70. డెబ్బదియవ అధ్యాయము
దుష్యంతమహారాజు కణ్వాశ్రమమున ప్రవేశించుట.
వైశంపాయన ఉవాచ
తతో మృగసహస్రాణి హత్వా సబలవాహనః ।
రాజా మృగప్రసంగేన వనమన్యద్ వివేశ హ ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు - వేలాది మృగాలను చంపిన దుష్యంతుడు ససైన్యంగా మృగాలను వెంటాడుతూ మరొక వనంలోకి ప్రవేశించాడు. (1)
ఏక ఏవోత్తమబలః క్షుత్పిపాసాశ్రమాన్వితః ।
స వనస్యాంతమాసాద్య మహచ్ఛూన్యం సమాసదత్ ॥ 2
మంచి బలం గల ఆ దుష్యంతుడొక్కడూ ఆకలి దప్పులతో ఆ వనం చివరికి వెళ్లాడు. అక్కడ ఒక శూన్యప్రదేశం కనబడింది. (2)
తచ్చాప్యతీత్య నృపతిః ఉత్తమాశ్రమసంయుతమ్ ।
మనః ప్రహ్లాదజననం దృష్టికాంతమతీవ చ ॥ 3
శీతమారుతసంయుక్తం జగామాన్యన్మహద్వనమ్ ।
పుష్పితైః పాదపైః కీర్ణమ్ అతీవ సుఖశాద్వలమ్ ॥ 4
ఆ ప్రదేశాన్ని కూడా దాటి దుష్యంతుడు మరొక వనంలోకి వెళ్లాడు. అది చక్కనైన ఆశ్రమాలతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ, చూడటానికి చాలా అందంగా ఉంది. చల్లని గాలివీస్తూ వికసించిన పూలచెట్లతో కూడి, మిక్కిలి సుఖంగా ఉండే పచ్చికలతో నిండి ఉంది. (3,4)
విపులం మధురారావైః నాదితం విహగైస్తథా ।
పుంస్కోకిలనినాదైశ్చ ఝుల్లీకగణనాదితమ్ ॥ 5
ఆ వనం పక్షుల కలధ్వనులతో ప్రతిధ్వనిస్తూ కోకిలల కుహూరవాలతో తేనేటీగలతో ఝుంకారాలతో నిండి విశాలంగా ఉంది. (5)
ప్రవృద్ధవిటపైర్వృక్షైః సుఖచ్ఛాయైః సమావృతమ్ ।
షట్పదాఘార్ణితతలం లక్ష్మ్యా పరమయా యుతమ్ ॥ 6
పెరిగిన కొమ్మలున్న వృక్షాలతో, చక్కని నీడనిచ్చే చెట్లతో నిండి ఉంది. తుమ్మెదల ఝుంకారాలతో మిక్కిలి శోభాయమానంగా ఉంది. (6)
నాపుష్పః పాదపః కశ్చిత్ నాఫలో నాపి కంటకీ ।
షట్పదైర్నాప్యపాకీర్ణః తస్మిన్ వై కాననేఽభవత్ ॥ 7
ఆ వనంలో పువ్వులులేని మొక్కలు లేవు. పండ్లు లేని చెట్లు లేవు. ముళ్ళున్న మొక్కలు అసలే లేవు. తుమ్మెదలు వాలని పువ్వులు లేవు. (7)
విహగైర్నాదితం పుష్పైః అలంకృతమతీవ చ ।
సర్వర్తుకుసుమైర్వృక్షైః సుఖచ్ఛాయైః సమావృతమ్ ॥ 8
పక్షుల ధ్వనులతో, పూలతో, అన్ని ఋతువులలో ఉండే పూలు గల చెట్లతో, చక్కని నీడనిచ్చే వృక్షాలతో మిక్కిలి అందంగా అలంకరింపబడి ఉంది. (8)
మనోరమం మహేష్వాసః వివేశ వనముత్తమమ్ ।
