56. ఏబది ఆరవ అధ్యాయము
జనమేజయుడు ఆస్తీకునకు వరమిచ్చుట.
జనమేజయ ఉవాచ
బాలోఽప్యయం స్థవిర ఇవాచభాషతే
నాయం బాలః స్థవిరోఽయం మతే మే ।
ఇచ్ఛామ్యహం వరమస్మై ప్రదాతుం
తన్మే విప్రాః సంవిదధ్వం యథావత్ ॥ 1
జనమేజయమహారాజు ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తములారా! ఈతడు బాలకుడే అయినప్పటికీ పెద్దవారివలె మాటలాడుతున్నాడు. కాబట్టి ఇతడు బాలుడు కాడు. వృద్ధుడనే భావిస్తున్నాను. ఆనందంగా ఇతనికి వరం ఇవ్వాలని అనుకొంటున్నాను. మీరందరు బాగుగా ఆలోచించి మీ అంగీకారాన్ని తెలుపండి. (1)
సదస్యా ఊచుః
బాలోఽపి విప్రో మాన్య ఏవేహ రాజ్ఞాం
విద్వాన్ యో వై స పునర్వై యథావత్ ।
సర్వాన్ కామాంస్తవ ఏవార్హతేఽద్య
యథా చ నస్తక్షక ఏతి శీఘ్రమ్ ॥ 2
సభలోని వారు ఈ విధంగా చెప్పారు. బాలుడు అయినప్పటికీ ఇతడు విప్రుడు. కాబట్టి రాజసమ్మానానికి తగినవాడే. ఇతడు విద్వాంసుడు కూడా. ఇక చెప్పేది ఏముంది? కాబట్టి ఈ బ్రాహ్మణ బాలకుడు మీచేత యథోచితంగా సత్కరింపదగినవాడు. అలాగే తక్షకుడు కూడా వెంటనే రాదగినవాడు. (2)
సౌతిరువాచ
వ్యాహర్తు కామే వరదే నృపే ద్విజం
వరం వృణీష్వేతితతోఽభ్యువాచ ।
హోతా వాక్యం నాతిహృష్టాంతరాత్మా
కర్మణ్యస్మింస్తక్షకో నైతి తావత్ ॥ 3
సూతనందనుడు ఇలా అన్నాడు. శౌనకా! ఆ తరువాత వరం ఇవ్వడానికి జనమేజయుడు సిద్ధమయి ఆస్తీకునితో నీవు కావలసిన వరాన్ని అడుగు" అని అన్నాడు. ఇంతలో హోత మనస్సు అంత తృప్తిగా లేకపోవటంతో లేచి "ఇప్పటివరకూ ఈ యజ్ఞకర్మలో తక్షకుని మంత్రాలతో పిలిచాం. కాని ఇంతవరకూ రాలేదు" అని చెప్పాడు. (3)
జనమేజయ ఉవాచ
యథా చేదం కర్మ సమాప్యతే మే
యథా చ వై తక్షక ఏతి శీఘ్రమ్ ।
తథా భవంతః ప్రయతంతు సర్వే
పరం శక్త్యా స హి మే విద్విషాణః ॥ 4
అపుడు జనమేజయుడు బ్రాహ్మణులతో "బ్రాహ్మణులారా! తక్షకుడు ఆహుతి అయితేనే గాని ఈ యాగం పూర్తికాదు. మీరు మీ శక్తిని ఉపయోగించి తక్షకుని రప్పించండి. అతడే నా అసలు శత్రువు" అని అన్నాడు. (4)
ఋత్విజ ఊచుః
యథా శాస్త్రాణి నః ప్రాహుః యథా శంసతి పావకః ।
ఇంద్రస్య భవనే రాజన్ తక్షకో భయపీడితః ॥ 5
ఋత్విజులు ఇలా అన్నారు. మహారాజా! మన శాస్త్రాలు ఏమి చెప్పాయో ఆ విధంగా అగ్నిదేవుడు చెపుతున్నాడు. ఈ మంత్రాలకు భయపడి తక్షకుడు ఇంద్రుని భవనంలో దాగుకొని ఉన్నాడు. (5)
యథా సూతో లోహితాక్షో మహాత్మా
