172. నూట డెబ్బది రెండవ అధ్యాయము
పాండవ రథాతిరథ సంఖ్యానము - 4.
భీష్మ ఉవాచ
రోచమానో మహారాజ పాండవానాం మహారథః।
యోత్స్యతేఽ మరవత్ సంఖ్యే పరసైన్యేషు భారత॥ 1
భీష్ముడు చెప్పాడు. మహారాజా! పాండవపక్షంలో రోచమానుడు మహారథుడు. అతడు యుద్ధరంగంలో శత్రుసేనలతో దేవతల వలె యుద్ధం చేస్తాడు. (1)
పురుజిత్కుంతిభోజశ్చ మహేష్వాసో మహాబలః।
మాతులో భీమసేనస్య స చ మేఽతిరథో మతః॥ 2
కుంతిభోజకుమారుడు పురజిత్తు భీమసేనునకు మేనమామ. అతడు గొప్ప విల్లు కలవాడు. మిక్కిలి బలవంతుడు. నేనతనిని అతిరథుడని భావిస్తాను. (2)
ఏష వీరో మహేష్వాసః కృతీ చ నిపుణశ్చ హ।
చిత్రయోధీ చ శక్తశ్చ మతో మే రఘుపుంగవః॥ 3
ఇతని ధనుస్సు గొప్పది. అస్త్ర విద్యలో పండితుడు, యుద్ధ నిపుణుడు, రథికులలో శ్రేష్ఠుడు శక్తిశాలి అయిన ఈ వీరుడు విచిత్ర యుద్ధం చేస్తాడు. (3)
స యోస్త్స్యతి హి విక్రమ్య మఘవానివ దానవైః।
యోధా యే చాస్య విఖ్యాతాః సర్వే యుద్ధవిశారదాః॥ 4
ఇంద్రుడు పరాక్రమించి దానవులలో యుద్ధం చేసినట్లు ఇతడు శత్రువులతో సమరం చేస్తాడు. ఇతని సైనికులు కూడా యుద్ధవిద్యలో నిపుణులు, ప్రఖ్యాతులు. (4)
భాగినేయకృతే వీరః స కరిష్యతి సంగరే।
సుమహత్ కర్మ పాండూనాం స్థితః ప్రియహితే రతః॥ 5
వీరుడైన పురుజిత్తు పాండవులకు ప్రియాన్ని, హితాన్ని కలిగించడంలో తత్పరుడు. అతడు మేనల్లుని కోసం రణరంగంలో గొప్ప యుద్ధం చేస్తాడు. (5)
భైమసేని ర్మహారాజ హైడింబో రాక్షసేశ్వరః।
మతో మే బహుమాయావీ రథయూథపయూథపః॥ 6
మహారాజ! హిడింబా భీమసేనుల కుమారుడు ఘటోత్కచుడు గొప్ప మాయలు కలవాడు. నా అభిప్రాయంలో అతడు రథయూథాధిపతుల కంటె యూథపతి. (6)
యోత్స్యతే సమరే తాత మాయావీ సమరప్రియః।
యేచాస్య రాక్షసా వీరాః సచివా వశవర్తినః॥ 7
అతనికి యుద్ధం చాలా ఇష్టం. నాయనా! మాయావి అయిన ఆ రాక్షసుడు సమరభుమిలో ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు. అతని వెంట వీరులయిన రాక్షసులు సచివులుగా ఉన్నారు. వారందరూ అతని వశంలో ఉంటారు. (7)
ఏతే చాన్యే చ బహవః నానాజనపదేశ్వరాః।
సమేతాః పాండవస్యార్థే వాసుదేవపురోగమాః॥ 8
వీరు, అనేక జనపదాలకు అధిపతులయిన ఇతర క్షత్రియ వీరులు, వీరందరూ శ్రీకృష్ణునితో కూడి పాండునందను డయిన ధర్మరాజు కోసం ఒక చోట సమకూడారు. (8)
ఏతే ప్రాధాన్యతో రాజన్ పాండవస్య మహాత్మనః।
రథాశ్చాతిరథాశ్చైవ యే చాన్యేఽర్ధరథా నృప॥ 9
రాజా! మహాత్ముడు పాండునందనుడు అయిన యుధిష్ఠిరునికి సంబంధించిన ముఖ్య రథికులు, అతిరథులు, అర్ధరథులు వీరు. (9)
నేష్యంతి సమరే సేనాం భీమాం యౌధిష్ఠిరీం నృప।
మహేంద్రేణేవ వీరేణ పాల్యమానాం కిరీటినా॥ 10
నరేశ్వరా! దేవరాజయిన ఇంద్రునితో సమానమయిన తేజస్వి అర్జునుని ద్వారా సురక్షిత మయిన యుధిష్ఠిరుని భయంకరమయిన సేనను సమరభూమిలో పై వీరులు నడిపిస్తారు. (10)
తై రహం సమరే వీర మాయావిద్భిర్జయైషిభిః।
యోత్స్యామి జయమాకాంక్షన్ అథవా నిధనం రణే॥ 11
వీరా! నేను మీ పక్షాన రణభూమిలో మాయావేత్తలు, విజయాభిలాషులు అయిన ఆ పాండవవీరులతో నీకు విజయమో, నాకు వీరమరణమో కోరుతూ యుద్ధం చేస్తాను. (11)
వాసుదేవం చ పార్థం చ చక్రగాండీవధారిణౌ।
