27. ఇరువది ఏడవ అధ్యాయము

తల్లి దాస్య నివృత్తిని గురించి గరుడుడు సర్పములను అడుగుట.

సౌతిరువాచ
సంప్రహృష్టాస్తతో నాగాః జలధారాప్లుతాస్తదా ।
సుపర్ణేనోహ్యమానాస్తే జగ్ముస్తం ద్వీపమాశు వై ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. నాగులు అందరూ నీటి ధారలతో తడిసి తాపాన్ని పోగొట్టుకొని సంతోషించి గరుడుని వీపుపై కూర్చుండి రామణీయక ద్వీపాన్ని చేరారు. (1)
తం ద్వీపం మకరావాసం విహితం విశ్వకర్మణా ।
తత్ర తే లవణం ఘోరం దదృశుః పూర్వమాగతాః ॥ 2
విశ్వకర్మ నిర్మించిన ఆ ద్వీపం మొసళ్లకు నివాస స్థలం. ఈ నాగులు కూడా ఇక్కడికి రావటం వల్ల లవణ సముద్రం భయంకరంగా కనిపించింది. (2)
సుపర్ణసహితాః సర్పాః కాననం చ మనోరమమ్ ।
సాగరాంబుపరిక్షిప్తం పక్షిసంఘనినాదితమ్ ॥ 3
గరుడునితో కూడా వచ్చిన సర్పాల వల్ల ఆ ప్రదేశం సముద్రజలంతో అభిషేకం చేసినట్లుగా ఉంది. అక్కడ ఉన్న పక్షుల కలకలారావాలతో ఆ వనం మారుమ్రోగింది. (3)
విచిత్రఫలపుష్పాభిః వనరాజిభిరావృతమ్ ।
భవనైరావృతం రమ్యైః తథా పద్మాకరైరపి ॥ 4
ఆ రామణీయకవనం విచిత్రమైన పండ్లతో, పుష్పాలతో, చెరువులతో, అందమైన భవనాలతో, వనాలతో కూడి ఉంది. (4)
ప్రసన్నసలిలైశ్చాపి హ్రదైర్దివ్యైర్విభూషితమ్ ।
దివ్యగంధవహైః పుణ్యైః మారుతైరుపవీజితమ్ ॥ 5
పుష్పాల పరిమళాన్ని వెదజల్లుతూ చల్లని పిల్లవాయువులతో పవనుడు అక్కడ సంచరిస్తున్నాడు. (5)
ఉత్పతద్భిరివాకాశం వృక్షైర్మలయజైరపి ।
శోభితం పుష్పవర్షాణి ముంచద్భిర్మారుతోద్ధతైః ॥ 6
అక్కడ మంచి గంధపు చెట్లు మహోన్నతంగా ఉన్నాయి. గాలి వేగానికి పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. (6)
వాయువిక్షిప్తకుసుమైః తథాన్యైరపి పాదపైః ।
కిరద్భిరివ తత్రస్థాన్ నాగాన్ పుష్పాంబువృష్టిభిః ॥ 7
అక్కడ మలయజ వృక్షాలే కాకుండా ఇతర వృక్షాల పూలు కూడా నాగులపై వర్షించాయి. (7)
మనః సంహర్షజం దివ్యం గంధర్వాప్సరసాం ప్రియమ్ ।
మత్తభ్రమరసంఘుష్టం మనోజ్ఞాకృతిదర్శనమ్ ॥ 8
ఆ దివ్యవనం హృదయాన్ని ఆకర్షిస్తోంది. గంధర్వులకు, అప్సర స్త్రీలకు ఆనందం కలిగిస్తోంది. తుమ్మెదల ఝంకారాలతో మనోజ్ఞమై చూడ ముచ్చటగా ఉంది. (8)
రమణీయం శివం పుణ్యం సర్వైర్జనమనోహరైః ।
నానాపక్షిరుతం రమ్యం కద్రూపుత్రప్రహర్షణమ్ ॥ 9