పౌరాణికో వేదితవాన్ పురస్తాత్ ।
స రాజానం ప్రాహ పృష్టస్తదానీం
యథాహుర్విప్రాస్తద్వదేతన్నృదేవ ॥ 6
పురాణవేత్త, మహాత్ముడు, సూతపుత్రుడు అయిన లోహితాక్షుడు యాగనిర్వహణకు ముందు "ఈ యాగం సంపూర్ణంగా జరుగదు" అని చెప్పాడు కదా! అని ఋత్విజులు చెపితే జనమేజయుడు ఈ విషయం గురించి లోహితాక్షుని అడిగాడు. అపుడు లోహితాక్షుడు రాజుతో "మహారాజా! బ్రాహ్మణులు ఈ విషయంలో ఏమి చెప్పారో అది సత్యం. (6)
పురాణమాగమ్య తతో బ్రవీమ్యహం
దత్తం తస్మై వరమింద్రేణ రాజన్ ।
వసేహ త్వం మత్సకాశో సుగుప్తః
న పావకస్త్వాం ప్రదహిష్యతీతి ॥ 7
మహారాజా! పురాణాన్ని తెలుసుకొన్న నేను ఈ మాటను చెపుతున్నాను. ఇంద్రుడు తక్షకుడికి "నాగరాజా! నీవు నా దగ్గర సురక్షితంగా ఉండు. సర్పయాగంలోని అగ్ని నిన్ను దహింపలేదు" అని వరం ఇచ్చాడు. (7)
ఏతచ్ఛ్రుత్వా దీక్షితస్తప్యమాన
ఆస్తే హోతారం చోదయన్ కర్మకాలే ।
హోతా చ యత్తోఽస్యాజుహావాథ మంత్రైః
అథో మహేంద్రః స్వయమాజగామ ॥ 8
విమానమారుహ్య మహానుభావః
సర్వైర్దేవైః పరిసంస్తూయమానః ।
వలాహకైశ్చాప్యనుగమ్యమానః
విద్యాధరైరప్సరసాం గణైశ్చ ॥ 9
యజ్ఞదీక్షను పూనిన జనమేజయుడు ఈ మాటలు విని విచారపడ్డాడు. ఇంద్రుడితో సహా తక్షకుని యాగాగ్నిలోకి రప్పించమని ఆవేశంతో రాజు ఋత్విజులను ప్రేరేపించాడు. అపుడు హోత ఏకాగ్రచిత్తంతో మంత్రాల ద్వారా ఇంద్రునితో కూడిన తక్షకుని ఆహ్వానించాడు. వెంటనే దేవరాజైన ఇంద్రుడు ఆకాశమార్గంలో విమానంలో వచ్చాడు. దేవతలందరూ ఇంద్రుని స్తుతిస్తున్నారు. అప్సరసలు, మేఘాలు, విద్యాధరులు అందరూ అతని వెనకాలే వస్తున్నారు. (8,9)
తస్యోత్తరీయే నిహితః స నాగః
భయోద్విగ్నః శర్మ నైవాభ్యగచ్ఛత్ ।
తతో రాజా మంత్రవిదోఽబ్రవీత్ పునః
క్రుద్ధో వాక్యం తక్షకస్యాంతమిచ్ఛన్ ॥ 10
తక్షకుడు ఆ ఇంద్రుని ఉత్తరీయవస్త్రంలో దాగుకొని ఉన్నాడు. భయంతో కలత చెంది తక్షకుడు అశాంతితో ఉన్నాడు. ఇక్కడ తక్షకుని వినాశనాన్ని కోరిన జనమేజయుడు కోపావేశంతో ఉండి మంత్రవేత్తలయిన బ్రాహ్మణులతో ఇలా అంటున్నాడు. (10)
జనమేజయ ఉవాచ
ఇంద్రస్య భవనే విప్రా యది నాగః స తక్షకః ।
తమింద్రేణైవ సహితం పాతయధ్వం విభావసౌ ॥ 11
జనమేజయుడు అన్నాడు. బ్రాహ్మణులారా! తక్షకుడు ఇంద్రుని విమానంలో దాగుకొని ఉంటే ఇంద్రుడితో కూడా తక్షకుని అగ్ని గుండంలోకి పడవేయండి. (11)
సౌతిరువాచ
జనమేజయేన రాజ్ఞా తు నోదితస్తక్షకం ప్రతి ।
