78. డెబ్బది ఎనిమిదవ అధ్యాయము

దేవయానీ శర్మిష్ఠల కలహము.

వైశంపాయన ఉవాచ
కృతవిద్యే కచే ప్రాప్తే హృష్టరూపా దివౌకసః ।
కచాదధీత్య తాం విద్యాం కృతార్థా భరతర్షభ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - కచుడు మృతసంజీవినీ విద్యను నేర్చుకొని రావడంతో దేవతలంతా ఆనందించారు. కచుని దగ్గర ఆ విద్యను అధ్యయనం చేసి కృతార్థులయ్యారు. (1)
సర్వ ఏవ సమాగమ్య శతక్రతుమథాబ్రువన్ ।
కాలస్తే విక్రమస్యాద్య జహి శత్రూన్ పురందర ॥ 2
అందరూ కలిసి వచ్చి ఇంద్రునితో ఇలా అన్నారు - ఇప్పుడిక నీవు పరాక్రమించవలసిన సమయం ఆసన్నమయింది పురందరా! శత్రువులను జయించు. (2)
ఏవముక్తస్తు సహితైః త్రిదశై ర్మఘవాంస్తదా ।
తథేత్యుక్త్వా ప్రచక్రామ సోఽపశ్యత వనే స్త్రియః ॥ 3
దేవతలందరూ కలిసి ఇలా చెప్పగానే దేవేంద్రుడు అలాగే అని పలికి బయలుదేరాడు. అతడు ఒక వనంలో స్త్రీలను చూశాడు. (3)
క్రీడంతీనాం తు కన్యానాం వనే చైత్రరథోపమే ।
వాయుభూతః స వస్త్రాణి సర్వాణ్యేవ వ్యమిశ్రయత్ ॥ 4
చైత్రరథవనాన్ని పోలిన వనంలో కన్యలందరూ జలక్రీడలాడుతుండగా అతడు వాయురూపంలో వారి బట్టల్ని కలగాపులగం చేశాడు. (4)
వి: సం: శర్మిష్ఠా దేవయానులద్వారా శుక్రునకూ, దానవులకూ విరోధం కలగాలని ఇంద్రుడిలా చేశాడు. (నీల)
తతో జలాత్ సముత్తీర్య కన్యాస్తాః సహితాస్తదా ।
వస్త్రాణి జగృహుస్తాని యథాసన్నాన్యనేకశః ॥ 5
తత్ర వాసో దేవయాన్యాః శర్మిష్ఠా జగృహే తదా ।
వ్యతిమిశ్రమజానంతీ దుహితా వృషపర్వణః ॥ 6
నీటి నుండి పైకి వచ్చి ఆ కన్యలందరూ ఒకదానితో ఒకటి కలిసి ఉన్న వస్త్రాలను తీసికొన్నారు. వస్త్రాలు తారుమారు కావటాన్ని వృషపర్వుని కూతురు శర్మిష్ఠ గమనించకుండా దేవయాని వస్త్రం స్వీకరించింది. (5,6)
తత స్తయోర్మిథస్తత్ర విరోధః సమజాయత ।
దేవయాన్యాశ్చ రాజేంద్ర శర్మిష్ఠాయాశ్చ తత్కృతే ॥ 7
రాజేంద్ర! అనంతరం అక్కడ ఆ వస్త్రం కోసం దేవయానికి శర్మిష్ఠకు పరస్పరం విరోధం ఏర్పడింది. (7)
దేవయాన్యువాచ
కస్మాద్ గృహ్ణాసి మే వస్త్రం శిష్యా భూత్వా మమాసురి ।
సముదాచారహీనాయాః న తే సాధు భావిష్యతి ॥ 8
దేవాయాని అంది - ఆసురీ! శిష్యురాలవై ఉండి నా వస్త్రాన్ని ఎందుకు తీసికొన్నావు? సముదాచారం లేని నీకు ఈ పని మంచిదికాదు. (8)
శర్మిష్ఠోవాచ
ఆసీనం చ శయానం చ పితా తే పితరం మమ ।
స్తౌతి వందీవ చాభీక్ష్ణం నీచైః స్థిత్వా వినీతవత్ ॥ 9
శర్మిష్ఠ ఇలా అన్నది - కూర్చున్నా, పరుండినా, నా తండ్రికి క్రింద నిలిచి నీ తండ్రి వినయంతో మాటి మాటికి వందిమాగధునివలె స్తుతిస్తూ ఉంటాడు. (9)
