69. అరువది తొమ్మిదవ అధ్యాయము

దుష్యంతుడు వేటకై వనమునకు వెళ్లుట.

జనమేజయ ఉవాచ
సంభవం భరతస్యాహం చరితం చ మహామతేః ।
శకుంతలాయాశ్చోత్పత్తిం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 1
జనమేజయుడిలా అడిగాడు - బ్రాహ్మణోత్తమా! దుష్యంత మహారాజు యొక్క చరిత్ర, శకుంతలాజననము, భరతుని పుట్టుక యథాతథంగా వినాలనుకొంటున్నాను. (1)
దుష్యంతేన చ వీరేణ యథాప్రాప్తా శకుంతలా ।
తం వై పురుష సింహస్య భగవన్ విస్తరం త్వహమ్ ॥ 2
శ్రోతుమిచ్ఛామి తత్త్వజ్ఞ సర్వం మతిమతాం వర ।
పూజ్యుడా! వీరుడైన దుష్యంతుడు శకుంతలను ఎలా పొందాడు? పురుషశ్రేష్ఠుడైన దుష్యంతుని చరిత్రను విస్తరంగా వినాలనుకొంటున్నాను. (2 1/2)
వైశంపాయన ఉవాచ
స కదా చిన్మహాబాహుః ప్రభూతబలవాహనః ॥ 3
వనం జగామ గహనం హయనాగశతైర్వృతః ।
బలేన చతురంగేణ వృతః పరమవల్గునా ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - ఒకానొకప్పుడు మహాబాహుడైన దుష్యంతుడు అశ్వగజరథపదాతి చతురంగ బలాలతో దట్టమైన అడవికి వేటకువెళ్లాడు. (3,4)
ఖడ్గాలు, శక్తులు, గదలు, ముసలాలు, ప్రాసాలు, తోమరాలు ధరించిన వందలాది యోధులతో బాటుగా వెళ్లాడు. (5)
సింహనాదైశ్చ యోధానాం శంకదుందుభినిఃస్వనైః ।
రథనేమిస్వనైశ్చైవ సనాగవరబృంహితైః ॥ 6
నానాయుధధరైశ్చాపి నానావెషధరైస్తథా ।
హ్రేషితస్వనమిశ్రైశ్చ క్ష్వేడితాస్ఫోటితస్వనైః ॥ 7
ఆసీత్ కిలకిలాశబ్దః తస్మిన్ గచ్ఛతి పార్థివే ।
ప్రాసాదవరశృంగస్థాః పరయా నృపశోభయా ॥ 8
దదృశుస్తం స్త్రియస్తత్ర శూరమాత్మయశస్కరమ్ ।
శక్రోపమమమిత్రఘ్నం పరవారణవారణమ్ ॥ 9
యోధుల సింహనాదాలతో, శంఖ దుందుభి ధ్వనులతో, రథాల ఇరుసుల చప్పుళ్లతో, గజరాజుల గర్జనలతో, నానావిధాయుధధారులతో, నానావేష ధారులతో, యోధుల గర్జనలతో, తాళ ధ్వనులతో ఆ రాజు వెళ్లే మార్గమంతా కోలాహలంగా ఉంది. రాజశోభతో ఉండి, తమకు కీర్తికరుడు, ఇంద్రసమానుడు, శత్రుసంహర్త, శత్రుగజాలను నిలువరింపగల ఆ దుష్యంతుని స్త్రీలు భవనాలెక్కి చూడసాగారు. (6-9)
పశ్యంతః స్త్రీగణాస్త్రత్ర వజ్రపాణిం స్మ మేనిరే ।
అయం స పురుషవ్యాఘ్రః రణే వసుపరాక్రమః ॥ 10
యస్య బాహుబలం ప్రాప్య న భవంత్యసుహృద్గణాః ।
అలా చూస్తున్న స్త్రీలు అతనిని ఇంద్రునిగా భావించారు. తమలో తాము "ఈ పురుషసింహుడు దుష్యంతుడు. యుద్ధరంగంలో వసువులతో సమానమైన పరాక్రమం కలవాడు. అతని బాహుబలం ముందు శత్రుగణాలేవీ మిగిలి ఉండవు". అని మాట్లాడుకొంటూ ప్రేమతో ఆ రాజును స్తుతించారు. (10 1/2)
ఇతి వాచో బ్రువంత్యస్తాః స్త్రియః ప్రేమ్ణా నరాధిపమ్ ॥ 11
