58. ఏబది ఎనిమిదవ అధ్యాయము

సర్పయాగ సమాప్తి - ఆస్తీకునకు వరప్రాప్తి.

సౌతిరువాచ
ఇదమత్యద్భుతం చాన్యద్ ఆస్తీకస్యానుశుశ్రుమ ।
తథా వీరైశ్ఛంద్యమానే రాజ్ఞా పారిక్షితేన హి ॥ 1
ఇంద్రహస్తాచ్చ్యుతో నాగః ఖ ఏవ యదతిష్ఠత ।
తతశ్చింతాపరో రాజా బభూవ జనమేజయః ॥ 2
ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు. మునీంద్రా! ఆస్తీకునికి సంబంధించి నేను ఒక అత్యద్భుతమైన మాటను విన్నాను. రాజైన జనమేజయుడు ఆస్తీకునికి వరం ఇవ్వడానికి సంకోచపడినప్పుడు ఇంద్రుడు తన ఉత్తరీయంలో ఉన్న తక్షకుడిని యాగాగ్నికి పైభాగంలో ఆకాశంలో విడిచిపెట్టి తాను భయంతో వెళ్లిపోయాడు. అప్పుడు తక్షకుడు తల్లడిల్లుతూ ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ చింతాక్రాంతుడై ఉన్నాడు. ఆ తక్షకుని చూసిన జనమేజయుడు తన యాగం పరిసమాప్తమవుతోందని విచారించాడు. (1,2)
హూయమానే భృశం దీప్తే విధివద్ వసురేతసి ।
న స్మ స ప్రాపతద్ వహ్నౌ తక్షకో బహుపీడితః ॥ 3
అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతున్నది. అయినా మంత్రాలతో ఆ యాగాగ్నిలో పిలిచినా అతడు అందులో పడలేదు. అందుకు జనమేజయుడు విచారపడ్డాడు. (3)
శౌనక ఉవాచ
కిం సూత తేషాం విప్రాణాం మంత్రగ్రామో మనీషిణామ్ ।
న ప్రత్యభాత్ తదాగ్నౌ యత్ స పపాత న తక్షకః ॥ 4
శౌనకుడు (సూతునితో) అన్నాడు. సూతనందనా! ఆ యజ్ఞశాలలో బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. తక్షకుడిపై వారి మంత్రాలు, పని చేయలేదా? తక్షకుడు అగ్నిగుండంలో పడకుండా ఉండటానికి కారణం ఏమిటి? (4)
సౌతిరువాచ
తమింద్రహస్తాద్ విత్రస్తం విసంజ్ఞం పన్నగోత్తమమ్ ।
ఆస్తీకస్తిష్ఠ తిష్ఠేతి వాచస్త్రిస్రోఽభ్యుదైరయత్ ॥ 5
సౌతి చెప్తున్నాడు. శౌనకా! ఇంద్రుని నుండి విడివడిన తక్షకుడు భయంతో తల్లడిల్లిపోయాడు. అతనితో చైతన్యం నశించింది. ఆ సమయంలో ఆస్తీకుడు ఆ తక్షకుని లక్ష్యంగా పెట్టుకొని మూడు సార్లు " తక్షకా ఆగు ఆగు ఆగు అక్కడే ఉండు" అని తక్షకుని ఆకాశంలోనే ఉంచాడు. (5)
వితస్థే సోఽంతరిక్షే చ హృదయేన విదూయతా ।
యథా తిష్ఠతి వై కశ్చిత్ ఖం చ గాం చాంతరా నరః ॥ 6
అపుడు తక్షకుడు హృదయంలో బాధపడుతూ ఆకాశంలోనే నిలిచి ఉన్నాడు. ఆ విధంగా ఏ మనుష్యుడూ ఆకాశానికి భూమికి మధ్యలో పూర్వం ఎవ్వరూ వ్రేలాడలేదు. (6)
తతో రాజాబ్రవీద్ వాక్యం సదస్యైశ్చోదితో భృశమ్ ।
కామమేతద్ భవత్వేవం యథాఽఽస్తీకస్య భాషితమ్ ॥ 7
తరువాత సదస్యులందరు మాటిమాటికి ప్రేరేపించడంతో జనమేజయుడు ఇలా అన్నాడు. "ఆస్తీకుని యొక్క మాట ప్రకారం అతని కోరిక నెరవేరుగాక!". (7)
సమాప్యతామిదం కర్మ పన్నగాః సంత్వనామయాః ।
ప్రీయతామయమాస్తీకః సత్యం సూతవచోఽస్తు తత్ ॥ 8
