137. నూట ముప్పదియేడవ అధ్యాయము
ద్రుపదపరాభవము.
వైశంపాయన ఉవాచ
పాండవాన్ ధార్తరాష్ట్రాంశ్చ కృతాస్త్రాన్ ప్రసమీక్ష్య సః ।
గుర్వర్థం దక్షినాకాలే ప్రాప్తోఽమన్యత వై గురుః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పాండవులూ, ధార్తరాష్ట్రులూ అస్త్రవిద్యలో నిష్ణాతులయ్యారని నిశ్చయించుకొన్న ద్రోనాచార్యుడు గురుదక్షిణను స్వీకరించటానికి తగిన సమయ మాసన్నమైనదని భావించాడు. (1)
తతః శిష్యాన్ సమానీయ ఆచార్యోఽర్థమచోదయత్ ।
ద్రోణః సర్వానశేషేణ దక్షిణార్థం మహీపతే ॥ 2
రాజా! ఆ తరువాత ద్రోనాచార్యుడు తన శిష్యులనందరినీ పిలిపించి గురుదక్షిణ కోరుతూ ఇలా పలికాడు. (2)
పంచాలరాజం ద్రుపదం గృహీత్వా రణమూర్ధని ।
పర్యానయత భద్రం వః సా స్యాత్ పరమదక్షిణా ॥ 3
పంచాలరాజయిన ద్రుపదుని యుద్ధంలో బంధించి తీసికొనిరండి. మీకు మేలు కలుగుతుంది. ఇదే నాకివ్వదగిన గొప్ప గురుదక్షిణ. (3)
తథేత్యుక్త్వా తు తే సర్వే రథైస్తూర్ణం ప్రహారిణః ।
ఆచార్యధనదానార్థం ద్రోణేన సహితా యయుః ॥ 4
'అలాగే' అని, దెబ్బతీయగల ఆ రాజకుమారులంతా త్వరగా రథాలనెక్కి గురుదక్షిణను ఇవ్వటానికి ద్రోణాచార్యునితో సహా బయలుదేరారు. (4)
తతోఽభిజగ్ముః పంచాలాన్ నిఘ్నంతస్తే నరర్షభాః ।
మమృదుస్తస్య నగరం ద్రుపదస్య మహౌజసః ॥ 5
దుర్యోధనశ్చ కర్ణశ్చ యుయుత్సుశ్చ మహాబలః ।
దుఃశాసనో వికర్ణశ్చ జలసంధః సులోచనః ॥ 6
ఏతే చాన్యే చ బహవః కుమారా బహువిక్రమాః ।
అహం పూర్వమహం పూర్వమ్ ఇత్యేవం క్షత్రియర్షభాః ॥ 7
ఆ తరువాత దుర్యోధనుడూ, కర్ణుడూ, బలిష్ఠుడైన యుయుత్సుడూ, దుఃశాసనుడూ, వికర్ణుడూ, జలసంధుడూ, సులోచనుడూ - ఇంకా పరాక్రమశాలులూ, నరశ్రేష్ఠులూ, క్షత్రియశిరోమణులూ అయిన అనేక రాజకుమారులు అహమహమికతో యుద్ధానికి సిద్ధాప్డి పంచాలరాజ్యంలో ప్రవేశించారు. అక్కడున్న ప్రజలను దండిస్తూ మహాతేజస్వి అయిన ద్రుపదుని రాజధానివైపు దూసుకొనిపోయారు. (5-7)
తతో రథముపారూఢాః కుమారాః సాదిభిః సహ ।
ప్రవిశ్య నగరం సర్వే రాజమార్గముపాయయుః ॥ 8
రథాలనధిరోహించి ఆ రాజకుమారులంతా ఆశ్వికులతో పాటు నగరంలో ప్రవేశించి రాజమార్గాన్ని పట్టారు. (8)
తస్మిన్ కాలే తు పాంచాలః శ్రుత్వా దృష్ట్వా మహద్ బలమ్ ।
భ్రాతృభిః సహితో రాజన్ త్వరయా నిర్యయౌ గృహత్ ॥ 9
రాజా!ఆ సమయంలో పంచాలరాజు ద్రుపదుడు ఆ ఆక్రమణను గూర్చి విని, ఆ మహాసేనను చూచి సోదరులతో కలిసి వేగంగా రాజభవనం నుండి వెలుపలికి వచ్చాడు. (9)
తతస్తు కృతసంనాహాః యజ్ఞసేనసహోదరాః ।
శరవర్షాణి ముంచంతః ప్రణేదుః సర్వ ఏవ తే ॥ 10
ఆ తరువాత యజ్ఞసేనుని (ద్రుపదుని) సహోదరులు అందరూ కవచాలు ధరించి శరవర్షాలు కురిపిస్తూ సింహనాదాలు చేయసాగారు. (10)
తతో రథేన శుభ్రేణ సమాసాద్య తు కౌరవాన్ ।
