57. ఏబది యేడవ అధ్యాయము
సర్పయాగములో ఆహుతి అయిన ప్రధాన సర్పములు.
శౌనక ఉవాచ
యే సర్పాః సర్పసత్రేఽస్మిన్ పతితా హవ్యవాహనే ।
తేషాం నామాని సర్వేషాం శ్రోతుమిచ్ఛామి సూతజ ॥ 1
శౌనకుడు అడుగుతున్నాడు. సూతనందనా! జనమేజయుని సర్పయాగంలో ఏయే సర్పాలు అగ్నికి ఆహుతి అయ్యాయో వారి అందరి పేర్లూ నేను వినాలనుకొంటున్నాను. (1)
సౌతిరువాచ
సహస్రాణి బహూన్యస్మిన్ ప్రయుతాన్యర్బుదాని చ ।
న శక్యం పరిసంఖ్యాతుం బహుత్వాద్ ద్విజసత్తమ ॥ 2
సౌతి ఇలా అన్నాడు. ఈ యజ్ఞంలో వేలకొలది లక్షలకొలది, కోట్ల కొలది సర్పాలు అగ్నిగుండంలో పడి నాశనం అయ్యాయి. ఎంతో మంది ఉండటం చేత వారి అందరిపేర్లు చెప్పడానికి సాధ్యం కాదు. (2)
యథాస్మృతి తు నామాని పన్నగానాం నిబోధ మే ।
ఉచ్యమానాని ముఖ్యానాం హుతానాం జాతవేదసి ॥ 3
నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అగ్నికి ఆహుతి అయిన అతిముఖ్యుల పేర్లను మాత్రం చెప్పగలను. విను. (3)
వాసుకేః కులజాతాంస్తు ప్రాధాన్యేన నిబోధ మే ।
నీలరక్తాన్ సితాన్ ఘోరాన్ మహాకాయాన్ విషోల్బణాన్ ॥ 4
ముందుగా వాసుకి వంశంలో జన్మించిన ముఖ్యులయిన వారిపేర్లను చెపుతాను వినండి. అందులో కొందరు నీలవర్ణంతోను, కొందరు ఎరుపుగాను, కొందరు తెల్లగాను భయంకర రూపంలో ఉన్నారు. పెద్ద శరీరంతో మిక్కిలి భయంకరంగా విషపూరితులై ఉన్నారు. (4)
అవశాన్ మాతృవాగ్దండ పీడతాన్ కృపణాన్ హుతాన్ ।
కోటిశో మానసః పూర్ణః శలః పాలో హలీమకః ॥ 5
పిచ్ఛలః కౌణపశ్చక్రః కాలవేగః ప్రకాలనః ।
హిరణ్యబాహుః శరణః కక్షకః కాలదంతకః ॥ 6
మాతృశాప పీడితులైన ఆ సర్పాలు పరాధీనాలై అగ్నిలో పడిపోయాయి. వాటిపేర్లు ఇవి. కోటిశుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్ఛలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, కక్షకుడు, కాలదంతకుడు. (5,6)
ఏతే వాసుకిజా నాగాః ప్రవిష్టా హవ్యవాహనే ।
అన్యే చ బహవో విప్ర తథా వై కులసంభవాః ।
ప్రదీప్తాగ్నౌ హుతాః సర్వే ఘోరరూపా మహాబలాః ॥ 7
వీరందరు వాసుకి వంశంలో జన్మించినవారు. అగ్నిలో భస్మం అయ్యారు. ఇంకా ఇతరులు కొందరు మహాబలశాలులు, భయంకరులు అయిన నాగులు. ఆ వంశజులే అందరూ సర్పయాగాగ్నిలో ఆహుతి అయ్యారు. (7)
తక్షకస్య కులే జాతాన్ ప్రవక్ష్యామి నిబోధ తాన్ ।
పుచ్ఛాండకో మండలకః పిండసేక్తా రభేణకః ॥ 8
ఉచ్ఛిఖః శరభో భంగః బిల్వతేజా విరోహణః ।
శిలీ శలకరో మూకః సుకుమారః ప్రవేపనః ॥ 9
ముద్గరః శిశురోమా చ సురోమా చ మహాహనుః ।
ఏతే తక్షకజా నాగాః ప్రవిష్టా హవ్యవాహనమ్ ॥ 10
ఇపుడు తక్షకుని వంశంలో జన్మించిన నాగుల పేర్లను వివరిస్తాను విను. పుచ్ఛాండకుడు, మండలకుడు, పిండసేక్తుడు, రభేణకుడు, ఉచ్ఛిఖుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహణుడు, శిలి, శలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, సురోముడు, మహాహనుడు - వీరంతా తక్షకవంశంలో జన్మించిన నాగులు. వీరందరూ సర్పయాగాగ్నిలో భస్మం అయ్యారు. (8-10)
పారావతః పారిజాతః పాండరో హరిణః కృశః ।
విహంగః శరభో మేదః ప్రమోదః సంహతాపనః ॥ 11
ఐరావతకులాదేతే ప్రవిష్టా హవ్యవాహనమ్ ।
పారావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు, కృశుడు, విహంగుడు, శరభుడు, మేదుడు, ప్రమోదుడు, సంహతాపనుడు - వీరందరు ఐరావతవంశంలోని వారు. వీరంతా హోమంలో పడిపోయారు. (11 1/2)
కౌరవ్యకులజాన్ నాగాన్ శృణు మే త్వం ద్విజోత్తమ ॥ 12
