55. ఏబది అయిదవ అధ్యాయము

ఆస్తీకుడు చేసిన ప్రశంస.

ఆస్తీక ఉవాచ
సోమస్య యజ్ఞో వరుణస్య యజ్ఞః
ప్రజాపతేర్యజ్ఞ ఆసీత్ ప్రయాగే ।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్య్ర
పారీక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 1
ఆస్తీకుడు స్తుతిస్తున్నాడు. భరతవంశోత్తమా! జనమేజయమహారాజా! నీయజ్ఞం చంద్రుని యజ్ఞం వలె, వరుణుని యజ్ఞం వలె, ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞం వలె ఎంతో శోభాయమానంగా ఉంది. ఉత్తమగుణాలతో విరాజిల్లుతున్నది. మహారాజా! నా ప్రియజనులకు శుభం కలుగుగాక! (1)
శక్రస్య యజ్ఞః శతసంఖ్య ఉక్తః
తథా పూరోస్తుల్య సంఖ్యం శతం వై ।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్య్ర
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 2
భరతకుల శిరోమణీ! జనమేజయా! దేవేంద్రుడు చేసిన నూరు యజ్ఞాలకు సాటిగా ఉన్నది నీ యజ్ఞం. పూరుడు చేసిన యజ్ఞాలతో ఈ యజ్ఞం సమానంగా ఉన్నది. ఆ యజ్ఞాలన్నిటితోను నీ యజ్ఞం సమంగా ఉన్నది. నా ప్రియబాంధవులకు కల్యాణమగుగాక! (2)
యమస్య యజ్ఞో హరిమేధసశ్చ
యథా యజ్ఞో రంతిదేవస్య రాజ్ఞః ।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్య్ర
పారీక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 3
మహారాజా! యముని యజ్ఞానికి, హరిమేధసుని యజ్ఞానికి, రంతిదేవుని యజ్ఞానికి, సమానంగా ఉత్తమోత్తమంగా ఉంది నీ యజ్ఞం. మా ప్రియజనులకు శుభం కలుగుగాక! (3)
వి: హరిమేధసుడు: ఒక ప్రాచీన రాజు
రంతిదేవుడు: ఒక ప్రాచీనరాజు. సంకృతి యొక్క పుత్రుడు. ఇతడు 100 సంవత్సరాలు ఎంతోఘనంగా భూరిదక్షిణలతో యజ్ఞం చేశాడు. తనకేమీ లేకుండా దానం చేశాడు. చివరకు అతడు చేసిన జలదానం వల్ల అతనికి స్వర్గం లభించింది.
గయస్య యజ్ఞః శశబిందోశ్చ రాజ్ఞః
యజ్ఞస్తథా వైశ్రవణస్య రాజ్ఞః ।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్య్ర
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 4
భరత వంశాగ్రగణ్యా! జనమేజయ మహారాజా! గయిని యజ్ఞం, శశబిందుమహారాజు యొక్క యజ్ఞం, రాజాధిరాజైన కుబేరుని యజ్ఞాలతో సమానంగా విధి విధానాలతో జరుపబడుతూ నీ యజ్ఞం విరాజిల్లుతున్నది. నా బంధుజనులకు శుభం కలుగుగాక! (4)
గయుడు: అమూర్త రజసుని పుత్రుడు - బ్రహ్మసరోవరం దగ్గర గొప్పయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోని నెయ్యి 100 కుండములయింది. పెరుగు నది వలె ప్రవహించింది.
శశబిందుడు: ఒక ప్రాచీనరాజు - చిత్రరథుని పుత్రుడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. అతడు చేసిన అన్నదానం 13 పర్వతాలు అయింది.
నృగస్య యజ్ఞస్త్వజమీఢస్య చాసీద్
యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః ।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్య్ర
పారీక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 5
పరిక్షిత్ కుమారా! రాజైన నృగుని యజ్ఞం, మహారాజైన అజమీఢుని యజ్ఞం, దశరథనందనుడైన శ్రీరామచంద్రుని యజ్ఞాలతో సమానంగా నీ యజ్ఞం కూడా శోభాయమానంగా ఉంది. మా బంధుజనులకు శుభమగుగాక! (5)
నృగుడు: ఒక ప్రాచీన రాజు - పయోష్టీనదీ తీరంలో యజ్ఞం చేశాడు. కురుక్షేత్రంలో యజ్ఞం చేశాడు. ఒక పాపం వల్ల తొండ అయ్యాడు.
అజమీఢుడు - చంద్రవంశపు ప్రాచీనరాజు - సుహోత్రునికి ఇక్ష్వాకికి పుట్టినవాడు.
