29. ఇరువది తొమ్మిదవ అధ్యాయము
గజకచ్ఛపముల వృత్తాంతము.
సౌతిరువాచ
తస్య కంఠమనుప్రాప్తః బ్రాహ్మణః సహ భార్యయా ।
దహన్ దీప్త ఇవాంగారః తమువాచాంతరిక్షగః ॥ 1
ద్విజోత్తమ వినిర్గచ్ఛ తూర్ణమాస్యాదపావృతాత్ ।
న హి మే బ్రాహ్మణో వధ్యః పాపేష్వపి రతః సదా ॥ 2
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఆ గరుడుని కంఠంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో సహా ప్రవేశించి అగ్నిలాగ దహిస్తూంటే, గరుడుడు ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. "బ్రాహ్మణోత్తమా! నా నోటి నుండి బయటకు రా! ఎంత పాపాత్ముడైనా సరే నేను బ్రాహ్మణుని చంపను." (1,2)
బ్రువాణమేవం గరుడం బ్రాహ్మణః ప్రత్యభాషత ।
నిషాదీ మమ భార్యేయం నిర్గచ్ఛతు మయా సహ ॥ 3
అపుడు బ్రాహ్మణుడు గరుడునితో "నా భార్య నిషాది, ఆమె కూడా నాతోపాటు బయటకు రావాలి" అన్నాడు. (3)
గరుడ ఉవాచ
ఏతామపి నిషాదీం త్వం పరిగృహ్యాశు నిష్పత ।
తూర్ణం సంభావయాత్మానమ్ అజీర్ణం మమ తేజసా ॥ 4
"నిషాదుడా! నీ భార్యను గ్రహించి వెంటనే బయటకురా. నీవు నా జఠరాగ్నితో జీర్ణమగుట లేదు. వెంటనే నీ భార్యతో నిన్ను నీవు రక్షించుకో" అని గరుత్ముంతుడు నిషాదునకు చెప్పాడు. (4)
సౌతిరువాచ
తతః స విప్రో నిష్క్రాంతః నిషాదీ సహితస్తదా ।
వర్ధయిత్వా చ గరుడమ్ ఇష్టం దేశం జగామ చ ॥ 5
సౌతి చెపుతున్నాడు. వెంటనే విప్రుడు తన భార్యతో సహా వెలుపలికి వచ్చాడు. గరుడుని సంతోషపెట్టి ఆ విప్రుడు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయాడు. (5)
సహభార్యే వినిష్క్రాంతే తస్మిన్ విప్రే చ పక్షిరాట్ ।
వితత్య పక్షావాకాశం ఉత్పపాత మనోజవః ॥ 6
బ్రాహ్మణుడు అతని భార్యతో వెళ్ళిన తరువాత గరుడుడు తన రెక్కల్ని విదిలించి మనోవేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. (6)
తతోఽపశ్యత్ స పితరం పృష్టశ్చాఖ్యాతవాన్ పితుః ।
యథాన్యాయ మమేయాత్మా తం చోవాచ మహానృషిః ॥ 7
గరుడుడు తండ్రిని దర్శించాడు. తండ్రి అడిగితే గరుత్మంతుడు యథాన్యాయంగా తండ్రికి చెప్పాడు. అపుడు మహర్షి ఇలా అన్నాడు. (7)
కశ్యప ఉవాచ
కచ్చిద్ వః కుశలం నిత్యం భోజనే బహులం సుత ।
కచ్చిచ్చ మానుషే లోకే తవాన్నం విద్యతే బహు ॥ 8
అపుడు కశ్యపుడు ఇలా అడిగాడు. "కుమారా! మీరందఱు కుశలమేనా? నీకు మానవలోకంలో కావలసినంత భోజనం లభిస్తున్నదా?" అని అడిగాడు. (8)
గరుడ ఉవాచ
మాతా మే కుశలా శశ్వత్ తథా భ్రాతా తథా హ్యహమ్ ।