యాచతస్త్వం హి దుహితా స్తువతః ప్రతిగృహ్ణతః ।
సుతాహం స్తూయమానస్య దదతో ఽప్రతిగృహ్ణతః ॥ 10
ఆదున్వస్వ విదున్వస్వ ద్రుహ్య కుప్యస్వ యాచకి ।
అనాయుధా సాయుధాయా రిక్తా క్షుభ్యసి భిక్షుకి ।
లప్స్యసే ప్రతియోద్ధారం న హి త్వాం గణయామ్యహమ్ ॥ 11
యాచిస్తూ, స్తుతిస్తూ దానాన్ని ప్రతిగ్రహించే శుక్రుని కూతురవు నీవు. యాచకీ! కోపగించు. ఆయుధం లేకుండా ఉన్న నీవు ఆయుధంతో ఉన్న నాతో వ్యర్థంగా విరోధిస్తున్నావు. ప్రతియోద్ధను పొందగలవు. నిన్ను నే లెక్కపెట్టను. (10,11)
(ప్రతికూలం వదసి చేదితః ప్రభృతి యాచకి ।
ఆకృష్య మమ దాసీభిః ప్రస్థాప్యసి బహిర్బహిః ॥)
యాచకీ! ఇకపైన ప్రతికూలంగా మాట్లాడితే నాదాసీలు నిన్ను బలవంతాన బయటకు పంపుతారు.
వైశంపాయన ఉవాచ
సముచ్ఛ్రయం దేవయానీం గతాం సక్తాం చ వాససి ॥ 12
శర్మిష్ఠా ప్రాక్షిపత్ కూపే తతః స్వపురమాగమత్ ।
హతేయమితి విజ్ఞాయ శర్మిష్ఠా పాపనిశ్చయా ॥ 13
వైశంపాయనుడిలా అన్నాడు - తన ఉన్నతత్వాన్ని, గొప్పతనాన్ని చెప్పి తన వస్త్రం పట్టుకులాగుతున్న దేవయానిని శర్మిష్ఠ నూతిలోకి త్రోసింది. అనంతరం 'ఆమె మరణించింది' అని భావించి పాపనిశ్చయురాలయిన శర్మిష్ఠ తన నగరానికి తిరిగి వచ్చింది. (12,13)
అనవేక్ష్య యయౌ వేశ్మ క్రోధవేగపరాయణా ।
అథ తం దేశమభ్యాగాద్ యయాతి ర్నహుషాత్మజః ॥ 14
చూడకుండానే కోపవేగంతో శర్మిష్ఠ ఇంటికి వెళ్ళింది. అనంతరం ఆ ప్రదేశానికి నహుషుని కొడుకు యయాతి వచ్చాడు. (14)
శ్రాంతయుగ్యః శ్రాంతహయః మృగలిప్సుః పిపాసితః ।
స నాహుషః ప్రేక్షమాణః ఉదపానం గతోదకమ్ ॥ 15
ఆ యయాతి సారథి, రథాశ్వాలు అలిసిపోయాయి. మృగాలను వేటాడుతూ అతడు కూడా దప్పికతో ఉన్నాడు. త్రాగడానికి నీరున్న ప్రదేశాన్ని వెదకుతూ యయాతి అక్కడకు వచ్చాడు. (15)
దదర్శ రాజా తాం తత్ర కన్యా మగ్నిశిఖామివ ।
తామపృచ్ఛత్ స దృష్ట్వైవ కన్యా మమరవర్ణినీమ్ ॥ 16
అక్కడ నూతిలో అగ్నిశిఖలా ఉన్న ఆ కన్యను రాజు చూశాడు. దేవతాస్త్రీలా ఉన్న ఆమెను చూడగానే ఇలా అడిగాడు. (16)
సాంత్వయిత్వా నృపశ్రేష్ఠః సామ్నా పరమవల్గునా ।
కా త్వం తామ్రనఖీ శ్యామా సుమృష్టమణికుండలా ॥ 17
రాజశ్రేష్ఠుడైన యయాతి మిక్కిలి తీయనైన సాంత్వన వచనాలతో ఆమెను ఊరడించి, 'ఎర్రనిగోళ్ళు కలిగి, మణికుండలాలతో ప్రకాశిస్తూన్న నీవు ఎవరవు' అని అడిగాడు? (17)
దీర్ఘం ధ్యాయసి చాత్యర్థం కస్మాచ్ఛోచసి చాతురా ।
కథం చ పతితాస్యస్మిన్ కూపే వీరుత్తృణావృతే ॥ 18