దాశరథి = రాముడు
యజ్ఞాః శ్రుతో దివి దేవస్య సూనోః
యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః ।
తథా యజోఽయం తవ భారతాగ్య్ర
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 6
భరతశ్రేష్ఠా! జనమేజయమహారాజా! అజమీఢ వంశీయుడును, ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుని యజ్ఞం వలె ప్రఖ్యాతిని పొందింది నీ యజ్ఞం. మా ప్రియ వంశజులకు స్వస్తియగు గాక. (6)
కృష్ణస్య యజ్ఞః సత్యవత్యాః సుతస్య
స్వయం చ కర్మ ప్రచకార యత్ర ।
తథా యజ్ఞోఽయం తవ భారతాగ్య్ర
పారిక్షిత స్వస్తి నోఽస్తు ప్రియేభ్యః ॥ 7
భరతాగ్రగణ్యా! జనమేజయమహారాజా! సత్యవతీనందనుడైన వ్యాసమహర్షి స్వయంగా కర్మాచరణం చేసిన యజ్ఞంతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నాబంధులకు శుభం కలుగుగాక! (7)
ఇమే చ తే సూర్యసమానవర్చసః
సమాసతే వృత్రహణః క్రతుం యథా ।
నైషాం జ్ఞాతుం విద్యతే జ్ఞానమద్య
దత్తం యేభ్యో న ప్రణశ్యేత్ కదాచిత్ ॥ 8
మహారాజా! నీ యజ్ఞశాలలోని ఋత్త్విక్కులు సూర్యునితో సమానమైన తేజస్వంతులు. ఇంద్రుని యజ్ఞంలో లాగా నీ యజ్ఞంలో వారు అనుష్ఠానం చేస్తున్నారు. ఇతరులెవరికీ ఇట్టి జ్ఞానం లేదు. వీరు మహాజ్ఞాన సంపన్నులు. వీరికి నీవు ఇచ్చే దానం ఎన్నటికీ తరగదు. (8)
ఋత్విక్ సమో నాస్తి లోకేషు చైవ
ద్వైపాయనేనేతి వినిశ్చితం మే ।
ఏతస్య శిష్యాః క్షితిమాచరంతి
సర్వర్త్విజః కర్మసు స్వేషు దక్షాః ॥ 9
కృష్ణద్వైపాయనునితో సాటివచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఆ వ్యాసుని శిష్యులు కూడా వారి వారి కర్మానుష్ఠానాలలో నిపుణులు. వీరు అందరు యజ్ఞనిర్వహణలో దక్షులే. (9)
విభావసుశ్చిత్రభానుర్మహాత్మా
హిరణ్యరేతా హుతభుక్ కృష్ణవర్త్మా ।
ప్రదక్షిణావర్తశిఖః ప్రదీప్తః
హవ్యం తవేదం హుతభుగ్ వష్టి దేవః ॥ 10
విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హుతభుక్కు, కృష్ణవర్త్ముడు అని మనం పిలిచే అగ్నిదేవుడు నీ యజ్ఞంలో దక్షిణావర్తశిఖలతో ప్రజ్వరిల్లుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తూ నీ హవిస్సులను కోరుతున్నాడు. (10)
నేహ త్వదన్యో విద్యతే జీవలోకే
సమో నృపః పాలయితా ప్రజానామ్ ।
ధృత్యా చ తే ప్రీతమనాః సదాహం
త్వం వా వరుణో ధర్మరాజో యమో వా ॥ 11
మానవలోకంలో ప్రజాపాలనలో నీతో సమానమైన రాజు మరొకడు లేడు. ధైర్యం వలన నీ మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. నీవు సాక్షాత్తుగా వరుణుడిలాగా, ధర్మరాజులాగ, యమధర్మరాజులాగా అత్యంత ప్రభావశాలివి. (11)
శక్రః సాక్షాద్ వజ్రపాణిర్యథేహ
త్రాతా లోకేఽస్మింస్త్వం తథేహ ప్రజానామ్ ।
మతస్త్వం నః పురుషేంద్రేహ లోకే
న చ త్వదన్యో భూపతిరస్తి జజ్ఞే ॥ 12
పురుషోత్తమా! సాక్షాత్తు వజ్రపాణి అయిన ఇంద్రుడు ప్రజలందరినీ ఎలా రక్షిస్తున్నాడో నీవు కూడా ఈ లోకంలో అలాగే ప్రజాపాలన చేస్తున్నావు. ఈ ప్రపంచంలో నీవు తప్ప ఈ విధంగా ప్రజాపాలన చేసే మహారాజు మరొకడు లేడు. (12)
ఖట్వాంగనాభాగ దిలీపకల్ప
యమాతిమాంధాతృసమప్రభావ ।
ఆదిత్యతేజఃప్రతిమానతేజాః
భీష్మో యథా రాజసి సువ్రతస్త్వమ్ ॥ 13
