37. ముప్పది యేడవ అధ్యాయము

వాసుకి మొదలగువారు సమాలోచనము చేయుట.

సౌతిరువాచ
మాతుః సకాశాత్ తం శాపం శ్రుత్వా వై పన్నగోత్తమః ।
వాసుకిశ్చింతయామాస శాపోఽయం న భవేత్ కథమ్ ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. నాగులకు తల్లియైన కద్రువ ఇచ్చిన శాపాన్ని విన్న వాసుకి "ఈ శాపాన్ని ఎలా తప్పించాలి" అని ఆలోచించాడు. (1)
తతః స మంత్రయామాస భ్రాతృభిః సహ సర్వశః ।
ఐరావతప్రభృతిభిః సర్వధర్మపరాయణైః ॥ 2
అనంతరం ఐరావతుడు మొదలైన ధర్మపరాయణులైన సోదరుల్ని, బంధువుల్ని పిలిచి శాపాన్నుండి తప్పించు కొనడానికి వాసుకి వారందరితో ఆలోచన చేశాడు. (2)
వాసుకి రువాచ
అయం శాపో యథోద్దిష్టే విదితం వస్తథానఘాః ।
తస్య శాపస్య మోక్షార్థే మంత్రయిత్వా యతామహే ॥ 3
సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే ।
న తు మాత్రాభిశప్తానాం మోక్షః క్వచన విద్యతే ॥ 4
వాసుకి ఇలా అన్నాడు. మనకు తల్లి ఇచ్చిన శాపం అందరికీ తెలుసుగదా! ఆ శాపం నుండి విముక్తి పొందడానికి అందరం కలిసి ఆలోచించి ప్రయత్నిద్దాం. అందరి శాపాలకూ విరుగుడు ఉంటుంది. కాని తల్లి ఇచ్చిన శాపానికి ఎక్కడా ప్రతీకారం లేదు గదా! (3,4)
అవ్యయస్యాప్రమేయస్య సత్యస్య చ తథాగ్రతః ।
శప్తా ఇత్యేవ మే శ్రుత్వా జాయతే హృది వేపథుః ॥ 5
అవినాశి, అప్రమేయుడు, సత్యస్వరూపుడు అయిన బ్రహ్మదేవుని ఎదుటనే తల్లి మనకు శాపం ఇచ్చింది. ఈ మాట వింటే నా హృదయం వణికిపోతున్నది. (5)
నూనం సర్వవినాశోఽయమ్ అస్మాకం సముపాగతః ।
న హ్యేతాం సోఽవ్యయో దేవః శపంతీం ప్రత్యషేధయత్ ॥ 6
మనం అందరం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. ఎందుకంటే మన తల్లి ఈ శాపాన్ని బ్రహ్మ కూడా ప్రతిషేధించలేదుగదా! (6)
తస్మాత్ సమ్మంత్రయామోఽద్య భుజంగావామనామయమ్ ।
యథా భవేద్ధి సర్వేషాం మా నః కాలోఽత్యగాదయమ్ ॥ 7
సర్వ ఏవ హి నస్తావద్ బుద్ధిమంతో విచక్షణః ।
అపి మంత్రయమాణా హి హేతుం పశ్యామ మోక్షణే ॥ 8
యథా నష్టం పురా దేవాః గూఢమగ్నిం గుహాగతమ్ ॥
ఆ కారణంచేత మనమందరం చక్కగా ఆలోచించుదాం. ఈ పాములన్నిటికీ శుభం కలిగేటట్లు ఆలోచిద్దాం-ఆలస్యం చేయకూడదు. మనలో బుద్ధిమంతులు, ఉపాయాన్ని ఆలోచించే నేర్పరులూ ఉన్నారు. మనమందరం కలిసి ఆలోచిస్తే తప్పకుండా ఈ కష్టంనుండి బయటపడగలం. పూర్వం దేవతలందరు కలిసి గుహ నుండి వెలువడిన అగ్ని నుండి రక్షించుకొన్న విధంగా మనం మనల్ని రక్షించుకోవాలి. (7,8 1/2)
యథా స యజ్ఞో న భవేద్ యథా వాపి పరాభవః ।
