173. నూటడెబ్బదిమూడవ అధ్యాయము
(అంబోపాఖ్యాన పర్వము)
భీష్ముడు కాశీరాజు దుహితలను అపహరించి తెచ్చుట.
దుర్యోధన ఉవాచ
కిమర్థం భరతశ్రేష్ఠ నైవ హన్యాః శిఖండినమ్।
ఉద్యతేషుమథో దృష్ట్వా సమరేష్వాతతాయినమ్॥ 1
దుర్యోధనుడు అడిగాడు - భరతశ్రేష్ఠుడా! శిఖండి యుద్ధంలో విల్లెక్కుపెట్టి ఆతతాయిలా నిన్ను చంపాలను కొని వస్తూంటే చూసి కూడా నీవు అతడిని ఎందుకు చంపలేవు? (1)
ఆతతాయి:
అగ్నిదో గరదశ్పైవ శస్త్రణిర్ధనాపహః।
క్షేత్రదారాపహారీ చ షడేతే ఆతతాయినః॥
నిప్పు పెట్టే వాడు, విషం పెట్టేవాడు, శస్త్రాన్ని ధరించిన వాడు, ధనాన్ని అపహరించినవాడు, ఆస్తిని అపహరించే వాడు, భార్యను కాజేసేవాడు - అనే ఈ ఆరుగురు ఆతతాయులు. ఇక్కడ శిఖండి విల్లెక్కుపెట్టి వచ్చాడు కాబట్టి ఆతతాయి.
పూర్వముక్త్వా మహాబాహో పంచాలాన్ సహ సోమకైః।
హనిష్యామీతి గాంగేయ తన్మే బ్రూహి పితామహ॥ 2
మహావీరుడైన పితామహా! సోమకులతో సహితంగా పాంచాలుర నందరినీ చంపుతానని పూర్వం చెప్పి ఉన్నావు కదా! మరి శిఖండిని ఎందుకు చంపలేవో నాకు చెప్పు. (2)
భీష్మ ఉవాచ
శృణు దుర్యోధన కథాం సహైభిర్వసుధాధిపైః।
యదర్థం యుధి సంప్రేక్ష్య నాహం హన్యాం శిఖండినమ్॥ 3
భీష్ముడు ఇలా చెప్పాడు. దుర్యోధనా! యుద్ధంలో నన్నె దిరించడానికి వచ్చిన శిఖండిని చూసి కూడా ఎందుకు నేను చంపలేనో, ఆ కథ చెప్తాను. ఈ రాజులందరితో కలిసి విను. (3)
మహారాజో మమ పితా శాంతమర్ణోకవిశ్రుతః।
దిష్టాంతమాప ధర్మాత్మా సమయే భరతర్షభ॥ 4
తతోఽహం భరతశ్రేష్ఠ ప్రతిజ్ఞాం పరిపాలయన్।
చిత్రాంగదం భ్రాతరం వై మహారాజ్యేఽభ్యషేదయమ్॥ 5
భరతశ్రేష్ఠుడా! ధర్మాత్ముడు, లోకవిఖ్యాతుడు అయిన నా తండ్రి మహారాజు శాంతనుడు మరణించాడు. అప్పుడు నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ తమ్ముడైన చిత్రాంగదుని మహారాజుగా పట్టాభిషిక్తుని చేశాను. (4-5)
తస్మింశ్చ నిధనం ప్రాప్తే సత్యవత్యా మతే స్థితః।
విచిత్రవీర్యం రాజానమ్ అభ్యషించం యథావిది॥ 6
అతడు కూడా చనిపోవడంతో తల్లిగారైన సత్యవతి యొక్క సమ్మతితో విచిత్రవీర్యుని శాస్త్రోక్తంగా రాజుగా అభిషిక్తుని చేశాను. (6)
మయాభిషిక్తో రాజేంద్ర యవీయానపి ధర్మతః।
విచిత్రవీర్యో ధర్మాత్మా మామేవ సముదైక్షత॥ 7
రాజేంద్రా! చిన్నవాడైనప్పటికీ నా చేత పట్టాభిషిక్తుడయిన ధర్మాత్ముడు ఆ విచిత్రవీర్యుడు. ధర్మానుసారంగా(సహజంగా) నన్నే చూస్తూండేవాడు. (అంటే నా సమ్మతితోనే రాజకార్యాలను చక్క పెట్టేవాడని అర్థం) (7)
తస్య దారక్రియాం తాత చికీర్షురహమప్యుత।
