59. ఏబది తొమ్మిదవ అధ్యాయము
(అంశావతరణ పర్వము)
మహాభారత కథా ప్రారంభము.
శౌనక ఉవాచ
భృగువంశాత్ ప్రభృత్యేవ త్వయా మే కీర్తితం మహత్ ।
ఆఖ్యానమఖిలం తాత సౌతే ప్రీతోఽస్మి తేన తే ॥ 1
శౌనకుడు ఇలా చెపుతున్నాడు. ఉగ్రశ్రవా! భృగువంశం దగ్గర నుండి భారతాఖ్యానం నీవు చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. (1)
వక్ష్యామి చైవ భుయస్త్వాం యథావత్ సూతనందన ।
యాః కథాః వ్యాససంపన్నాః తాశ్చ భూయో విచక్ష్వ మే ॥ 2
సౌతీ! ఇంకా వ్యాసమహర్షి చెప్పిన కథలన్నీ యథాతథంగా వివరంగా నాకు చెప్పు. (2)
తస్మిన్ పరమదుష్పారే సర్పసత్రే మహాత్మనామ్ ।
కర్మాంతరేషు యజ్ఞస్య సదస్యానాం తథాధ్వరే ॥ 3
యా బభూవుః కథాశ్చిత్రాః యేష్వర్థేషు యథాతథమ్ ।
త్వత్త ఇచ్ఛామహే శ్రోతుం సౌతే త్వం వై ప్రచక్ష్వ నః ॥ 4
అనంతమయిన ఆ సర్పయాగంలో కర్మాంతరాల్లో సదస్యుల మధ్య జరిగినవి ఉన్నవి వున్నట్లు నీ ముఖం నుండి వినాలని కోరుతున్నాను. సౌతీ! వాటిని మాకు చెప్పు. (3,4)
సౌతిరువాచ
కర్మాంతరేష్వకథయన్ ద్విజా వేదాశ్రయాః కథాః ।
వ్యాసస్త్వకథయచ్చిత్రమ్ ఆఖ్యానం భారతం మహత్ ॥ 5
సౌతి ఇలా చెప్పాడు. కర్మాంతరాల్లో వేదాశ్రితాలయిన కథలు చెప్పారు. అందులో వ్యాసుడు చెప్పిన చిత్రమయిన కథ భారతం చాలా గొప్పది. (5)
శౌనక ఉవాచ
మహాభారతమాఖ్యానం పాండవానాం యశస్కరమ్ ।
జనమేజయేన పృష్టఃసన్ కృష్ణద్వైపాయనస్తదా ॥ 6
శ్రావయామాస విధివత్ తదా కర్మాంతరేతు సః ।
తామహం విధివత్ పుణ్యాం శ్రోతుమిచ్ఛామి వై కథామ్ ॥ 7
శౌనకుడు ఇలా అడిగాడు. జనమేజయుడు అడిగితే వ్యాసుడు మహాభారత కథను కర్మాంతరాల్లో వినిపింపజేశాడు. పాండవుల కీర్తిని ప్రకటించే ఆ పుణ్యకథను శాస్త్రోకంగా వినాలని కోరుతున్నాను. (6,7)
మనఃసాగర సంభూతాం మహర్షేర్భావితాత్మనః ।
కథయస్వ సతాం శ్రేష్ఠ సర్వరత్నమయీమిమామ్ ॥ 8
సజ్జనోత్తమా! నిర్మలాత్ముడయిన వ్యాసమహర్షి యొక్క మనస్సు అనే సముద్రం నుండి వెలువడినది ఈ కథ. సముద్రం వలెనే ఈ కథ కూడ రత్నాలకు నిలయం. ఈ కథను చెప్పు. (8)
సౌతి రువాచ
హంత తే కథయిష్యామి మహదాఖ్యానముత్తమమ్ ।
కృష్ణద్వైపాయనమతం మహాభారతమాదితః ॥ 9
సౌతి ఇలా అన్నాడు. అయ్యో! తప్పకుండా చెపుతాను. గొప్పదయిన ఈ మహాభారతం వ్యాస మహర్షికి చాలా ఇష్టం. ఆ మహాభారతం మొదటి నుండీ చెపుతాను. (9)
శృణు సర్వమశేషేణ కథ్యమానం మయా ద్విజ ।
శంసితుం తన్మహాన్ హర్షః మమాపీహ ప్రవర్తతే ॥ 10
శౌనకా! మహాభారతం చెప్పటానికి నాకూ ఎంతో సంతోషంగా ఉంది. పూర్తిగా చెపుతాను. విను. (10)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి కథానుబంధే ఏకోన షష్టితమోఽధ్యాయః ॥ 59 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అంశావతార పర్వమను ఉపపర్వమున కథానుబంధమను ఏబది తొమ్మిదవ అధ్యాయము. (59)