జనమేజయస్య సర్పాణాం వినాశకరణాయ వై ॥ 9
"సర్పవినాశనానికి జనమేజయుడు ప్రారంభించే ఆ సర్పయాగం జరగకుండా ఏం చెయ్యాలి-లేదా సర్పయాగానికి ఎలా విఘ్నం కలిగించాలి?" అని ఆలోచిద్దాం. (9)
సౌతిరువాచ
తథేత్యుక్త్వా తతః సర్వే కాద్రవేయాః సమాగతాః ।
సమయం చక్రిరే తత్ర మంత్రబుద్ధి విశారదాః ॥ 10
వాసుకి చెప్పిన మాటలను అంగీకరించి కద్రూ పుత్రులంతా సమావేశమయ్యారు. అక్కడ వారు ఆలోచనాపరులయిన బుద్ధిమంతులవడంతో వారు ఒక నిశ్చయానికి వచ్చారు. (10)
ఏకే తత్రాబ్రువన్ నాగాః వయం భూత్వా ద్విజర్షభాః ।
జనమేజయం తు భిక్షామః యజ్ఞస్తే న భవేదితి ॥ 11
ఆ సమయంలో కొందరు ఇలా చెప్పారు. "మనం బ్రాహ్మణవేషంలో జనమేజయుడి దగ్గరకు భిక్షుకరూపంలో వెళ్లి యజ్ఞం జరుపవద్దని ప్రార్థిద్దాం" అన్నారు. (11)
అపరే త్వబ్రువన్ నాగాః తత్ర పండితమానినః ।
మంత్రిణోఽస్య నయం సర్వే భవిష్యామః సుసమ్మతాః ॥ 12
మరికొందరు ఇలా అన్నారు. "మనలో మహాపండితు-లనుకొనేవారు అతనికి మంత్రులుగా చేరుదాం. నమ్మకం కలిగించేట్టుగా ప్రవర్తిద్దాం. (12)
స నః ప్రక్ష్యతి సర్వేషు కార్యేష్వర్థవినిశ్చయమ్ ।
తత్ర బుద్ధిం ప్రదాస్యామః యథా యజ్ఞో నివర్త్స్యతి ॥ 13
ఆ జనమేజయుడు కార్యసిద్ధికోసం మనలను సలహ అడిగినప్పుడు యజ్ఞం జరుపకుండా సలహా ఇచ్చి నివారిద్దాము. (13)
స నో బహుమతాన్ రాజా బుద్ధ్యా బుద్ధిమతాం వరః ।
యజ్ఞార్థం ప్రక్ష్యతి వ్యక్తం నేతి వక్ష్యామహే వయమ్ ॥ 14
బుద్ధిమంతులలో ఉత్తముడయిన రాజు చాలామందికి ఇష్టులయిన మనలను యజ్ఞంకోసం అడుగుతాడు. అపుడు మనం వద్దని చెపుదాం. (14)
దర్శయంతో బహూన దోషాన్ ప్రేత్య చేహ చ దారుణాన్ ।
హేతుభిః కారణైశ్చైవ యథా యజ్ఞో భవేన్న సః ॥ 15
ఆ విధంగా సలహా అడిగినప్పుడు ఆ యజ్ఞం గురించి అనేక భయంకరమైన దోషాలున్నాయని చెప్పి, ఏవేవో కారణాల్ని చూపిస్తూ సర్పయాగాన్ని జరుగకుండా చూద్దాం. (15)
అథవా య ఉపాధ్యాయః క్రతోస్తస్య భవిష్యతి ।
సర్పసత్రవిదానజ్ఞః రాజకార్యహితే రతః ॥ 16
తం గత్వా దశతాం కశ్చిద్ భుజంగః స మరిష్యతి ।
తస్మిన్ మృతే యజ్ఞకారే క్రతుః స న భవిష్యతి ॥ 17
లేదా సర్పయాగ విధానం తెలిసి, రాజకార్యం చేయాలనుకొనే యాగోపాధ్యాయుని మనం కాటువేస్తే అతడు చనిపోతాడు. యజ్ఞం చేయించే అతడు చనిపోతే యజ్ఞం జరుగదు. (17)
యే చాన్యే సర్పసత్రజ్ఞాః భవిష్యంత్యస్య చర్త్విజః ।
తాంశ్చ సర్వాన్ దశిష్యామః కృతమేవం భవిష్యతి ॥ 18
