38. ముప్పది ఎనిమిదవ అధ్యాయము

ఏలాపత్రుని అభిప్రాయము.

సౌతిరువాచ
సర్పాణాం తు వచః శ్రుత్వా సర్వేషామితి చేతి చ ।
వాసుకేశ్చ వచః శ్రుత్వా ఏలాపత్రోఽ బ్రవీదిదమ్ ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. సర్పాలన్నీ చెప్పిన అభిప్రాయాలనూ, వాసుకి అభిప్రాయాన్నీ విన్న ఏలాపత్రుడు అనే సోదరుడు ఈ విధంగా అన్నాడు. (1)
వి: ఏలాపుత్రుడని పిపియస్ శాస్త్రి వావిళ్ల ప్రతి - నన్నయ కూడ.
న స యజ్ఞో న భవితా న స రాజా తథా విధః ।
జనమేజయః పాండవేయః యతోఽస్మాకం మహద్భయమ్ ॥ 2
మనం భయపడుతున్న జనమేజయుడు పాండవ వంశీయుడు. అతడటువంటి వాడు కాడు. ఆ యజ్ఞం జరుగదనేది లేదు. (2)
దైవేనోపహతో రాజన్ యో భవేదిహ పూరుషః ।
స దైవమేవాశ్రయతే నాన్యత్ తత్ర పరాయణమ్ ॥ 3
రాజా! ఈలోకంలో దైవోపహతుడు దైవాన్నే తప్పక శరణుకోరాలి. దైవంతప్ప వేరెవరూ దైవోపహతుని రక్షించలేరు. (3)
తదిదం చైవమస్మాకం భయం పన్నగసత్తమాః ।
దైవమేనాశ్రయామోఽత్ర శ్రుణుధ్వం చ వచో మమ ॥ 4
అహం శాపే సముత్సృష్టే సమశ్రౌషం వచస్తదా ।
మాత్రుత్సంగమారూఢః భయాత్ పన్నగసత్తమాః ॥ 5
దేవానాం పన్నగశ్రేష్ఠాః తీక్ష్ణాస్తీక్ష్ణా ఇతి ప్రభో ।
పితామహముసాగమ్య దుఃఖార్తానాం మహాద్యుతే ॥ 6
నాగరాజా! మనకు కలిగిన భయం దైవం వల్లనే కలిగింది. కాబట్టి మనం భగవంతునే ఆశ్రయించాలి. సర్పశ్రేష్ఠులారా! ఈ విషయంలో నేను చెప్పే ఈ మాటను వినండి. తల్లి కద్రువ మనకు శాపం ఇచ్చేటప్పుడు నేను ఆమె ఒడిలో నిదురపోయినట్లుండి శాపసమయంలో దేవతలకూ, బ్రహ్మకూ జరిగిన సంభాషణలను విన్నాను. దేవతలలో పన్నగులు చాలా తీవ్రస్వభావులు అనే మాట కూడ విన్నాను. (4-6)
దేవా ఊచుః
కా హి లబ్ధ్వా ప్రియాన్ పుత్రాన్ శపేదేవం పితామహ ।
ఋతే కద్రూం తీక్ష్ణరూపాం దేవదేవ తవాగ్రతః ॥ 7
దేవతలు బ్రహ్మతో ఈ విధంగా అన్నారు. పితామహా! దేవదేవా! మీ ముందు ఎపుడైనా ఏ స్త్రీ అయినా తన పుత్రులకు ఇంత కఠినంగా శాపం ఇచ్చిందా? (7)
తథేతి చ వచస్తస్యాః త్వయాప్యుక్తం పితామహ ।
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం కారణం యన్న వారితా ॥ 8
మీరు కూడా ఆ కద్రూశాపానికి అడ్డు చెప్పకుండా అనుమతించారే. దీనిని ఎందుకు నివారించలేదు. కారణాన్ని తెలుసుకోవాలని అనుకొంటున్నాము. (8)
బ్రహ్మోవాచ
బహనః పన్నగాస్తీక్ష్ణాః ఘోరరూపా విషోల్బణాః ।
ప్రజానాం హితకామోఽహం న చ వారితవాంస్తదా ॥ 9
బ్రహ్మ అన్నాడు. "అనేక సర్పాలు చాలా క్రూరమైనవి. తీక్ష్ణమైనవి విషపూరితాలు కూడా అవి. ప్రజలకు హితం కోరేవాడిని కాబట్టి అపుడు ఆ శాపం నివారించలేదు. (9)
యే దందశూకాః క్షుద్రాశ్చ పాపాచారా విషోల్బణాః ।
తేషాం వినాశో భవితా న తు యే ధర్మచారిణః ॥ 10