తుష్టువుః పుష్పవృష్టీశ్చ ససృజుస్తస్య మూర్ధని ।
తత్ర తత్ర చ విప్రేంద్రైః స్తూయమానః సమంతతః ॥ 12
ఈ విధంగా మాట్లాడుతున్న స్త్రీలు ప్రేమతో ఆ రాజును స్తుతించారు. పూలవాన కురిపించారు. అన్ని దిక్కులా విప్రశ్రేష్ఠులు అతనిని స్తుతిస్తున్నారు. (11,12)
నిర్యయౌ పరమప్రీత్యా వనం మృగజిఘాంసయా ।
తం దేవరాజప్రతిమం మత్తవారణధూర్గతమ్ ॥ 13
ద్విజక్షత్రియవిట్ శూద్రాః నిర్యాంతమనుజగ్మిరే ।
దదృశుర్వర్ధమానాస్తే ఆశీర్భిశ్చ జయేన చ ॥ 14
ఆ దుష్యంతుడు మిక్కిలి ప్రీతితో అడవికి వేటకు వెళ్లాడు. దేవేంద్రునితో సమానమైన దుష్యంతుడు మదగజాన్ని అధిరోహించి వెళుతూ ఉంటే బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యశూద్రులు అంతా ఆశీశ్శబ్దాలతో, జయ జయ ధ్వానాలతో అనుసరించారు. (13,14)
సుదూరమనుజగ్ముస్తం పౌరజానపదాస్తథా ।
న్యవర్తంత తతః పశ్చాద్ అనుజ్ఞాతా నృపేణ హ ॥ 15
పౌరులు, జానపదులు చాలా దూరం అతనిని అనుసరించారు. అటుపై అతని అనుమతితో వెనుకకు మళ్ళారు. (15)
సుపర్ణప్రతిమేనాథ రథేన వసుధాధిపః ।
మహీమాపూరయామాస ఘోషేణ త్రిదివం తథా ॥ 16
స గచ్ఛన్ దదృశే ధీమాన్ నందనప్రతిమం వనమ్ ।
బిల్వార్కఖదిరాకీర్ణం కపిత్థధవసంకులమ్ ॥ 17
అనంతరం అతడు గరుడుని వంటి రథం ఎక్కి ప్రయాణిస్తుంటే రథ శబ్దం భూమిని, స్వర్గాన్ని కూడా ఆవరించింది. ధీమంతుడైన అతడు వెళుతూ మారేడు జిల్లేడు, చండ్రవృక్షాలతోను వెలగ, వెలమ చెట్లతోను నిండిన అడవిని చూడసాగాడు. (16,17)
విషమం పర్వతస్రస్తైః అశ్మభిశ్చ సమావృతమ్ ।
నిర్జలం నిర్మనుష్యం చ బహుయోజనమాయతమ్ ॥ 18
ఆ అడవి అంతా పర్వతాలనుండి జారిపడిన రాళ్లతో నిండి ఎత్తుపల్లాలతో నిర్జలంగా నిర్మానుష్యంగా అనేక యోజనాలు విస్తరించి ఉంది. (18)
మృగసింహైర్వృతం ఘోరైః అన్యైశ్చాపి వనేచరైః ।
తద్ వనం మనుజవ్యాఘ్రః సభృత్యబలవాహనః ॥ 19
లోడయామాస దుష్యంతః సూదయన్ వివిధాన్ మృగాన్ ।
బాణగోచరసంప్రాప్తాన్ తత్ర వ్యాఘ్రగణాన్ బహు ॥ 20
పాతయామాస దుష్యంతః నిర్బిభేద చ సాయకైః ।
దూరస్థాన్ సాయకైః కాంశ్చిద్ అభినత్ స నరాధిపః ॥ 21
అభ్యాశమాగతాంశ్చాన్యాన్ ఖడ్గేన నిరకృంతత ।
కాంశ్చిదేణాన్ సమాజఘ్నే శక్త్యా శక్తిమతాం వరః ॥ 22
మృగాలు, సింహాలు, క్రూరమృగాలు, ఏనుగులు ఉంటున్న ఆ వనమంతా దుష్యంతుడు తన సేవకులతో బలాలతో బాటు మృగాలను వేటాడుతూ కలియ తిరిగాడు. తన బాణాలకు అందినంతమేరలోకి వచ్చిన వ్యాఘ్రసమూహాలను పడగొట్టాడు. దూరంగా ఉన్న మృగాలను బాణాలతో ఛేదించాడు. దగ్గరగా ఉన్నవాటిని ఖడ్గంతో ఖండించాడు. శక్తిమంతులలో శ్రేష్ఠుడైన అతడు తన శక్తితో లేళ్ళను సంహరించాడు. (19-22)
