79. డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

శుక్రాచార్యుడు దేవయానిని సముదాయించుట.

శుక్ర ఉవాచ
(మమ విద్యా హి నిర్ద్వంద్వా ఐశ్వర్యం హి ఫలం మమ ।
దైన్యం శాఠ్యం చ జైహ్మం చ నాస్తి మే యదధర్మతః ॥)
యః పరేషాం నరో నిత్యమ్ అతివాదాంస్తితిక్షతే ।
దేవయాని విజానీహి తేన సర్వమిదం జితమ్ ॥ 1
యః సముత్పతితం క్రోధం నిగృహ్ణాతి హయం యథా ।
స యంతేత్యుచ్యతే సద్భిః న యో రశ్మిషు లంబతే ॥ 2
శుక్రుడిలా అన్నాడు - నా విద్య తిరుగులేనిది. దాని ఫలితమే కదా ఈ నా ఐశ్వర్యం. దైన్యం, శాఠ్యం, కుటిలత్వం, అధర్మ ప్రవృత్తి నాకు లేవు. పరులనిందలను సహించేవాడు ఈ సర్వజగత్తును జయింపగలడు. గుఱ్ఱాన్ని నిగ్రహించినట్లు పొంగివచ్చే క్రోధాన్ని నిగ్రహించినవాడే సారథి అని సత్పురుషులంటారు. కేవలం కళ్ళెములు పట్టుకొన్నవాడు సారథి కాడు. (1,2)
యః సముత్పితితం క్రోధమ్ అక్రోధేన నిరస్యతి ।
దేవయాని విజానీహి తేన సర్వమిదం జితమ్ ॥ 3
చెలరేగే క్రోధాన్ని సహనంతో తొలగించినవాడు ఈ సమస్తజగత్తును జయిస్తాడు. దేవయానీ! ఈ విషయం గ్రహించు. (3)
యః సముత్పతితం క్రోధం క్షమయేహ నిరస్యతి ।
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే ॥ 4
పాము కుబుసం విడిచినట్లు, పొంగివచ్చే కోపాన్ని సహనంతో తొలగించుకొనే వాడే పురుషుడని అంటారు. (4)
యః సంధారయతే మన్యుం యోఽతివాదాంస్తితిక్షతే ।
యశ్చ తప్తో న తపతి దృఢం సోఽర్థస్య భాజనమ్ ॥ 5
కోపాన్ని నిగ్రహించేవాడు, నిందలను సహించేవాడు, బాధపడినా ఇతరులను బాధింపనివాడు ఐశ్వర్యానికి అర్హుడవుతాడు. (5)
యో యజేదపరిశ్రాంతః మాసి మాసి శతం సమాః ।
న క్రుద్ధ్యేద్ యశ్చ సర్వస్య తయోరక్రోధనో ఽధికః ॥ 6
అలసట లేకుండా నెలకొకసారి చొప్పున నూరు సంవత్సరాలు యజ్ఞం చేసేవాడు - అందరి పట్ల కోపం లేక ప్రవర్తించేవాడు - వీరిరువురిలో కోపంలేని వాడే గొప్పవాడు. (6)
(క్రుద్ధస్య నిష్ఫలాన్యేవ దానయజ్ఞతపాంసి చ ।
తస్మాదక్రోధనే యజ్ఞః తపో దానం మహాఫలమ్ ॥
న పూతో న తపస్వీ చ న యజ్వా న చ కర్మవిత్ ।
క్రోధస్య యో వశం గచ్ఛేత్ తస్య లోకద్వయం న చ ॥
పుత్రభృత్యసుహృన్మిత్రభార్యా ధర్మశ్చ సత్యతా ।
తస్యైతాన్యపయాస్యంతి క్రోధశీలస్య నిశ్చితమ్ ॥)
యత్ కుమారాః కుమార్యశ్చ వైరం కుర్యురచేతసః ।