మారుతాకలితాస్తత్ర ద్రుమాః కుసుమశాఖినః ॥ 9
పుష్పవ్ఱ్రుష్టిం విచిత్రాం తు వ్యసృజంస్తే పునః పునః ।
దివఃస్పృశోఽథ సంఘూష్టాః పక్షిభిర్మధురస్వనైః ॥ 10
అటువంటి మనోహరమైన ఉత్తమమైన వనంలోకి మహాధన్వి అయిన దుష్యంతుడు ప్రవేశించాడు. పూలతో నిండిన కొమ్మలు గల వృక్షాలు గాలికి కదులుతూ మాటిమాటికి విచిత్రమైన పుష్పవృష్టిని కురిపించాయి. పక్షుల మధుర ధ్వనులు ఆకాశాన్నంటుతున్నాయి. (9,10)
విరేజుః పాదపాస్తత్ర విచిత్రకుసుమాంబరాః ।
తేషాం తత్ర ప్రవాలేషు పుష్పభారావనామిషు ॥ 11
రువంతి రావాన్ మధురాన్ షట్పదా మధులిప్సవః ।
తత్ర ప్రదేశాంశ్చ బహూన్ కుసుమోత్కరమండితాన్ ॥ 12
లతాగృహం పరిక్షిప్తాన్ మనసః ప్రీతివర్ధనాన్ ।
సంపశ్యన్ సుమహాతేజాః బభూవ ముదితస్తదా ॥ 13
విచిత్రమైన పూలవస్త్రాలతో అక్కడి చెట్లు ప్రకాశిస్తున్నాయి. పూలభారంతో వంగి ఉన్న చెట్ల చిగుళ్ళలో చేరి తేనె త్రాగాలనే కోరికతో తుమ్మెదలు మధుర రావాలు చేస్తున్నాయి. విరగబూసిన పూలతో అలంకరింపబడిన, లతా గృహాలతో, మనస్సుకు ప్రీతిని కలిగించే ఆ ప్రదేశాలను చూస్తూ తేజస్వియైన దుష్యంతుడు మిక్కిలి ఆనందించాడు. (11-13)
పరస్పరాశ్లిష్టశాఖైః పాదపైః కుసుమాన్వితైః ।
అశోభత వనం తత్తు మహేంద్రధ్వజసంనిభైః ॥ 14
పూలతో నిండి ఒక దానితో ఒకటి పెనవేసుకున్న కొమ్మలతో మహేంద్రుని ధ్వజంలా ప్రకాశిస్తున్న వృక్షాలతో ఆ వనం శోభిల్లింది. (14)
సిద్ధచారణసంఘైశ్చ గంధర్వాప్సరసాం గణైః ।
సేవితం వనమత్యర్థం మత్తవానరకింనరమ్ ॥ 15
సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరలు, మదించిన వానరులు, కింనరులు మొదలైన వారిచే సేవింపబడుతోంది ఆ వనం. (15)
సుఖం శీతం సుగంధీ చ పుష్పరేణువహోఽనిలః ।
పరిక్రామన్ వనే వృక్షానుపైతీవ రిరంసయా ॥ 16
ఆ వనంలో వీచేగాలి సుఖంగా, చల్లగా, సువాసనతో పూలపుప్పొడిని తీసికొనిపోతూ క్రీడించే కోరికతో వృక్షాలను చేరుతున్నట్లుగా ఉంది. (16)
ఏవం గుణసమాయుక్తం దదర్శ స వనం నృపః ।
నదీకచ్ఛోద్భవం కాంతమ్ ఉచ్ఛ్రితధ్వజసంనిభమ్ ॥ 17
మాలినీ నదీ తీరంలో ఎత్తైన ధ్వజాలవలె ప్రకాశిస్తున్న చక్కని చెట్లతో మనోహరమైన ఆ వనాన్ని రాజు చూశాడు. (17)
ప్రేక్షమాణో వనం తత్ తు సుప్రహృష్టవిహంగమమ్ ।
