36. ముప్పది ఆరవ అధ్యాయము
శేషుని తపస్సు - బ్రహ్మ వరములిచ్చుట.
శౌనక ఉవాచ
ఆఖ్యాతా భుజగాస్తాత వీర్యవంతో దురాసదాః ।
శాపం తం తేఽభివిజ్ఞాయ కృతవంతః కిముత్తరమ్ ॥ 1
శౌనకుడు ఇలా చెప్పాడు. "మహాపరాక్రమవంతులైన నాగుల్ని మీరు వర్ణించారు. తల్లియైన కద్రువ తన బిడ్డలకు శాపం ఇచ్చిన తరువాత మహాసర్పాలు ఆ శాపాన్నుంచి తప్పించుకొనడానికి ఏం చేశాయి?" (1)
సౌతిరువాచ
తేషాం తు భగవాన్ శేషః కద్రూం త్యక్త్వా మహాయశాః ।
ఉగ్రం తపః సమాతస్థే వాయుభక్షో యతవ్రతః ॥ 2
ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు. శౌనక! ఆ సర్పాలందరిలో ఉత్తమోత్తముడయిన శేషుడు తల్లిని వీడి కఠోరమైన తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు. కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నియమబద్ధంగా తపస్సు చేయసాగాడు. (2)
గంధమాదనమాసాద్య బదర్యాం చ తపోరతః ।
గోకర్ణే పుష్కరారాణ్యే తథా హిమవతస్తటే ॥ 3
తేషు తేషు చ పుణ్యేషు తీర్థేష్వాయతనేషు చ ।
ఏకాంతశీలో నియతః సతతం విజితేంద్రియః ॥ 4
ఆ శేషుడు జితేంద్రియుడై గంధమాదనపర్వతానికి వెళ్లి బదరికాశ్రమంలో తపస్సుచేయటం ప్రారంభించాడు. ఆ తరువాత అనేక పుణ్యతీర్థాల్లోను, దేవాలయాల్లోను ఏకాంతంగా, నియమబద్ధంగా తపస్సు చేశాడు. (3,4)
తప్యమానం తపో ఘోరం తం దదర్శ పితామహః ।
సంశుష్కమాంసత్వక్స్నాయుం జటాచీరధరం మునిమ్ ॥ 5
ఘోరమయిన తపస్సు చేస్తూ జడలూ వల్కలాలూ దాల్చి, శరీరాన్ని శుష్కింపజేసుకొన్న శేషునికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. (5)
తమబ్రవీత్ సత్యధృతిం తప్యమానం పితామహః ।
కిమిదం కురుషే శేష ప్రజానాం స్వస్తి వై కురు ॥ 6
"శేషుడా! ఎందుకు ఈ విధంగా తపస్సుచేస్తున్నావు? నీకోరిక ఏమిటి? ప్రాణి కోటికి మేలు చేయి. (6)
త్వం హి తీవ్రేణ తపసా ప్రజాస్తపయసేఽనఘ ।
బ్రూహి కామం చ మే శేష యస్తే హృది వ్యవస్థితః ॥ 7
ఈ తీవ్రమైన తపస్సువలన ప్రాణికోటికి బాధ కల్గుతున్నది. పుణ్యాత్మా! నీమనస్సులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు" అని అడిగాడు. (7)
శేష ఉవాచ
సోదర్యా మమ సర్వే హి భ్రాతరో మందచేతనః ।
సహ తైర్నోత్సహే తద్ భవానమమవ్యతామ్ ॥ 8
"సర్వలోకపితామహా! నా సోదరులందరు మందబుద్ధులు. ఆ కారణంగా వారి దగ్గర ఉండటానికి ఇష్టపడను. మీరు నా ఈ కోరికను అంగీకరించండి. (8)
అభ్యసూయంతి సతతం పరస్పరమమిత్రవత్ ।
తతోఽహం తప ఆతిష్ఠం నైతాన్ పశ్యేయమిత్యుత ॥ 9
నా సోదరులు పరస్పరం శత్రుభావంతో దెబ్బలాడు కొంటున్నారు. అందుచేత వారిని చూడకూడదని తపస్సు చేసుకొంటున్నాను. (9)
న మర్షయంతి ససుతాం సతతం వివతాం చ తే ।
అస్మాకం చాపరో భ్రాతా వైనతేయేఽంతరిక్షగః ॥ 10
నాగులయిన నా సోదరులు పుత్రసహిత అయిన వినతను చూసి సహించలేరు. మాకు మరో సోదరుడు ఆకాశచారి అయిన గరుడుడు. (10)
తం చ ద్విషంతి సతతం స చాపి బలవత్తరః ।
