87. ఎనుబది ఏడవ అధ్యాయము

యయాతి పూరునికిచ్చిన ఉపదేశము.

వైశంపాయన ఉవాచ
స్వర్గతః స తు రాజేంద్ర నివసన్ దేవవేశ్మని ।
పూజితస్త్రిదశైః సాధ్యైః మరుద్భి ర్వసుభి స్తథా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. రాజేంద్రా! స్వర్గానికి వెళ్ళిన ఆ యయాతి దేవభవనంలో నివసిస్తూ, దేవతల చేత, సాధ్యుల చేత, వాయువులచేత, వసువుల చేత పూజింపబడ్డాడు. (1)
దేవలోకం బ్రహ్మలోకం సంచరన్ పుణ్యకృద్ వశీ ।
అవసత్ పృథివీపాలః దీర్ఘకాలమితి శ్రుతిః ॥ 2
పుణ్యాత్ముడై, ఇంద్రియనిగ్రహం కల యయాతి రాజు దేవలోకంలోను, బ్రహ్మలోకంలోనూ సంచరిస్తూ చాలకాలం అక్కడ నివసించాడని వినికిడి. (2)
స కదాచిన్నృపశ్రేష్ఠః యయాతిః శక్రమాగమత్ ।
కథాంతే తత్ర శక్రేణ స పృష్టః పృథివీపతిః ॥ 3
ఒకానొకసారి దేవరాజు ఇంద్రుడు యయాతి దగ్గరకు వచ్చాడు. వారిరువురి సంభాషణ చివరలో శుక్రుడు యయాతిని ఇలా అడిగాడు. (3)
శక్ర ఉవాచ
యదా స పూరుస్తవ రూపేణ రాజన్
జరాం గృహీత్వా ప్రచచార భూమౌ ।
తదా చ రాజ్యం సంప్రదాయైవ తస్మై
త్వయా కిముక్తః కథయేహ సత్యమ్ ॥ 4
ఇంద్రుడిలా అన్నాడు - రాజా! నీకుమారుడు పూరుడు నీ ముసలితనాన్ని స్వీకరించి నీ రూపంతో భూమిపై సంచరించాడు కదా! అతడికి రాజ్యాన్ని అప్పగిస్తూ అపుడు నీవు అతనికి ఏం చెప్పావు? నాకిప్పుడు నిజం చెప్పు. (4)
యయాతి రువాచ
గంగా యమునయోర్మధ్యే కృత్స్నోఽయం విషయస్తవ ।
మధ్యే పృథివ్యాస్త్వం రాజా భ్రాతరో ఽంత్యాధిపా స్తవ ॥ 5
యయాతి ఇలా అన్నాడు - గంగా యమునలకు మధ్యనున్నదంతా నీదేశం. ఈ మధ్య నున్న భూమి కంతటికి నీవు రాజువి. నీ సోదరులు నీ రాజ్యం చివర నున్న సీమాంతప్రదేశాలకు రాజులు. (5)
( న చ కుర్యాన్నరో దైన్యం శాఠ్యం క్రోధం తథైవ చ ।
జైహ్మ్యం చ మత్సరం వైరం సర్వత్రైవ న కారయేత్ ॥
మాతరం పితరం చైవ విద్వాంసం చ తపోధనమ్ ।
క్షమావంతం చ దేవేంద్ర నావమన్యేత బుద్ధిమాన్ ॥
శక్తస్తు క్షమతే నిత్యమ్ అశక్తః క్రుధ్యతే నరః ।
దుర్జనః సుజనం ద్వేష్టి దుర్బలో బలవత్తరమ్ ॥
రూపవంతమరూపీ చ ధనవంతం చ నిర్ధనః ।
అకర్మీ కర్మిణం ద్వేష్టి ధార్మికం చ న ధార్మికః ॥
నిర్గుణో గుణవంతం చ శక్రైతత్ కలిలక్షణమ్ ।)
మానవునికి దైన్యం, శాఠ్యం, క్రోధం, కుటిలత్వం, మత్సరం, వైరం, ఎప్పుడూ రాకూడదు. తల్లిదండ్రులను, పండితులను, తపోధనులను, ఓర్పుగలవారిని బుద్ధిమంతుడు ఎప్పుడూ అవమానింపడు. శక్తికలవాడు ఎప్పుడూ ఓర్పును వహిస్తాడు. శక్తిలేనివాడే కోపిస్తాడు. దుర్జనుడు సుజనుని ద్వేషిస్తాడు. బలహీనుడు బలవంతుని ద్వేషిస్తాడు. కురూపి రూపవంతుని ద్వేషిస్తాడు. నిర్ధనుడు ధనవంతుని ద్వేషిస్తాడు. పనిచేయనివాడు చేసేవానిని ద్వేషిస్తాడు. ధార్మికుడు కానివాడు ధార్మికుని ద్వేషిస్తాడు. గుణహీనుడు గుణవంతుని ద్వేషిస్తాడు. ఇంద్రా! ఇది కలికాల లక్షణం.