ఆశ్రమప్రవరం రమ్యం దదర్శ చ మనోరమామ్ ॥ 18
ఆనందంలో ఉన్న పక్షులతో ఉన్న ఆ వనాన్ని చూస్తున్న దుష్యంతుడు అక్కడ అందమైన మనోహరంగా ఉన్న ఒక ఆశ్రమాన్ని చూశాడు. (18)
నానావృక్షసమాకీర్ణం సంప్రజ్వలితపావకమ్ ।
తం తదాప్రతిమం శ్రీమాన్ ఆశ్రమం ప్రత్యపూజయత్ ॥ 19
అతడు అనేకవిధాలైన వృక్షాలతో నిండి ప్రజ్వరిల్లుతూన్న అగ్నిహోత్రాలతో సాటిలేని శోభలో ఉన్న ఆ ఆశ్రమాన్ని ఎంతో గౌరవించాడు. (19)
యతిభిర్వాలఖిల్యైశ్చ వృతం మునిగణాన్వితమ్ ।
అగ్న్యాగారైశ్చ బహుభిః పుష్పసంస్తరసంస్తృతమ్ ॥ 20
యతులతో, వాలఖిల్యులతో, మునిగణాలతో అగ్నిహోత్ర గృహాలతో పలురకాల పువ్వులు పరిచినట్లు వ్యాపించి ఉన్న ఆ ఆశ్రమాన్ని రాజు గౌరవించాడు. (20)
మహాకచ్ఫైర్బృ హద్భిశ్చ విభ్రాజితమతీవ చ ।
మాలినీమభితో రాజన్ నదీం పుణ్యాం సుఖోదకామ్ ॥ 21
రాజా! నిర్మలమై ఆస్వాదయోగ్యమైన నీటితో ఉన్న మాలినీనదికి ఇరుప్రక్కల పెద్ద పెద్ద చెట్లతో ప్రకాశిస్తున్న ఆ ఆశ్రమాన్ని ఆదరించాడు. (21)
నైకపక్షిగణాకీర్ణాం తపోవనమనోరమామ్ ।
తత్ర వ్యాలమృగాన్ సౌమ్యాన్ పశ్యన్ ప్రీతిమవాప సః ॥ 22
పలురకాల పక్షి సమూహాలతో, తపోవనంతో అందంగా ఉన్న ఆ మాలినీనదిని చూశాడు. ఆ ప్రాంతంలో ఉన్న సౌమ్యాలైన పులులను, మృగాలను చూస్తూ అతడు ఆనందాన్ని పొందాడు. (22)
తం చాప్రతిరథః శ్రీమాన్ ఆశ్రమం ప్రత్యపద్యత ।
దేవలోకప్రతీకాశం సర్వతః సుమనోహరమ్ ॥ 23
అప్రతిరథుడు, శ్రీమంతుడూ ఐన దుష్యంతుడు దేవలోకంలా ప్రకాశించే మనోహరమైన ఆ ఆశ్రమాన్ని చేరుకొన్నాడు. (23)
నదీం చాశ్రమసంశ్లిష్టాం పుణ్యతోయాం దదర్శ సః ।
సర్వప్రాణభృతాం తత్ర జననీమివ ధిష్ఠితామ్ ॥ 24
ఆ ఆశ్రమాన్ని ఆనుకొని నిర్మలమైన నీటితో ప్రాణులన్నింటికి తల్లిలా ఉన్న మాలినీనదిని చూశాడు. (24)
సచక్రవాకపులినాం పుష్పఫేనప్రవాహినీమ్ ।
సకిన్నరగణావాసాం వానరర్ క్షనిషేవితామ్ ॥ 25
చక్రవాకాలున్న ఇసుకతిన్నెలతో, పూలనురుగులతో నున్న ప్రవాహంతో కిన్నరగణాలూ, వానరాలూ, ఎలుగుబంట్లు సేవిస్తున్న నదిని చూశాడు. (25)
పుణ్యస్వాధ్యాయసంఘుష్టాం పులినైరుపశోభితామ్ ।
మత్తవారణ శార్దూలభుజగేంద్రనిషేవితామ్ ॥ 26
