88. ఎనుబది ఎనిమిదవ అధ్యాయము

యయాతి స్వర్గము నుండి పడుట, అష్టకుడతనిని ప్రశ్నించుట.

ఇంద్ర ఉవాచ
సర్వాణి కర్మాణి సమాప్య రాజన్
గృహం పరిత్యజ్య వనం గతో ఽసి ।
తత్ త్వాం పృచ్ఛామి నహుషస్య పుత్ర
కేనాసి తుల్యస్తపసా యయాతే ॥ 1
ఇంద్రుడిలా అన్నాడు - రాజా! నీవు గృహస్థకర్మాలన్నింటిని పూర్తిచేసికొని, ఇంటిని వదిలి, వనానికి వెళ్ళావు. నహుషపుత్రా! ఒక మాట నిన్ను అడుగుతున్నాను. నీవు తపస్సుతో ఎవరితో సమానుడవయ్యా? (1)
యయాతి రువాచ
వాహం దేవమనుష్యేషు గంధర్వేషు మహర్షిషు ।
ఆత్మనస్తపనా తుల్యం కంచిత్పశ్యామి వాసవ ॥ 2
యయాతి ఇలా అన్నాడు - ఇంద్రా! దేవతలలో, మనుష్యులలో, గంధర్వులలో, మహర్షులలో, నాతో తపస్సులో సమానుని ఎవరినీ చూడలేదు. (2)
ఇంద్ర ఉవాచ
యదావమంస్థాః సదృశః శ్రేయసశ్చ
అల్పీయస శ్చావిదితప్రభావః ।
తస్మాల్లోకాస్త్వంతవంత స్తవేమే
క్షీణే పుణ్యే పతితాస్యద్య రాజన్ ॥ 3
ఇంద్రుడిలా అన్నాడు - రాజా! నీవు నీతో సమానమైన వాళ్ళని , ఎక్కువ వాళ్ళను, తక్కువ వాళ్ళను వాళ్ళ ప్రభావం తెలియకుండానే తిరస్కరించావు. అందువల్ల నీకు ఈ పుణ్యలోకాల్లో ఉండే సమయం పూర్తయింది. పుణ్యం క్షీణించడం వల్ల నీవిపుడు క్రిందికి పడుతున్నావు. (3)
యయాతి రువాచ
సురర్షి గంధర్వ నరావమానాత్
క్షయం గతా మే యది శక్ర లోకాః ।
ఇచ్ఛామ్యహం సురలోకాద్ విహీనః
సతాం మధ్యే పతితుం దేవరాజ ॥ 4
యయాతి ఇలా అన్నాడు - ఇంద్రా! దేవ ఋషి గంధర్వ మనుష్యుల అవమానం వల్ల నాకు ఈ పుణ్యలోకాలు క్షీణిస్తే, స్వర్గలోకం విడిచి, సత్పురుషుల మధ్యలో పడాలని కోరుతున్నాను. (4)
ఇంద్ర ఉవాచ
సతాం సకాశే పతితాసి రాజన్
చ్యుతః ప్రతిష్ఠాం యత్ర లబ్ధాసి భూయః ।
ఏతద్ విదిత్వా చ పునర్యయాతే
త్వం మావమంస్థాః సదృశః శ్రేయసశ్చ ॥ 5
ఇంద్రుడిలా అన్నాడు - రాజా! నీవు ఈ స్వర్గం నుండి చ్యుతుడవై సత్పురుషుల దగ్గర పడుతున్నావు. యయాతీ! అక్కడ మరల ప్రతిష్ఠను పొందుతావు. ఈ విషయం గ్రహించి నీవు మళ్ళీ సమానులను, గొప్పవాళ్ళను అవమానించవద్దు. (5)
వైశంపాయన ఉవాచ
తతః ప్రహాయామరరాజజుష్టాన్
పుణ్యాంల్లోకాన్ పతమానం యయాతిమ్ ।
సంప్రేక్ష్య రాజర్షివరో ఽష్టకస్తమ్
ఉవాచ సద్ధర్మవిధానగోప్తా ॥ 6
వైశంపాయనుడిలా అన్నాడు - దేవేంద్రుడు అనుభవించే పుణ్యలోకాలను విడిచి, యయాతి క్రిందికి పడుతున్నాడు. అలా పడుతున్న ఆ రాజర్షిని చూసి, సద్ధర్మాచరణాన్ని రక్షించే అష్టకుడు అతనితో ఇలా అన్నాడు. (6)
అష్టక ఉవాచ
కస్త్వం యువా వాసవతుల్యరూపః
స్వతేజసా దీప్యమానో యథాగ్నిః ।
పతస్యుదీర్ణాంబుధరాంధకారాత్
ఖాత్ ఖేచరాణాం ప్రవరో యథార్కః ॥ 7