న హి మే కుశలం తాత భోజనే బహులే సదా ॥ 9
అపుడు గరుడుడు సమాధానం చెపుతున్నాడు. "నా తల్లి సదా కుశలమే; నేనును నా అన్నగారును కుశలమే. భోజనం బాగానే ఉన్నా నాకు మాత్రం కుశలం లేదు. (9)
అహం హి సర్పైః ప్రహితః సోమమాహర్తుముత్తమమ్ ।
మాతుర్దాస్య విమోక్షార్థమ్ ఆహరిష్యే తమద్య వై ॥ 10
మతృదాస్య విముక్తికి సర్పాలు నన్ను అమృతాన్ని తీసుకొని రమ్మని ప్రేరేపించినాయి. అందుచేత అమృతం తీసుకొని రావటానికి వెళ్లుతున్నాను. (10)
మాత్రా చాత్ర సమాదిష్టః నిషాదాన్ భక్షయేతి హ ।
న చ మే తృప్తిరభవద్ భక్షయిత్వా సహస్రశః ॥ 11
నా తల్లి చెప్పినట్లుగా మార్గ మధ్యంలో వేలకొద్దీ నిషాదుల్ని తిన్నాను. కాని నాకు తృప్తి కలుగలేదు. (11)
తస్మాద్ భక్ష్యం త్వమపరం భగవన్ ప్రదిశస్వ మే ।
యద్భుక్త్వామృతమాహర్తుం సమర్థః స్యామహం ప్రభో ॥ 12
క్షుత్పిపాసావిఘాతార్థే భక్ష్యమాఖ్యాతు మే భవాన్ ।
కాబట్టి నా ఆకలి తీరి, బలం కలగడానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి. దాన్ని తిని అమృతాన్ని తీసుకొని రావడానికి శక్తుడనవుతాను. నా ఆకలి దప్పులు తీరటానికి తగిన ఆహారం గురించి చెప్పండి." అని తండ్రియైన కశ్యపమహర్షిని అడిగాడు గరుత్మంతుడు. (12 1/2)
కశ్యప ఉవాచ
ఇదం సరో మహాపుణ్యం దేవలోకేఽపి విశ్రుతమ్ ॥ 13
అపుడు కశ్యపుడు చెప్తున్నాడు. "కుమారా! మహాపుణ్యదాయకమై, దేవలోకంలో కూడ ప్రసిద్ధి చెందిన సరస్సు ఇది. (13)
యత్ర కూర్మాగ్రజం హస్తీ సదా కర్షత్యవాఙ్ముఖః ।
తయోర్జన్మాంతరే వైరం సంప్రవక్ష్యామ్యశేషతః ॥ 14
తన్మే తత్మం నిబోధస్వ యత్ప్రమాణౌ చ తావుభౌ ।
ఆ సరోవరంలో ఒక ఏనుగు తాబేలు నిరంతరం దెబ్బలాడుకొంటున్నాయి. పూర్వజన్మలో ఆ రెండిటికి గల వైరమే ఆ దెబ్బలాటకు కారణం. ఆ కథను నీకు పూర్తిగా చెపుతాను. వాటి పరిమాణాలను తెలియజేస్తాను. చక్కగా విను. (14 1/2)
ఆసీద్విభావసుర్నామ మహర్షిః కోపనో భృశమ్ ॥ 15
భ్రాతా తస్యానుజశ్చాసీత్ సుప్రతీకో మహాతపాః ।
స నేచ్ఛతి ధనం భ్రాత్రా సహైకస్థం మహామునిః ॥ 16
పూర్వం విభావసుడు అనే మహర్షి ఉండేవాడు. అతడు కోపి. అతని తమ్ముడు సుప్రతీకుడు మహా తపస్వి. సుప్రతీకునికి అన్నగారి ధనాన్ని తన ధనాన్ని కలిపి ఉంచటం ఇష్టంలేదు. (15,16)
విభాగం కీర్తయత్యేవ సుప్రతీకో హి నిత్యశః ।
అథాబ్రవీచ్చ తం భ్రాతా సుప్రతీకం విభావసుః ॥ 17