మాలినీనదీతీరం ఇసుకతిన్నెలతో అందగించి ఉంది. పవిత్ర వేదఘోష అక్కడ ప్రతిధన్విస్తోంది. మదపుటేనుగులు, పులులూ, సర్పాలు అక్కడ సంచరిస్తున్నాయి. (26)
తస్యాస్తీరే భగవతః కాశ్యపస్య మహాత్మనః ।
ఆశ్రమప్రవరం రమ్యం మహర్షి గణసేవితమ్ ॥ 27
ఆ నదీతీరంలో కాశ్యపగోత్రుడయిన కణ్వుని ఆశ్రమాన్ని చూశాడు. పూజ్యులయిన మహర్షిగణాలతో నిండి అది ఎంతో రమ్యంగా ఉంది. (27)
నదీమాశ్రమసంబద్దాం దృష్ట్వాశ్రమపదం తథా ।
చకారాభిప్రవేశాయ మతిం స నృపతిస్తదా ॥ 28
ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న నదిని, ఆశ్రమప్రదేశాన్ని చూసి దుష్యంతుడు ఆశ్రమంలో ప్రవేశించాలనుకొన్నాడు. (28)
అలంకృతం ద్వీపవత్యా మాలిన్యా రమ్యతీరయా ।
నరనారాయణస్థానం గంగయేవోపశోభితమ్ ॥ 29
అందమైన తీరాలూ, ద్వీపాలు గల మాలినీ నదిచేత అలంకరింపబడింది ఆ ఆశ్రమం. అది గంగచేత శోభిల్లుతున్న నరనారాయణ స్థానంలా ప్రకాశిస్తూ ఉన్నది. (29)
మత్తబర్హిణసంఘుష్టం ప్రవివేశ మహద్వనమ్ ।
తత్ స చైత్రరథప్రఖ్యం సముపేత్య నరర్షభః ॥ 30
అతీవగుణసంపన్నమ్ అనిర్దేశ్యం చ వర్చసా ।
మహర్షిం కాశ్యపం ద్రష్టుమ్ అథ కణ్వం తపోధనమ్ ॥ 31
ధ్వజినీమశ్వసంబాధాం పదాతిగజసంకులామ్ ।
అవస్థాప్య వనద్వారి సేనామిదమువాచ సః ॥ 32
మదించిన నెమళ్ల క్రేంకారాలతో కుబేరుని చైత్రరథవనంలా ఉన్న ఆ మహావనంలోకి దుష్యంతుడు ప్రవేశించాడు. గొప్ప గుణసంపద కలిగి, వర్చస్సుచే చెప్పనలవి గానంత తపోధనుడైన కశ్యపగోత్రజుడైన కణ్వమహర్షిని చూడాలనుకొన్నాడు. గుర్రాలు, ఏనుగులు, యోధులతో కూడి ఉన్న సేనను ఆశ్రమప్రవేశ ద్వారం దగ్గరే ఉంచి, ఇలా అన్నాడు. (30-32)
మునిం విరజసం ద్రష్టుం గమిష్యామి తపోధనం ।
కాశ్యపం స్థీయతామత్ర యావదాగమనం మమ ॥ 33
విరాగి, తపోధనుడూ అయిన కాశ్యప మునిని చూడటానికి వెళుతున్నాను. నేను వచ్చేటంత వరకు మీరిక్కడే ఉండండి. (33)
తద్వనం నందనప్రఖ్యమ్ ఆసాద్య మనుజేశ్వరః ।
క్షుత్పిపాసే జహౌ రాజా ముదం చావాప పుష్కలమ్ ॥ 34
నందనవనంలా ఉన్న ఆ తపోవనంలో ప్రవేశించిన రాజు ఆకలి దప్పులు మరచి పుష్కలమైన ఆనందాన్ని పొందాడు. (34)
సామాత్యో రాజలింగాని సోఽపనీయ నరాధిపః ।
పురోహితసహాయశ్చ జగామాశ్రమముత్తమమ్ ॥ 35
ఆ రాజు అమాత్యులతోపాటు రాజ చిహ్నాలను కూడా విడిచిపెట్టి పురోహితుడుతోడుగా ఆశ్రమంలో ప్రవేశించాడు. (35)