అష్టకుడిలా అన్నాడు - ఇంద్రునితో సమానరూపం గల యువకుడవు, నీవెవరు? నీవు అగ్నిలా తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. దట్టని మేఘం లాంటి అంధకారం గల ఆకాశం నుండి గ్రహాల్లో శ్రేష్ఠుడైన సూర్యునిలా ఎక్కడ నుండి పడుతున్నావు? (7)
దృష్ట్వా చ త్వాం సూర్యపథాత్ పతంతం
వైశ్వానరార్కద్యుతి మప్రమేయమ్ ।
కిం ను స్విదేతత్ పతతీతి సర్వే
వితర్కయంతః పరిమోహితాః స్మః ॥ 8
సూర్యుని మార్గం నుండి పడుతూ, అగ్నివలె, సూర్యుని వలె అప్రమేయమైన కాంతి గల నిన్ను చూసి 'ఏమిటీ పడుతున్నది?' అని అంతా సమ్మోహితులమై ఆలోచిస్తున్నాం. (8)
దృష్ట్వా చ త్వాం ధిష్ఠితం దేవమార్గే
శక్రార్కవిష్ణుప్రతిమప్రభావమ్ ।
అభ్యుద్గతాస్త్వాం వయమద్య సర్వే
తత్త్వం ప్రపాత్ తవ జిజ్ఞాసమానాః ॥ 9
ఇంద్ర సూర్య విష్ణువులతో సమాన ప్రభావం గల నీవు ఆకాశమార్గంలో ఉండటం చూసి ఇపుడు మేమంతా నీవు పడటంలోని యథార్థకారణాన్ని తెలుసుకోవాలని నీ దగ్గరకు వచ్చాము. (9)
న చాపి త్వాం ధృష్ణుమః ప్రష్ణుమగ్రే
నచ త్వమస్మాన్ పృచ్ఛసి యే వయం స్మః ।
తత్ త్వాం పృచ్ఛామి స్పృహణీయరూప
కస్య త్వం వా కిం నిమిత్తం త్వమాగాః ॥ 10
నిన్ను ముందుగా అడగటానికి సాహసింపలేకపొతున్నాం. నీవు కూడ మమల్ని 'ఎవర'ని అడగలేదు. అందువల్ల నేను నిన్ను అడుగుతున్నాను - నీవెవరి కుమారుడవు? ఏకారణంగా నువ్విక్కడకి వచ్చావు? (10)
భయం తు తే వ్యేతు విషాదమోహౌ
త్వజాశు చైవేంద్రసమప్రభావ ।
త్వాం వర్తమానం హి సతాం సకాశే
నాలం ప్రసోఢుం బలహాపి శక్రః ॥ 11
ఇంద్రునితో సమానమైన శక్తికలవాడా! నీ భయం తొలగిపోవుగాక! విషాదాన్ని, మోహాన్నీ వెంటనే విడిచి పెట్టు. నీవు సత్పురుషుల మధ్యలో ఉన్నావు. ఇంద్రుడు కూడ ఇపుడు నీ తేజస్సును సహింపడానికి సమర్థుడు కాదు. (11)
సంతః ప్రతిష్ఠా హి సుఖచ్యుతానాం
సతాం సదైవామరరాజకల్ప ।
తే సంగతాః స్థావరజంగమేశాః
ప్రతిష్ఠితస్త్వం సదృశేషు సత్సు ॥ 12
దేవేంద్రసమానా! సుఖం నుండి చ్యుతులైన సత్పురుషులకు సత్పురుషులే ఆశ్రయము. స్థావరజంగమాలను శసింపగల సత్పురుషులంతా ఇక్కడ కలిసి ఉన్నారు. నీవిపుడు నీతో సమానమైన వారిలో ఉన్నావు. (12)
ప్రభురగ్నిః ప్రతపనే భూమి రావపనే ప్రభుః ।
ప్రభుః సూర్యః ప్రకాశిత్వే సతాం చాభ్యాగతః ప్రభుః ॥ 13
అగ్ని కాల్చడానికి సమర్థమైనది. భూమి బీజం మొలకెత్తడానికి సమర్థమైనది. సూర్యుడు అంతటిని ప్రకాశింపజేయడానికి సమర్థుడు. ఇదేవిధంగా అతిథి సత్పురుషులను శాసించడానికి సమర్థుడు. (13)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే అష్టాశీతితమోఽధ్యాయః ॥ 88 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము. (88)