85. ఎనుబది అయిదవ అధ్యాయము
యయాతి పూరునకు రజ్యాభిషేకము చేసి వనమున కేగుట.
వైశంపాయన ఉవాచ
పౌరవేణాథ వయసా యయాతిర్నహుషాత్మజః ।
ప్రీతియుక్తో నృపశ్రేష్ఠం చచార విషయాన్ ప్రియాన్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు. నహుషుని కుమారుడైన యయాతి పూరుని వయస్సుతో ఆనందించి తనకిష్టాలైన విషయసుఖాలను అనుభవించాడు. (1)
యథాకామం యథోత్సాహం యథాకాలం యథాసుఖమ్ ।
ధర్మావిరుద్ధం రాజేంద్ర యథార్హతి స ఏవ హి ॥ 2
రాజేంద్రా! అతడు కోరికననుసరించి, ఉత్సాహాన్ని బట్టి, కాలోచితమైనట్లు, సుఖంగా ధర్మవిరుద్ధం కానట్లు, యోగ్యత ననుసరించి ప్రవర్తించాడు. (2)
దేవానతర్పయద్ యజ్ఞైః శ్రాద్ధై స్తద్వత్ పితౄనపి ।
దీనాననుగ్రహై రిష్టైః కామైశ్చ ద్విజసత్తమాన్ ॥ 3
దేవతలను యజ్ఞాలచేత, పితృదేవతలను శ్రాద్ధాలచేత, దీనులకు ఇష్టమైనవి ఇచ్చి, బ్రాహ్మణోత్తములకు వారి కోరికలు తీర్చి తృప్తిపరచాడు. (3)
అతిథీనన్నపానైశ్చ విశశ్చ పరిపాలనైః ।
ఆనృశంస్యేన శూద్రాంశ్చ దస్యూన్ సంనిగ్రహేణ చ ॥ 4
ధర్మేణ చ ప్రజాః సర్వాః యథావదనురంజయన్ ।
యయాతిః పాలయామాస సాక్షాదింద్ర ఇవాపరః ॥ 5
అతిథులను అన్నపానాలతోను, వైశ్యులను రక్షణలతోను, శూద్రులను దయతో, దొంగలను బంధించుటచేత, ప్రజలను ధర్మం చేత అందరిని తగినవిధంగా రంజింపజేస్తూ సాక్షాత్తు ఇంద్రునివలె యయాతి పాలించాడు. (4,5)
స రాజా సింహవిక్రాంతః యువా విషయగోచరః ।
అవిరోధేన ధర్మస్య చచార సుఖముత్తమమ్ ॥ 6
సింహం వంటి పరాక్రమం గల యువకుడైన ఆ రాజు విషయసుఖాలన్నీ అందుబాటులో ఉన్నా, ధర్మవిరోధం లేకుండా ఉత్తమసుఖాన్ని అనుభవించాడు. (6)
స సంప్రాప్య శుభాన్ కామాన్ తృప్తః ఖిన్నశ్చ పార్థివః ।
కాలం వర్షసహస్రాంతం సస్మార మనుజాధిపః ॥ 7
పరిసంఖ్యాయ కాలజ్ఞః కలాః కాష్ఠాశ్చ వీర్యవాన్ ।
యౌవనం ప్రాప్య రాజర్షిః సహస్రపరివత్సరాన్ ॥ 8
విశ్వాచ్యా సహితో రేమే వ్యభ్రాజన్నందనే వనే ।
అలకాయాం సకాలం తు మేరుశృంగే తథోత్తరే ॥ 9
యదా స పశ్యతే కాలం ధర్మాత్మా తం మహీపతిః ।
పూర్ణం మత్వా తతః కాలం పూరుం పుత్రమువాచ హ ॥ 10
శుభాలైన అనేక కోరికలను అనుభవించి తృప్తి చెంది గడిచిన వేయిసంవత్సరాలను స్మరించి ఆ మహారాజు ఖిన్నుడయ్యాడు. కాలజ్ఞుడైన యయాతి కళలు, కాష్ఠలు లెక్కించి, యౌవనం పొంది వేయి సంవత్సరాలను విశ్వాచి
అనే అప్సరతో నందనవనంలో ఆనందించాడు. అతడు అలకానగరంలో, ఉత్తరదిక్కులో ఉన్న మేరుశిఖరంపైన ఇచ్ఛానుసారంగా విహరించాడు. ధర్మాత్ముడైన ఆ రాజు కాలం మీద దృష్టిపెట్టి తన సమయం పూర్తయిందని భావించి కుమారుడైన పూరునితో ఇలా అన్నాడు. (7-10)
యథాకామం యథోత్సాహం యథాకాలమరిందమ ।
సేవితా విషయాః పుత్ర యౌవనేన మయా తవ ॥ 11