దిదృక్షుస్తత్ర తమృషిం తపోరాశిమథావ్యయమ్ ।
బ్రహ్మలోకప్రతీకాశమ్ ఆశ్రమం సోఽభివీక్ష్య హ ।
షట్ పదోద్గీతసంఘుష్టం నానాద్విజగణాయుతమ్ ॥ 36
తుమ్మెదల ఝుంకారాలతో రకరకాల పక్షి సమూహాలతో బ్రహ్మలోకంలా ప్రకాశిస్తూన్న ఆ ఆశ్రమాన్ని చూసి, వికార రహితుడు, తపోనిధి అయిన ఆ కణ్వ మహర్షిని చూడాలనుకొన్నాడు. (36)
ఋచో బహ్వృచముఖ్యైశ్చ ప్రేర్యమాణాః పదక్రమైః ।
శుశ్రావ మనుజవ్యాఘ్రః వితతేష్విహ కర్మసు ॥ 37
వివిధ కర్మలయందు బహ్వృచులైన బ్రాహ్మణులు ఋక్కులను పదక్రమాలతో ఉచ్చరిస్తూ ఉండగా ఆ రాజు విన్నాడు. (37)
యజ్ఞవిద్వాంగవిద్భిశ్చ యజుర్విద్భిశ్చ శోభితమ్ ।
మధురైః సామగీతైశ్చ ఋషిభిర్నియతవ్రతైః ॥ 38
భారుండసామగీతాభిః అథర్వశిరసోద్గతైః ।
యతాత్మభిః సునియతైః శుశుభే స తదాశ్రమః ॥ 39
యజ్ఞవిద్యను, యజ్ఞాంగవిద్యల్ను (వేదవేదాంగాలు) తెలిసినవారితో, యజుర్వేత్తలతో శోభిల్లుతూ, మదురములైన సామగీతాలతో నియమదీక్షగల ఋషులతో, భారుండ సామగీతాలతో అథర్వ శిరోగీతాలతో జితేంద్రియులైన మునులతో ఆ ఆశ్రమం శోభిల్లుతోంది. (38,39)
అథర్వవెదప్రవరాః పూగయజ్ఞియసామగాః ।
సంహితామీరయంతి స్మ పదక్రమయుతాం తు తే ॥ 40
అథర్వవేదంలో శ్రేష్ఠులు, పూగయజ్ఞియసామను గానం చేసేవాళ్లు, పదక్రమాలతో వేదసంహితను పఠిస్తూ ఉన్నారు. (40)
శబ్దసంస్కారసంయుక్తైః బ్రువద్భిశ్చాపరైర్ద్విజైః ।
నాదితః స బభౌ శ్రీమాన్ బ్రహ్మలోక ఇవాపరః ॥ 41
మరికొందరు బ్రాహ్మణులు శబ్దసంస్కార సంయుక్తంగా వేదోచ్చారణలు చేస్తూంటే ఆ ఆశ్రమం మరొక బ్రహ్మలోకంలా ప్రతిధ్వనింపసాగింది. (41)
యజ్ఞసంస్తరవిద్భిశ్చ క్రమశిక్షావిశారదైః ।
న్యాయతత్త్వాత్మవిజ్ఞాన సంపన్నైర్వేదపారగైః ॥ 42
నానావాక్యసమాహార సమవాయవిశారదైః ।
విశేషకార్యవిద్భిశ్చ మోక్షధర్మపరాయణైః ॥ 43
స్థాపనాక్షేపసిద్ధాంత పరమార్థజ్ఞతాం గతైః ।
శబ్దచ్ఛందోనిరుక్తజ్ఞైః కాలజ్ఞానవిశారదైః ॥ 44
ద్రవ్యకర్మగుణజ్ఞైశ్చ కార్యకారణవేదిభిః ।
పక్షివానరరుతజ్ఞైః వ్యాసగ్రంథసమాశ్రితైః ॥ 45
నానాశాస్త్రేషు ముఖ్యైశ్చ శుశ్రావ స్వనమీరితమ్ ।
లోకాయతికముఖ్యైశ్చ సమంతాదనునాదితమ్ ॥ 46
