158. నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము

రుక్మిసహాయమును కౌరవులు, పాండవులు తిరస్కరించుట.

వైశంపాయన ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు భీష్మకస్య మహాత్మనః।
హిరణ్యరోమ్ణో నృపతేః సాక్షాదింద్రసఖస్య వై॥ 1
ఆకూతీనామధిపతిః భోజస్యాతియశస్వినః।
దాక్షిణాత్యపతేః పుత్రః దిక్షు రుక్మీతి విశ్రుతః॥ 2
వైశంపాయనుడు ఇట్లన్నాడు.
జనమేజయా! ఈ సమయంలోనే అతియశస్వి దక్షిణదేశాధిపతి, భోజవంశీయుడు - ఇంద్రుని చెలికాడు హిరణ్యరోముడను, భీష్మకుని పుత్రుడు 'రుక్మి' పాండవుల దగ్గరకు చేరుకున్నాడు. (1-2)
(రుక్మి మనసులోని సంకల్పాలకు అధిపతి, అనుకున్నది చేస్తాడు)
యః కిం పురుషసింహస్య గంధమాదనవాసినః।
కృత్స్నం శిష్యో ధనుర్వేదం చతుష్పాదనువాస్తవాన్॥ 3
రుక్మి గంధమాదన నివాసియైన కింపురుష శ్రేష్ఠుని శిష్యుడుగా చేరి నాలుగుపాదాలతో కూడిన ధనుర్వేదాన్ని అభ్యసించాడు. (3)
వి॥సం॥ ద్రుముడనే కింపురుషుని దగ్గర వేదం అభ్యసించాడు. (అర్జు)
యో మాహేంద్రం ధనుర్లేభే తుల్యం గాండీవతేజసా।
శార్ ఙ్గేణ చ మహాబాహుః సమ్మితం దివ్యలక్షణమ్॥ 4
గాండీవంతో సమానమైన 'విజయ' మనే ధనుస్సును ఇంద్రభగవానుని నుండి పొందాడు. ఇది శార్ ఙ్గధనుస్సుతో సమానం. (4)
త్రీణ్యైవైతాని దివ్యాని ధనూంషి దివి చారిణామ్।
వారుణం గాండివం తత్ర మాహేంద్రం విజయం ధనుః।
శార్ ఙ్గం తు వైష్ణవం ప్రాహుః దివ్యం తేజోమయం ధనుః॥ 5
స్వర్గంలో సంచరించే దేవతల దివ్యధనుస్సులు మూడు. అందులో "గాండీవం" వరుణదేవునిదిగా, 'విజయం' దేవేంద్రునిదిగ, దివ్యతేజోమయమైన శార్ ఙ్గధనుస్సు విష్ణుదేవునిదిగా చెప్పబడుతోంది. (5)
ధారయామాస తత్ కృష్ణః పరసేనాభయావహమ్।
గాండీవం పావకాల్లేభే ఖాండవే పాకశాసనిః॥ 6
శత్రుసైన్యానికి భయాన్ని కల్పించే ఆ శార్ ఙ్గ ధనుస్సును శ్రీకృష్ణుడు ధరించాడు. ఖాండవవనదహన సమయంలో అగ్నిహోత్రుని నుండి అర్జునుడు గాండీవ ధనుస్సును పొందగలిగాడు. (6)
ద్రుమాత్ రుక్మీ మహాతేజాః విజయం ప్రత్యపద్యత।
సంఛిద్య మౌరవాన్ పాశాన్ నిహత్య మురమోజసా॥ 7
నిర్జిత్య నరకం భౌమమ్ ఆహృత్య మణికుండలే।
షోడశస్త్రీసహస్రాణి రత్నాని వివిధాని చ॥ 8
ప్రతిపేదే హృషీకేశ శార్ ఙ్గం చ ధనురుత్తమమ్।
తేజస్వి అయిన రుక్మి ద్రుముని నుండి విజయమనే ధనుస్సును పొందాడు. శ్రీకృష్ణుడు తన తేజోబలపరాక్రమాలచే 'మురాసురుని పాశాలను భేదించి నరకాసురుని జయించి మణికుండలాలను తిరిగి వశం చేసుకున్నాడు. పదహారువేల స్త్రీలను - రకరకాల రత్నాలను స్వాధీన పరచుకున్నాడు. ఆ సమయంలో శార్ ఙ్గమనే ఉత్తమ ధనుస్సును కూడా పొందాడు. (7-8 1/2)
రుక్మీ తు విజయం లబ్ధ్వా ధనుర్మేఘనిభస్వనమ్॥ 9
విభీషయన్నివ జగత్ పాండవానభ్యవర్తత।