శత్రువులను నిగ్రహించువాడా! కోరికల ననుసరించి ఉత్సాహమున్నంత వరకు, తగిన సమయంలో విషయసుఖాలను నీ యౌవనంతో నేను అనుభవించాను. (11)
న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతి ।
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే ॥ 12
కోరికలను అనుభవించినంత మాత్రాన కోరిక శాంతింపదు. హవిస్సుచేత అగ్నిహోత్రం వృద్ధి చెందుతుంది. అలాగే కోరికల అనుభవం చేత కోరిక పెరుగుతూనే ఉంటుంది. (12)
యథా పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః ।
ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్ తృష్ణాం పరిత్యజేత్ ॥ 13
ఈ భూమిపై ఉన్న ధాన్యాలు, బంగారం, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించినా అవి ఒక్కనికి చాలవు. అందువల్ల ముందు కోరికను విడిచిపెట్టాలి. (13)
యా దుస్త్యజా దుర్మతిభిః యా న జీర్యతి జీర్యతః ।
యో ఽసౌ ప్రాణాంతకో రోగః తాం తృష్ణాం త్యజతః సుఖమ్ ॥ 14
తృష్ణను చెడు బుద్ధిగలవారు త్యజింపలేరు. జీర్ణమైపోతున్న (ముసలి) వానిలో కూడ అది నశింపదు. ఇది ప్రాణాంతకమైన రోగం. అందువల్ల తృష్ణను విడిచిపెట్టాలి. (14)
పూర్ణం వర్షసహస్రం మే విషయాసక్తచేతసః ।
తథాప్యనుదినం తృష్ణా మమైతేష్వభిజాయతే ॥ 15
విషయాల పట్ల లగ్నమైన మనసుతో నాకు వేయి సంవత్సరాలు గడిచాయి. అయినా నిత్యమూ నాకు ఈ విషయసుఖాల యందు కోరిక కలుగుతూనే ఉంది. (15)
తస్మాదేనామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసమ్ ।
నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగైః సహ ॥ 16
అందువల్ల నేను ఈ తృష్ణను విడిచి, మనస్సును బ్రహ్మమందు నిలిపి, సుఖదుఃఖాది ద్వంద్వరహితుడనై మమకారం లేకుండా, మృగాలతోపాటు సంచరిస్తాను. (16)
పూరో ప్రీతో ఽస్మి భద్రం తే గృహాణేదం స్వయౌవనమ్ ।
రాజ్యం చేదం గృహాణ త్వం త్వం హి మే ప్రియకృత్ సుతః ॥ 17
పూరూ! సంతోషించాను. నీకు శుభమగుగాక! నీ యౌవనాన్ని నీవు గ్రహించు. ఈ రాజ్యాన్ని కూడ స్వీకరించు. నీవే నాకు ప్రియాన్ని చేసిన కొడుకువు. (17)
వైశంపాయన ఉవాచ
ప్రతిపేదే జరాం రాజా యయాతిర్నాహుషస్తదా ।
యౌవనం ప్రతిపేదే చ పూరుః స్వం పునరాత్మనః ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు - అపుడు నహుషుని కుమారుడు యయాతి తన ముసలితనాన్ని తాను తీసికొన్నాడు. పూరుడు తన యౌవనాన్ని తాను తీసికొన్నాడు. (18)
అభిషేక్తుకామం నృపతిం పూరం పుత్రం కనీయసమ్ ।
బ్రాహ్మణ ప్రముఖా వర్ణా ఇదం వచనమబ్రువన్ ॥ 19
చిన్న కొడుకైన పూరుని రాజ్యాభిషిక్తుని చేయాలనుకొంటున్న యయాతి దగ్గరకు బ్రాహ్మణాదిప్రముఖులు వచ్చి ఇలా అన్నారు. (19)