దుహితా చైవ కస్య త్వం వద సత్యం సుమధ్యమే ।
మిక్కిలిగా ఆలోచిస్తున్నావు. తెలివైన నీవు ఎందువల్ల మిక్కిలి దుఃఖిస్తున్నావు. నీటిమొక్కలతోను, గడ్డితోను నిండి ఉన్న ఈ కూపంలో ఎలా పడ్డావు? నీవు ఎవరి కూతురవు. సుందరీ! నిజం చెప్పు. (18 1/2)
దేవయాన్యువాచ
యోఽసౌ దేవైర్హతాన్ దైత్యాన్ ఉత్థాపయతి విద్యయా ॥ 19
తస్య శుక్రస్య కన్యాఽహం స మాం నూనం న బుధ్యతే ।
దేవయాని ఇలా చెప్పింది - దేవతలు చంపిన దైత్యులను తన విద్యతో తిరిగి బ్రతికిస్తున్న శుక్రాచార్యుని కూతురను. నన్ను నీవు ఎరుగవా! (19)
(పృచ్ఛసే మాం కస్త్వమసి రూపవీర్యబలాన్వితః ।
బ్రూహ్యత్రాగమనం కిం వా శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥
రూపం, పరాక్రమం, బలం, వీటితో కూడియున్న నీవు 'నీవెవరూ', అని నన్ను అడుగుతున్నావు. నీవు ఇక్కడకు రావడం ఎందుకో చెప్పు. యథార్థమ్గా వినాలనుకొంటున్నాను.
యయాతిరువాచ
యయాతి ర్నాహుషోఽహం తు శ్రాంతో ఽద్య మృగలిప్సయా ।
కూపే తృణావృతే భద్రే దృష్టవానస్మి త్వామిహ ॥)
యయాతి ఇలా అన్నాడు - నహుషుని కుమారుడైన యయాతిని నేను, మృగాలను వేటాడుతూ అలసిపోయి ఇక్కడకు వచ్చాను. గడ్డితో నిండి ఉన్న ఈ నూతిలో నిన్ను చూశాను.
ఏష మే దక్షిణో రాజన్ పాణిస్తామ్రనఖాంగులిః ॥ 20
సముద్ధర గృహీత్వా మాం కులీనస్త్వం హి మే మతః ।
జానామి త్వాం హి సంశాంతం వీర్యవంతం యశస్వినమ్ ॥ 21
తస్మాన్మాం పతితా మస్మాత్ కూపాదుద్ధర్తు మర్హసి ।
రాజా! రాగరంజితమైన గోళ్లు వేళ్లు ఉన్న నాకుడిచేతిని గ్రహించి నన్ను ఉద్ధరించు. ఉత్తమవంశస్థుడవయిన నీవు నాకు ఇష్టుడవే. శాంతుడు, పరాక్రమవంతుడు, యశస్వి అయిన నిన్ను నేనెరుగుదును. అందువలన ఈ నూతిలో పడ్డ నన్ను ఉద్ధరించటానికి నీవే (సమర్థుడవు) యోగ్యుడవు. (20,21)
వైశంపాయన ఉవాచ
తామథో బ్రాహ్మణీం రాజా విజ్ఞాయ నహుషాత్మజః ॥ 22
గృహీత్వా దక్షిణే పాణౌ ఉజ్జహార తతో ఽవటాత్ ।
ఉద్ధృత్య చైనాం తరసా తస్మాత్కూపాన్నరాధిపః ॥ 23
(గచ్ఛ భద్రే యథా కామం న భయం విద్యతే తవ ।
ఇత్యుచ్యమానా నృపతిం దేవయానీ తముత్తరమ్ ॥
ఉవాచ మాం త్వమాదాయ గచ్ఛ శీఘ్రం ప్రియో హి మే ।
గృహీతాహం త్వయా పాణౌ తస్మాద్ భర్తా భవిష్యసి ॥
ఇత్యేవముక్తో నృపతిః ఆహ క్షత్రకులోద్భవః ।
త్వం భద్రే బ్రాహ్మణీ తస్మాత్ మయా నార్హసి సంగమమ్ ॥
సర్వలోకగురుః కావ్యః త్వం తస్య దుహితాసి వై ।
తస్మాదపి భయం మేఽద్య తస్మాత్ కల్యాణి నార్హసి ॥