యజ్ఞసేనః శరాన్ ఘోరాన్ వవర్ష యుధి దుర్జయః ॥ 11
దుర్జయుడైన ఆ ద్రుపదమహారాజు తెల్లని రథాన్ని అధిరోహించి కౌరవుల దాఫునకు పోయి భయంకరమైన బాణవృష్టిని కురిపించాడు. (11)
వైశంపాయన ఉవాచ
పూర్వమేవ తు సంమంత్య్ర పార్థో ద్రోణమథాబ్రవీత్ ।
దర్పోద్రేకాత్కుమారాణామ్ ఆచార్యం ద్విజసత్తమమ్ ॥ 12
వైశంపాయనుడిలా అన్నాడు. కౌరవులూ, ఇతర రాజకుమారులూ ప్రదర్శిస్తున్న బలపరాక్రమోద్రేకాన్ని గమనించి అర్జునుడు ముందుగానే బాగా ఆలోచించి ద్విజసత్తముడైన ద్రోణాచార్యునితో ఇలా పలికాడు. (12)
ఏషాం పరాక్రమస్యాంతే వయం కుర్యామ సాహసమ్ ।
ఏతైరశక్యః పాంచాలః గ్రహీతుం రణమూర్ధని ॥ 13
వీరి పరాక్రమప్రదర్శన ముగిసిన తరువాత మేము యుద్ధం చేస్తాము. పాంచాలరాజు ద్రుపదుని యుద్ధంలో బంధించటం వీరికి అసాధ్యం. (13)
ఏవముక్త్వా తు కౌంతేయః భ్రాతృభిః సహితోఽనఘః ।
అర్థక్రోశే తు నగరాత్ అతిష్ఠద్ బహిరేవ సః ॥ 14
ఆచార్యునితో అలా పలికి అనఘడైన అర్జునుడు తన సోదరులతో సహా నగరానికి వెలుపల అరక్రోసు దూరంలోనే నిలిచాడు. (14)
ద్రుపదః కౌరవాన్ దృష్ట్వా ప్రాధావత సమంతతః ।
శరజాలేన మహాతా మోహయన్ కౌరవీం చమూమ్ ॥ 15
తముద్యంతం రథేనైకమ్ ఆశుకారిణమాహవే ।
అనేకమివసంత్రాసాత్ మేనిరే తత్ర కౌరవాః ॥ 16
ద్రుపదుడు కౌరవులను చూచి అన్నివైపులనుండీ వారిపైకి ఉరికి బాణాలతో పెద్ద వలను వేసి కౌరవసేనను మూర్ఛిల్లజేశాడు. ఒంటరియై రథంపై యుద్ధంలో వేగంగా పరాక్రమిస్తున్న ద్రుపదుని చూచిన కౌరవులు భయం వలన ఆ ద్రుపదుడు ఒంటరి వాడైనా చాలా మంది ఆక్రమిస్తున్నట్టు భావించారు. (15,16)
ద్రుపదస్య శరా ఘోరాః విచేరుః సర్వతో దిశమ్ ।
తతః శంఖాశ్చ భేర్యశ్చ మృదంగాశ్చ సహస్రశః ॥ 17
ప్రావాద్యంత మహారాజ పాంచాలానాం నివేశనే ।
సింహనాదశ్చ సంజజ్ఞే పాంచాలానాం మహాత్మనామ్ ॥ 18
ధనుర్జ్యాతలశబ్దశ్చ సంస్పృశ్య గగనం మహాన్ ।
ద్రుపదుని తీవ్రబాణాలు అన్నిదిక్కులా ప్రసరింపసాగాయి. మహారాజా! అప్పుడు ద్రుపదుని విజయాన్ని భావించి పాంచాల ప్రజల ఇళ్ళలో వేలకొలదిగా శంఖాలూ, భేరులూ, మృదంగాలూ మ్రోగాయి. ఆత్మబల సంపన్నులైన పాంచాలసైనికుల సింహనాదాలు కూడా చెలరేగాయి. వారి ధనుష్ఠంకారధ్వని కూడా గొప్పగా గగన తలాన్ని స్పృశించింది. (17,18 1/2)
దుర్యోధనో వికర్ణశ్చ సుబాహుర్దీర్ఘలోచనః ॥ 19
దుఃశాసనశ్చ సంక్రుద్ధః శరవర్షైరవాకిరన్ ।
సోఽతివిద్ధో మహేష్వాసః పార్షతో యుధి దుర్జయః ॥ 20
వ్యధమత్ తాన్యనీకాని తత్ క్షణాదేవ భారత ।
దుర్యోధనం వికర్ణం చ కర్ణం చాపి మహాబలమ్ ॥ 21
నానానృపసుతాన్ వీరాన్ సైన్యాని వివిధాని చ ।
అలాతచక్రవత్ సర్వం చరన్ బాణైరతర్పయత్ ॥ 22