సుప్రతీకుడు అన్నగారిని నిరంతరం తనభాగాన్ని పంచి ఈయవలసినదిగా కోరేవాడు. అపుడు విభావసుడు తమ్ముడితో ఇలా అన్నాడు. (17)
విభాగం బహవో మోహత్ కర్తుమిచ్ఛంతి నిత్యశః ।
తతో విభక్తాస్త్వన్యోన్యం విక్రుధ్యంతేఽర్థమోహితాః ॥ 18
తమ్ముడా! అనేకులు ధనవ్యామోహంతో విభాగాన్ని కోరుకొంటారు. ఆ విధంగా విడిపోయిన తరువాత ధనకాంక్షతో విరోధులై, దెబ్బలాడుకొంటారు. (18)
తతః స్వార్థపరాన్ మూఢాన్ పృథగ్భూతాన్ స్వకైర్ధనైః ।
విదిత్వా భేదయంత్యేతాన్ అమిత్రా మిత్రరూపిణః ॥ 19
మిత్రులుగా కనిపించే శత్రువులు ఐకమత్యంతో ఉన్న కుటుంబంలోని వారికి స్పర్ధలు పెట్టి విభజించుకో మంటారు. (19)
విదిత్వా చాపరే భిన్నాన్ అంతరేషు పతంత్యథ ।
భిన్నానామతులో నాశః క్షిప్రమేవ ప్రవర్తతే ॥ 20
వేరు పడిపోయారని తెలిస్తే కొంతమంది మన భేదాలను ఆసరాగా చేసుకొని మరింత బాధిస్తారు. భిన్నమైపోయిన వారికి త్వరలో నాశనం కలుగుతుంది. (20)
తస్మాద్ విభాగం భ్రాతౄణాం న ప్రశంసంతి సాధవః ।
గురుశాస్త్రేనిబద్ధానామ్ అన్యోన్యేనాభిశంకినామ్ ॥ 21
కాబట్టి అన్నదమ్ములు పంచుకోవడం మంచిదికాదు. ఇది గురుశాస్త్రానికి విరుద్ధం కూడా. అంతేకాక వారు ఒకరినొకరు నమ్మరు. (21)
నియంతుం న హి శక్యస్త్వం భేదతో ధనమిచ్ఛసి ।
యస్మాత్ తస్మాత్ సుప్రతీక హస్తిత్వం సమవాప్స్యసి ॥ 22
తమ్ముడా! సుప్రతీకా! ఈ విధంగా ఐక్యంగా ఉండకుండా నీ ధనాన్ని పంచాలని కోరుకొంటున్నావు గావున నీవు తరువాతి జన్మలో ఏనుగువై జన్మింతువు గాక! (22)
శప్తస్త్వేవం సుప్రతీకః విభావసుమథాబ్రవీత్ ।
త్వమప్యంతర్జలచరః కచ్ఛపః సంభవిష్యసి ॥ 23
ఈ విధంగా శపింపబడిన సుప్రతీకుడు అన్నగారికి కూడా "తరువాత జన్మలో తాబేలుగా జన్మింతువుగాక" అని ప్రతిశాపమిచ్చాడు. (23)
ఏవమన్యోన్యశాపాత్ తౌ సుప్రతీకవిభావసూ ।
గజకచ్ఛపతాం ప్రాప్తౌ అర్థార్థం మూఢచేతసౌ ॥ 24
ఈ విధంగా ధనం కోసం సుప్రతీక విభావసులు ఇద్దరూ ఒకరినొకరు మూర్ఖత్వంతో శపించుకొని గజకచ్ఛపాలుగా జన్మించారు. (24)
రోషదోషానుషంగేణ తిర్యగ్యోనిగతావుభౌ ।
పరస్పరద్వేషరతౌ ప్రమాణబలదర్పితౌ ॥ 25
సరస్యస్మిన్ మహాకాయౌ పూర్వవైరానుసారిణౌ ।
తయోరన్యతరః శ్రీమాన్ సముపైతి మహాగజః ॥ 26
యస్య బృంహితశబ్దేన కూర్మోఽప్యంతర్జలేశయః ।
ఉత్థితోఽసౌ మహాకాయః కృత్స్నం విక్షోభయమ్ సరః ॥ 27