సంధ్యాగతావివార్కేందూ సమేష్యేతే రథోత్తమౌ॥ 12
శ్రీకృష్ణుడు అర్జునుడు రథికులలో శ్రేష్ఠులు. శ్రీ కృష్ణుడు చక్రం, అర్జునుడు గాండీవం ధరిస్తారు. వారు సంధ్యాకాలంలో సూర్యచంద్రుల వలె పరస్పరం కలిసి యుద్ధానికి వస్తారు. ఆ సమయంలో నేను వారిని ఎదిరిస్తారు. (12)
యే చైవ తౌ రథోదారాః పాండుపుత్రస్య సైనికాః।
సహసైన్యానహం తాంశ్చ ప్రతీయాం రణమూర్ధని॥ 13
పాండుపుత్రుడయిన యుధిష్ఠిరుని పక్షంలో ఉన్న శ్రేష్ఠరథికులయిన యోధులను వారి సేనలను రణాగ్రాన ఎదిరిస్తాను. (13)
ఏతే రథా శ్చాతిరథాశ్చ తుభ్యం
యథాప్రధానం నృప కీర్తితా మయా।
తథాపరే యేఽర్ధరథాశ్చ కేచిత్
తథైవ తేషామపి కౌరవేంద్ర॥ 14
రాజా! నేనీ విధంగా నీకు అతిముఖ్యులయిన రథికులను, అథిరథులను వర్ణించాను. ఇతరులయిన అర్ధ రథికులను కూడా చెప్పాను. కౌరవేంద్రా! ఇదే రీతిగా పాండవ పక్షంలో వారి పరిచయం కూడా చేశాను. (14)
అర్జునం వాసుదేవం చ యే చాన్యే తత్ర పార్థివాః।
సర్వాంస్తాన్ వారయిష్యామి యావద్ ద్రక్ష్యామి భారత॥ 15
భారతా! అర్జునుడు, శ్రీకృష్ణుడు, ఇంకా ఇతరులయిన రాజులు ఇలా నాకు కనబడిన వారినందరినీ ముందుకు రాకుండా నిరోధిస్తాను. (15)
పాంచాల్యం తు మహాబాహో నాహం హన్యాం శిఖండినమ్।
ఉద్యతేషుమథో దృష్ట్వా ప్రతియుధ్యంతమాహవే॥ 16
కాని పాంచాల రాజకుమారుడయిన శిఖండి రణంలో వింటియందు బాణాన్ని సంధించి నన్ను ఎదిరించడం చూస్తే నేనతనని కొట్టను. (16)
లోకస్తం వేద యదహం పితుః ప్రియచికీర్షయా।
ప్రాప్తం రాజ్యం పరిత్యజ్య బ్రహ్మచర్యవ్రతే స్థితః॥ 17
నా తండ్రి గారికి ప్రీతి కలిగించడం కోసం నాకు లభించిన రాజ్యాన్ని వదిలి నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం లోకమెరుగును. (17)
చిత్రాంగదం కౌరవాణామ్ ఆధిపత్యేఽభ్యషేచయమ్।
విచిత్రవీర్యం చ శిశుం యౌవరాజ్యేఽభ్యషేచయమ్॥ 18
కౌరవుల రాజ్యానికి చిత్రాంగదుని అధిపతిగా పట్టాభిషేకం చేశాను. బాలకుడైన విచిత్రవీర్యుని యువరాజుగా అభిషేకించాను. (18)
దేవవ్రతత్వం విజ్ఞాప్య పృథివీం సర్వరాజసు।
నైవ హన్యాం స్త్రియం జాతు న స్త్రీ పూర్వం కదాచన॥ 19
రాజులందరిలో దేవవ్రతునిగా ప్రఖ్యాతిని పొంది, నేనెప్పుడూ స్త్రీని గాని; ముందు స్త్రీగా ఉండి, తరువాత పురుషునిగా మారిన వానిని గాని చంపను. (19)
స హి స్త్రీపూర్వకో రాజన్ శిఖండీ యది తే శ్రుతః।
కన్యా భూత్వా పుమాన్ జాతః న యోత్స్యే తేవ భారత॥ 20
రాజా! అతడు మొదట స్త్రీగా పుట్టాడు. భారతా! ఇలా ముందు కన్యగా ఉండి, తరువాత పురుషునిగా అయ్యాడు. ఈ విషయం నీవు విని ఉంటావు. కాబట్టి ఇతనితో నేను యుద్ధం చేయను. (20)
సర్వాం స్త్వన్యాన్ హనిష్యామి పార్థివాన్ భరతర్షభ।
యాన్ సమేష్యామి సమరే న తు కుంతీసుతాన్ నృప॥ 21
భరతశ్రేష్ఠా! నా ఎదుటపడిన ఇతర రాజులందరినీ నేను చంపుతాను. కుంతీ కుమారులను మాత్రం చంపను. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి ద్విసప్తధిక శతతమోఽధ్యాయః ॥ 172 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథసంఖ్యానపర్వమను ఉపపర్వమున రథాతిరథసంఖ్యానపర్వమను నూట డెబ్బది రెండవ ఆధ్యాయము. (172)