గదామండలతత్త్వజ్ఞః చచారామితవిక్రమః ।
తోమరైరసిభిశ్చాపి గదాముసలకంపనైః ॥ 23
చచార స వినిఘ్నన్ వై స్వైరచారాన్ వనద్విపాన్ ।
రాజ్ఞా చాద్భుతవీర్యేణ యోధైశ్చ సమరప్రియైః ॥ 24
లోడ్యమానం మహారణ్యం హతయూథపతీని చ ॥ 25
మృగయూథాన్యథౌత్సుక్యాత్ శబ్దం చక్రుస్తతస్తతః ।
శుష్కాశ్చాపి నదీర్గత్వా జలనైరాశ్యకర్శితాః ॥ 26
వ్యాయామక్లాంతహృదయాః పతంతి స్మ విచేతసః ।
క్షుత్పిపాసాపరీతాశ్చ శ్ఱాంతాశ్చ పతితా భువి ॥ 27
అతడు గద త్రిప్పడంలో నేర్పరి. మేరలేని పరాక్రమం కలవాడు. వనంలో స్వేచ్చగా సంచరించే ఏనుగులను తోమరాలతో, ఖడ్గాలతో, గదలతో, ముసలాలతో చంపుతూ సంచరించాడు. అద్భుతమైన పరాక్రమంగల రాజు, యుద్ధప్రియులైన యోధులూ సంచరిస్తూండగా అడవిలోని సింహాలు ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోసాగాయి. యూథపతులు మరణించడంతో చెల్లాచెదరైన మృగాలు, ఆర్తనాదాలు చేయసాగాయి. ఎండిపోయిన నదుల దగ్గరకు వెళ్లిన మృగాలు నీరులేక కృశించి అలసట చెందిన హృదయాలతో అచేతనంగా పడి ఉంటున్నాయి. ఆకలి దప్పులకు తట్టుకోలేనివి భూమిపై పడిపోతున్నాయి. (23-27)
కేచిత్తత్ర నరవ్యాఘ్రైః అభక్ష్యంత బభుక్షితైః ।
కేచిదగ్నిమథోత్పాద్య సంసాధ్య చ వనేచరాః ॥ 28
భక్షయంతి స్మ మాంశాని ప్రకుట్య విధివత్ తదా ।
తత్ర కేచిత్ గజా మత్తాః బలినః శస్త్రవిక్షతాః ॥ 29
సంకోచ్యాగ్రకరాన్ భీతాః ప్రద్రవంతి స్మ వేగితాః ।
శకృన్మూత్రం సృజంతశ్చ క్షరంతః శోణితం బహు ॥ 30
ఆకలిగా ఉన్న కొందరు మానవులు కొన్ని మృగాలను తిన్నారు. కొందరు వనేచరులు అగ్గిని రగిలించి ఆ మాంసాలను కాల్చుకొని తినసాగారు. మదగజాలు కొన్ని ఆయుధాల దెబ్బలవల్ల తొండాలను ముడుచుకొని భయంతో మలమూత్రాలను విసర్జిస్తూ రక్తం కారుతున్నా వేగంగా పరుగెత్తసాగాయి. (28-30)
వన్యా గజవరాస్తత్ర మమృదుర్మనుజాన్ బహు ।
తద్వనం బలమేఘేన శరధారేణ సంవృతమ్ ।
వ్యరోచత మృగాకీర్ణం రాజ్ఞా హతమృగాధిపమ్ ॥ 31
అడవి ఏనుగులు కొన్ని కొంతమంది మనుష్యుల్ని మర్దించాయి. ఆ వనమంతా సైన్యమనే మేఘంతో బాణాల వర్షధారలతో నిండిపోయింది. చచ్చిపడి ఉన్న సింహాలతో మృగాలతో ఆ వనమంతా శోభిల్లింది. (31)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలోపాఖ్యానే ఏకోనసప్తతితమోఽధ్యాయః ॥ 69 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వము అను ఉపపర్వమున శకుంతలోపాఖ్యాన మను అరువది తొమ్మిదవ అధ్యాయము. (69)