కోపం అనే దోషంతో ఆ ఇద్దరూ జంతువులుగా జన్మించారు. పెద్ద పెద్ద గజ కచ్ఛపాలుగా పుట్టిన వారిద్దరూ పరస్పర ద్వేషంతో దెబ్బలాడుకొంటున్నారు. పూర్వవైరాన్ని బట్టి ఆ రెండూ ఆ సరస్సులో పడి దెబ్బలాడుకొనేవి. ఏనుగు నీరు త్రాగడానికి వచ్చినప్పుడల్లా నీటిలోని తాబేలు దాని శబ్దాన్ని విని పైకిలేచి సరసును కలచివేస్తూ ఏనుగును బాధించేది. (25-27)
యం దృష్ట్వా వేష్టితకరః పతత్యేష గజో జలమ్ ।
దంతహస్తాగ్రలాంగూల పాదయోగేన వీర్యవాన్ ॥ 28
విక్షోభయంస్తతో నాగః సరో బహుఝషాకులమ్ ।
కూర్మోఽప్యభ్యుద్యతశిరాః యుద్ధాయాభ్యేతి వీర్యవాన్ ॥ 29
ఆ తాబేలును చూసి ఏనుగు తొండం మెలిపెట్టి నీటిలోకి ఉరికేది. దంతాలతో, తొండంతో, తోకతో, పాదాలతో కొట్టుతూ సరస్సు నంతటినీ క్షోభింప జేసేది. తాబేలు కూడా తల పైకెత్తి యుద్ధానికి సిద్ధపడేది. (28,29)
షడుచ్ఛ్రితొ యోజనాని గజస్తద్ ద్విగుణాయతః ।
కూర్మస్త్రియోజనోత్సేధః దశయోజనమండలః ॥ 30
ఏనుగు ఆరుయోజనాల ఎత్తు, పన్నెండు యోజనాల పొడుగు ఉండేది. తాబేలు మూడు యోజనాల వెడల్పు, పదియోజనాల చుట్టుకొలత ఉండేది. (30)
తావుభౌ యుద్ధసమ్మతౌ పరస్పరవధైషిణౌ ।
ఉపయుజ్యాశు కర్మేదం సాధయేప్సితమాత్మనః ॥ 31
పరస్పరం వధించుకోవాలని యుద్ధం చేస్తున్న వారిద్దరిని భక్షించి నీ అభీష్ట కార్యాన్ని నెరవేర్చుకో. (31)
మహాభ్రఘనసంకాశం తం భుక్త్వామృతమానయ ।
మహాగిరిసమప్రఖ్యం ఘోరరూపం చ హస్తినమ్ ॥ 32
కచ్ఛపం మేఘ సమానంగాను, ఏనుగు పర్వత సమానంగాను భయంకరంగా ఉన్నాయి. ఈ రెండింటిని భక్షించి అమృతాన్ని తీసుకొనిరా" అని కశ్యపుడు తన కుమారుడికి ఉపాయం చెప్పాడు. (32)
సౌతిరువాచ
ఇత్యుక్త్వా గరుడం సోఽథ మాంగల్యమకరోత్ తదా ।
యుధ్యతః సహ దేవైస్తే యుద్ధే భవతు మంగలమ్ ॥ 33
ఉగ్రశ్రవుడు ఇలా చెపుతున్నాడు. ఈ విధంగా కశ్యపుడు చెప్పి "దేవతలతో అమృతం కోసం పోరాడే నీకు విజయం కలుగుగాక" అని ఆశీర్వదించాడు. (33)
పూర్ణకుంభో ద్విజా గావః యచ్చాన్యత్ కించిదుత్తమమ్ ।
శుభం స్వస్త్యయనం చాపి భవిష్యతి తవాండజ ॥ 34
ఖగోత్తమా! పూర్ణకుంభం, బ్రాహ్మణుడు, గోవులు మొదలైన ఉత్తమమైనవన్నీ నీకు శుభాన్నే కలిగిస్తాయి. (34)
యుధ్యమానస్య సంగ్రామే దేవైః సార్ధం మహాబల ।
ఋచో యజూంషి సామాని పవిత్రాణి హవీంషి చ ॥ 35
రహస్యాని చ సర్వాణి సర్వే వేదాశ్చ తే బలమ్ ।
ఇత్యుక్తో గరుడః పిత్రా గతస్తం హ్రదమంతికాత్ ॥ 36
మహాబలా! నీవు దేవతలతో యుద్ధం చేసేటపుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, పవిత్రమైన హవిస్సులు, మొదలైనవన్నీ నీకు బలాన్ని ఇచ్చుగాక!" ఈ విధంగా తండ్రి ఆశీర్వదించాక గరుడుడు ఆ సరోవరానికి వెళ్ళాడు. (35,36)