కథం శుక్రస్య నప్తారం దేవయాన్యాః సుతం ప్రభో ।
జ్యేష్ఠం యదుమతిక్రమ్య రాజ్యం పూరోః ప్రయచ్ఛసి ॥ 20
శుక్రుని మనుమని, దేవయాని కుమారుడైన జ్యేష్ఠుని యదుని విడిచిపెట్టి పూరునకు రాజ్యం ఎలా ఇస్తావు? (20)
యదుర్జ్యేష్ఠస్తవ సుతః జాతస్తమను తుర్వసుః ।
శర్మిష్ఠాయాః సుతో ద్రుహ్యుః తతోఽనుః పూరురేవ చ ॥ 21
నీ జ్యేష్ఠ కుమారుడు యదువు. అతని తరువాత తుర్వసువు, శర్మిష్ఠ కుమారులు ద్రుహ్యువు, అనువు, పూరువు జన్మించారు. (పూరుడు అందరి కంటె చిన్నవాడు.) (21)
కథం జ్యేష్ఠానతిక్రమ్య కనీయాన్ రాజ్యమర్హతి ।
ఏతత్ సంబోధయామస్త్వాం ధర్మం త్వం ప్రతిపాలయ ॥ 22
పెద్దవాళ్లను విడిచిపెట్టి చిన్నవాడు రాజ్యానికి ఎలా అర్హుడౌతాడు? ఈ విషయాన్ని నీకు గుర్తుచేస్తున్నాము. నీవు ధర్మాన్ని పాటించవలసింది. (22)
యయాతిరువాచ
బ్రాహ్మణప్రముఖా వర్ణాః సర్వే శృణ్వంతు మే వచః ।
జ్యేష్ఠం ప్రతి యథారాజ్యం న దేయం మే కథంచన ॥ 23
యయాతి ఇలా అన్నాడు - బ్రాహ్మణాదులైన అన్ని వర్ణాల వారూ నామాటను వినండి. ఏవిధంగానైనా సరే, ఈ రాజ్యం నాజ్యేష్ఠకుమారునికి ఇవ్వదగింది కాదు. (23)
మమ జ్యేష్ఠేన యదునా నియోగో నానుపాలితః ।
ప్రతికూలః పితుర్యశ్చ న స పుత్రః సతాం మతః ॥ 24
నా జ్యేష్ఠకుమారుడు యదువు నా ఆజ్ఞను పాటించలేదు. తండ్రికి ప్రతికూలంగా ఉండేవాడు కొడుకే కాదు అని సత్పురుషుల అభిప్రాయం. (24)
మాతాపిత్రో ర్వచనకృత్ హితః పథ్యశ్చ యః సుతః ।
స పుత్రః పుత్రవద్ యశ్చ వర్తతే పితృమాతృషు ॥ 25
తల్లిదండ్రుల మాటను ఆచరించేవాడు, హితుడు, అనుకూలంగా ఉండేవాడు, తల్లిదండ్రుల విషయంలో కొడుకులా ప్రవర్తించేవాడే నిజమైన పుత్రుడు. (25)
(పుదితి నరకస్యాఖ్యా దుఃఖం హి నరకం విదుః ।
పుతస్త్రాణాత్ తతః పుత్త్రమ్ ఇహేచ్ఛంతి పరత్ర చ ॥
ఆత్మనః సదృశః పుత్రః పితృదేవర్షిపూజనే ।
యో బహూనాం గుణకరః స పుత్రో జ్యేష్ఠ ఉచ్యతే ॥
జ్యేష్ఠాంశభాక్ స గుణకృత్ ఇహ లోకే పరత్ర చ ।
శ్రేయాన్ పుత్రో గుణోపేతః స పుత్రో నేతరో వృథా ॥
వదంతి ధర్మం ధర్మజ్ఞాః పితౄణాం పుత్రకారణాత్ ।)
'పుత్' అని ఒక నరకానికి పేరు. ఆ నరకం దుఃఖరూపమైంది. 'పుత్' అనే నరకం నుండి రక్షించటం వలన పుత్రుడని అంటారు. అంధుకే ఇహపరాల కోసం పుత్రుని కోరుకొంటారు. పితరులను, దేవతలను, ఋషులను పూజించడంలో తనతో సమానమైన వాడు, ఎక్కువ మందికి ఉపకారం చేసేవాడే జ్యేష్ఠపుత్రుడౌతాడు. గుణవంతుడైన లేదా ఉపకారి అయిన పుత్రుడే ఇహపరాలలొ జ్యేష్ఠాంశాన్ని పొందుతాడు. గుణాలతో ఉన్న పుత్రుడే శ్రేయస్కారకుడు. అతడే పుత్రుడు. ఇతరులు కాదు. గుణహీనుడైన పుత్రుడు వ్యర్థుడు. ధర్మజ్ఞులైన వారు పుత్రులకారణంగానే పితరులకు ధర్మాన్ని చెపుతున్నారు.
