21. ఇరువది ఒకటవ అధ్యాయము
సముద్రవర్ణనము.
సౌతిరువాచ
తతో రజన్యాం వ్యుష్టాయాం ప్రభాతేఽభ్యుదితే రవౌ ।
కద్రూశ్చ వినతా చైవ భగిన్యౌ తే తపోధన ॥ 1
అమర్షితే సుసంరబ్ధే దాస్యే కృతపణే తదా ।
జగ్మతుస్తురగం ద్రష్టుమ్ ఉచ్చైఃశ్రవసమంతికాత్ ॥ 2
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - తపోధనా! ఆ రాత్రి గడచిన తరువాత సూర్యుడు ఉదయించగానే ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కద్రూవినతలు తమ పందెములు నెగ్గించుకోడానికని మాత్సర్యంతో ఆ సముద్రతీరంలో ఉన్న ఉచ్చైశ్రవం అనే అశ్వరాజాన్ని చూడటానికి వెళ్లారు. (1,2)
దదృశాతేఽథ తే తత్ర సముద్రం నిధిమంభసామ్ ।
మహాంతముదకాగాధం క్షోభ్యమాణం మహాస్వనమ్ ॥ 3
కొంతదూరం వెళ్లాక అగాధమై హోరుమని శబ్దం చేస్తున్న సముద్రాన్ని వారిద్దరూ చూశారు. (3)
తిమింగిలఝషాకీర్ణం మకరైరావృతం తథా ।
సత్త్వైశ్చ బహుసాహస్రైః నానారూపైః సమావృతమ్ ॥ 4
తిమింగిలాలు పెద్దపెద్ద చేపలు, మొసళ్లు, ఇంకా ఎన్నో వేల జల జంతువులతో మహాభయంకరంగా ఉన్న సముద్రాన్ని వారు చూశారు. (4)
భీషణైర్వికృతైరన్యైః ఘోరైర్జలచరైస్తథా ।
ఉగ్రైర్నిత్యమనాధృష్యం కూర్మగ్రాహసమాకులమ్ ॥ 5
వికృతాకారంలో ఉన్న అనేక భయంకర జలజంతువులతోను తాబేళ్లతోను, కూడి ఉన్న సముద్రం చేరడానికి వీలు కాని విధంగా ఉన్నది. (5)
ఆకరం సర్వరత్నానామ్ ఆలయం వరుణస్య చ ।
నాగానామాలయం రమ్యమ్ ఉత్తమం సరితాం పతిమ్ ॥ 6
ఆ సముద్రం సకలవిధ రత్నాలకు నిలయం. అది వరుణ దేవుని నివాస స్థానం. సర్పాలకు అది రమణీయమైన ఆలయం కూడా. (6)
పాతాళజ్వలనావాసమ్ అసురాణాం చ బాంధవమ్ ।
భయంకరం చ సత్త్వానాం పయనాం నిధిమర్ణవమ్ ॥ 7
అది బడబాగ్నికి స్థానం. రాక్షసులకు ఆ సముద్రం బంధువులాగ ఆశ్రయం ఇస్తున్నది. ఇతర జంతువులకు భయంకరంగా ఉన్నది. వీటికి నిలయం అది. (7)
శుభం దివ్యమమర్త్యానామ్ అమృతస్యాకరం పరమ్ ।
అప్రమేయమచింత్యం చ సుపుణ్యజలమద్భుతమ్ ॥ 8
ఆ సముద్రం ఎంతో పవిత్రమైనది. దివ్యమైనది కూడ. అమృతం పుట్టిన ఆ సముద్రజలం అద్భుతమైనది. దానికదే సాటిగదా! (8)
ఘోరం జలచరారావ రౌద్రం భైరవ నిఃస్వనమ్ ।
గంభీరావర్తకలిలం సర్వభూతభయంకరమ్ ॥ 9
ఆ సముద్రం జలజంతువుల రౌద్రశబ్దాలతో భయంకరంగా ఉంది. అన్ని ప్రాణులకు భయాన్ని కలిగించే సుడులతో నిండి ఉంది. (9)
వేలాదోలానిలచలం క్షోభోద్వేగసముచ్ఛ్రితమ్ ।
వీచీహస్తైః ప్రచలితైః నృత్యంతమివ సర్వతః ॥ 10
ఆ సముద్రం అలల ఉయ్యాలల వేగంతో మహాధ్వనితో క్షోభ కల్గిస్తున్నట్లుగా ఉన్నది. కదిలే కెరటాలు అనే హస్తాలతో నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నది. (10)
చంద్రవృద్ధిక్షయవశాద్ ఉద్ధతోర్మిసమాకులమ్ ।