జనమేజయా! అప్పుడు దుర్యోధనుడు, వికర్ణుడు, సుబాహువు, దీర్ఘలోచనుడు, దుశ్శాసనుడు తీవ్రకోపంతో శరవృష్టిని కురిపించారు. మేటివిలుకాడూ, దుర్జయుడూ అయిన ద్రుపదుడు తీవ్రంగా గాయపడి, వెంటనే కౌరవసేనలను చితకగొట్టాడు. మండుతున్న కొరివిచక్రం వలె అంతటా తిరుగుతూ దుర్యోధనునీ, వికర్ణునీ, మహాబలశాలి అయిన కర్ణునీ, వీరులైన అనేక రాజకుమారులనూ, వివిధసేనలనూ బాణాలతో తృప్తి పరచసాగాడు. (19-22)
(దుఃశాసనం చ దశభిః వికర్ణం వింశకైః శరైః ।
శకునిం వింశకైస్తీక్ష్ణైః దశభిః మర్మభేదిభిః ॥
కర్ణ దుర్యోధనౌ చోభౌ శరైః సర్వాంగసంధిషు ।
అష్టావింశతిభిః సర్వైః పృథక్ పృథగరిందమః ॥
సుబాహుం పంచభిర్విద్ధ్వా తథాన్యాన్ వివిధైః శరైః ।
వివ్యాధ సహసా భూయః ననాద బలవత్తరమ్ ॥
వినద్య కోపాత్ పాంచాలః సర్వశస్త్రభృతాం వరః ।
ధనూంషి రథయంత్రం చ హయాంశ్చిత్రధ్వజానపి ।
చకర్త సర్వపాంచాలాః ప్రణేదుః సింహసంఘవత్ ॥)
తతస్తు నాగరాః సర్వే ముసలైర్యష్టిభిస్తదా ।
అభ్యవర్షంత కౌరవ్యాన్ వర్షమాణా ఘనా ఇవ ॥ 23
ఆ ద్రుపదుడు దుశ్శాసనుని పది బాణాలతోనూ, వికర్ణుని ఇరవై బాణాలతోనూ, శకునిని మర్మస్థానాలను ఛేదించగల ఇరవై తీక్ష్ణశరాలతోనూ గాయపరిచాడు. భారతా! యుద్ధంలో శత్రుదమనుడైన ద్రుపదుడు ఆ తరువాత కర్ణదుర్యోధనుల శరీరావయసంధులన్నింటి మీద విడివిడిగా ఇరవై యెనిమిది బాణాలతో కొట్టాడు. సుబాహుని ఐదుబాణాలతోనూ, ఇతరయోధులను వివిధబాణాలతోనూ బాధించి వెంటనే సింహనాదం చేశాడు. ఈవిధంగా శస్త్రధారులలో మేటి అయిన ద్రుపదుడు కోపంతో గర్జిస్తూ శత్రువుల ధనస్సులనూ, రథాలను, అశ్వాలను, చిత్రవిచిత్ర పతాకలను ఖండించాడు. పాంచాలసేనలు అన్నీ సింహనాదాలు చేశాయి.
ఆ తరువాత నగరవాసులందరూ కురుస్తున్న మేఘాలవలె కౌరవులందరిపై రోకళ్ళనూ, కర్రలనూ విసిరారు. (23)
సబాలవృద్ధాస్తే పౌరాః కౌరవానభ్యయుస్తదా ।
శ్రుత్వా సుతుములం యుద్ధం కౌరవానేవ భారత ॥ 24
ద్రవంతి స్మ నదంతి స్మ క్రోశంతః పాండవాన్ ప్రతి ।
(పాంచాల శరభిన్నాంగః భయమాసాద్య వై వృషః ।
కర్ణో రథాదవప్లుత్య పలాయనపరోఽభవత్ ॥)
పాండవాస్తు స్వరం శ్రుత్వా ఆర్తానాం లోమహర్షణమ్ ॥ 25
అభివాద్య తతో ద్రోణం రథానారురుహుస్తదా ।
యుధిష్ఠిరం నివార్యాశు మా యుధ్య స్వేతి పాండవమ్ ॥ 26
జనమేజయా! నగరంలోని పౌరులు తీవ్రయుద్ధం జరుగుతోందని విని ఆ బాలవృద్ధంగా కౌరవుల నెదిరించారు. కౌరవులు సాటిగా నిలువలేక అరుస్తూ, ఆక్రోశిస్తూ పాండవులవైపు పరుగెత్తారు. పాంచాలరాజబాణాలతో శరీరం ఛిన్నాభిన్నంకాగా కర్ణుడు భయపడి, రథం దిగి పారిపోసాగాడు. రోమాంచం కలిగేటట్లు సైనికులు చేస్తున్న ఆర్తనాదాలను విని పాండవులు ద్రోణునకు నమస్కరించి తమ రథాలనెక్కారు. నీవు యుద్ధం చేయనవసరం లేదని యుధిష్ఠిరుని నివారించారు. (24-26)
మాద్రేయౌ చక్రరక్షౌ తు ఫాల్గునశ్చ తదా కరోత్ ।
సేనాగ్రగో భీమసేనః సదాభూద్ గదయా సహ ॥ 27