జనమేజయమహారాజా! నీవు ఖట్వాంగ మహారాజువలె, నాభాగుడివలె, దిలీపునివలె ప్రతాపశాలివి. నీ ప్రభావం యయాతి, మాంధాతల ప్రభావంతో సమానం. నీ తేజస్సు సూర్యభగవానుడి ప్రచండతేజస్సు వంటిది. పితామహుడు అయిన భీష్మాచార్యునివలె ఉత్తమోత్తమ నియమవ్రతుడవు. (13)
వాల్మీకివత్ తే నిభృతం స్వవీర్యం
వసిష్ఠవత్ తే నియతశ్చ కోపః ।
ప్రభుత్వమింద్రత్వసమం మతం మే
ద్యుతిశ్చ నారాయణవద్ విభాతి ॥ 14
మహర్షి వాల్మీకిలాగా నీలో అద్భుత పరాక్రమం దాగి ఉంది. వసిష్ఠమహర్షి లాగా నీ కోపం నీ వశంలోనే ఉంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుని వలె ఉన్నదని నా అభిప్రాయం. నీ కాంతి విష్ణుమూర్తిని తలపిస్తోంది. (14)
యమో యథా ధర్మవినిశ్చయజ్ఞః
కృష్ణో యథా సర్వగుణోపపన్నః ।
శ్రియాం నివాసోఽసి యథా వసూనాం
నిధానభూతోఽసి తథా క్రతూనామ్ ॥ 15
నీవు యమధర్మరాజులాగా ధర్మనిశ్చయం తెలిసిన వాడివి. భగవంతుడైన శ్రీకృష్ణునివలె సకల సద్గుణ సంపన్నుడవు. వసువుల వలె నీవు మహాసంపన్నుడవు. ఆ విధంగానే యజ్ఞనిర్వహణలో నీవు నిధివే. (15)
దంభోద్భవేనాసి సమో బలేన
రామో యథా శాస్త్రవిదస్త్రవిచ్చ ।
ఔర్వత్రితాభ్యామసి తుల్యతేజాః
దుష్ప్రేక్షణీయోఽసి భగీరథేవ ॥ 16
మహారాజా! నీవు దంభోద్భవునిలాగా మహాబలశాలివి. అస్త్రశస్త్ర విద్యలలో నీవు పరశురామునితో సమానుడివి. ఔర్వుడు, త్రితుడు అనేవారి తేజస్సుతో నీ తేజస్సు సమానం. భగీరథమహారాజువలె నీవు దుష్ప్రేక్షణీయుడవు. (16)
1. దంభోద్భవుడు: పూర్వం ఒక సార్వభౌముడితడు. బలగర్వితుడై ఉండేవాడు. వాని గర్వాన్ని నరనారాయణులు పోగొట్టారు. అప్పటి నుండి అతడు బ్రాహ్మణభక్తి కలిగి ఉండేవాడు. గర్వం పోయిన దంభోద్భవునితో ఇచట పోలిక (ఉద్యో-96)
2. రాముడు: పరశురాముడు. జమదగ్ని పుత్రుడు. రాజులందరినీ 21 మారులు సంహరించినవాడు.
3. ఔర్వుడు: చ్యవన మహర్షి పుత్రుడు. భృగువంశస్థులందరినీ కృతవీర్యవంశజులు చంపుతుంటే తల్లి తన గర్భాన్ని తొడలో దాచుకొంది. ఆ తరువాత అతడు తల్లి ఊరువు (తొడ) నుండి ఉద్భవించి, కృతవీర్యవంశజులను అంధులుగా చేశాడు. అతని కోపాన్ని ఉపసంహరించుకొమ్మని పితృదేవతలు కోరితే ఆ కోపాగ్నిని సముద్రంలో దాచాడు. అదే బడబాగ్ని - (ఆది-181)
4. త్రితుడు: ఒక మహర్షి. ఏకతుడు, ద్వితుడు, త్రితుడు - వీరుమువ్వురూ సోదరులు.
5. భగీరథుడు: సగరవంశజుడు. సగరపుత్రుల ఉత్తమగతి కొరకు గంగను భూమికి తీసుకొని వచ్చిన మహనీయుడు.
సౌతిరువాచ
ఏవం స్తుతాః సర్వ ఏవ ప్రసన్నా
రాజా సదస్యా ఋత్విజో హవ్యవాహః ।
తేషాం దృష్ట్వా భావితానీంగితాని
ప్రోవాచ రాజా జనమేజయోఽథ ॥ 17
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఆస్తీకుడు ఈవిధంగా యాగానికి యజమాని అయిన జనమేజయమహారాజును, ఆ యాగశాలలోని సభ్యులను, ఋత్విజులను, అగ్నిదేవుని, ఇలా అందరినీ స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకొన్నాడు. జనమేజయుడు వారి అందరి భావాల్ని తెలుసుకొనడానికి వారితో ఈ విధంగా అంటున్నాడు. (17)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పసత్రే ఆస్తీకకృతరాజస్తవే పంచపంచాశత్తమోఽధ్యాయః ॥ 55 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పయాగమున ఆస్తీకస్తుతి అను ఏబది ఐదవ అధ్యాయము. (55)