వైశంపాయనుడిలా అన్నాడు - నహుషుని కొడుకైన యయాతిరాజు ఆమెను బ్రాహ్మణస్త్రీగా తెలిసికొని కుడిచేతితో పట్టుకుని ఆ రాజు కూపంనుండి తేలికగా ఆమెను పైకి తీసి 'స్వేచ్ఛగా వెళ్లు. నీకు భయంలేదు' అని అన్నాడు. అపుడామె రాజుకి ఇలా సమాధానమిచ్చింది - నన్ను స్వీకరించి 'శీఘ్రంగా వెళ్ళు' అని నీవు అన్నావు. కాని నీవు నాకిష్టుడవు. నీవు నా పాణిని గ్రహించావు. కాబట్టి భర్తవవుతావు. ఇలా చెప్పగానే క్షత్రవంశంలో పుట్టిన యయాతి ఇలా అన్నాడు - భద్రా! నీవు బ్రాహ్మణ కన్యవు. అందువల్ల నాతో కలయిక నీకు తగదు. శుక్రాచార్యుడు లోకానికంతకూ గురువు. ఆతని కూతురివి నీవు. అతని వల్ల ఇపుడు నాకు భయం కూడా. కళ్యాణీ! అందువల్ల ఇందుకు తగిన దానివి కాదు. (22,23)
దేవయాన్యువాచ
(యది మద్వచనాదద్య మాం నేచ్ఛసి నరాధిప ।
త్వామేవ వరయే పిత్రా పశ్చాద్ జ్ఞాస్యసి గచ్ఛసి ॥)
దేవయాని ఇలా అంది - రాజా! నా మాట ప్రకారం ఇపుడు నన్ను ఇష్టపడకపోయినట్లయితే, తండ్రి ద్వారానే నిన్ను వరిస్తాను. తర్వాత నీవు తెలుసుకొంటావు. వెళ్ళు.
ఆమంత్రయిత్వా సుశ్రోణీం యయాతిః స్వపురం యయౌ ।
గతే తు నాహుషే తస్మిన్ దేవయాన్యప్యనిందితా ॥ 24
(క్వచిదార్తా చ రుదతీ వృక్షమాశ్రిత్య తిష్ఠతి ।
తత శ్చిరాయమాణాయాం దుహితర్యాహ భార్గవః ।
ధాత్రి త్వమానయ క్షిప్రం దేవయానీం శుచిస్మితామ్ ।
ఇత్యుక్త మాత్రే సా ధాత్రీ త్వరితా ఽఽహ్వయితం గతా ॥
యత్ర యత్ర సఖీభిః సా గతా పదమమార్గత ।
సా దదర్శ తథా దీనాం శ్రమార్తాం రుదతీం స్థితామ్ ॥
యయాతి దేవయానిని వీడ్కొని తన నగరానికి వెళ్లాడు. యయాతి వెళ్లగానే ప్రశంసింపదగిన దేవయాని కూడ ఒక చెట్టుకింద కూర్చుని దుఃఖితురాలై ఏడుస్తూ కూర్చుంది. అనంతరం కూతురి రాక ఆలస్యం కావడంతో శుక్రాచార్యుడు దాదితో ఇలా అన్నాడు - 'ధాత్రీ! స్వచ్ఛమైన చిరునవ్వుతో ఉండే నాకూతురు దేవయానిని నీవు త్వరగా తీసికొనిరా.' అని చెప్పగానే దాది తొందరగా ఆంఎను పిలవడానికి వెళ్ళింది. చెలులతోబాటు ఆమె వెళ్లిన ప్రదేశాలన్నీ ఆమేకోసం వెదికింది. ఒక చోట అలసిపోయి దీనంగా ఏడుస్తూ ఉన్న దేవయానిని చూసింది. (24)
ధాత్య్రువాచ
వృత్తం తే కిమిదం భద్రే శీఘ్రం వద పితాఽఽహ్వయత్ ।
ధాత్రీమాహ సమాహూయ శర్మిష్ఠా వృజినం కృతమ్ ॥)
ఉవాచ శోకసంతప్తా ఘూర్ణికా మాగతాం పురః ।
దాది ఇలా అంది - భద్రా! నీకేం జరిగింది? ఇలా ఉన్నావు. తొందరగా చెప్పు. నీ తండ్రి నిన్ను పిలిచాడు. అపుడు దేవయాని దాదిని దగ్గరకు పిలిచి శర్మిష్ఠ చేసిన అపరాధాన్ని చెప్పింది. దుఃఖంతో తపించినదై దేవయాని తనకెదురుగా వచ్చిన ఘూర్ణిక (దాది) తో ఇలా అంది.