అర్జునుడు నకులసహదేవులను తన రథచక్ర-రక్షకులనుగా నిలిపాడు. భీమసేనుడు గదను చేతబట్టి సేనకు ముందు నిలిచాడు. (27)
తదా శత్రుస్వనం శ్రుత్వా భ్రాతృభిః సహితోఽనఘః ।
అయాజ్జవేన కౌంతేయః రథేనానాదయన్ దిశః ॥ 28
అప్పుడు శత్రువుల గర్జనలను విని అనఘుడైన అర్జునుడు తన సోదరులతో సహా రథధ్వనితో దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ వేగంగా వచ్చాడు. (28)
పాంచాలానాం తతః సేనామ్ ఉద్ధూతార్ణవనిఃస్వనామ్ ।
భీమసేనో మహాబాహుః దండపాణిరివాంతకః ॥ 29
ప్రవివేశ మహాసేనాం మకరః సాగరం యథా ।
స్వయమభ్యద్రవద్ భీమః నాగానీకం గదాధరః ॥ 30
ద్రుపదునిసేన ఎగసిపడే సముద్రం వలె ఘోష పెడుతోంది. మహాబాహువయిన భీమసేనుడు దండధరుడైన యమధర్మరాజువలె గద పట్టి సముద్రంలోనికి మొసలి ప్రవేశించినట్లు ఆ మహాసేనలోనికి ప్రవేశించాడు. గదాధారియై గజసమూహంపై విరుచుకొని పడ్డాడు భీమసేనుడు. (29,30)
స యుద్ధకుశలః పార్థః బాహువీర్యేణ చాతులః ।
అహనత్ కుంజరానీకం గదయా కాలరూపధృత్ ॥ 31
అసమానమైన బాహుపరాక్రమం గలిగి యుద్ధకుశలుడైన ఆ భీమసేనుడు మృత్యురూపాన్ని ధరించి గదతో గజసమూహాలను సంహరించసాగాడు. (31)
తే గజా గిరిసంకాశాః క్షరంతో రుధిరం బహు ।
భీమసేనస్య గదయా భిన్నమస్తకపిండకాః ॥ 32
పతంతి ద్విరదా భూమౌ వజ్రఘాతాదివాచలాః ।
గజానశ్వాన్ రథాంశ్చైవ పాతయామాస పాండవః ॥ 33
పదాతీంశ్చ రథాంశ్చైవ న్యధీదర్జునాగ్రజః ।
గోపాల ఇవ దండేన యథా పశుగణాన్ వనే ॥ 34
చాలయన్ రథనాగాంశ్చ సంచచాల వృకోదరః ।
పర్వతాకారంతో ఉన్న ద్రుపదుని ఏనుగులు భీమసేనుని గదదెబ్బలకు తలలు పగిలి నెత్తురోడుతూ వజ్రపుదెబ్బలకు నేలగూలిన పర్వతాలవలె భూమిపై పడసాగాయి. భీముడు ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ కూడా పడగొట్టాడు. పదాతిసైనికులనూ, రథికులనూ కూడా కూల్చాడు. గోపాలుడు దండం చేతబట్టి పశుగణాలను తోలినట్లు వృకోదరుడు రథాలనూ, ఏనుగులనూ తరుముతూ వెంటబడ్డాడు. (32-34 1/2)
వైశంపాయన ఉవాచ
భారద్వాజప్రియం కర్తుమ్ ఉద్యతః ఫాల్గునస్తదా ॥ 35
పార్షతం శరజాలేన క్షిపన్నాగాత్ స పాండవః ।
హయౌఘాంశ్చ రథౌఘాంశ్చ గజౌఘాంశ్చ సమాంతతః ॥ 36
పాతయన్ సమరే రాజన్ యుగాంతాగ్నిరివ జ్వలన్ ।
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఆ సమయంలో ద్రోణునకు ప్రియాన్ని కల్గించటానికి ఉద్యమించిన అర్జునుడు శరజాలంతో ద్రుపదుని తురుముతూ ఆక్రమించాడు. అన్ని దిక్కులా అశ్వసమూహాలనూ, రథసముదాయాన్నీ, ఏనుగుల గుంపునూ నేలగూల్చుతూ ప్రళయకాలాగ్ని వలె ప్రజ్వరిల్లాడు. (35, 36 1/2)
తతస్తే హన్యమానా వై పాంచాలాః సృంజయాస్తథా ॥ 37
శరైర్నానావిధైస్తూర్ణం పార్థం సంఛాద్య సర్వశః ।
సింహనాదం ముఖైః కృత్వా సమయుధ్యంత పాండవమ్ ॥ 38
