68. ఆరువది ఎనిమిదవ అధ్యాయము
దుష్యంతుని అద్భుతశక్తి - రాజ్యపాలన సామర్థ్యము.
జనమేజయ ఉవాచ
త్వత్తః శ్రుతమిదం బ్రహ్మన్ దేవదానవరక్షసామ్ ।
అంశావతరణం సమ్యాగ్ గంధర్వాప్సరసాం తథా ॥ 1
జనమేజయుడిలా అన్నాడు - బ్రాహ్మణోత్తమా! నీవల్ల దేవదానవ రాక్షస గంధర్వ అప్సరోగణాల అంశావతారాలను బాగా విన్నాను. (1)
ఇమం తు భూయ ఇచ్ఛామి కురూణాం వంశామాదితః ।
కథ్యమానం త్వయా విప్ర విప్రర్షిగణసంనిధౌ ॥ 2
ఇంకను ఈ బ్రహ్మర్షుల సన్నిధానంలో కురువంశం గురించి మొదటినుండి వినాలనుకొంటున్నాను. (2)
వైశంపాయన ఉవాచ
పౌరవాణాం వంశకరః దుష్యంతో నామ వీర్యవాన్ ।
పృథివ్యాశ్చ తురంతాయాః గోప్తా భరతసత్తమ్ ॥. 3
వైశంపాయనుడిలా చెప్పాడు - భరతశ్రేష్ఠా! పౌరవ వంశవర్ధకుడు, తేజస్వి అయిన దుష్యంతుడు నాలుగుసముద్రాలు సరిహద్దులుగా గల ఈ భూమండలాన్ని ఏలుతున్నాడు. (3)
చతుర్భాగం భువః కృత్స్నం యో భుంక్తే మనుజేశ్వరః ।
సముద్రావరణాంశ్చాపి దేశాన్ స సమితింజయః ॥ 4
ఆమ్లేచ్ఛావధికాన్ సర్వాన్ స భుంక్తే రిపుమర్దనః ।
రత్నాకరసముద్రాంతాంన్ చాతుర్వర్ణ్యజనావృతాన్ ॥ 5
అతడు నాలుగు సముద్రాలచే చుట్టబడిన భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు. యుద్ధాలలో విజయాన్ని పొందినవాడు. బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాలతో నిండి మ్లేచ్ఛ దేశాలు సరిహద్దులుగాగల ఈ భూమండలాన్ని శత్రుమర్దనుడైన ఆ దుష్యంతుడొక్కడే రక్షిస్తున్నాడు. (4,5)
న వర్ణసంకరకరః న కృష్యాకరకృజ్జనః ।
న పాపకృత్ కశ్చిదాసీత్ తస్మిన్ రాజని శాసతి ॥ 6
ఆ మహారాజు పాలనలో ఎక్కడా వర్ణసాంకర్యం జరుగలేదు. ప్రజలు వ్యవసాయం చేసి రత్నాలు పండిస్తూ రత్నాకరం (సముద్రం) జోలికే ఎవరూ పోవటం లేదు. ఎవరూ పాపకార్యం చేయటం లేదు. (6)
ధర్మే రతిం సేవయానాః ధర్మార్థావభిపేదిరే ।
తదా నరా నరవ్యాఘ్ర తస్మిన్ జనపదేశ్వరే ॥ 7
నాసీచ్చోరభయం తాత న క్షుధాభయమణ్వపి ।
నాసీద్ వ్యాధిభయం చాపి తస్మిన్ జనపదేశ్వరే ॥ 8
రాజా! అతనిపాలనలో ప్రజలు ధర్మమందు ఆసక్తి కలిగి ధర్మార్థాలను పాటిస్తున్నారు. చోరభయం కాని, ఆకలిభయంకాని, వ్యాధిభయంకాని అతని పాలనలో ఎక్కడా లేదు. (7,8)
స్వధర్మే రేమిరే వర్ణాః దైవే కర్మణి నిఃస్పృహాః ।
తమాశ్రిత్య మహీపాలమ్ ఆసంశ్పైవాకుతోభయాHఆ ॥ 9
జనులందరూ వారివారి ధర్మాల్ని తప్పక పాటించేవారు. దైవకర్మలు నిష్కామంగా చేసేవారు. ఆ రాజు ఆశ్రయంలో ఎటువంటి భయాలూ లేకుండా ప్రజలు జీవించారు. (9)
కాలవర్షీ చ పర్జన్యః సస్యాని రసవంతి చ ।
సర్వరత్నసమృద్ధా చ మహీ పశుమతీ తథా ॥ 10
మేఘం సకాలంలో వర్షించేది. రసవంతాలైన పంటలు పండేవి. భూమి సర్వ రత్నాలతో సమృద్ధమై పశుసంపదలతో నిండి ఉండేది. (10)
స్వకర్మనిరతా విప్రాః నానృతం తేషు విద్యతే ।
స చాద్భుతమహావీర్యః వజ్రసంహననో యువా ॥ 11
బ్రాహ్మణులు స్వకర్మనిరతులై, అబద్ధమాడేవారు కాదు. దుష్యంతమహారాజు యువకుడు, అద్భుతమైన పరాక్రమం కలవాడు. వజ్రంలా దృఢమైన శరీరం కలవాడు. (11)
ఉద్యమ్య మందరం దోర్భ్యాం వహేత్ సవనకాననమ్ ।
చతుష్పథగదాయుద్ధే సర్పప్రహరణేషు చ ॥ 12
నాగపృష్ఠే ఽశ్వపృష్ఠే చ బభూవ పరినిష్ఠతః ।
బలే విష్ణుసమశ్చాసీత్ తేజసా భాస్కరోపమః ॥ 13
అతడు తన భుజాలతో అడవులతో నిండిన మందర పర్వతాన్ని ఎత్తగల బలశాలి. ప్రక్షేప, విక్షేప, పరిక్షేప, అభిక్షేపములనే నాలుగు విధాల గదాయుద్ధంలో ఆరితేరినవాడు. బలంలో విష్ణువుతో సమానమైనవాడు. తేజస్సులో సూర్యునితో సమానుడు. (12,13)
అక్షోభ్యత్వేఽర్ణవసమః సహిష్ణుత్వే ధరాసమః ।
సమ్మతః స మహీపాలః ప్రసన్నపురరాష్ట్రవాన్ ॥ 14
భూయో ధర్మపరైర్భావైః ముదితం జనమాదిశత్ ॥ 15
గాంభీర్యంలో సముద్రంతో సమానుడు, సహనంలో భూమితో సమానుడు. అందరికీ ఆమోదయోగ్యుడు. అతని ఏలుబడిలో నగరాలు, దేశాలు ప్రశాంతంగా ఉన్నాయి. అతడు ధర్మ భావనలతో ప్రజలను శాసించేవాడు. (14,15)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలోపాఖ్యానే అష్టషష్టితమోఽధ్యాయః ॥ 68 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శకుంతలోపాఖ్యానమున అరువది ఎనిమిదవ అధ్యాయము. (68)