దేవయాన్యువాచ
త్వరితం ఘూర్ణికే గచ్ఛ శీఘ్రమాచక్ష్వ మే పితుః ॥ 25
నేదానీం సంప్రవేక్ష్యామి నగరం వృషపర్వణః ।
దేవయాని ఇలా అంది - ఘూర్ణికా తొందరగా వెళ్లు. శీఘ్రంగా నా తండ్రికి చెప్పు. నేనిపుడు వృషపర్వుని నగరాన్ని ప్రవేశించను. (25 1/2)
వైశంపాయన ఉవాచ
సా తత్ర త్వరితం గత్వా ఘూర్ణికా ఽసురమందిరమ్ ॥ 26
దృష్ట్వా కావ్యమువాచేదం సంభ్రమావిష్టచేతనా ।
ఆచచక్షే మహాప్రాజ్ఞం దేవయానీం వనే హతామ్ ॥ 27
శర్మిష్ఠయా మహాభాగ దుహిత్రా వృషపర్వణః ।
శ్రుత్వా దుహితరం కావ్యః తత్ర శర్మిష్ఠయా హతామ్ ॥ 28
త్వరయా నిర్యయౌ దుఃఖాత్ మార్గమాణః సుతాం వనే ।
దృష్ట్వా దుహితరం కావ్యః దేవయానీం తతో వనే ॥ 29
బాహుభ్యాం సంపరిష్వజ్య దుఃఖితో వాక్యమబ్రవీత్ ।
ఆత్మదోషై ర్నియచ్ఛంతి సర్వే దుఃఖసుఖే జనాః ॥ 30
మన్యే దుశ్చరితం తేఽస్తి యస్యేయం నిష్కృతిః కృతా ।
వైశంపాయనుడిలా అన్నాడు - ఘూర్ణిక అక్కడున్న రాక్షసమందిరానికి తొందరగా వెళ్ళి, శక్రుని చూసి కంగారుపడుతున్న హృదయంతో 'వృషపర్వుని కూతురయిన శర్మిష్ఠ వనంలో దేవయానిని కొట్టిందని' చెప్పింది. అక్కడ శుక్రుడు తన కూతురిని శర్మిష్ఠ కొట్టిందని విని దుఃఖంతో తొందరగా అక్కడ నుంచి వెళ్ళాడు. కూతురిని వనంలో వెతుక్కుంటూ వెళ్ళి ఒక చోట దేవయానిని చూశాడు. కూతురిని కౌగిలించుకొని, దుఃఖితుడై ఇలా అన్నాడు - "జనులందరూ తమతమదోషాల చేతనే సుఖదుఃఖాల్లో నియమింపబడతారు. నీవేదో చెడుపని చేసి ఉంటావు. దాని వల్లనే నీవిటువంటి ఫలితాన్ని పొందావు. (26-30 1/2)
దేవయాన్యువాచ
నిష్కృతిర్మేఽస్తు వా మాస్తు శృణుస్వావహితో మమ ॥ 31
దేవయాని ఇలా పలికింది - నిష్కృతి ఉండనీ, ఉండకపోనీ. సావధానంగా నామాట విను. (31)
శర్మిష్ఠయా యదుక్తాస్మి దుహిత్రా వృషపర్వణః ।
సత్యం కిలైతత్ సా ప్రాహ దైత్యానామసి గాయనః ॥ 32
వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నాతో అన్నది నిజమా? కాదా? 'రాక్షసులను స్తుతిస్తూ గానం చేసేవాడివి' అని ఆమె అంది. (32)
ఏవం హి మే కథయతి శర్మిష్ఠా వార్షపర్వణీ ।
వచనం తీక్ష్ణపరుషం క్రోధరక్తేక్షణా భృశమ్ ॥ 33
వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ఇలా అంటోంది. ఆమె కోపంతో ఎర్రబడ్డ కన్నులతో తీవ్రమూ, కఠినమూ అయిన ఈ మాట మాటిమాటికీ అంటూంది. (33)
స్తువతో దుహితా నిత్యం యాచతః ప్రతిగృహ్ణతః ।
అహం తు స్తూయమానస్య దదతో ఽప్రతిగృహ్ణతః ॥ 34
నీవు స్తుతించేవానికి, నిత్యం యాచించే వానికి, దానం తీసికొనేవానికి కూతురివి, నేనయితే స్తుతింపబడే వానికి ఇచ్చేవానికి, దానం తీసికోనటువంటివానికి కూతురిని. (34)