ఆ విధంగా దెబ్బతిన్న పాంచాలూరూ, సృంజయులూ అర్జునుని వివిధ బాణాలతో వెంటనే అన్ని వైపులా చుట్టుముట్టి సింహనాదాలు చేస్తూ అర్జునుని ఎదిరించారు. (37,38)
తద్ యుద్ధమభవత్ ఘోరమ్ సుమహాద్భుతదర్శనమ్ ।
సింహనాదస్వనం శ్రుత్వా నామృష్యత్ పాకశాసనిః ॥ 39
ఆ యుద్ధం ఘోరంగా, చూచేవారికి అద్భుతంగా కనిపించింది. అర్జునుడు ఆ సింహనాదధ్వని విని సహించలేకపోయాడు. (39)
తతః కిరీటీ సహసా పాంచాలాన్ సమరేఽద్రవత్ ।
ఛాదయన్నిషుజాలేన మహతా మోహయన్నివ ॥ 40
వేగంగా అర్జునుడు బాణసమూహంతో పాంచాల సేనలను కప్పుతూ, వారిని మూర్ఛిల్లజేస్తూ రణరంగాన్ని ఆక్రమించాడు. (40)
శీఘ్రమభ్యస్యతో బాణాన్ సందధానస్య చానిశమ్ ।
నాంతరం దదృశే కించిత్ కౌంతేయస్య యశస్వినః ॥ 41
యశస్వి అయిన అర్జునుడు తీవ్రవేగంతో నిరంతరంగా బాణాలు విడుస్తున్నాడు. బాణాలను సంధించటానికీ, విడవటానికీ మధ్య వ్యవధానమే కనిపించటం లేదు. (41)
(న దిశో నాంతరిక్షంచ తదా నైవ చ మేదినీ ।
అదృశ్యత మహారాజ తత్ర కించన సంయుగే ॥
బాణాంధకారే బలినా కృతే గాండీవధన్వనా ।)
మహారాజా! గాండీవధారి అయిన అర్జునుడు బలిష్ఠుడై బాణప్రయోగం ద్వారా చీకటి క్రమ్మజేస్తుంటే ఆ రణరంగంలో భూమి, ఆకాశం, దిక్కులూ ఏవీ కనిపించకుండా పోయాయి.
సింహనాదశ్చ సంజజ్ఞే సాధుశబ్దేన మిశ్రితః ।
తతః పంచాలరాజస్తు తథా సత్యజితా సహ ॥ 42
త్వరమాణో-భిదుద్రావ మహేంద్రం శంబరో యథా ।
మహతా శరవర్షేణ పార్థః పాంచాలమావృణోత్ ॥ 43
అప్పుడు అర్జునపక్షంలో అభినందనలూ, సింహనాదాలూ చెలరేగాయి. అటు పాంచాలరాజు సత్యజిత్తును తోడు తీసికొని శంబరాసురుడు దేవేంద్రుని ఆక్రమించినట్లు అర్జునుని ఆక్రమించాడు. తీవ్రబాణవర్షంతో అర్జునుడు ద్రుపదుని కప్పేశాడు. (42,43)
తతో హలహలాశబ్దః ఆసీత్ పాంచాలకే బలే ।
జిఘృక్షతి మహాసింహః గజానామివ యూథపమ్ ॥ 44
మహాసింహం గజరాజును నిలువరించినట్టు అర్జునుడు ద్రుపదుని ఆక్రమించాడు. పాంచాలరాజ సేనలలో హాహాకారాలు చెలరేగాయి. (44)
దృష్ట్వా పార్థం తదాఽఽయాంతం సత్యజిత్ సత్యవిక్రమః ।
పాంచాలమ్ వై పరిప్రేప్సుః ధనంజయముపాద్రవత్ ॥ 45
తతస్త్వర్జునపాంచాలౌ యుద్ధాయ సముపాగతౌ ।
వ్యక్షోభయేతాం తౌ సైన్యమ్ ఇంద్రవైరోచనావివ ॥ 46
ద్రుపదుని బంధించటానికి బాగా దగ్గరకు వస్తున్న అర్జునుని చూచి పాంచాల రాజసంరక్షణకై సత్యవిక్రముడైన సత్యజిత్తు అర్జునుని పైకి ఉరికాడు. అప్పుడు ఇంద్ర బలిచక్రవర్తులవలె యుద్ధానికి సన్నద్ధులైన అర్జున సత్యజిత్తులు ఆ సేనలను బాగా కలత పెట్టారు. (45,46)
తతః సత్యజితం పార్థః దశభిర్మర్మభేదిభిః ।
వివ్యాధ బలవద్ గాఢం తదద్భుతమివాభవత్ ॥ 47
ఆ పై అర్జునుడు మర్మచ్ఛేదన చేయగల పదిబాణాలతో సత్యజిత్తును బలంగా గాఢంగా గాయపరిచాడు. అది ఎంతో అద్భుతంగా కనిపించింది. (47)