మేఘగర్జనవలె ఠంకారం చేసే విజయధనుస్సును రుక్మి పొందాడు. దానితో లోకాన్నంతా భయపెడుతూ పాండవులను సమీపించాడు. (9 1/2)
నామృష్యత పురా యోఽసౌ స్వబాహుబలగర్వితః॥ 10
రుక్మిణ్యా హరణం వీరో వాసుదేవేన ధీమతా।
బుద్ధిమంతుడయిన శ్రీకృష్ణుడు చేసిన రుక్మిణీ హరణాన్ని సహించలేకపోయినది ఈ రుక్మియే. (10 1/2)
కృత్వా ప్రతిజ్ఞాం నాహత్వా నివర్తిష్యే జనార్దనమ్॥ 11
తతోఽన్వధావత్ వార్ష్ణేయం సర్వశస్త్రభృతాం వరః।
సకలశస్త్రాలను బాగా తెలిసిన ఆ రుక్మి కృష్ణుని చంపనిదే తన నగరానికి తిరిగిరానని ప్రతిజ్ఞచేసి కృష్ణుని వెంటపడ్డాడు. (11 1/2)
సేనయా చతురంగిణ్యా మహత్యా దూరపాతయా॥ 12
విచిత్రాయుధవర్మిణ్యా గంగయేవ ప్రవృద్ధయా।
అతనితోపాటు ఆయుధాల కవచాలతో కూడిన చతురంగ బలాలు, చాలాదూరం వ్యాపించి వృద్ధి పొందుతున్న గంగా ప్రవాహంలా కనబడ్డాయి. (12 1/2)
స సమాసాద్య వార్ష్ణేయం యోగానామీశ్వరం ప్రభుమ్।
వ్యంసితో క్రీడితో రాజన్ నాజగామ స కుండినమ్।
రాజా! ఆ రుక్మి యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుని వెంబడించి ఓడిపోయి సిగ్గుతో మరల కుండినపురానికి చేరుకోలేదు. (13 1/2)
యత్రైవ కృష్ణేన రణే నిర్జితః పరవీరహా॥ 14
తత్ర భోజకటం నామ కృతం నగరముత్తమమ్।
శ్రీకృష్ణుడు శత్రుసైన్యాన్ని ఓడించిన చోట రుక్మి "భోజకట" మనే పేరుతో ఉత్తమ నగరాన్ని నిర్మించుకొన్నాడు. (14 1/2)
సైన్యేన మహతా తేన ప్రభూతగజవాజినా॥ 15
పురం తద్ భువి విఖ్యాతం భోజకటం నృప।
రాజా! అనేక గజాశ్వ సైన్యాలతో కూడిన ఆ నగరం భోజకటమనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. (15 1/2)
స భోజరాజః సైన్యేన మహతా పరివారితః॥ 16
అక్షౌహిణ్యా మహావీర్యః పాండవాన్ క్షిప్రమాగమత్।
మహాపరాక్రమవంతుడైన ఆ భోజరాజు ఒక అక్షౌహిణీ సైన్యంతో పాండవుల దగ్గరకు వేగంగా వచ్చాడు. (16 1/2)
తతః స కవచీ ధన్వీ తలీ ఖడ్గీ శరాసనీ॥ 17
ధ్వజేనాదిత్యవర్ణేన ప్రవివేశ మహాచమూమ్।
ఆ రుక్మి కవచాన్ని, ధనుస్సును, ఖడ్గశరాసనాలను ధరించి, సూర్యకాంతివంటి ధ్వజంతో పాండవ సేనలను చేరుకున్నాడు. (17 1/2)
విదితః పాండవేయానాం వాసుదేవప్రియేప్సయా॥ 18
యుధిష్ఠిరస్తు తం రాజా ప్రత్యుద్గమ్యాభ్యపూజయత్।
పాండవులకు అతని రాక తెలిసింది. యుధిష్ఠిరుడు కృష్ణునిప్రీతికోసం అతనికి ఎదురేగి ఆదరసత్కారాలు చేశాడు. (18 1/2)
స పూజితః పాండుపుత్రైః యథాన్యాయం సుసంస్తుతః॥ 19
ప్రతిగృహ్య తు తాన్ సర్వాన్ విశ్రాంతః సహసైనికః।
పాండుతనయులందరూ రుక్మిని యథావిధిగా సత్కరించి ప్రశంసించారు. రుక్మి కూడా ఆదరపూర్వక సత్కారాలను గైకొని, సైనికులతో సహా విశ్రాంతిని పొందాడు. (19 1/2)
ఉవాచ మధ్యే వీరాణాం కుంతీపుత్రం ధనంజయమ్॥ 20