ఇదం మామాహ శర్మిష్ఠా దుహితా వృషపర్వణః ।
క్రోధసంరక్తనయనా దర్పపూర్ణా పునః పునః ॥ 35
వృషపర్వుని కూతురు శర్మిష్ఠ కోపంతో ఎర్రబడ్డ కన్నులతో నిండుగర్వంతో మాటిమాటికి ఈ మాటను అంటోంది. (35)
యద్యహం స్తువతస్తాత దుహితా ప్రతిగృహ్ణతః ।
ప్రసాదయిష్యే శర్మిష్ఠామ్ ఇత్యుక్తా తు సఖీ మయా ॥ 36
తండ్రీ! 'నేను స్తుతించేవానికి, ప్రతి గ్రహణం చేసేవానికి, కూతురినే అయితే నిన్ను ప్రసన్నం చేసుకోగలను' అని నా సఖి శర్మిష్ఠతో అన్నాను. (36)
(ఉక్తాప్యేవం భృశం క్రుద్ధా మాం గృహ్య విజనే వనే ।
కూపే ప్రక్షేపయామాస ప్రక్షిప్యైవ గృహం యయౌ ॥)
ఇలా చెప్పినప్పటికీ మిక్కిలి కోపంతో జనులు లేని ఈవనంలో నన్ను పట్టుకొని కూపంలోకి త్రోసి ఇంటికి వెళ్ళింది.
శుక్ర ఉవాచ
స్తువతో దుహితా న త్వం యాచతః ప్రతిగృహ్ణతః ।
అస్తోతుః స్తూయమానస్య దుహితా దేవయాన్యసి ॥ 37
శుక్రుడిలా అన్నాడు - నీవు స్తుతించేవానికి, యాచించేవానికి, ప్రతిగ్రహణం చేసేవానికి కూతురివి కాదు. స్తోత్రం చేయకుండా, స్తుతింపబడే శుక్రుని కూతురు దేవయాణివి నీవు. (37)
వృషపర్వైవ తద్వేద శక్రో రాజా చ నాహుషః ।
అచింత్యం బ్రహ్మ నిర్ద్వంద్వమ్ ఐశ్వరం హి బలం మమ ॥ 38
చింతింపశక్యంగాని, బ్రహ్మము, ద్వంద్వాతీతము, అయిన ఈశ్వరసంబంధమగు శక్తియే నాబలం. ఆ సంగతి వృషపర్వునికీ తెలుసు. ఇంద్రుడు, యయాతి రాజు కూడా దీనిని ఎరుగుదురు. (38)
యచ్చ కించిత్ సర్వగతం భూమౌ వా యది వా దివి ।
తస్యాహ మీశ్వరో నిత్యం తుష్టేనోక్తః స్వయంభువా ॥ 39
భూమి మీద గాని, స్వర్గంలో గాని, ప్రాణులన్నింటిలో గాని ఏదున్నప్పటికిని నిత్యము దానికి నేను ఈశ్వరుడను. సంతోషించిన స్వయంభువు నాకీ వరాన్ని ఇచ్చాడు. (39)
అహం జలం విముంచామి ప్రజానాం హితకామ్యయా ।
పుష్ణామ్యోషధయః సర్వాః ఇతి సత్యం బ్రవీమి తే ॥ 40
ప్రజలకు హితం చేయాలనే కోరికతో నేను నీటిని తర్పణం చేస్తాను-ఓషధులన్నింటిని నేను పోషిస్తున్నాను. నీకు నిజమే చెపుతున్నాను. (40)
వైశంపాయన ఉవాచ
ఏవం విషాదమాపన్నాం మన్యునా సంప్రపీడితామ్ ।
వచనై ర్మధురైః శ్లక్ష్ణైః సాంత్వయామాస తాం పితా ॥ 41
వైశంపాయనుడిలా అన్నాడు - ఇలా విషాదాన్ని పొంది కోపంతో బాధపడుతున్న కూతురిని తండ్రి శూక్రాచార్యుడు తీయని మాటలతో ఊరడించాడు. (41)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే అష్టసప్తతితమోఽధ్యాయః ॥ 78 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము. (78)
(దాక్షిణాత్య అధికపాఠము 13 శ్లోకాలతో కలిపి మొత్తం 54 శ్లోకాలు)