ఈ యజ్ఞం సమాప్తం అగుగాక! పన్నగులందరూ కుశలముగ ఉందురుగాక! ఆస్తీకుడు సంతోషించుగాక! సూతునిమాట సత్యమగును గాక. (8)
తతో హలహలాశబ్దః ప్రీతిదః సమజాయత ।
ఆస్తీకస్య వరే దత్తే తథైవోపరరామ చ ॥ 9
స యజ్ఞః పాండవేయస్య రాజ్ఞః పారిక్షితస్య హ ।
ప్రీతిమాంశ్చాభవద్ రాజా భరతో జనమేజయః ॥ 10
జనమేజయుడు ఆస్తీకునకు ఇచ్చిన వరం వలన అందరూ సంతోషించి హర్షధ్వానాలు చేశారు. పాండవవంశీయుడైన జనమేజయ మహారాజు యొక్క సర్పయాగం సమాప్తం అయింది. ఆస్తీకుడికి వరం ఇచ్చిన తరువాత జనమేజయుని మనస్సు కూడా ప్రశాంతంగా ఉన్నది. (9,10)
ఋత్విగ్భ్యః ససదస్యేభ్యః యే తత్రాసన్ సమాగతాః ।
తేభ్యశ్చ ప్రదదౌ విత్తం శతశోఽథ సహస్రశః ॥ 11
ఆ యజ్ఞంలోని ఋత్విజులకు, సభాసదులకు అందరికీ వందలకొలదీ, వేలకొలది ధనాన్ని జనమేజయుడు ఇచ్చాడు. (11)
లోహితాక్షాయ సూతాయ తథా స్థపతయే విభుః ।
యేనోక్తం తస్య తత్రాగ్రే సర్పసత్రనివర్తనే ॥ 12
నిమిత్తం బ్రాహ్మణ ఇతి తస్మై విత్తం దదౌ బహు ।
దత్వా ద్రవ్యం యథాన్యాయం భోజనాచ్ఛాదనాన్వితమ్ ॥ 13
ప్రీతస్తస్మై నరపతిః అప్రమేయపరాక్రమః ।
తతశ్చకారావభృథం విధిదృష్టేన కర్మణా ॥ 14
సూతడయిన లోహితాక్షునికీ, యజ్ఞవాటికను రూపొందించిన శిల్పికీ, ఈ యజ్ఞం ప్రారంభానికి ముందు ఒక బ్రాహ్మణుని నిమిత్తం యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన బ్రాహ్మణునికీ అధికమైన ధనాన్ని జనమేజయుడు ఇచ్చాడు. అప్రమేయపరాక్రమవంతుడయిన జనమేజయుడు ప్రసన్నుడయి, యోగ్యులయిన వారికందరికీ వారి వారి యోగ్యతను బట్టి, ధనం, భోజనం, వస్త్రాలు ఇచ్చి సత్కరించాక శాస్త్రీయ విధిని అనుసరించి అవభృథ స్నానం చేశాడు. (12-14)
ఆస్తీకం ప్రేషయామాస గృహానేవ సుసంస్కృతమ్ ।
రాజా ప్రీతమనాః ప్రీతం కృతకృత్యం మనీషిణమ్ ॥ 15
పునరాగమనం కార్యమితి చైనం వచోఽబ్రవీత్ ।
భవిష్యసి సదస్యో మే వాజిమేధే మహాక్రతౌ ॥ 16
ఆస్తీకుడు గొప్ప సంస్కారం కలవాడు. బుద్ధిమంతుడు. విద్వాంసుడు. అతడు తన అభీష్టకార్యమందు కృతకృత్యుడు. కాబట్టి ప్రసన్నంగా ఉన్నాడు. మహారాజయిన జనమేజయుడు అతడిని మెచ్చుకొని ఇంటికి పంపుతూ అతనితో "నేను భవిష్యత్కాలంలో అశ్వమేధయాగాన్ని చేయబోతున్నాను. ఆ యజ్ఞంలో నీవు సదస్యుడవుగా ఉండాలని కోరుతున్నాను" అన్నాడు. (15,16)
తథేత్యుక్త్వా ప్రదుద్రావ తదాఽఽస్తీకో ముదా యుతః ।
కృత్వా స్వకార్యమతులం తోషయిత్వా చ పార్థివమ్ ॥ 17
ఆస్తీకుడు ఎంతో సంతోషపడి జనమేజయునితో "చాల మంచిది. అలాగే చేస్తాను" అని ఆ మహారాజుకు తన అంగీకారాన్ని తెలిపి, రాజును సంతోషపరచి వెంటనే బయలుదేరాడు. (17)
స గత్వా పరమప్రీతో మాతులం మాతరం చ తామ్ ।
అభిగమ్యోపసంగృహ్య తథావృత్తం న్యవేదయత్ ॥ 18
ఆస్తీకుడు ప్రసన్నహృదయంతో ఇంటికి వచ్చి తల్లిని, తన మేనమామను కలుసుకొని వారి పాదపద్మాలకు నమస్కరించి, యజ్ఞసభలో జరిగిన విషయాలను అన్నిటిని జరిగింది జరిగినట్లుగా చెప్పాడు. (18)