న తత్ ప్రాజ్ఞో ఽనుకుర్వీత న విదుస్తే బలాబలమ్ ॥ 7
క్రోధంతో ఉన్నవాని దానం, యజ్ఞం, తపస్సు వ్యర్థమే. అందువల్ల క్రోధం లేనివాడు చేసిన యజ్ఞం, తపస్సు, దానం మహాఫలాన్ని ఇస్తాయి. క్రోధానికి వశమైనవాడు పవిత్రుడు కాడు, తపస్వికాడు, యజ్వకాదు, కర్మజ్ఞుడు కాదు. అటువంటివానికి ఇహపరాలు రెండూలేవు. నిత్యం కోపించేస్వభావం ఉన్నవానికి పుత్రుడు, సేవకుడు, మిత్రుడు, సుహృత్తు, భార్య, ధర్మం, సత్యత్వం - ఇవన్నీ దూరంగా పోతాయి.) అజ్ఞానం వల్ల కుమారులు కాని, కూతుళ్లు కాని పరస్పరం విరోధించుకొంటే, ప్రాజ్ఞులు వారిని అనుసరించకూడదు, అజ్ఞానం వల్ల వారు ఇతరుల బలాబలాలు తెలియజాలరు. (7)
దేవయాన్యువాచ
వేదాహం తాత బాలాపి ధర్మాణాం యదిహాంతరమ్ ।
అక్రోధే చాతివాదే చ వేద చాపి బలాబలమ్ ॥ 8
దేవయాని ఇలా అంది - నాయనా! నేను బాలికనయినా ధర్మాల మధ్యనున్న భేదాన్ని ఎరుగుదును. సహనం, నిందలమధ్య బలాబలాలను కూడ నేను ఎరుగుదును. (8)
శిష్యస్యాశిష్యవృత్తేస్తు న క్షంతవ్యం బుభూషతా ।
తస్మాత్ సంకీర్ణవృత్తేషు వాసో మమ న రోచతే ॥ 9
శిష్యుడిగా ఉండి శిష్యప్రవృత్తికి విరుద్ధంగా ఉండేవాడిని, అతడి హితం కోరే గురువు క్షమించకూడదు. అందువల్ల ఆచారవిచారాల్లో సంకీర్ణంగా ప్రవర్తించే దానవుల దగ్గర నివాసం నాకు ఇష్టం లేదు. (9)
పుమాంసో యే హి నిందంతి వృత్తేనాభిజనేన చ ।
న తేషు నివసేత్ ప్రాజ్ఞః శ్రేయోఽర్థీ పాపబుద్ధిషు ॥ 10
ఇతరుల సదాచారప్రవృత్తిని, కులీనతను నిందించేవారు పాపబుద్ధులు, శ్రేయస్సును కోరుకొనే ప్రాజ్ఞుడు వారి మధ్య నివసించకూడదు. (10)
యే త్వేన మభిజానంతి వృత్తేనాభిజనేన వా ।
తేషు సాధుషు వస్తవ్యం స వాసః శ్రేష్ఠ ఉచ్యతే ॥ 11
తనప్రవృత్తిని గాని, కులీనత గాని తెలిసికొనగల్గిన సత్పురుషులమధ్య నివసించాలి. ఆ నివాసం శ్రేష్ఠమైనదిగా చెప్పబడింది. (11)
(సుయంత్రితా వరా నిత్యం విహీనాశ్చ ధనైర్నరాః ।
దుర్వృత్తాః పాపకర్మాణః చాండాలా ధనినోఽపి వా ॥
అకారణాద్ యే ద్విషంతి పరివాదం వదంతి చ ।
న తత్రాస్య నివాసోఽస్తి పాప్మభిః పాపతాం వ్రజేత్ ॥
సుకృతే దుష్కృతే వాపి యత్ర సజ్జతి యో వరః ।
ధ్రువం రతి ర్భవేత్తత్ర తస్మాద్ దోషం న రోచయేత్ ॥)
వాగ్ దురుక్తం మహాఘోరం దుహితుర్వృషపర్వణః ।
మమ మథ్నాతి హృదయమ్ అగ్నికామ ఇవారణిమ్ ॥ 12