బ్రాహ్మణోత్తమా! ఇపుడు కౌరవ్యకులంలో పుట్టిన నాగుల పేర్లు చెపుతాను విను. (12)
ఏరకః కుండలో వేణీ వేణీస్కంధః కుమారకః ।
బాహుకః శృంగబేరశ్చ ధూర్తకః ప్రాతరాతకౌ ॥ 13
కౌరవ్య కులజాస్త్వేతే ప్రవిష్టా హవ్యవాహనమ్ ।
ఏరకుడు, కుండలుడు, వేణి, వేణీస్కంధుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరుడు, ధూర్తకుడు, ప్రాతరుడు, ఆతకుడు. వీరందరూ కౌరవ్యకులంలో పుట్టినవారు. వీరు యాగాగ్నిలో భస్మం అయ్యారు. (13 1/2)
ధృతరాష్ట్రకులే జాతాన్ శృణు నాగాన్ యథాతథమ్ ॥ 14
కీర్త్యమానాన్ మయా బ్రహ్మన్ వాతవేగాన్ విషోల్బణాన్ ।
శంకుకర్ణః పిఠరకః కుఠారముఖసేచకౌ ॥ 15
పూర్ణాంగదః పూర్ణముఖః ప్రహాసః శకునిర్దరిః ।
అమాహఠః కామఠకః సుషేణో మానసోఽవ్యయః ॥ 16
భైరవో ముండవేదాంగః పిశంగశ్చోద్రపారకః ।
ఋషభో వేగవాన్ నాగః పిండారకమహాహనూ ॥ 17
రక్తాంగః సర్వసారంగః సమృద్ధపటవాసకౌ ।
వరాహకో వీరణకః సుచిత్రశ్చిత్రవేగికః ॥ 18
పరాశరస్తరుణకః మణిః స్కంధస్తథారుణిః ।
ఇతి నాగా మయా బ్రహ్మన్ కీర్తితాః కీర్తివర్ధనాః ॥ 19
ప్రాధాన్యేన బహుత్వాత్ తు న సర్వే పరికీర్తితాః ।
ఏతేషాం ప్రసవో యశ్చ ప్రసవస్యచ సంతతిః ॥ 20
న శక్యం పరిసంఖ్యాతుం యే దీప్తం పావకం గతాః ।
త్రిశీర్షాః సప్తశీర్షాశ్చ దశశీర్షాస్తథాపరే ॥ 21
బ్రాహ్మణా! శౌనకా! ఇపుడు ధృతరాష్ట్రకులంలో పుట్టిన నాగుల యొక్క పేర్లు యథాతథంగా చెపుతాను. వినండి. వీరందరూ వాయువుతో సమానమైన వేగం కలవారు. అత్యంత విషపూరితులు కూడా. వీరిపేర్లు ఇవి. శంకుకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, ముఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, దరి, అమాహఠుడు, కామఠకుడు, సుషేణుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, ముండవేదాంగుడు, పిశంగుడు, ఉద్రపారకుడు, ఋషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పటవాసకుడు, వరాహకుడు, విరణకుడు, సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణి, స్కంధుడు, ఆరుణి - వీరందరూ ధృతరాష్ట్ర వంశజనాగులు. సర్పసత్రంలో యాగాగ్నిలో భస్మం అయ్యారు. బ్రాహ్మణా! నేను ఇపుడు అతిముఖ్యులైన నాగులపేర్లే చెప్పాను. వీరి సంఖ్య చాలా అధికం. అందుచేత అందరిపేర్లు చెప్పలేదు. ఈ సంతానం, వీరి సంతానసంతతి అందరూ అగ్నిలో ఆహుతి అయ్యారు. ఇందులో కొందరు మూడుతలలుగలవారు. కొందరు ఏడు శిరస్సులు కలవారు. ఇంకనూ కొందరు పదితలలు గలవారు ఉన్నారు. (14-21)
కాలానలవిషా ఘోరా హుతాః శతసహస్రశః ।
మహాకాయా మహావేగాః శైలశృంగసముచ్ఛ్రయాః ॥ 21
వీరందరూ ప్రళయాగ్నితో సమానమైన విషంతో దహించే స్వభావం కలవారు. మహాభయంకరులు, పెద్ద శరీరంగలవారు. మహావేగం కలవారు. పర్వతశిఖరం లాగా పొడగరులు. వీరందరూ లక్షలకొలదిగ యాగాగ్నికి ఆహుతులయ్యారు. (22)
యోజనాయామవిస్తారాః ద్వియోజనసమాయతాః ।
కామరూపాః కామబలా దీప్తానలవిషోల్బణాః ॥ 23
దగ్ధాస్తత్ర మహాసత్రే బ్రహ్మదండనిపీడితాః ॥ 24
వీరు ఒక్కొక్క యోజనం లావు గలవారు. రెండు రెండు యోజనాల పొడవు గలవారు. వీరు కామరూపులు, కామబలులు, ప్రజ్వరిల్లే అగ్నితో సమానంగా ఉన్న విషంతో ఉన్నవారు. వీరందరూ ఆ మహా సర్పయాగంలో మాతృశాపపీడితులై దగ్ధమయ్యారు. (23,24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పనామకథనే సప్తపంచాశత్తమోఽధ్యాయః ॥ 57 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పనామకథనము అను ఏబది ఏడవ అధ్యాయము. (57)