యజ్ఞవేదికలు ఏర్పాటు చేయటం తెలిసినవారు, క్రమంలో శిక్షణనివ్వటంలో నేర్పరులు, న్యాయం, తత్త్వం, ఆత్మ విజ్ఞానం, కలిగిన వేదపారగులు, అనేక విధాలైన వాక్యాలను సమన్వయం చేసే నేర్పరులు, విశేష కార్యాలు తెలిసినవారు, మోక్ష ధర్మంపట్ల ఆసక్తి గలవారు, విషయ ప్రతిపాద్యమైన, ఆక్షేపం, సిద్ధాంతం, పరమార్థం, తెలిసినవారు, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషా (కాలజ్ఞానము)ల జ్ఞానం కలవారు, పక్షుల, వానరాల అరుపులు తెలిసినవారు, పెద్దపెద్ద గ్రంథాలను వ్యాఖ్యానింపగలవారు, అనేక శాస్త్రాలలో పండితులు, లోకులను రంజింపచేయగలవారు---పలికిన మాటలను అతడు విన్నాడు. (42-46)
తత్ర తత్ర విప్రేంద్రాన్ నియతాన్ సంశితవ్రతాన్ ।
జపహోమపరాన్ విప్రాన్ దదర్శ పరవీరహా ॥ 47
శత్రువీరులను సంహరించే దుష్యంతుడు ఆయా ప్రదేశాలలో కఠోర నియమాలను పాటించే జపహోమ తత్పరులైన విప్రులను చూశాడు. (47)
ఆసనాని విచిత్రాణి రుచిరాణి మహీపతిః ।
ప్రయత్నోపహితాని స్మ దృష్ట్వా విస్మయమాగమత్ ॥ 48
ఆ రాజు ప్రయత్నపూర్వకంగా తయారుచేసిన విచిత్రాలైన అందమైన ఆసనాలను చూసి ఆశ్చర్యపోయాడు. (48)
దేవతాయతనానాం చ ప్రేక్ష్య పూజాం కృతాం ద్విజైః ।
బ్రహ్మలోకస్థమాత్మానం మేనే స నృపసత్తమః ॥ 49
అక్కడున్న దేవగృహాలలో బ్రాహ్మణులు చేసిన పూజలు చూసి తాను బ్రహ్మలోకంలో ఉన్నట్లుగా అతడు భావించాడు. (49)
స కాశ్యపతపోగుప్తమ్ ఆశ్రమప్రవరం శుభమ్ ।
నాతృప్యత్ ప్రేక్షమాణో వై తపోవనగుణైర్యుతమ్ ॥ 50
కశ్యప వంశజుడైన కణ్వమహర్షి తపస్సులచే రక్షింపబడుతూ, తపోవన లక్షణాలన్నింటితో నిండిన ఆ ఆశ్రమాన్ని చూస్తూ ఉన్నా దుష్యంతునికి తృప్తి కలగలేదు. (50)
స కాశ్యపస్యాయతనం మహావ్రతైః
వృతం సమంతా దృషిభిస్తపోధనైః ।
వివేశ సామాత్యపురోహితోఽరిహా
వివిక్తమత్యర్థమనోహరం శుభమ్ ॥ 51
మహావ్రతులు, తపోధనులు అయిన ఋషులతో కూడి, మిక్కిలి మనోహరంగా, మంగళకరంగా, ఏకాంతంగా ఉన్న ఆ కాశ్యపుని ఆశ్రమంలోఅమాత్య పురోహితులతో కలిసి దుష్యంతుడు ప్రవేశించాడు. (51)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలోపాఖ్యానే సప్తతితమోఽధ్యాయః ॥ 70 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శకుంతలోపాఖ్యానము అను దెబ్బదియవ అధ్యాయము. (70)