(ధనం లేకపోయినా నిత్యమూ మనస్సును నియంత్రించ గలిగిన మానవులు శ్రేష్ఠులు. దుష్టప్రవృత్తితో పాపాలు చేసేవారు ధనవంతులైనా వారు చండాలురే. కారణం లేకుండా ఇతరులను ద్వేషించేవారు, ఇతరులను నిందించేవారు పాపాత్ములు. వారితో సత్పురుషులు నివసించరాదు. వారితో కలిస్తే ఇతరులు కూడ పాపాత్ములౌతారు. మానవుడు సుకృతంలో, కాని దుష్కృతంలో కాని ఆసక్తుడైతే తప్పనిసరిగా దాని యందతనికి దృఢమైన ప్రీతి కలుగుతుంది. అందువల్ల దోష ప్రీతి కలిగి ఉండకూడదు. అగ్ని కోరేవాడు అరణిని మథించినట్లు వృషపర్వుని కూతురు పలికిన ఘోరమైన తప్పుమాట నా హృదయాన్ని మథిస్తోంది. (12)
న హ్యతో దుష్కరతరం మన్యే లోకేష్వపి త్రిషు ।
(నిః సంశయో విశేషేణ పరుషం మర్మకృంతనమ్ ।
సుహృన్మిత్రజనాస్తేషు సౌహృదం న చ కుర్వతే ॥)
యః సపత్నశ్రియం దీప్తాం హీనశ్రీః పర్యుపాసతే ।
మరణం శోభనం తస్య ఇతి విద్వజ్జనా విదుః ॥ 13
ఇంతకంటె మిక్కిలి దుఃఖకరమైంది వేరొకటి ఈ మూడులోకాలలోనూ లేదు. పరుషమైన మాట మర్మాలను ఛేదిస్తుంది. సందేహం లేదు. సజ్జనులూ, మిత్రులూ వారితో స్నేహం చెయ్యరు. సంపద లేకుండా తేజరిల్లుతున్న శత్రువుల సంపదను ఆరాధించేవాడు మరణించడం మంచిది - అని విద్వాంసులు చెపుతున్నారు. (13)
(అవమానమవాప్నోతి శనై ర్నీచేషు సంగతః ।
వాక్ సాయకా వదనాన్నిష్పతంతి
యైరాహతః శోచతి రాత్య్రహాని ।
శనైర్దుఃఖం శస్త్రవిషాగ్ని జాతం
తాన్ పండితో నావసృజేత్ పరేషు ॥
సంరోహతి శరైర్విద్ధం వనం పరశునా హతమ్ ।
వాచా దురుక్తం బీభత్సం న సంరీహతి వాక్ క్షతమ్ ॥)
నీచులతో కలిసిన మనుష్యుడు మెల్లమెల్లగా అవమానాన్ని పొందుతాడు. నోటినుండి వెలువడ్డ వాగ్బాణాలు తగిలినవాడు రాత్రింబవళ్ళు దుఃఖిస్తాడు. శస్త్రం వల్ల, విషం వల్ల, అగ్ని వల్ల కలిగిన దుఃఖం మెల్లగా అనుభవంలోకి వస్తుంది. అందుచే పండితుడు పరుల మీద వాగ్బాణాన్ని విడువకూడదు. బాణాలచే కాని గొడ్డలిచే కాని, నరకబడిన వనం మళ్లీ మొలకెత్తుతుంది. కాని భయంకరమైన, కటువైన వాక్కుచే గాయపడిన హృదయం, మళ్లీ సహజంగా వికసించదు).
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే ఏకోనాశీతితమోఽధ్యాయః ॥ 79 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. (79)
(దాక్షిణాత్య అధికపాఠము 10 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 23 1/2 శ్లోకాలు)