వరప్రదానాత్ స పితుః కశ్యపస్య మహాత్మనః ॥ 11
ఆ గరుడునితో నాగులందరు ద్వేషభావంతో ఉంటారు. ఆ సువర్ణుడు మా తండ్రిగారి వరంవల్ల మహాపరాక్రమ వంతుడుగా ఉన్నాడు. (11)
సోఽహం తసః సమాస్థాయ మోక్ష్యామీదం కలేబరమ్ ।
కథం మే ప్రేత్యభావేఽసి న తైః స్యాత్ సహ సంగమః ॥ 12
ఈ కారణంవల్ల తపస్సు చేసుకొంటూ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకొన్నాను. తరువాత కూడా వాళ్లతో కలిసి ఉండటానికి నేను ఇష్టపడను. (12)
తమేవం వాదినం శేషం పితామహ ఉవాచ హ ।
జానామి సేష సర్వేషాం భ్రాతృణాం తే విచేష్టితమ్ ॥ 13
ఇలా అంటున్న్ శేషునితో బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు. "నాయనా శేషా! నీ తపస్సుకు సంతోషిస్తున్నాను. నీ సోదరులందరి చెడునడతలు నాకు తెలుసు. (13)
మాతుశ్చాప్యపరాభాత్ వై భ్రాతౄణాం తే మహద్ భయమ్ ।
కృతోఽత్ర పరిహారశ్చ పూర్వమేవ భుజంగమ ॥ 14
నీ తల్లి కద్రువ ఇచ్చిన శాపంవల్ల వాళ్లందరు భయభ్రాంతులుగా ఉన్నారు. ఈ శాపం యొక్క పరిహారాన్ని కూడా నేను పూర్వమే చేసిపెట్టాను. (14)
భ్రాతౄణాం తవ సర్వేషాం న శోకం కర్తుమర్హసి ।
వృణీష్వ చ వరం మత్తః శేష యత్ఽభికాంక్షితమ్ ॥ 15
నీ సోదరుల కోసం నీవు విచారించవద్దు. నీవు నీకు కావలసిన వరాన్ని కోరుకో. (15)
దాస్యామి హి వరం తేఽద్య ప్రీతిర్మే పరమా త్వయి ।
దిష్ట్యా బుద్ధిశ్చ తే ధర్మే నివిష్టా పన్నగోత్తమ ।
భూయో భూయశ్చ తే బుద్ధిః ధర్మే భవతు సుస్థిరా ॥ 16
ఇపుడే నీకు వరమిస్తాను. నీయందు నాకు చాలా ప్రీతి ఉంది. నీ ధర్మబుద్ధికి నాకు చాలా సంతోషం కలిగింది. నీ బుద్ధి ఇదే విధంగా ఎప్పుడూ ధర్మబద్ధమై ఉండుగాక! (16)
శేష ఉవాచ
ఏష ఏవ వరో కాంక్షితో మే పితామహ ।
ధర్మే మే రమతాం బుద్ధిః శమే తపసి చేశ్వర ॥ 17
శేషుడు ఇలా ప్రార్థించాడు. "మహానుభావా! పరమేశ్వరా! పితామహా! ఇదే నేను కోరే వరం. నా బుద్ధి ఎప్పుడూ ధర్మము నందే నిలిచియుండు నట్లుగాను, నిరంతరం నాబుద్ధి శమమందు, తపస్సునందుగాను లగ్నమగునట్లు వరమిమ్ము." (17)
బ్రహ్మోవాచ
ప్రీతోఽస్మ్యనేవ తే శేష దమేన చ శమేన చ ।
త్వయా త్విదం వచః కార్యం మన్నియోగాత్ ప్రజాహితమ్ ॥ 18
బ్రహ్మ ఇట్లన్నాడు. "శేషుడా! నీ శమదమాలకు చాలా సంతోషం కల్గింది. ఇపుడు నా ఆజ్ఞప్రకారం ప్రజలకు ఉపకారం జరిగే పని చేయి. (18)
ఇమాం మహీం శైలవనోపపన్నాం
ససాగరగ్రామవిహారపత్తనామ్ ।
త్వం శేష సమ్యక్ చలితాం యథావత్
సంగృహ్య తిష్ఠస్వ యథాచలా స్యాత్ ॥ 19
శేషుడా! పర్వతాలతోను, అడవులతోను, సముద్రాలతోను, గ్రామాలతోను, విహారాలతోను, పట్టణాలతోను కూడిన ఈ భూమి ఎప్పుడూ చలిస్తూ ఊగుతూ ఉన్నది. నీవు భూభారం వహించి నిశ్చలంగా ఉండేటట్లు మోస్తూ ఉండు." (19)
శేష ఉవాచ
యథాహ దేవో వరదః ప్రజాపతిః
మహీపతిర్భూతపతిర్జగత్పతిః ।
తథా మహీం ధారయితాస్మి నిశ్చలాం
ప్రయచ్ఛతాం మే శిరసి ప్రజాపతే ॥ 20