పాంచజన్యస్య జననం రత్నాకరమనుత్తమమ్ ॥ 11
చంద్రుని యొక్క వృద్ధి క్షయాల వలన మహోన్నత తరంగాలతో కూడి ఉన్నది ఆ సముద్రం. అందులో పాంచజన్యం అనే శంఖం ఉద్భవించింది. అది రత్నాలకు నిలయం. ఉత్తమమైనదీ సముద్రం. (11)
గాం విందతా భగవతా గోవిందేనామితౌజసా ।
వరాహరూపిణాం చాంతః విక్షోభితజలావిలమ్ ॥ 12
భూమిని సంతోషపెట్టడానికి శ్రీమన్నారాయణమూర్తి వరాహమూర్తియై భూమిని ఉద్ధరించేటప్పుడు ఆ సముద్రజలం అంతా క్షోభచెందినట్లుగా అయింది. (12)
బ్రహ్మర్షిణా వ్రతవతా వర్షాణాం శతమత్రిణా ।
అనాసాదితగాధం చ పాతాలతలమవ్యయమ్ ॥ 13
నిరంతర జపతత్పరుడై బ్రహ్మర్షియైన అత్రిమహర్షి ఆ సముద్రం యొక్క లోతును తెలుసుకొనవలెనని నూరు సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ దాని అంతు చిక్కలేదు. అది పాతాళం చివరిదాకా వ్యాపించి ఉన్నది. (13)
అధ్యాత్మయోగనిద్రాం చ పద్మనాభస్య సేవతః ।
యుగాదికాలశయనం విష్ణోరమితతేజసః ॥ 14
శ్రీ మహావిష్ణువు యుగాంతకాలం నుండి యుగాదికాలం వరకు యోగ నిద్ర చేయడానికి శయనాగారంగా సేవచేసింది ఆ మహాసముద్రమే. (14)
వజ్రపాతనసంత్రస్తమైనాకస్యాభయప్రదమ్ ।
డింబాహవార్దితానాం చ అసురాణాం పరాయణమ్ ॥ 15
ఇంద్రుని వజ్రాయుధం దాడికి భయపడిన మైనాక పర్వతానికి ఆ సముద్రం ఆశ్రయమిచ్చింది. దేవతలతో జరిగిన యుద్ధంలో భయపడి పారిపోయిన ఎందరో రాక్షసులకు అది ఆశ్రయం ఇచ్చింది. (15)
బడబాముఖదీప్తాగ్నేః తోయహవ్యప్రదం శివమ్ ।
అగాధపారం విస్తీర్ణమ్ అప్రమేయం సరిత్పతిమ్ ॥ 16
సముద్రం తనలో పుట్టిన బడబానలం అనే అగ్నిని జలరూప హవిస్సులతో సేవించింది. ఆ విధంగా అది ప్రపంచ కల్యాణానికి కారకమైంది. ఆ విధంగా ఎన్నో నదులకు పతియైన సముద్రం అగాధమైనది. అపారమైనది. ఊహింపరానంత విస్తీర్ణం కలది. (16)
మహానదీభిర్బహ్వీభిః స్పర్ధయేవ సహస్రశః ।
అభిసార్యమాణమనిశం దదృశాతే మహార్ణవమ్ ।
ఆపూర్యమాణమత్యర్థే నృత్యమానమివోర్మిభిః ॥ 17
వేలకొద్దీ నదులెన్నో పోటీపడినట్లు అభిసరిస్తున్నాయి ఆ సముద్రాన్ని. ఆ నదుల కెరటాలతో నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది ఆ సముద్రం. (17)
గంభీరం తిమిమకరోగ్రసంకులం తం
గర్జంతం జలచరరావరౌద్రనాదైః ।
విస్తీర్ణే దదృశతురంబరప్రకాశం
తేఽగాధం నిధిమురుమభసామనంతమ్ ॥ 18
గంభీరంగా ఉంటూ, తిమింగలాలు మొసళ్లు మొదలైన భయంకర జంతువుల గర్జనలతో కూడి ఉంది. విశాలమై, ఆకాశం లాగా స్వచ్ఛంగా ఉంటూ, అనంతమైన అగాధంతో ప్రకాశిస్తున్న జలనిధిని కద్రూ వినతలు ఇద్దరూ చూశారు. (18)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే ఏకవింశతితమోఽధ్యాయః ॥ 21 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ఇరువది ఒకటవ అధ్యాయము. (21)