అక్రోధనః క్రోధనేభ్యో విశిష్టః
తథా తితిక్షు రతితిక్షో ర్విశిష్టః ।
అమానుషేభ్యో మానుషాశ్చ ప్రధానాః
విద్వాం స్తథైవావిదుషః ప్రధానః ॥ 6
కోపించనివాడు కోపించే వారికంటె గొప్పవాడు. అట్లే ఓర్పుగలవాడు ఓర్పులేని వానికంటె విశిష్టుడు. అమానుషులకంటె మనుష్యులు ముఖ్యులు. అవిద్వాంసుని కంటె విద్వాంసుడు ప్రధానుడు. (6)
ఆకృశ్యమానో నాక్రోశేత్ మన్యురేవ తితిక్షతః ।
ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి ॥ 7
ఇతరులు తన్ను నిందిస్తున్నా తిరిగి వారిని నిందింపకూడదు. సహనంగలవారి కోపమే నిందించేవానిని దహిస్తుంది. అతని పుణ్యాన్ని కూడ సహనం గలవాడు పొందుతాడు. (7)
నారుంతుదః స్యాన్న నృశంసవాదీ
న హీనతః పర్మభ్యాదదీత ।
యయాస్య వాచా పర ఉద్విజేత
న తాం వదేదుషతీం పాపలోక్యామ్ ॥ 8
ప్రాణాపాయం కలిగించే మర్మస్థానాల్లో బాధించకూడదు. ఇతరులను హింసించే మాటలను మాట్లాడరాదు. ఇతరులు ఉద్వేగం పొందే మాటలు మాట్లాడకూడదు. పాపలోకంలో ఉండే పాపులు మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. (8)
అరుంతుదం పరుషం తీక్ష్ణవాచం
వాక్కంటకై ర్వితుదంతం మనుష్యాన్ ।
విద్యాదలక్ష్మీకతమం జనానాం
ముఖే నిబద్ధాం నిరృతిం వహంతమ్ ॥ 9
ఇతరుల మర్మస్థానాలను బాధించేవాడు, కఠినంగా, తీక్ష్ణంగా మాట్లాడేవాడు వాక్కులనే ముళ్ళతో మనుష్యులను బాధపెట్టేవాడు, ఈ లక్షణాలు కలవానిని దరిద్రుడుగా భావించాలి. అతడు నోటియందు రాక్షసిని ధరించినవాడని గ్రహించాలి. (9)
సద్భిః పురస్తా దభిపూజితః స్యాత్
సద్భిస్తథా పృష్ఠతో రక్షితః స్యాత్ ।
సదా సతామతివాదాం స్తితిక్షేత్
స తాం వృత్తం చాదదీతార్యవృత్తః ॥ 10
ముందుగా సత్పురుషులను గౌరవించి, వారిచే గౌరవింపబడాలి. ఆ తరువాత సత్పురుషులచే రక్షింపబడాలి. చెడ్డవారి అనుచితమైన మాటలను సహించాలి. సత్పురుషుల నడవడికను అనుసరించి ఽఆరిప్రవృత్తిని ఆదరించాలి. (10)
వాక్ సాయకా వదనా న్నిష్పతంతి
యైరాహతః శోచతి రాత్య్రహాని ।
పరస్య ణా మర్మసు తే పతంతి
తాన్ పండితో నావసృజేత్ పరేషు ॥ 11
దుష్టులైన మానవుల నోటి నుండి వెలువడిన వాగ్బాణాలు అవి తగిలిన వారిని రాత్రింబవళ్ళు బాధిస్తాయి. దుష్టుడు అటువంటి మాటలను ఇతరుల మర్మస్థానాల్లో కొడతాడు. అందువల్ల పండితులు అటువంటి మాటలను ఇతరులపై ప్రయోగింపరాదు. (11)
న హీదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే ।
దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాక్ ॥ 12
ప్రాణుల పట్ల దయ, స్నేహం, దానం, తీయని మాట - ఇతరులను వశంచేసుకోవడానికి ఈ మూడులోకాలలో ఇంతకంటె వేరొకటి ఏమీలేదు. (12)
తస్మాత్ సాంత్వం సదా వాచ్యం న వాచ్యం పరుషం క్వచిత్ ।
పూజ్యాన్ సంపూజయేద్ దద్యాత్ న చ యాచేత్ కదాచన ॥ 13
అందువల్ల ఎల్లపుడు సాంత్వనవచనమే పలకాలి కాని కఠినమైన మాటలు పలకరాదు. గౌరవింపదగిన వారిని గౌరవించాలి. దానం చెయ్యాలి. ఎన్నడూ యాచించకూడదు. (13)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే సప్తాశీతితమోఽధ్యాయః ॥ 87 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తరయయాతిచరిత్రమను ఎనుబది ఏడవ అధ్యాయము. (87)
(దాక్షిణాత్య అధికపాఠము 4 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 17 1/2 శ్లోకాలు)