ఆ వనం రమణీయం, పుణ్యప్రదం, శుభంకరమూను. అందరినీ ఆనంద పరిచే దివ్యవనం అది. పక్షుల కలకల ధ్వనులతో సుందరంగా ఉండటం వల్ల కద్రూ సంతానానికి చాలా ఆనందం కలిగింది. (9)
తత్ తే వనం సమాసాద్య విజహ్రుః పన్నగాస్తదా ।
అబ్రువంశ్చ మహావీర్యం సుపర్ణం పతగేశ్వరమ్ ॥ 10
వారందరూ ఆ వనంలో కొన్నిరోజులు విహరించిన తరువాత ఆ సర్పాలు మహాపరాక్రమవంతుడయిన ఆ గరుడునితో ఈ విధంగా అన్నాయి. (10)
వహాస్మానపరం ద్వీపం సురమ్యం విమలోదకమ్ ।
త్వం హి దేశాన్ బహూన్ రమ్యాన్ వ్రజన్ పశ్యసి ఖేచర ॥ 11
ఖేచరా! నీవు ఆకాశంలో సంచరిస్తున్నపుడు అనేకమైన సుందర ప్రదేశాల్ని చూసి ఉంటావు కదా! కాబట్టి మమ్మల్ని నిర్మల జలం ఉన్న మరో మంచి ద్వీపంలోనికి తీసుకొని వెళ్లు. (11)
స విచింత్యాబ్రవీత్ పక్షీ మాతరం వినతాం తదా ।
కిం కారణం మయా మాతః కర్తవ్యం సర్పభాషితమ్ ॥ 12
ఆ మాటలకు కొంత బాధపడి గరుడుడు తన తల్లితో "అమ్మా! నేను సర్పాలు ఆజ్ఞాపించే పనుల్ని ఎందుకు చేయాలి." అని కారణం అడిగాడు. (12)
వినతోవాచ
దాసీభూతాస్మి దుర్యోగాత్ సపత్న్యాః పతగోత్తమ ।
పణం వితథమాస్థాయ సర్పైరుపధినా కృతమ్ ॥ 13
అపుడు తల్లి వినత ఇలా అంది. "నాయనా! దురదృష్టం వల్ల నేను నాసవతియైన కద్రువకు దాసిని అయ్యాను, పందెంలో నేను ఆమె చేతిలో ఓడి పోవటం వల్ల ఈ విధంగా సేవ చేయవలసి వస్తున్నది." (13)
తస్మింస్తు కథితే మాత్రా కారణే గగనేచరః ।
ఉవాచ వచనం సర్పాన్ తేన దుఃఖేన దుఃఖితః ॥ 14
తన దాసీత్వానికి తల్లి కారణం చెప్పగా గరుత్మంతుడు దుఃఖించి సర్పాలను ఇలా అడిగాడు. (14)
కిమాహృత్య విదిత్వా వా కిం వా కృత్వేహ పౌరుషమ్ ।
దాస్యాద్ వో విప్రముచ్యేయం తథ్యం వదత లేలిహాః ॥ 15
"సర్పములారా! మేము ఏమి తీసుకొనివచ్చి మీకు ఇస్తే మా తల్లిని దాస్యం నుండి విడిపించుకోవచ్చునో చెప్పండి". అని అడిగాడు. (15)
సౌతిరువాచ
శ్రుత్వా తమబ్రువన్ సర్పాః ఆహారామృతమోజసా ।
తతో దాస్యాద్ విప్రమోక్షః భవితా తవ ఖేచర ॥ 16
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు. గరుడుని మాటలు విన్న సర్పాలు తమకు ఆహారంగా అమృతాన్ని తెచ్చియిస్తే దాసీత్వం నుండి నీకు విముక్తి కలుగుతుందని చెప్పాయి. (16)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే సప్తవింశోఽధ్యాయః ॥ 27 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను అను ఇరువది ఏడవ అధ్యాయము. (27)