86. ఎనుబది ఆరవ అధ్యాయము

యయాతి స్వర్గమును పొందుట.

వైశంపాయన ఉవాచ
ఏవం స నాహుషో రాజా యయాతిః పుత్రమీప్సితమ్ ।
రాజ్యే ఽభిషిచ్య ముదితః వానప్రస్థో ఽభవన్మునిః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - ఇలా నహుషకుమారుడైన ఆ యయాతిరాజు తన ప్రియపుత్రుని పూరుని రాజ్యంలో అభిషిక్తుని చేసి ఆనందంతో వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. (1)
ఉషిత్వా చ వనే వాసం బ్రాహ్మణైః సంశితవ్రతః ।
ఫలమూలాశనో దాంతః తతః స్వర్గమితో గతః ॥ 2
కఠోరనియమాలు పాటిస్తూ బ్రాహ్మణులతో పాటు అరణ్యంలో ఫలమూలాలను మాత్రమే భుజిస్తూ ఉండి కొంతకాలం తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. (2)
స గతః స్వర్నివాసం తం నివసన్ ముదితః సుఖీ ।
కాలేన చాతిమహతా పునః శక్రేణ పాతితః ॥ 3
నిపతన్ ప్రచ్యుతః స్వర్గాత్ అప్రాప్తో మేదినీతలమ్ ।
స్థిత ఆసీదంతరిక్షే స తదేతి శ్రుతం మయా ॥ 4
స్వర్గానికి వెళ్ళిన యయాతి అక్కడ ఆనందంగా, సుఖంగా చాలాకాలం నివసించాడు. తరువాత మళ్ళీ ఇంద్రుడు అతనిని క్రిందికు త్రోసివేశాడు. స్వర్గం నుండి క్రిందికి పడుతూ అతడు నేలమీద పడకుండా అంతరిక్షంలోనే ఉండిపోయాడు అని నేను విన్నాను. (3,4)
తత ఏవ పునశ్చాపి గతః స్వర్గమితి శ్రుతమ్ ।
రాజ్ఞా వసుమతా సార్ధమ్ అష్టకేన చ వీర్యవాన్ ॥ 5
ప్రతర్దనేన శిబినా సమేత్య కిల సంసది ।
అక్కడ నుండే మళ్ళీ అతడు స్వర్గానికి వెళ్లాడని విన్నాను. వసుమంతుడు, అష్టకుడు, ప్రతర్దనుడు, శిబి అనేవారితో కలిసి మళ్ళీ ఇంద్రుని సభలోకి ప్రవేశించాడని విని ఉన్నాం. (5 1/2)
జనమేజయ ఉవాచ
కర్మణా కేన స దివం పునః ప్రాప్తో మహీపతిః ॥ 6
జనమేజయుడిలా అన్నాడు - ఆయయాతి రాజు ఏ పనిచేసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు. (6)
సర్వమేతదశేషేణ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ।
కథ్యమానం త్వయా విప్ర విప్రర్షిగణసంనిధౌ ॥ 7
విప్రోత్తమా! ఈ విప్రుల సమూహం యొక్క సంనిధిలో ఆ వృత్తాంతాన్నంతా ఉన్నదున్నట్లుగా నీవు చెపితే వినాలని ఉంది. (7)
దేవరాజసమో హ్యాసీద్ యయాతిః పృథివీపతిః ।
వర్ధనః కురువంశస్య విభావసుసమద్యుతిః ॥ 8
యయాతి మాహారాజు దేవేంద్రునితో సమానమైన వాడుకదా! అతడు కురువంశవర్ధనుడు. అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు. (8)
తస్య విస్తీర్ణయశసః సత్యకీర్తే ర్మహాత్మనః ।
చరితం శ్రోతుమిచ్ఛామి దివి చేహ చ సర్వశః ॥ 9
విపులమైన సత్యకీర్తి గల ఆమహాత్ముని యొక్క ఈ లోకంలోని చరిత్రను, స్వర్గలోకంలోని చరిత్రను అన్ని విధాలా వినాలని కోరుతున్నాను. (9)