తతః శరశతైః పార్థం పాంచాలః శీఘ్రమార్దయత్ ।
పార్థస్తు శరవర్షేణ ఛాద్యమానో మహారథః ॥ 48
వేగం చక్రే మహావేగః ధనుర్జ్యామవమృజ్య చ ।
తతః సత్యజితశ్చాపం ఛిత్త్వా రాజానమభ్యయాత్ ॥ 49
ఆ పై సత్యజిత్తు వెంటనే వందబాణాలతో అర్జునుని బాధించాడు. అయితే పార్థుడు ద్రుపదుని శరవర్షం తనను కప్పినా నారి సారించి వేగంగా బాణాలను విడిచి సత్యజితుని ధనస్సును ఖండించి ద్రుపదునిపై కురికాడు. (48,49)
అథాన్యద్ ధనురాదాయ సత్యజిద్ వేగవత్తరమ్ ।
సాశ్వం ససూతం సరథం పార్థం వివ్యాధ సత్వరః ॥ 50
అప్పుడు సత్యజిత్తు తీవ్రవేగంతో మరొక వింటిని తీసికొని త్వరత్వరగా అర్జునునీ, అతని గుఱ్ఱాలనూ, సూతునీ గాయపరిచాడు. (50)
స తం న మమృషే పార్థః పాంచాలేనార్దితో యుధి ।
తతస్తస్య వినాశార్థం సత్వరం వ్యసృజచ్ఛరాన్ ॥ 51
సత్యజిత్తు తనను బాధించటాన్ని సహించని ఆ అర్జునుడు వెంటనే సత్యజిత్తును నశింపజేయటానికి బాణాలను విడిచాడు. (51)
హయాన్ ధ్వజం ధనుర్ముష్టిమ్ ఉభౌ తౌ పార్ష్ణిసారథీ ।
స తథా భిద్యమానేషు కార్ముకేషు పునః పునః ॥ 52
హయేషు వినియుక్తేషు విముఖోఽభవదాహవే ।
స సత్యజితమాలోక్య తథా విముఖమాహవే ॥ 53
వేగేన మహతా రాజన్ అభ్యవర్షత పాండవమ్ ।
తదా చక్రే మహద్ యుద్ధమ్ అర్జునో జయతాం వరః ॥ 54
సత్యజిత్తు గుఱ్ఱాలనూ, ధ్వజాన్నీ, వింటినీ, పిడికిలినీ, రథరక్షకునీ, సారథినీ కూడా అర్జునుడు గాయాపరిచాడు. అలా ధనస్సులు మాటిమాటికీ విరుగుతున్నాయి. అశ్వాలు మరణిస్తున్నాయి. అపుడు సత్యజిత్తు రణరంగం నుండి పారిపోయాడు. రాజా! పారిపోతున్న సత్యజిత్తును గమనించి ద్రుపదుడు మరీ వేగమ్తో అర్జునునిపై బాణవృష్టిని కురిపించాడు. అప్పుడు జయశీలుడయిన అర్జునుడు ఘోరయుద్ధాన్ని ప్రారంభించాడు. (52-54)
తస్య పార్థో ధనుశ్ఛిత్త్వా ధ్వజం చోర్వ్యామపాతయత్ ।
పంచభిస్తస్య వివ్యాధ హయాన్ సూతం చ సాయకైః ॥ 55
అర్జునుడు ఆ ద్రుపదుని వింటిని ఖండించి, ధ్వజాన్ని నేలగూల్చి అయిదు బాణాలతో గుఱ్ఱాలనూ, సారథినీ బాధించాడు. (55)
తత ఉత్సృజ్య తచ్చాపమ్ ఆదదానం శరావరమ్ ।
ఖడ్గముద్ధృత్య కౌంతేయః సింహనాదమథాకరోత్ ॥ 56
ద్రుపదుడు విరిగిన ధనస్సును విడిచి మరొక వింటిని తీసికొనే లోపులో అర్జునుడు కత్తిని చేతబట్టి సింహనాదం చేశాడు. (56)
పాంచాలస్య రథస్యేషామ్ ఆప్లుత్య సహసాపతత్ ।
పాంచాలరథమాస్థాయ అవిత్రస్తో ధనంజయః ॥ 57
విక్షోభ్యాంభోనిధిం పార్థః తం నాగమివ సోఽగ్రహీత్ ।
తతస్తు సర్వపాంచాలాః విద్రవంతి దిశో దశ ॥ 58
అర్జునుడు వెంటనే పాంచాలరాజు రథం నొగలిపైకి సముద్రాన్ని కలతపెట్టి పాములను పట్టుకొనే గరుత్ముంతుని వలె దూకి ద్రుపదుని రథంపై నిర్భయంగా నిలిచి అర్జునుడు. ఆ ద్రుపదుని లోబరచుకొన్నాడు.