హోతా జుహావ తత్రస్థం తక్షకం పన్నగం తథా ॥ 12
ఉగ్రశ్రవుడు ఇలా చెపుతున్నాడు. జనమేజయమహారాజు ప్రేరేపించిన ప్రకారం తక్షకుడిని అగ్నికి ఆహుతి చేయదలచి ఇంద్రుడి దగ్గర ఉన్న తక్షకుని ఆహ్వానించాడు. అతని పేరుతో అగ్నిలో ఆహుతులు వేశాడు. (12)
హూయమానే తథా చైవ తక్షకః సపురందరః ।
ఆకాశే దదృశే చైవ క్షణేన వ్యధితస్తదా ॥ 13
ఈ ప్రకారం ఆహుతి ఇచ్చాక క్షణకాలంలో ఇంద్రుడితో సహా తక్షకుడు ఆకాశంలో వ్యథచెందుతూ కనబడ్డాడు. (13)
పురందరస్తు తం యజ్ఞం దృష్ట్వోరుభయమావిశత్ ।
హిత్వా తు తక్షకం త్రస్తః స్వమేవ భవనం యయౌ ॥ 14
ఆ యజ్ఞాన్ని చూసిన ఇంద్రుడు మిక్కిలి భయగ్రస్తుడై తక్షకుని అక్కడే విడిచిపెట్టి కంగారుపడుతూ తన భవనానికి వెళ్లిపోయాడు. (14)
ఇంద్రే గతే తు నాగేంద్రః తక్షకో భయమోహితః ।
మంత్రశక్త్యా పావకార్చిః సమీపమవశో గతః ॥ 15
ఇంద్రుడు వెళ్లిపోయిన తరువాత తక్షకుడు భయంతో తల్లడిల్లిపోతూ మంత్రశక్తికి అధీనుడై అగ్విజ్వాలల సమీపానికి వచ్చాడు. (15)
ఋత్విజ ఊచుః
వర్తతే తవ రాజేంద్ర కర్మైతద్ విధివత్ ప్రభో ।
అస్మై తు ద్విజముఖ్యాయ వరం త్వం దాతుమర్హసి ॥ 16
ఋత్విజులు అన్నారు. రాజేంద్ర! మీ యజ్ఞకార్యం విధి పూర్వకంగా సుసంపన్నం అయింది. ఇపుడు మీరు ఈ బ్రాహ్మణోత్తముడైన ఆస్తీకునికి వరం ఇవ్వవచ్చు. (16)
జనమేజయ ఉవాచ
బాలాభిరూపస్య తవాప్రమేయ
వరం ప్రయచ్ఛామి యథానురూపమ్ ।
వృణీష్వ యత్ తేఽభిమతం హృది స్థితం
తత్ తే ప్రదాస్యామ్యపి చేదదేయమ్ ॥ 17
జనమేజయుడు అన్నాడు. "బ్రాహ్మణబాలకా! నీవు అప్రమేయుడవు. నీ ప్రతిభకు పరిమితిలేదు. నీ పాండిత్యానికి తగిన వరం ఇవ్వాలని అనుకొంటున్నాను. నీ మనస్సులోని కోరిక నిర్భయంగా చెప్పు. ఆ కోరిక ఎటువంటిదైనా అయోగ్యమైనా తప్పక ఇస్తాను. (17)
ఋత్విజ ఊచుః
అయమాయాతి తూర్ణం స తక్షకస్తే వశం నృప ।
శ్రూయతేఽస్య మహాన్ నాదో నదతో భైరవం రవమ్ ॥ 18
ఋత్విజులు అన్నారు. రాజా! ఈ తక్షకనాగుడు వేగంగా నీ అధీనంలోకి వస్తున్నాడు. అతడు భయంకరంగా అరుచుకొంటూ వస్తున్నాడు. (18)
నూనం ముక్తో వజ్రభృతా స నాగః
భ్రష్షో నాకాన్మంత్రవిస్రస్తకాయః ।
ఘూర్ణన్నాకాశే నష్టసంజ్ఞోఽభ్యుపైతి
తీవ్రాన్ నిఃశ్వాసాన్ నిఃశ్వసన్ పన్నగేంద్రః ॥ 19