ఇంకా ఎవరైనా సర్పయాగాన్ని చేయించే బ్రాహ్మణులు ఉంటే వారిని అందరినీ కరిచి చంపేద్దాం. అపుడు సర్పయాగం చేయించేవారే ఉండరు. ఆ విధంగా యాగాన్ని నివారిద్దాం" అని కొందరు సలహా ఇచ్చారు. (18)
అపరే త్వబ్రువన్ నాగాః ధర్మాత్మానో దయాలవః ।
అబుద్ధిరేషా భవతాం బ్రహ్మహత్యా న శోభనమ్ ॥ 19
దయాళురూ, ధర్మాత్ములూ అయిన కొందరు నాగులు వారి మాటల్ని ఖండిస్తూ ఇట్లా అన్నారు. "మీరు చెప్పిన ఆలోచన సమంజసం కాదు. బ్రహ్మహత్య ఎన్నటికినీ శుభప్రదం కాదు. అది మహాపాపం. (19)
సమ్యక్సద్ధర్మమూలా వై వ్యసనే శాంతిరుత్తమా ।
అదర్మోత్తరతా నామ కృత్స్నం వ్యాపాదయేజ్జగత్ ॥ 20
ఆపద సమయంలో శాంతంగా మంచి ఆలోచన చేయాలి. ఉత్తమధర్మాన్ని అనుసరిస్తూ ఆలోచించాలి. కష్టాల్ని పోగొట్టుకొనడానికి ఒకదాని తరువాత మరొక అధర్మాన్ని ఆచరిస్తే ప్రపంచమే నాశనం అవుతుంది. (20)
అపరే త్వబ్రువన్ నాగాః సమిద్ధం జాతవేదసమ్ ।
వర్షైర్నిర్వాపయిష్యామః మేఘా భూత్వా సువిద్యుతః ॥ 21
మరికొందరు నాగులు ఈ విధంగా సలహా ఇచ్చారు. "మనం అందరం కామరూపులంగాబట్టి విద్యుత్తుతో కూడిన మేఘాలుగా మారి ఆ యాగాగ్నిలో వర్షిస్తే యజ్ఞం జరుగదు కదా! (21)
స్రుగ్భాండం నిశి గత్వా చ అపరే భుజగోత్తమాః ।
ప్రమత్తానాం హరంత్వాశు విఘ్న ఏవం భవిష్యతి ॥ 22
యజ్ఞంలో ఉపయోగించే స్రుగ్భాండం రాత్రి వెళ్లి అపహరిద్దాం. అపుడు ఆ యాగానికి విఘ్నం కలుగుతుందికదా! (22)
యజ్ఞే నా భుజగా స్తస్మిన్ శతశోఽథ సహస్రశః ।
జనాన్ దశంతు వై సర్వే నైవం త్రాసో భవిష్యతి ॥ 23
అంతేకాదు. ఆ యాగానికి వచ్చిన వందలు, వేల జనాన్ని మనం అంతా కరిచి బాధించుదాం. అపుడు మనకు యజ్ఞభయం కలగదు. (23)
అథవా సంస్కృతం భోజ్యం దూషయంతు భూజంగమాః ।
స్వేమ మూత్రపురీషేణ సర్వభొజ్యవినాశినా ॥ 24
లేనిపక్షంలో అక్కడ ఉన్న భుజింపదగిన పదార్థాలన్నింటి మీద మలమూత్రాల్ని విసర్జించి కలుషితం చేద్దాం. అపుడా భోజన పదార్థాలు పనికి రాకుండాపోతాయి." (24)
అపరే త్వబ్రువ్వంస్తత్ర ఋత్విజోఽస్య భవామహే ।
యజ్ఞవిఘ్నం కరిష్యామః దీయతాం దక్షిణా ఇతి ॥ 25
వశ్యతాం చ గతోఽసౌ నః కరిష్యతి యతేప్సితమ్ ।
మరికొందరు "మనమే యజ్ఞం చేయించే ఋత్విక్కులుగా ఉండి దక్షిణగా యాగాన్ని నిలుపుకొని కోరుదాం. ఆ రాజు మన కోరికను మన్నించి యజ్ఞాన్ని ఆపు చేస్తాడు" అన్నారు. (25 1/2)
అపరేత్వబ్రువంస్తత్ర జలే ప్రక్రీడితం నృపమ్ ॥ 26
గృహమానీయ బధ్నీమః క్రతురేవం భవేన్న సః ।
మరికొందరు ఇట్లా అన్నారు. "జనమేజయుడు జలక్రీడలాడే సమయంలో అతనిని బంధించి తీసుకువస్తే యాగం భగ్నం అవుతుంది". (26 1/2)