యదునాహమవజ్ఞాతః తథా తుర్వసునాపి చ ।
ద్రుహ్యునా చానువా చైవ మయ్యవజ్ఞా కృతా భృశమ్ ॥ 26
యదువు, తుర్వసువు, ద్రుహ్యువు, అనువు వీరంతా నా మాటను తిరస్కరించారు. నన్ను చాలా అవమానించారు. (26)
పూరుణా తు కృతం వాక్యం మానితం చ విశేషతః ।
కనీయాన్ మమ దాయాదః ధృతా యేన జరా మమ ॥ 27
పూరుడు నా మాటను ఆచరించాడు. ప్రత్యేకించి నా మాటను గౌరవించాడు. అతడు నా చిన్నకొడుకు. అయినా అతడు నా ముసలితనాన్ని స్వీకరించాడు. (27)
మమ కామః స చ కృతః పూరుణా మిత్రరూపిణా ।
శుక్రేణ చ వరో దత్తః కావ్యేనోశనసా స్వయమ్ ॥ 28
పుత్రో యస్త్వనువర్తేత స రాజా పృథివీపతిః ।
భవతో ఽనునయామ్యేవం పూరూ రాజ్యే ఽభిషిచ్యతామ్ ॥ 29
స్నేహితుని రూపంతో ఉన్న నా కుమారుడు పూరుడు నా కోరికను మన్నించాడు. నా మాటను అనుసరించినవాడే ఈ రాజ్యానికి రాజౌతాడని కవి కుమారుడైన శుక్రుడు స్వయంగా వరానిచ్చాడు. కాబట్టి మిమ్మల్ని అనునయిస్తున్నాను. పూరుని రాజ్యంలో అభిషేకిద్దాము. (28,29)
ప్రకృతయ ఊచుః
యః పుత్రో గుణసంపన్నః మాతాపిత్రోర్హితః సదా ।
సర్వమర్హతి కల్యాణం కనీయానపి సత్తమః ॥ 30
పౌరులిలా అన్నారు - గుణసంపన్నుడు, తల్లిదండ్రులకు హితం కూర్చేవాడు, మంచి పుత్రుడు చిన్నవాడైనా సమస్త శుభాలకూ యోగ్యుడవుతాడు. (30)
అర్హః పూరురిదం రాజ్యం యః సుతః ప్రియకృత్ తవ ।
వరదానేన శుక్రస్య న శక్యం వక్తుముత్తరమ్ ॥ 31
నీకు ప్రియాన్ని ఆచరించిన నీ కుమారుడు పూరుడు ఈ రాజ్యాధికారం పొందటానికి అర్హుడు. శుక్రుడు వరం ఇవ్వడం చేత దానికి విరుద్ధంగా మాట్లాడటం కూడా యుక్తం కాదు. (31)
వైశంపాయన ఉవాచ
పౌరజానపదైస్తుష్టైః ఇత్యుక్తో నాహుష స్తదా ।
అభ్యషించత్ తతః పూరుం రాజ్యే స్వే సుతమాత్మనః ॥ 32
వైశంపాయనుడిలా అన్నాడు - పౌరజానపదులు సంతుష్టులై చెప్పిన తరువాత రాజు తన కుమారుడైన పూరుని తన రాజ్యానికి అభిషిక్తుని చేశాడు. (32)
దత్వా చ పూరవే రాజ్యం వనవాసాయ దీక్షితః ।
పురాత్ స నిర్యయౌ రాజా బ్రాహ్మణై స్తాపసై స్సహ ॥ 33
పూరునికి రాజ్యమిచ్చిన తర్వాత యయాతి వనవాసానికి దీక్షితుడై బ్రాహ్మణులతో, తాపసులతో కూడి నగరం నుండి బయటకు వెళ్ళాడు. (33)
యదోస్తు యాదవా జాతాః తుర్వసోర్యవనాః స్మృతాః ।
ద్రుహ్యోః సుతాస్తు వై భోజాః అనోస్తు మ్లేచ్ఛజాతయః ॥ 34
యదువునకు యాదవులు జన్మించారు. తుర్వసువు వల్ల యవనులు జన్మించారు. ద్రుహ్యునికి జన్మించిన పుత్రులను భోజులని, అనువుకు జన్మించిన వారిని మ్లేచ్ఛజాతులని అంటారు. (34)
పూరోస్తు పౌరవో వంశః యత్ర జాతోఽసి పార్థివ ।
ఇదం వర్షసహస్రాణి రాజ్యం కారయితుం వశీ ॥ 35
రాజా! పూరుని వల్ల పౌరవవంశం ఏర్పడింది. ఆ వంశంలోనే నీవు జన్మించావు. ఇంద్రియనిగ్రహంతో నీవు వేయి సంవత్సరాలు ఈ రాజ్యం చేయడానికి అర్హుడవు. (35)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే పూర్వయాయాతసమాప్తౌ పంచాశీతితమోఽధ్యాయః ॥ 85 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమున యయాతి పూర్వవృత్తాంత సమాప్తి అను ఎనుబది అయిదవ అధ్యాయము. (85)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠము 3 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 38 1/2 శ్లోకాలు)