అపశ్యన్నిర్మలజలం నానాపక్షిసమాకులమ్ ।
స తత్ స్మృత్వా పితుర్వాక్యం భీమవేగోఽంతరిక్షగః ॥ 37
నఖేన గజమేకేన కూర్మమేకేన చాక్షిపత్ ।
సముత్పపాత చాకాశం తత ఉచ్చైర్విహంగమః ॥ 38
తండ్రి చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని అనేక పక్షులతో కూడి నిర్మలజలంతో ఉన్న ఆ సరోవరాన్ని చూశాడు. ఒక గోటితో గజాన్ని, మరోక గోటితో కచ్ఛపాన్ని పట్టుకొని గరుడుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. (37,38)
సోఽలంబం తీర్థమాసాద్య దేవవృక్షానుపాగమత్ ।
తే భీతాః సమకంపంత తస్య పక్షానిలాహతాః ॥ 39
న నో భంజ్యాదితి తదా దివ్యాః కనకశాఖినః ।
ప్రచలాంగాన్ స తాన్ దృష్ట్వా మనోరథఫలద్రుమాన్ ॥ 40
అన్యానతుల రూపాంగాన్ ఉపచక్రామ ఖేచరః ।
కాంచనై రాజతైశ్చైవ ఫలైర్వైదూర్యశాఖినః ।
సాగరాంబుపరిక్షిప్తాన్ భ్రాజమానాన్ మహాద్రుమాన్ ॥ 41
ఆ విధంగా ఎగిరిపోతూ అలంబతీర్థం అనే ప్రదేశం దగ్గరకు చేరి ఆ రెంటిని తినడానికి అనువైన స్థలం కోసం వెదుకుతూండగా అతని వేగానికి వృక్షాలన్నీ కంపించాయి. మమ్మల్ని విఱగగొట్టవద్దని ఆ వృక్షాలు మొఱ పెట్టుకున్నాయి. సముద్ర జలంతో ఆ చెట్లన్నీ వైడూర్యమణులతో బంగారంతో, వెండితో సమానమైన పండ్లతో ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తున్నాయి. (39,41)
తమువాచ ఖగశ్రేష్ఠం తత్ర రౌహిణపాదపః ।
అతిప్రవృద్ధః సుమహాన్ ఆపతంతం మనోజవమ్ ॥ 42
అపుడు అక్కడి పెద్ద మఱ్ఱి చెట్టు ఒకటి మనోవేగంతో వస్తున్న పక్షీంద్రునితో ఈ విధంగా అన్నది. (42)
రౌహిణ ఉవాచ
యైషా మమ మహాశాఖా శతయోజనమాయతా ।
ఏతామాస్థాయ శాఖాం త్వం ఖాదేమౌ గజకచ్ఛపౌ ॥ 43
మఱ్ఱిచెట్టు ఇలా అన్నది. "పక్షీంద్రా! నా యీ కొమ్మ నూరుయోజనాల పొడవుగలది. ఈ కొమ్మపై చేరి గజ కచ్ఛపాలను భుజించు." అని చెప్పింది. (43)
తతో ద్రుమం పతగసహస్రసేవితం
మహీధరప్రతిమవపుః ప్రకంపయన్ ।
ఖగోత్తమో ద్రుతమభిపత్య వేగవాన్
బభంజ తామవిరలపత్రసంచయామ్ ॥ 44
అనేక పక్షులతో సేవింపబడుతూ పర్వతంతో సమానమయిన వైశాల్యం కలిగి ఉన్న ఆ చెట్టును కంపింప చేస్తూ గరుడుడు దాని కొమ్మపై వ్రాలగానే ఆ కొమ్మ విరిగిపోయింది. (44)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే ఏకోనత్రింశోఽధ్యాయః ॥ 29 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను సౌపర్ణోపాఖ్యానము అను ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (29)