ఏ సర్పాలు నీచాలో పాపకర్ములో, విషపూరితులో అటువంటివారికే వినాశనంగాని ధర్మాచరణులు, ఉత్తములు అయిన సర్పాలకు ఎటువంటి హాని జరుగదు సుమా! (10)
యన్నిమిత్తం చ భవితా మోక్షస్తేషాం మహాభయాత్ ।
పన్నగానాం నిబోధన్యం తస్మిన్ కాలే సమాగతే ॥ 11
ఆ భయంకరయాగ సమయం వచ్చినపుడు తప్పకుండా ఉత్తమసర్పాలకు మోక్షం కలుగుతుంది. మీకు ఆ విషయాన్ని చెపుతాను. అందరు వినండి. (11)
యాయావరకులే థీమాన్ భవిష్యతి మహావృషిఆః ।
జరత్కారురితి ఖ్యాతః తపస్వీ నియతేంద్రియః ॥ 12
యాయావరవంశంలో జరత్కారుడు అనే పేరుగల గొప్ప ఋషీశ్వరుడు పుడతాడు. అతడు మహాతపస్వి. జితేంద్రియుడు. (12)
తస్య పుత్రో జరత్కారోః భవిష్యతి తపోధనః ।
ఆస్తీకో నామ యజ్ఞం స ప్రతిషేత్స్యతి తం తదా ।
తత్ర మోక్ష్యంతి భుజగా యే భవిష్యంతి ధార్మికాః ॥ 13
ఆ తపోధనుడైన జరత్కారునకు ఆస్తీకుడు అనే కుమారుడు ఉదయిస్తాడు. అతడు ఆ యజ్ఞం నివారిస్తాడు. ధర్మాత్ములైన నాగశ్రేష్ఠులు ఆ విధంగా శాపం నుండి బయటపడతారు." (13)
దేవా ఊచుః
స ముని ప్రవరో బ్రహ్మన్ జరత్కారుర్మహాతపాః ।
కస్యాం పుత్రం మహాత్మానం జనయిష్యతి వీర్యవాన్ ॥ 14
అపుడు దేవతలు మరల ఇలా ప్రశ్నించారు. దేవా! మునిశ్రేష్ఠుడు, మహాతపస్వి, శక్తిశాలి అయిన జరత్కారునకు ఎవరి గర్భంలో ఆస్తీకుడు జన్మిస్తాడు? (14)
బ్రహ్మోవాచ
సనామాయాం సనామా స కన్యాయాం ద్విజసత్తమః ।
అపత్యం వీర్యసంపన్నం వీర్యవాన్ జనయిష్యతి ॥ 15
బ్రహ్మ చెప్పాడు. ఈ జరత్కారునకు సనామ్ని అయిన కన్యతో వివాహం జరిగినప్పుడు ఆమెయందు శక్తి సంపన్నుడయిన కుమారుని కంటాడు. (15)
వాసుకేః సర్పరాజస్య జరత్కారుః స్వసా కిల ।
స తస్యాం భవితా పుత్రః శాపాన్నాగాంశ్చ మోక్ష్యతి ॥ 16
సర్పరాజైన వాసుకియొక్క సోదరి పేరు జరత్కారువు. ఆమెకు ఆస్తీకుడు జన్మించి నాగుల శాపాన్ని నివారిస్తాడు. (16)
ఏలాపత్ర ఉవాచ
ఏవమస్త్వితి తం దేవాః పితామహమథాబ్రువన్ ।
ఉక్త్వైవం వచనం దేవాన్ విరించిస్త్రిదివం యయౌ ॥ 17
ఏలాపత్రుడు చెప్పాడు. ఆ విధంగా జరుగుగాక అని దేవతలు బ్రహ్మకు చెప్పిన తరువాత బ్రహ్మ తనలోకానికి వెళ్లిపోయాడు. (17)
సోఽహమేవం ప్రపశ్యామి వాసుకే భగినీం తవ ।
జరత్కారురితి ఖ్యాతాం తాం తస్మై ప్రతిపాదయ ॥ 18
భైక్షవద్ భిక్షమాణాయ నాగానాం భయశాంతయే ।
ఋషయే సువ్రతాయైనామ్ ఏష మోక్షః శ్రుతో మయా ॥ 19
కావున సోదరా! వాసుకీ! సోదరియగు జరత్కారువును ఆ జరత్కారు మహర్షికిచ్చి వివాహం చేయడానికి యాచించవలసినది. ఆ విధంగా చేస్తే మనకు మోక్షం కలుగుతుంది. (18,19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఏలాపత్రవాక్యే అష్టత్రింశోఽధ్యాయః ॥ 38 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున ఏలాపత్రవాక్యము అను ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (38)