28. ఇరువది యెనిమిదవ అధ్యాయము

గరుడుడు అమృతమును తెచ్చుటకు వెళ్లుట.

సౌతిరువాచ
ఇత్యుక్తో గరుడః సర్పైః తతో మాతరమబ్రవీత్ ।
గచ్ఛామ్యమృతమాహర్తుం భక్ష్యమిచ్ఛామి వేదితుమ్ ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. సర్పాలు అమృతం కోరితే గరుత్మంతుడు తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు. "అమృతం తీసుకొని రావడానికి బయలు దేరుతున్నాను. నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పు" అని తన తల్లిని అడిగాడు. (1)
వినతోవాచ
సముద్రకుక్షావేకాంతే నిషాదాలయముత్తమమ్ ।
విషాదానాం సహస్రాణి తాన్ భుక్త్వామృత మానయ ॥ 2
వినత కుమారునితో ఇలా అంది. "నాయనా! సముద్ర మధ్యంలో ఒక బోయపల్లె ఉంది. అందులో వేలాది మంది నిషాదులు ఉన్నారు. వాళ్ళని ఆహారంగా భుజించి అమృతాన్ని తీసుకొనిరా. (2)
న చ తే బ్రాహ్మణం హంతుం కార్యా బుద్ధిః కథంచన ।
అవధ్యః సర్వభూతానాం బ్రాహ్మణో హ్యనలోపమః ॥ 3
ఆ నిషాదులలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే వానిని చంపకు. బ్రాహ్మణుడు అగ్నితో సమానం. ప్రాణికోటిలో బ్రాహ్మణుని చంపరాదు సుమా! (3)
అగ్నిరర్కో విషం శస్త్రం విప్రో భవతి కోపితః ।
గురుర్హి సర్వభూతానాం బ్రాహ్మణః పరికీర్తితః ॥ 4
అతడి కోపం అగ్నికంటె, విషం కంటె, కత్తి కంటె భయంకరమైనది. కాబట్టి అతని కోపాగ్ని నిన్ను దహించి వేస్తుంది. బ్రాహ్మణుడు సర్వప్రాణులకూ పూజనీయుడు సుమా. (4)
ఏవమాదిస్వరూపైస్తు సతాం వై బ్రాహ్మణో మతః ।
స తే తాత న హంతవ్యః సంక్రుద్ధేనాపి సర్వథా ॥ 5
బ్రాహ్మణుడు ఆదరింపదగినవాడు. కావున కుమారా! నీకు కోపం వచ్చినా కూడా అతడిని చంపదగదు. బ్రాహ్మణులకు అపకారం తలపెట్టరాదు. (5)
బ్రాహ్మణానామభిద్రోహః న కర్తవ్యః కథంచన ।
న హ్యేవమగ్నిర్నాదిత్యః భస్మ కుర్యాత్ తథానఘ ॥ 6
యథా కుర్యాదభిక్రుద్ధః బ్రాహ్మణః సంశితవ్రతః ।
తదేతైర్వివిధైర్లింగైః త్వం విద్యాస్తం ద్విజోత్తమమ్ ॥ 7
భూతానామగ్రభూర్విప్రః వర్ణశ్రేష్ఠః పితా గురుః ।
కాబట్టి బ్రాహ్మణులకు ఎప్పటికీ ద్రోహం తలపెట్టరాదు. అతడికి కోపం వస్తే అగ్ని కంటె, సూర్యుని కంటె అధికంగా భస్మం చేయగలడు. ఇటువంటి లక్షణాలతో ఉన్న వానిని విప్రునిగా గుర్తించు. అతడు ప్రాణులన్నిటికంటె ముందు ఉద్భవించినవాడు, తండ్రి, గురువు." (6,7 1/2)
గరుడ ఉవాచ
కిం రూపో బ్రాహ్మణో మాతః కిం శీలః కిం పరాక్రమః ॥ 8
గరుడుడు తల్లిని ప్రశ్నిస్తున్నాడు. "అమ్మా! బ్రాహ్మణుడు ఏ రూపంలో ఉంటాడు? అతని ప్రవర్తన ఎట్టిది? పరాక్రమం ఎలా ఉంటుంది? (8)
కిం స్విదగ్నినిభో భాతి కిం స్విత్ సౌమ్యప్రదర్శనః ।
యథాహమభిజానీయాం బ్రాహ్మణం లక్షణైః శుభైః ॥ 9
తన్మే కారణతో మాతః పృచ్ఛతో వక్తుమర్హసి ।
అతడు అగ్నిలాగా ఉంటాడా? లేక సౌమ్యుడుగా కనిపిస్తాడా? నేను బ్రాహ్మణుని ఏ శుభలక్షణాలతో గుర్తించాలి? అమ్మా! బ్రాహ్మణుని గుర్తించడానికి నాకు కారణంతో సహా ఉపాయం చెప్పు." (9 1/2)
వినతోవాచ
యస్తే కంఠమనుప్రాప్తః నిగీర్ణే బడిశం యథా ॥ 10
దహేదంగారవత్ పుత్ర తం విద్యాద్ బ్రాహ్మణర్షభమ్ ।
విప్రస్త్వయా న హంతవ్యః సంక్రుద్ధేనాపి సర్వదా ॥ 11
అపుడు వినత కుమారునితో ఇలా అంది. "నీవు మ్రింగినపుడు వాడు నీ కంఠబిలంలోకి పోకుండా అగ్నిలాగా దహిస్తూ ఉంటాడు. కుమారా! అట్టివానిని బ్రాహ్మణునిగా గుర్తించు. నీకు కోపం వచ్చినా బ్రాహ్మణుని చంపరాదు సుమా" అంది. (10,11)