శేషుడు ఇలా అన్నాడు. స్వామీ! నీవు అందరి కోరికలు తీర్చే వరదుడవు. సమస్త ప్రజలను పాలించేవాడవు. ఈ భూమికి రక్షకుడివి. సమస్త ప్రాణికోటికి అధిపతివి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. తప్పక భూభారాన్ని మోస్తాను. నిశ్చలంగా భూమిని ఉంచుతాను. ఈ భూమిని నా శిరస్సుపై ఉంచండి. (20)
బ్రహ్మోవాచ
అథో మహీం గచ్ఛ భుజంగమోత్తమ
స్వయం తవైషా వివరం ప్రదాస్యతి ।
ఇమాం ధరాం ధారయతా త్వయా హి మే
మహత్ ప్రియం శేష కృతం భవిష్యతి ॥ 21
అపుడు బ్రహ్మ ఇలా అన్నాడు. "మహానాగా! శేషా! నీవు ఈ భూమికి క్రింది భాగానికి వెళ్లు. నీవు అలా వెళ్లడానికి అది నీకు మార్గాన్ని ఇస్తుంది. ఆ దారిలో నీవు పాతాళానికి వెళ్లి అక్కడ భూమి క్రింద నీ శరీరాన్ని ఉంచి నిశ్చలంగా ఉంటూ మోయి. ఈ భూభారాన్ని నీవు వహించడం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది." (21)
సౌతిరువాచ
తథైవ కృత్వా వివరం ప్రవిశ్య స
ప్రభుర్భువో భుజగవరాగ్రజః స్థితః ।
బిభర్తి దేవీం శిరసా మహీమిమాం
సముద్రనేమిం పరిగృహ్య సర్వతః ॥ 22
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. నాగులలో పెద్దవాడు, సర్వసమర్థుడూ అయిన శేషుడు బ్రహ్మదేవుడు మెచ్చుకొనే విధంగా సముద్రం ఇచ్చిన మార్గం ద్వారా భూమిలో ప్రవేశించి శిరసుపై భూమాతను ధరించాడు. (22)
బ్రహ్మోవాచ
శేషోఽసి నాగోత్తమ ధర్మదేవః
మహీమిమాం ధారయసే యదేకః ।
అనంతభోగైః పరిగృహ్య సర్వః
యథాహమేవం బలభిద్ యథా వా ॥ 23
బ్రహ్మ ఇట్లా అంటున్నాడు. "నాగరాజా! నీవు శేషుడవు. ధర్మమే నీకు ఆరాధ్యదేవత. నీవు ఒక్కడవే అనేకమైన పడగలతో ఈ భూమిని అంతటినీ నాలాగా, ఇంద్రుడిలాగా భరిస్తున్నావు." (23)
సౌతిరువాచ
అధో భూమో వసత్యేవం నాగోఽసంతః ప్రతాపవాన్ ।
ధారయన్ వసుధామేకః శాసనాద్ బ్రహ్మణో విభుః ॥ 24
ఉగ్రశ్రవుడు ఇలా అంటున్నాడు. శౌనకమునీంద్రా! ఇలా ప్రతాపశాలి అయిన అనంతుడు బ్రహ్మ ఆజ్ఞప్రకారం ఈ భూమి నంతటినీ మోస్తూ పాతాళలోకంలో నివసిస్తున్నాడు. (24)
సుపర్ణే చ సహాయం వై భగవానమరోత్తమః ।
ప్రాదాదనంతాయ తదా వైనతేయం పితామహః ॥ 25
శేషునికి సహాయకుడుగా మిత్రునిగా ఉండవలసినదని గరుడుని పిలిచి చెప్పి శేషునితో చెలిమికి కారకుడయ్యాడు. (25)
(అనంతే చ ప్రయాతే తు వాసుకిః సుమహాబలః ।
అభ్యషిచ్యత నాగైస్తు దైవతైరివ వాసవః ॥)
(అనంతుడు వెళ్లిన తరువాత దేవతలందరూ ఇంద్రుని అభిషేకించినట్లుగా సర్పాలన్నీ వాసుకిని నాగరాజుగా అభిషేకించాయి.)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి శేషవృత్తకథనే షట్ త్రింశోఽధ్యాయః ॥ 36 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వము అను ఉపపర్వమున శేషుని వృత్తాంతము అను ముప్పది ఆరవ అధ్యాయము. (36)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకము కలుపుకొని మొత్తం 26 శ్లోకాలు)