సౌతిరువాచ
ఏతచ్ఛ్రుత్వా ప్రీయమణాః సమేతా
యే తత్రాసన్ పన్నగా వీతమోహాః ।
ఆస్తీకే వై ప్రీతిమంతో బభూవుః
ఊచుశ్చైవం వరమిష్టం వృణీష్వ ॥ 19
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. శౌనకా! సర్పయాగంలో భస్మం కాగా అక్కడ మిగిలిన నాగులందరు భయం విడిచిపెట్టి పరమసంతోషాన్ని పొందారు. ఆస్తీకునిపై అమితమైన ప్రీతిని ప్రకటించారు. వారందరు అతనితో నీకు కావలసిన వరాన్ని కోరుకో" అని అన్నారు. (19)
భూయో భూయః సర్వశస్తేఽబ్రువంస్తం
కింతే ప్రియం కరవామ్యష్య విద్వన్ ।
ప్రీతా వయం మోక్షితాశ్చైవ సర్వే
కామం కిం తే కరవామ్యద్య వత్స ॥ 20
వాళ్లందరు అనేక పర్యాయాలు ఈ విధంగా అతనితో అంటున్నారు. "విద్వాంసుడా! ఇవ్వాళ నీకు సంతోషం కలిగేటట్లుగా మేము ఏమి చేస్తే బాగుంటుంది? మమ్మల్ని అందరిని కష్టాల నుండి గట్టెక్కించావు. నీ కోరిక ఏమిటో చెప్పు. తప్పకుండా దాన్ని నెరవేరుస్తాము" అని నాగులందరు గుచ్చి గుచ్చి అడిగారు. (20)
ఆస్తీక ఉవాచ
సాయం ప్రాతర్యే ప్రసన్నాత్మరూపా
లోకే విప్రా మానవా యే పరేఽపి ।
ధర్మాఖ్యానం యే పఠేయుర్మమేదం
తేషాం యుష్మన్నైవ కించిద్ భయం స్యాత్ ॥ 21
ఆస్తీకుడు ఇలా అన్నాడు. పన్నగోత్తములారా! ప్రపంచంలో బ్రాహ్మణులుగాని, ఇతర మానవులు గాని ప్రసన్నచిత్తులై ధర్మమయ మయిన నా ఈ కథను చదువుతారో వాళ్లందరికీ మీ వలన ఎట్టి భయమూ కలుగకూడదు. (21)
తైశ్చాపుయుక్తో భాగినేయః ప్రసన్నైః
ఏతత్ సత్యం కామమేవం వరం తే ।
ప్రీత్యా యుక్తాః కామితం సర్వశస్తే
కర్తారః స్మ ప్రవణా భాగినేయ ॥ 22
ఈ మాటల్ని నాగులందరు విని చాలా ఆనందించారు. తమ మేనల్లుడితో బిడ్డా! నీ ఈ కోరికను తప్పక నెరవేరుస్తాం. మేనల్లుడా! మేమందరం అమిత ప్రేమతో నమ్రత తో అన్నివిధాలా నీ ఈ కోరికను తీరుస్తాం. (22)
అసితం చార్తిమంతం చ సునీథం చాపి యః స్మరేత్ ।
దివా వా యది వా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్ ॥ 23
రాత్రిగాని, పగలుగాని ఎవరు అసితుని, ఆర్తిమంతుని, సునీథుని స్మరిస్తారో అట్టివారికి ఎన్నటికినీ సర్పభయం ఉండదు. (23)
యో జరత్కారుణా జాతః జరత్కారౌ మహాయశాః ।
ఆస్తీకః సర్పసత్రే వః పన్నగాన్ యోఽభ్యరక్షత ।
తం స్మరంతం మహాభాగాః న మాం హింసితుమర్హథ ॥ 24
"జరత్కారు ఋషివలన జరత్కారువు అను నాగకన్యకు జన్మించి, జనమేజయుని సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తీకుని నేను స్మరిస్తున్నాను. నాగులారా! మీరు నన్ను హింసించకండి" అంటూ ఈ మంత్రాన్ని జపించండి. (24)
సర్పాపసర్ప భద్రం తే గచ్ఛ సర్ప మహావిష ।
జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తీకవచనం స్మర ॥ 25