అనురూపాదిప కులాత్ ఇత్యేవ చ మనో దధే॥ 8
నాయనా! అప్పుడు నేను అనుకూలమైన యోగ్యమైన వంశంనుండి కన్యను తెచ్చి అతనికి వివాహం చేయాలని నిశ్చయించుకొన్నాను. (8)
తథాశ్రౌషం మహాబాహో తిప్రః కన్యాః స్వయంవరాః।
రూపేణాప్రతిమాః సర్వాః కాశిరాజసుతాస్తదా।
అంబాం చైవాంబికాం చైవ తథైవాంబాలికామపి॥ 9
మహావీరా! ఆ రోజుల్లోనే - సాటిలేని సౌందర్యం కల కాశీరాజు కూతుళ్లు ముగ్గురు స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను. వారే అంబ, అంబిక, అంబాలికలు. (9)
రాజానశ్చ సమాహుతాః పృథివ్యాం భరతర్షభ।
అంబా జ్యేష్ఠాభవత్ తాసామ్ అంబికా త్వథ మధ్యమా॥ 10
అంబాలికా చ రాజేంద్ర రాజకన్యా యవీయసీ।
సోఽహమేకరథేనైవ గతః కాశిపతేః పురమ్॥ 11
రాజేంద్రా! ఆ స్వయంవరానికి భూమండలంలోని రాజులందరినీ పిలిచారు. అంబ అందరికంటె పెద్దది. అంబిక మధ్యది. అంబాలిక అందరికంటె చిన్నది. పిలుపు అందుకుని నేను ఒంటరిగా రథం మీద కాశీరాజు పట్టణానికి వెళ్లాను. (10-11)
అపశ్యం తా మహాబాహో తిస్రః కన్యాః స్వలంకృతాః।
రాజ్ఞశ్చైచ సమాహుతాన్ పార్థివాన్ పృథివీపతే॥ 12
మహాబాహూ! అక్కడికి వెళ్లి చక్కగా అలంకరింపబడిన ఆ ముగ్గురు కన్యలను చూశాను. రాజా! అంతే కాదు ఆహ్వానంపై అక్కడికి విచ్చేసి ఉన్న క్షత్రియులను, నృపులను కూడా చూశాను. (12)
తతోఽహం తాన్ నృపాన్ సర్వానాహూయ సమరే స్థితాన్।
రథమారోపయాంచక్రే కన్యాస్తా భరతర్షభ॥ 13
భరతశ్రేష్ఠుడా! తరువాత నేను యుద్ధంకోసం నిలిచిఉన్న ఆ రాజులందరినీ హెచ్చరించి, ఆ ముగ్గురు కన్యలను నా రథం మీదకు ఎక్కించాను. (13)
వీర్యశుల్కాశ్చ తా జ్ఞాత్వా సమారోప్య రథం తదా।
అవోచం పార్థివాన్ సర్వాన్ అహం తత్ర సమాగతాన్।
భీష్మః శాంతనవః కన్యాః హరతీతి పునః పున॥ 14
తే యతధ్వం పరం శక్త్వా సర్వే మోక్షాయ పార్థివాః।
ప్రసహ్య హి హరామ్యేషః మిషతాం వో నరర్షభాః॥ 15
ఆ ముగ్గురు కన్యలు పరాక్రమమే శుల్కంగా కలవారిని తెలిసికొని నేను వారిని రథమెక్కించాక అక్కడకు చేరిన సమస్త రాజులను ఉద్దేశించి, నేను "రాజశ్రేష్ఠులారా! శంతనుని కుమారుడైన భీష్ముడు ఈ రాజకన్యలను అపహరించుకు పోతున్నాడు. మీరు మీ శక్తిని పూర్తిగా వినియోగించి వీరిని విడిపించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉండగానే బలవంతంగా వీరిని నేను తీసుకుపోతున్నాను." అని వారికి పదే పదే చెప్పాను. (14-15)
తతస్తే పృథివీపాలాః సముత్పేతురుదాయుధాః।
యోగో యోగ ఇతి క్రుద్ధాః సారథీనభ్యచోదయన్॥ 16
