22. ఇరువది రెండవ అధ్యాయము

సర్పములు ఉచ్చైఃశ్రవము తోకను నల్లగా చేయిట.

సౌతిరువాచ
నాగాశ్చ సంవిదం కృత్వా కర్తవ్యమితి తద్వచః ।
నిఃస్నేహా వై దహేన్మాతా అసంప్రాప్తమనోరథా ॥ 1
ప్రసన్నా మోక్షయేదస్మాన్ తస్మాచ్ఛాపాం చ భామినీ ।
కృష్ణం పుచ్ఛం కరిష్యామః తురగస్య న సంశయః ॥ 2
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు. మహర్షులారా! నాగులందరు తమలో తాము ఆలోచించుకొని తల్లి ఆజ్ఞ ప్రకారం చేయటానికే నిశ్చయించుకొన్నారు. తల్లి చెప్పినట్లు చేయకుంటే రోషంతో కుమారులని కూడా లెక్కచేయక శాపం ఇస్తుంది గదా? ఆమె కోరికను నెరవేర్చి శాపం నుండి విముక్తి పొందడానికే నల్లత్రాచులు ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకొందా మనుకున్నాయి. (1,2)
తథా హి గత్వా తే తస్య పుచ్ఛే వాలా ఇవ స్థితాః ।
ఏతస్మిన్నంతరే తే తు సపత్నౌ పణితే తదా ॥ 3
తతస్తే పణితం కృత్వా భగిన్యౌ ద్విజసత్తమ ।
జగ్మతుః పరయా ప్రీత్యా పరం పారం మహోదధేః ॥ 4
కద్రూశ్చ వినతా చైవ దాక్షాయణ్యౌ విహాయసా ।
ఆలోకయంత్యా వక్షోభ్యం సముద్రం నిధిమంభసామ్ ॥ 5
వాయునాతీవ సహసా క్షోభ్యమాణం మహాస్వనం ।
తిమింగిలసమాకీర్ణం మకరైరావృతం తథా ॥ 6
సంయుతం బహుసాహస్రైః సత్త్వైర్నానావిధైరపి ।
ఘోరైర్ఘోరమనాధృష్యం గంభీరమతిభైరవమ్ ॥ 7
ఆ విధంగా కాలసర్పాలు తోకకు చుట్టుకొన్న తరువాత పందెం వేసుకొన్న ఆ కద్రూవినతలు ఇద్దరూ సంతోసంతో సముద్రతీరానికి ఆకాశమార్గాన వెళ్లారు. ఆ సముద్రం గాలితో పెద్దఘోష చేస్తూ క్షోభించి పోతోంది. ఎన్నో వేల జంతువులు కలిగి ఆ సముద్రం మహాభయంకరంగా, ఎవరూ దగ్గరకు రాలేనట్లుగా ఉంది. (3-7)
ఆకరం సర్వరత్నానామ్ ఆలయం వరుణస్య చ ।
నాగానామాలయం చాపి సురమ్యం సరితాం పతిమ్ ॥ 8
సముద్రం రత్నాలకు నిలయం. అదే వరుణుని గృహం కూడా. నాగులకు ఆలయమయిన ఆ సముద్రం నీటికే అధిపతి. (8)
పాతాళజ్వలనావాసమ్ అసురాణాం తథాఽఽలయమ్ ।
భయంకరాణాం సత్త్వానాం పయసో నిధిమవ్యయమ్ ॥ 9
ఆ జలనిధి పాతాళంలోని బడబాగ్నికి నిలయం. అలాగే రాక్షసులకూ నిలయం. భయంకరమయిన జలజంతువు లందులో ఉన్నాయి. జలానికి నిలయమది. (9)
శుభ్రం దివ్యమమర్త్యానామ్ అమృతస్యాకరం పరమ్ ।
అప్రమేయమచింత్యం చ సుపుణ్యజలసమ్మితమ్ ॥ 10
అది అమృతం పుట్టినచోటు, శుభ్రమైన, పుణ్య జలంతో నిండినది. దాని లోతు ఎంతో ఊహించలేము. (10)
మహానదీభిర్బహ్వీభిః తత్ర తత్ర సహస్రశః ।
ఆపూర్వమాణమత్యర్థం నృత్యంతమివ చోర్మిభిః ॥ 11
అక్కడక్కడ దానిలో ఎన్నో మహానదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆ నీటితో బాగా నిండి కెరటాలతో నృత్యం చేస్తూన్నట్లుంది. (11)
ఇత్యేవం తరలతరోర్మిసంకులం తం
గంభీరం వికసితమంబరప్రకాశమ్ ।
పాతాలజ్వలన శిఖావిదీపితాంగం
గర్జంతం ద్రుతమభిజగ్మతుస్తతస్తే ॥ 12
మెరిసే కెరటాలతో, ఆకాశంలా నల్లగా కనిపిస్తూ, ఆ సముద్రం బడబాగ్ని జ్వాలలతో ప్రకాశిస్తోంది. ఘోషిస్తోంది. ఆ సముద్రాన్ని కద్రూవినతలు త్వరగా చేరుకొన్నారు. (12)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే సముద్రదర్శనం నామ ద్వావింశోఽధ్యాయః ॥ 22 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమున సముద్రదర్శన మను ఇరువది రెండవ అధ్యాయము. (22)