అపరే త్వబ్రువంస్తత్ర నాగాః పండితమానినః ॥ 27
దశామస్తం ప్రగృహ్యాశు కృతమేనం భవిష్యతి ।
భిన్నం మూలమనర్థానాం మృతే తస్మిన్ భవిష్యతి ॥ 28
మరికొందరు పండితులమనుకొనేవారు "అతడిని ఆ విధంగా బంధించి తెచ్చినపుడు అతనిని కరిచి చంపుదాం. మనకార్యం సఫలం అవుతుంది. మన కష్టాలన్నీ తొలగిపోతాయి" అన్నారు. (27,28)
ఏషా నో వైష్ఠికీ బుద్ధిః సర్వేషామీక్షణశ్రవః ।
అథ యన్మన్యసే రాజన్ ద్రుతం తత్ సంవిధీయతామ్ ॥ 29
"సోదరా! నాగరాజా! మేము అందరం ఈ విధంగా ఆలోచించి, నిశ్చయించి ఈ ఉపాయాల్ని చెప్పాం. ఇవి నీకు సమ్మతం కాకపోతే నీ అభిప్రాయం చెప్పు" అని నాగులందరు వాసుకితో అన్నారు. (29)
ఇత్యుక్త్వా సముదైక్షంత వాసుకిం పన్నగోత్తమమ్ ।
వాసుకిశ్చాపి సంచింత్య తానువాచ భుజంగమాన్ ॥ 30
ఈ విధంగా వారందరు చెప్పి వాసుకి అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నారు. అపుడు వాసుకి బాగా ఆలోచించి వారి అందరితో ఈ విధంగా అన్నాడు. (30)
నైషా వో వైష్ఠికీ బుద్ధిః మతా కర్తుం భుజంగమాః ।
సర్వేషామేవ మే బుద్ధిః పన్నగానాం న రోచతే ॥ 31
"పన్నగులారా! మీరు అందరు చెప్పిన ఆలోచన ఆచరణ యోగ్యంగా లేదు. నేను చెప్పే ఆలోచన కూడా మీకు సమ్మతం కాకపోతే అది కూడా ఆచరణ యోగ్యం కాదు. (31)
కిం తత్ర సంవిధాతవ్యం భవితాం స్యాద్ధితం తు యత్ ।
శ్రేయః ప్రసాధనం మన్యే కశ్యపస్య మహాత్మనః ॥ 32
ఈ పరిస్థితిలో మీ అందరి మేలుకోరి నేను చెపుతున్నాను. మనం మన తండ్రిగారైన కశ్యపప్రజాపతి దగ్గరకు వెళ్లి శాపప్రతీకారం చెప్పుమని ప్రార్థించుదాం. మనకు తప్పకుండా శుభం జరుగుతుంది. (32)
జ్ఞాతివర్గస్య సౌహార్ధాత్ ఆత్మనశ్చ భుజంగమాః ।
న చ జానాతి మే బుద్ధిః కించిత్ కర్తుం వచో హి వః ॥ 33
నాగులారా! మన వారందరి మేలుకోరి మీరందరు చెప్పిన మాటలవల్ల ఏమి చేయాలో తోచటంలేదు. (33)
మయా హీదం విధాతవ్యం భవతాం యద్ధితం భవేత్ ।
అనేనాహం భృశం తప్యే గుణదోషౌ మదాశ్రయౌ ॥ 34
మీకు అందరికీ మేలుకలుగునట్లుగా చేయాలి. ఏ తప్పు చేసినా మీ అందరికంటె పెద్దవాడినైన నాదే బాధ్యతగదా! కాబట్టి గుణదోషాల్ని బాగా ఆలోచించి కార్యసాధనకు పూనుకోవాలి." (34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి వాసుక్యాదిమంత్రణే సప్తత్రింశోఽధ్యాయః ॥ 37 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున వాసుక్యాదిమంత్రణము అను ముప్పది యేడవ అధ్యాయము. (37)