అప్పుడు ఆ రాజులందరూ కోపంతో ఆయుధాలు అందుకుని విరుచుకుపడుతూ తమ తమ సారథులకు రథాలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. (16)
తే రథైర్గజసంకాశైః గజైశ్చ గజయోధినః।
పుష్టైశ్చాశ్వైర్మహీపాలాః సముత్పేతురుదాయుధాః॥ 17
ఆ విధంగా కోపించిన రాజులందరూ ఏనుగుల వంటి రథాల మీద, గజాలమీద, బలిష్ఠమైన గుర్రాలమీద ఎక్కి శస్త్రాస్త్రాలు ధరించి నామీద దాడికి దిగారు. అందులో గజయోధులే ఎక్కువగా ఉన్నారు. (17)
తతస్తే మాం మహీపాలాః సర్వ ఏవ విశాంపతే।
రథవ్రాతేన మహతా సర్వతః పర్యవారయన్॥ 18
రాజా! అప్పుడు ఆ రాజులందరూ గొప్పదైన రథ సమూహంతో నన్ను అన్ని వైపులనుండి చుట్టుముట్టారు. (18)
తానహం శరవర్షేణ సమంతాన్ పర్యవారయమ్।
సర్వాన్ నృపాంశ్చాప్యజయం దేవరాడివ దానవాన్॥ 19
నేను కూడా వారిని బాణవర్షంతో అన్నివైపుల ముంచెత్తాను. దేవేంద్రుడు దానవులనువలె ఆ రాజులందరినీ ఓడించాను. (19)
అపాతయం శరైర్దీప్తైః ప్రహసన్ భరతర్షభ।
తేషామాపతతాం చిత్రాన్ ధ్వజాన్ హేమపరిష్కృతాన్॥ 20
భరతశ్రేష్ఠా! నన్ను చుట్టుముట్టిన ఆ రాజులందరి యొక్క రంగురంగుల బంగారు ధ్వజాలన్నిటినీ నవ్వుతూనే జ్వలించే బాణాలతో పడగొట్టేశాను. (20)
ఏకైకేన హి బాణేన భూమౌ పాతితవానహమ్।
హయాంస్తేషాం గజాంశ్పైవ సారథీంశ్చాప్యహం రణే॥ 21
నేను ఒక్కొక్కబాణంతోనే ఆ యుద్ధంలో వారి గుర్రాలను, ఏనుగులను, సారథులను కూడా నేలకు ఒరిగేలా చేశాను. (21)
తే నివృత్తాశ్చ భగ్నాశ్చ దృష్ట్వా తల్లాఘవం మమ।
(ప్రణిపేతుశ్చ సర్వే వై ప్రశశంసుశ్చ పార్థివాః।
తత ఆదాయ తాః కన్యాః నృపతీంశ్చ విసృజ్య తాన్॥)
అథాహం హాస్తినపురమ్ ఆయాం జిత్వా మహీక్షితః॥ 22
నా హస్తలాఘవాన్ని గమనించి వారంతా వెనుతిరిగి పారిపోయారు. వారంతా తలలు వంచి నన్ను ప్రశంసించారు. ఓడిపోయిన రాజులందరినీ అక్కడే వదిలి, ఆ కన్యలను తీసుకుని హస్తినాపురానికి వచ్చాను. (22)
తతోఽహం తాశ్చ కన్యా వై భ్రాతురర్థాయ భారత।
తచ్చ కర్మ మహాబాహో సత్యవత్యై న్యవేదయమ్॥ 23
మహావీరుడా! భరతకుమారా! అప్పుడు నేను ఆ కన్యలను నా తమ్ముడితో వివాహం కోసం సత్యవతీ దేవికి అప్పగించి, ఆ నా యుద్ధవిషయాలను కూడా ఆమెకు చెప్పాను. (23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ అంబోపాఖ్యానపర్వణి కన్యాహరణే త్రిసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 173 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున కన్యాహరణమను నూటడెబ్బది మూడవ ఆధ్యాయము. (173)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకం కలుపుకొని మొత్తం 24 శ్లోకాలు)