మహాసర్పమా! తప్పుకొని వెళ్లిపో. జనమేజయుని యొక్క సర్పయాగాంతకాలంలోని ఆస్తీకుని మాటలను స్మరించు. (25)
ఆస్తీకస్య వచః శ్రుత్వా యః సర్పో న నివర్తతే ।
శతధా భిద్యతే మూర్ధ్ని శింశవృక్షఫలం యథా ॥ 26
అట్టి ఆస్తీకుని మాటలను విని ఏసర్పం తొలగదో దాని శిరస్సు శింశవృక్ష ఫలంలాగా నూరు వ్రక్కలు అగునుగాక! (26)
సౌతిరువాచ
స ఏవముక్తస్తు తదా ద్విజేంద్రః
సమాగతైస్తైర్భుజగేంద్రముఖ్యైః ।
సంప్రాప్య ప్రీతిం విపులాం మహాత్మా
తతో మనో గమనాయాథ దధ్రే ॥ 27
మోక్షయిత్వా తు భుజగాన్ సర్పసత్రాద్ ద్విజోత్తమః ।
జగామ కాలే ధర్మాత్మా దిష్టాంతం పుత్రపౌత్రవాన్ ॥ 28
ఉగ్రశ్రవుడు (శౌనకునితో) చెపుతున్నాడు. బ్రాహ్మణోత్తమా! శౌనకా! ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రధానమైన నాగులందరు వరం అడిగిన మహాత్ముడయిన ఆస్తీకుని సంతోషపరచారు. తరువాత ఆస్తీకుడు అక్కడ నుండి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యాడు. ఇలా సర్పయాగంలో నాగుల్ని ఉద్దరించిన బ్రాహ్మణోత్తముడు, ధర్మాత్ముడు అయిన ఆస్తీకుడు వివాహం చేసుకొని పుత్రపౌత్రాదులతో ఆనందించి, జీవితాన్ని గడిపి సమయం రాగానే మోక్షాన్ని పొందాడు. (27,28)
ఇత్యాఖ్యానం మయాఽఽస్తీకం యథావత్ తవ కీర్తితమ్ ।
యత్ కీర్తయిత్వా సర్పేభ్యః న భయం విద్యతే క్వచిత్ ॥ 29
ఈ విధంగా నేను ఆస్తీకుని ఉపాఖ్యానాన్ని జరిగినది జరిగినట్లుగా చెప్పాను. ఆ ఆస్తీకోపాఖ్యానాన్ని ఎవరు కీర్తిస్తారో అట్టివారందరికీ ఎన్నటికీ సర్పభయం ఉండదు. (29)
యథా కథితవాన్ బ్రహ్మన్ ప్రమతిః పూర్వజస్తవ ।
పుత్రాయ రురవే ప్రీతః పృచ్ఛతే భార్గవోత్తమ ॥ 30
యద్ వాక్యం శ్రుతవాంశ్చాహం తథా చ కథితం మయా ।
ఆస్తీకస్య కవేర్విప్ర శ్రీమచ్చరితమాదితః ॥ 31
భృగువంశ శిరోమణీ! అ నీ పూర్వులు అయిన ప్రమతి తన కుమారుడైన రురుడు అడిగితే ఈ ఆస్తీకోపాఖ్యానాన్ని చెప్పాడు. దాన్ని నేను కూడా విన్నాను. ఆ ప్రకారంగా విద్వాంసుడూ, మహాత్ముడూ అయిన ఆస్తీకుని యొక్క శుభ చరిత్రం నేను మొదటి నుండి చెప్పాను. (30,31)
శ్రుత్వా ధర్మిష్ఠమాఖ్యానమ్ ఆస్తీకం పుణ్యవర్ధనమ్ ।
యన్మాం త్వం పృష్టవాన్ బ్రహ్మన్ శ్రుత్వా డుండుభభాషితమ్ ।
వ్యేతు తే సుమహద్ బ్రహ్మన్ కౌతూహలమరిందమ ॥ 32
ఈ ఆస్తీకుని యొక్క ఈ ధర్మమయమైన ఉపాఖ్యానం వింటే పుణ్యం వృద్ధి అవుతుంది. కామక్రోధాదులు అణగిపోతాయి. కథాప్రసంగంలో డుండుభం యొక్క మాటను విని మీరు నన్ను అడిగినందులకు నేను విన్న ఈ కథనంతటినీ మీకు వినిపించాను. దీనిని విన్న తరువాత మీ మనస్సులో ఉన్న సందేహం తీరిపోయిందని అనుకుంటాను. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పసత్రే అష్టపంచాశత్తమోఽధ్యాయః ॥ 58 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పయాగము అను ఏబది ఎనిమిదవ అధ్యాయము. (58)