ఈ తక్షకుడు ఇంద్రుని నుండి విడివడ్డాడు. ఆ తక్షకుడు మంత్రాలచే స్వర్గలోకం నుండి క్రింది భాగానికి వచ్చాడు. ఆకాశంలో గిరగిరా తిరుగుతున్నాడు. అతడు తీవ్రంగా నిట్టూరుస్తూ అగ్నిగుండం సమీపానికి వస్తున్నాడు. (19)
ఆస్తీక ఉవాచ
వరం దదాసి చేన్మహ్యం వృణోమి జనమేజయ ।
సత్రం తే విరమత్వేతద్ న పతేయురిహోరగాః ॥ 20
ఆస్తీకుడు అన్నాడు. మహారాజా! నాకు వరం ఇవ్వదలచుకొంటే ఈ సర్పయాగాన్ని ఇపుడే విరమింపచేయండి. ఇక యాగాగ్నిలో సర్పాలు పడరాదు. ఈ వరాన్ని ఇవ్వండి. (20)
ఏవముక్తస్తదా తేన బ్రహ్మన్ పారిక్షితస్తు సః ।
నాతిహృష్టమనాశ్చేదమ్ ఆస్తీకం వాక్యమబ్రవీత్ ॥ 21
ఆస్తీకుడు ఈ వరం అడుగగానే జనమేజయుడు విచారగ్రస్తుడయ్యాడు. అపుడు ఆస్తీకునితో ఈ విధంగా అంటున్నాడు. (21)
సువర్ణం రజతం గాశ్చ యచ్చాన్యన్మన్యసే విభో ।
తత్ తే దద్యాం వరం విప్ర న నివర్తేత్ క్రతుర్మమ ॥ 22
బ్రాహ్మాణోత్తమా! బంగారం, వెండి లేదా ఆవులు లేదా మరొక అభీష్టాన్ని దేనినైన నీవు కోరుకో. తప్పక ఇస్తాను. ఈ యజ్ఞాన్ని మాత్రం నిలుపుచేయడానికి ఇష్టపడను. (22)
ఆస్తీక ఉవాచ
సువర్ణం రజతం గాశ్చ న త్వాం రాజన్ వృణోమ్యహమ్ ।
సత్రం తే విరమత్వేతత్ స్వస్తి మాతృకులస్య నః ॥ 23
ఆస్తీకుడు అన్నాడు. మహారాజా! బంగారం కాని, వెండి కాని, గోసంపదకాని నేను కోరను, నీ సర్పయాగాన్ని నిలుపుచేయి. ఆ విధంగా చేస్తే నా మాతృవంశానికి శుభం కలుగుతుంది. (23)
సౌతిరువాచ
ఆస్తీకేనైవముక్తస్తు రాజా పారిక్షితస్తదా ।
పునఃపునరువాచేదమ్ ఆస్తీకం వదతామ్ వరః ॥ 24
అన్యం వరయ భద్రం తే వరం ద్విజవరోత్తమ ।
అయాచత న చాప్యన్యం వరం స భృగునందన ॥ 25
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. భృగునందనా! శౌనకా! ఆస్తీకుడు ఆ విధంగా అడిగిన తరువాత మాటకారి అయిన జనమేజయుడు మరల మరల అతనిని వారిస్తూ "బ్రాహ్మణోత్తమా! నీకు శుభం కలుగుతుంది. వేరొకవరం కోరుకో" అని అడిగినా ఆస్తీకుడు మాత్రం మరొకటి కోరలేదు. (24,25)
తతో వేదవిదస్తాత సదస్యాః సర్వ ఏవ తమ్ ।
రాజానమూచుః సహితా లభతాం బ్రాహ్మణో వరమ్ ॥ 26
అపుడు వేదవేత్తలయిన బ్రాహ్మణ సభ్యులందరూ ఒక్కటై జనమేజయునితో "ఈ బ్రాహ్మణోత్తమునికి కోరిన వరం ఇవ్వండి" అని చెప్పారు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఆస్తీకవరప్రదానం నామ షట్ పంచాశత్తమోఽధ్యాయః ॥ 56 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున ఆస్తీకవరప్రదానము అను ఏబది ఆరవ అధ్యాయము. (56)