వైశంపాయన ఉవాచ
హంత తే కథయిష్యామి యయాతేరుత్తమాం కథామ్ ।
దివి చేహ చ పుణ్యార్థాం సర్వపాపప్రణాశినీమ్ ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! స్వర్గలోకంలోనూ, ఇక్కడా జరిగిన చరిత్రను చెపుతాను. ఆ చరిత్ర పుణ్యప్రదమా, పాపనాశకమూను. (10)
యయాతిర్నాహుషో రాజా పూరం పుత్రం కనీయసమ్ ।
రాజ్యే ఽభిషిచ్య ముదితః ప్రవవ్రాజ వనం తదా ॥ 11
అంత్యేషు స వినిక్షిప్య పుత్రాన్ యదుపురోగమాన్ ।
ఫలమూలాశనో రాజా వనే సంన్యవసచ్చిరమ్ ॥ 12
నహుషుని కొడుకు యయాతి మహారాజు తన కనిష్ఠ కుమారుని పూరుని రాజ్యంలో అభిషేకించి, ఆనందించి వానప్రస్థానికి వెళ్ళాడు. యదువు మొదలయిన తక్కిన కొడుకులను రాజ్యానికి అంత్యసీమలలో (రాజ్యం సరిహద్దులలో) ఉంచాడు. ఫలమూలాలు భుజిస్తూ యయాతి వనంలో చాలాకాలం ఉన్నాడు. (11,12)
శంసితాత్మా జితక్రోధః తర్పయన్ పితృదేవతాః ।
అగ్నీంశ్చ విధివజ్జుహ్వన్ వానప్రస్థవిధానతః ॥ 13
మనోనిగ్రహంతో, క్రోధాన్ని జయించి వానప్రస్థధర్మాన్ని అనుసరించి పితృదేవతలకు తర్పణాలిస్తూ, వానప్రస్థ విధానంలో అగ్నిహోత్రంలో హోమం చేస్తూ నివసిస్తున్నాడు. (13)
అతిధీన్ పూజయామాస వన్యేన హవిషా విభుః ।
శిలోంఛవృత్తిమాస్థాయ శేషాన్నకృతభోజనః ॥ 14
వనంలో దొరికిన హవిస్సుతో (పదార్థాలతో) రాజు అతిథులను పూజించేవాడు. శిల, ఉంఛ అను పద్ధతుల ద్వారా లభించిన ఆహారాన్ని అతిథులకు పెట్టి మిగిలినదాన్ని భుజించేవాడు. (14)
పూర్ణం వర్షసహస్రం చ ఏవం వృత్తిరభూన్నృపః ।
అబ్భక్షః శరదస్త్రింశద్ ఆసీ న్నియతవాఙ్మనాః ॥ 15
ఇలా వేయిసంవత్సరాలు జీవించాడు. నీటిని మాత్రమే స్వీకరిస్తూ, వాక్కును, మనస్సును నిగ్రహించి ముప్పది సంవత్సరాలు (శరత్తులు) గడిపాడు. (15)
తతశ్చ వాయుభక్ష్యో ఽభూత్ సంవత్సరమతంద్రితః ।
తథా పంచాగ్నిమధ్యే చ తపస్తేపే స వత్సరమ్ ॥ 16
అనంతరం వాయుభక్షణ చేస్తూ అలసట లేకుండా సంవత్సరకాలం గడిపాడు. అదేవిధంగా పంచాగ్ని మధ్యంలో ఉండి ఒక సంవత్సర కాలం అతడు తపస్సు చేశాడు. (16)
ఏకపాద స్థితశ్చాసీత్ షణ్మాసాననిలాశనః ।
పుణ్యకీర్తి స్తతః స్వర్గే జగామావృత్య రోదసీ ॥ 17
ఒకే పాదం మీద నిలబడి, ఽఆయుభక్షణ చేస్తూ ఆరునెలలున్నాడు. అనంతరం పవిత్రమైన అతని కీర్తి రోదసి అంతటా వ్యాపించింది. తరువాత అతడు స్వర్గానికి వెళ్ళాడు. (17)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే షడశీతితమోఽధ్యాయః ॥ 86 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను ఎనుబది ఆరవ అధ్యాయము. (86)