ప్రోవాచ చైనం వినతా పుత్రహార్దాదిదం వచః ।
జఠరే న జీర్యేద్ యః తం జానీహి ద్విజోత్తమమ్ ॥ 12
వినత తన కుమారుడికి పుత్ర ప్రేమతో ఇంకా ఇలా చెప్పింది. 'నీ జఠరంలో జీర్ణం కాని వాడే బ్రాహ్మణుడు అని తెలుసుకో'. (12)
పునః ప్రోవాచ వినతా పుత్రహార్దాదిదం వచః ।
జానంత్యప్యతులం వీర్యమ్ ఆశీర్వాదపరాయణా ॥ 13
ప్రీతా పరమదుఃఖార్తా నగైర్విప్రకృతా సతీ ।
కుమారుని బలపరాక్రమాలు చాలా గొప్పవని తెలిసి, సర్పాలు చేసిన అపకారానికి దుఃఖితురాలై పుత్రప్రేమతో కుమారుని ఆశీర్వదించి ఇంకా ఇలా చెప్పింది. (13 1/2)
వినతోవాచ
పక్షౌ తే మారుతః పాతు చంద్రసూర్యౌ చ పృష్ఠతః ॥ 14
వినత అన్నది. "నాయనా! నీ రెక్కల్ని వాయుదేవుడు కాపాడుగాక! సూర్యచంద్రులు నీ వీపును రక్షించుగాక! (14)
శిరశ్చ పాతు వహ్నిస్తే వసవః సర్వతస్తనుమ్ ।
అహం చ తే సదా పుత్ర శాంతిస్వస్తిపరాయణా ॥ 15
ఇహాసీనా భవిష్యామి స్వస్తికార్యే రతా సదా ।
అరిష్టం వ్రజ పంథానం పుత్ర కార్యార్థసిద్ధయే ॥ 16
అగ్ని దేవుడు నీ శిరస్సును కాపాడుగాక! అష్టవసువులు నీ శరీర మంతటిని రక్షించుగాక! నేను ఇక్కడే ఉండి నీకు మేలుకలిగి, సుఖంగా కార్య సాధన చేసుకొని వచ్చేటందులకు ప్రార్థిస్తూ ఉంటాను. నీకు మార్గంలో సకల శుభాలూ కలుగుగాక. నీ కోరిక ప్రకారం కార్యాన్ని సాధించుకొని తిరిగిరా!" అని తల్లి ఆశీర్వదించింది. (15,16)
సౌతిరువాచ
తతః స మాతుర్వచనం నిశమ్య
వితత్య పక్షౌ నభ ఉత్పపాత ।
తతో నిషాదాన్ బలవానుపాగతః
ఋభుక్షితః కాల ఇవాంతకోఽపరః ॥ 17
ఉగ్రశ్రవుడు ఇలా చెప్పాడు. గరుత్మంతుడు తల్లి ఆశీర్వచనాన్ని పొంది రెక్కల్ని విప్పార జేసి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకలితో ఉన్న అతడు నిషాదుల పాలిట యమునిలాగా వారి దగ్గరకు చేరాడు. (17)
స తాన్ నిషాదానుపసంహరంస్తదా
రజఃసముద్ధూయ నభః స్పృశం మహత్ ।
సముద్రకుక్షౌ చ విశోషయన్ పయః
సమీపజాన్ భూధరజాన్ విచాలయన్ ॥ 18
నిషాదుల సంహార సమయంలో భూమి నుండి ఆకాశం దాకా అతని వేగానికి దుమ్ము రేగింది. సముద్రంలో నీరు కూడా ఎండిపోయింది. ఆ సమీపంలో ఉండే చెట్లు అన్నీ కదిలిపోయాయి. (18)
తతః స చక్రే మహదాననం తదా
నిషాదమార్గం ప్రతిరుధ్య పక్షిరాట్ ।
తతో నిషాదాస్త్వరితాః ప్రవవ్రజుః
యతో ముఖం తస్య భుజంగభోజినః ॥ 19
నిషాదుల దగ్గరకు చేరాక ఆ బోయలను తినడానికి నోరు తెరిచాడు. నిషాదులు పారిపోకుండా వారి మార్గాన్ని అడ్డగించాడు. వెంటనే అతని నోటిలోనికి నిషాదులందరూ చేరారు. (19)
తదాననం వివృతమతిప్రమాణవత్
సమభ్యయుర్గగనమివార్దితాః ఖగాః ।
సహస్రశః పవనరజో విమోహితాః
యథానిలప్రచలితపాదపే వనే ॥ 20
అతడి నోరు పెద్దగా తెరిచాడు. ఆ గరుడుని వేగానికి చెట్ల మీద ఉన్న పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరి పోయాయి. వేలకొద్దీ నిషాదులు అతడి నోటిలో ప్రవేశించారు. (20)
తతః ఖగో వదనమమిత్రతాపనః
సమాహరత్ పరిచపలో మహాబలః ।
నిఘాదయన్ బహువిధ మత్స్యజీవనః
ఋభుక్షితో గగనచరేశ్వర స్తదా ॥ 21
శత్రువుల్ని తపింపజేసే బలశాలియైన గరుత్మంతుడు ఆకలితో ఉండి మత్స్యజీవనులైన నిషాదుల్ని అందర్ని తన నోటిలో ఇముడ్చుకొన్నాడు. (21)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణాఖ్యానే అష్టావింశతితమోఽధ్యాయః ॥ 28 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ఇరువది యెనిమిదవ అధ్యాయము. (28)