దానితో సర్వసైన్యానాం స బాహ్వోర్బలమాత్మనః ।
సింహనాదస్వనం కృత్వా నిర్జగామ ధనంజయః ॥ 59
ఆ అర్జునుడు సర్వసైన్యాలకూ తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ సింహనాదాన్ని చేసి నిష్క్రమించాడు. (59)
ఆయాంత మర్జునం దృష్ట్వా కుమారాః సహితాస్తదా ।
మమృదుస్తస్య నగరం ద్రుపదస్య మహాత్మనః ॥ 60
అర్జున ఉవాచ
సంబంధీ కురువీరాణాం ద్రుపదో రాజసత్తమః ।
మావధీస్తద్బలం భీమ గురుదానం ప్రదీయతామ్ ॥ 61
అర్జునుడిలా అన్నాడు. భీమసేనా! రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు కురువీరులకు బంధువు. ఆయన సేనను సంహరించవద్దు. గురుదక్షిణగా ద్రుపదుని మాత్రమే ద్రోణునకివ్వాలి. (61)
వైశంపాయన్ ఉవాచ
భీమసేనస్తదా రాజన్ అర్జునేన నివారితః ।
అతృప్తో యుద్ధధర్మేషు న్యవర్తత మహాబలః ॥ 62
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఆవిధంగా అర్జునుడు వారించగా మహాబలుడైన భీమసేనుడు జరిగిన యుద్ధంతో తృప్తిపడకపోయినా వెనుదిరిగాడు. (62)
తే యజ్ఞసేనం ద్రుపదం గృహీత్వా రణమూర్ధని ।
ఉపాజహ్రుః సహామాత్యం ద్రోణాయ భరతర్షభ ॥ 63
భరతశ్రేష్టా! ఆ పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రుపదుని బంధించి ద్రోణాచార్యునకు కానుకజేశారు. (63)
భగ్నదర్పం హృతధనం తం తథా వశమాగతమ్ ।
స వైరం మనసా ధ్యాత్వా ద్రోణో ద్రుపదమబ్రవీత్ ॥ 64
గర్వాన్నీ, ధనాన్నీ కూడా కోలుపోయి తనకు వశమైన ద్రుపదుని చూచి గతవైరాన్నిమనస్సులో తలచి ద్రోణుడు అతనితో ఇలా అన్నాడు. (64)
విమృద్య తరసా రాష్ట్రం పురం తే మృదితం మయా ।
ప్రాప్య జీవం రిపువశం సఖిపూర్వం కిమిష్యతే ॥ 65
నేను నీ రాష్ట్రాన్ని చితకగొట్టాను. నీ నగరాన్ని మట్టిజేశాను. నీ ప్రాణాలిప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి. అలనాటి మైత్రిని నీవు కోరుతున్నావా? (65)
ఏవముక్త్వా ప్రహస్యైనం కించిత్ స పునరబ్రవీత్ ।
మా భైః ప్రాణభయాద్ వీర క్షమిణో బ్రాహ్మణా వయమ్ ॥ 66
అలా అని ద్రోణుడు ఒక నవ్వు నవ్వి మరల ద్రుపదునితో ఇలా అన్నాడు- వీరుడా! ప్రాణభయం వద్దు. మేము బ్రాహ్మణులము క్షమాశీలురము. (66)
ఆశ్రమే క్రీడితం యత్ తు త్వయా బాల్యే మయా సహః ।
తేన సంవర్ధితః స్నేహః ప్రీతిశ్చ క్షత్రియర్షభ ॥ 67
క్షత్రియశ్రేష్ఠా! బాల్యంలో నీవు నాతో కలిసి ఆశ్రమంలో క్రీడించావు. దానితో నీతో స్నేహం, నీపై ప్రేమా కలిగాయి. (67)
ప్రార్థయేయం త్వయా సఖ్యం పునరేవ జనాధిప ।
వరం దదామి తే రాజన్ రాజ్యస్యార్ధమవాప్నుహి ॥ 68
రాజా! నేను మరలా నీతో స్నేహాన్నే కోరుతున్నాను. నీకొక వరమిస్తున్నాను. ఈ రాజ్యంలో అర్ధభాగాన్ని నీవే స్వీకరించు. (68)
అరాజా కిల నో రాజ్ఞః సఖా భవితు మర్హసి ।
అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేన మయా తవ ॥ 69
యజ్ఞసేనా! రాజుకానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు గదా. అందువలననే నేను నీ రాజ్యాన్ని అధీనం చేసికొనేందుకు ప్రయత్నించాను. (69)
రాజాసి దక్షిణే కూలే భాగీరథ్యాహముత్తరే ।
సఖాయం మాం విజానీహి పాంచాల యది మన్యసే ॥ 70
భాగీరథికి దక్షిణభాగానికి నీవు రాజువు. ఉత్తరభాగానికి నేను రాజును. పాంచాలా! నీకు నచ్చితే నన్ను నీ మిత్రునిగానే భావించు. (70)
ద్రుపద ఉవాచ
అనాశ్చర్యమిదం బ్రహ్మన్ విక్రాంతేషు మహాత్మసు ।
ప్రీయే త్వయాహం త్వత్తశ్చ ప్రీతిమిచ్ఛామి శాశ్వతీమ్ ॥ 71
ద్రుపదుడిలా అన్నాడు. బ్రాహ్మణా! నీవంటి పరాక్రమవంతునకు ఇటువంటి ఔదార్యముండటం ఆశ్చర్యకరం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీతో శాశ్వతమైత్రిని కోరుతున్నాను. (71)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స తం ద్రోణః మోక్షయామాస భారత ।
సత్కృత్య చైనం ప్రీతాత్మా రాజ్యార్ధం ప్రత్యపాదయత్ ॥ 72
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ద్రుపదుడలా అన్నతరువాత ద్రోణుడు ద్రుపదుని విడిచిపెట్టాడు. ఆయనను సత్కరించి ఆనందంగా రాజ్యంలో అర్ధభాగాన్ని ఇచ్చివేశాడు. (72)
మాకందీమథ గంగాయాః తీరే జనపదాయుతామ్ ।
సోఽధ్యావసద్ దీనమనాః కాంపిల్యం చ పురోత్తమమ్ ॥ 73
దక్షిణాంశ్చాపి పంచాలాన్ యావచ్చర్మణ్వతీ నదీ ।
ద్రోణేన చైవం ద్రుపదః పరిభూయాథ పాలితః ॥ 74
ఆ తరువాత ద్రుపదుడు దీనహృదయుడై గంగానదీ తీరంలో అనేకజనపదాలతో కలిసి ఉన్న మాకందీపురాన్నీ, శ్రేష్ఠనగరమైన కాంపిల్యనగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసికొని చర్మణ్వతీనదికి దక్షిణతీరాన ఉన్న పాంచాలదేశాన్ని పరిపాలిమ్చసాగాడు. ఈ విధంగా ద్రోణుడు ద్రుపదుని పరాభవించి ఆపై అనుగ్రహించాడు. (73,74)
క్షాత్రేణ చ బలేనాస్య నాపశ్యత్ స పరాజయమ్ ।
హీనం విదిత్వా చాత్మానం బ్రాహ్మేణ స బలేన తు ॥ 75
పుత్రజన్మ పరీప్సన్ వై పృథివీమన్వసంచరత్ ।
అహిచ్ఛత్రం చ విషయం ద్రోణః సమభిపద్యత ॥ 76
ద్రుపదుడు తన క్షాత్రబలంతో ద్రోణుని ఓడించలేకపోయాడు. బ్రాహ్మణబలం కన్న తనను తక్కువగా భావించుకొని, శక్తిమంతుడైన కుమారుని పొందగోరి భూమిపై తిరగసాగాడు. ద్రోణుడు గంగానదికి ఉత్తరంవైపున్న అహిచ్ఛత్రరాజ్యాన్ని తన పాలనలో నిలుపుకొన్నాడు. (75,76)
ఏవం రాజన్నహిచ్ఛత్రా పురీ జనపదాయుతా ।
యుధి నిర్జిత్య పార్థేన ద్రోణాయ ప్రతిపాదితా ॥ 77
రాజా! ఈ విధంగా జనపదాలతో కూడిన అహిచ్ఛత్ర నగరాన్ని యుద్ధంలో గెలుచుకొని అర్జునుడు ద్రోణాచార్యునకు గురుదక్షిణగా ఇచ్చాడు. (77)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్రుపదశాసనే సప్త త్రింశదధిక శతతమోఽధ్యాయః ॥ 137 ॥
ఇధి శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ద్రుపదశాసన మను నూట ముప్పది యేడవ అధ్యాయము. (137)
(దాక్షిణాత్య అధికపాఠం 7 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 84 1/2 శ్లోకాలు)