సహాయోఽస్మి స్థితో యుద్ధే యది భీతోఽసి పాండవ।
కరిష్యామి రణే సాహ్యమ్ అసహ్యం తవ శత్రుభిః॥ 21
వీరులందరి మధ్యలో సుఖాసీనుడైన అర్జునుని జూచి - పాండునందనా! నీవు భయపడితే నేను నీకు యుద్ధంలో సహాయం చేస్తాను. అందుకే ఇక్కడకు వచ్చాను. నీ శత్రువులు నిన్ను ఎదుర్కొన లేనట్లుగా నేను నీకు సహాయపడగలను. (20-21)
న హి మే విక్రమే తుల్యః పుమానస్తీహ కశ్చన।
హనిష్యామి రణే భాగం యన్మే దాస్యసి పాండవ॥ 22
ఈ లోకంలో నాతో సమానమైన పరాక్రమవంతుడు లేడు. నీవు యుద్ధంలో నా పాలు చేసిన నీ శత్రువులను సంహరించగలను. (22)
అపి ద్రోణకృపౌ వీరౌ భీష్మకర్ణావథో పునః।
అథవా సర్వ ఏవైతే తిష్ఠంతు వసుధాధిపాః॥ 23
నిహత్య సమరే శత్రూన్ తవ దాస్యామి మేదినీమ్।
నా ఎదుట ద్రోణ, కృప, భీష్మ కర్ణాది వీరులెవరైనా ఎదురొడ్డి నిలిస్తే వారందరినీ నేనొక్కడనే సంహరించి ఈ భూమినంతా నీకు సమర్పిస్తాను. (23 1/2)
ఇత్యుక్తో ధర్మరాజస్య కేశవస్య చ సన్నిధౌ॥ 24
శృణ్వతాం పార్థివేంద్రాణామ్ అన్యేషాం చైవ సర్వశః।
వాసుదేవమభిప్రేక్ష్య ధర్మరాజం చ పాండవమ్॥ 25
ఉవాచ ధీమాన్ కౌంతేయః ప్రహస్య సఖిపూర్వకమ్।
ధర్మరాజూ, కృష్ణుడూ, మిగిలిన రాజులూ వింటూ ఉండగా రుక్మి అలా అన్నాడు. అపుడు అర్జునుడు కృష్ణునీ, ధర్మరాజునూ చూసి మైత్రీ పూర్వకంగా నవ్వుతూ ఇలా అన్నాడు. (24,25 1/2)
కౌరవాణాం కులే జాతః పాండోః పుత్రో విశేషతః॥ 26
ద్రోణం వ్యపదిశన్ శిష్యః వాసుదేవసహాయవాన్।
భీతోఽస్మీతి కథం బ్రూయాం దధానో గాండివం ధనుః॥ 27
వీరుడా! కురువంశంలో పుట్టి, అందునా పాండురాజు తనయుడనై, ద్రోణసిష్యునిగా చెప్పుకొంటూ వాసుదేవుని సహాయం పొందుతూ... గాండీవాన్ని చేబట్టిన నేను భయపడుతున్నానను నీతో ఎలా చెప్పగలను? (26-27)
యుధ్యమానస్య మే వీర గంధర్వైః సుమహాబలైః।
సహాయో ఘోషయాత్రాయాం కస్తదాసీత్ సఖా మమ॥ 28
వీరుడా! కౌరవుల ఘోషయాత్ర సమయంలో నేను బలవంతులైన గంధర్వులతో యుద్ధం చేశాను. ఆ సమయంలో ఏ మిత్రుడు నాకు సహాయపడ్డాడు? (28)
తథా ప్రతిభయే తస్మిన్ దేవదానవసంకులే।
ఖాండవే యుధ్యమానస్య కస్సహాయస్తదాభవత్॥ 29
ఖాండవవనంలో దేవదానవ యుద్ధంలో నేను శత్రు సంహారం చేసేటప్పుడు ఎవరు నాకు సహాయపడ్డారు? (29)
నివాతకవచైర్యుద్ధే కాలకేయైశ్చ దానవైః।
తత్ర మే యుధ్యమానస్య కస్సహాయస్తదా భవత్॥ 30
నివాతకవచులు, కాలకేయులు అనే రాక్షసులతో చేసిన యుద్ధంలో నాకు సహాయంగా ఎవరు వచ్చారు? (30)
తథా విరాటనగరే కురుభిఆHఅ సహసంగరే।
యుధ్యతో బహుభిస్తత్ర కస్సహాయోఽభవన్మమ॥ 31
అలాగే విరాట నగరంలో పెద్ద కౌరవసైన్యంలో చాలామంది వీరులతో చేసిన పోరాటంలో ఒంటరిగా నిలిచిన నాకు ఎవరు సాయం చేశారు? (31)
ఉపజీవ్య రణే రుద్రం శుక్రం వైశ్రవణం యమమ్।
వరుణం పావకం చైవ కృపం ద్రోణం చ మాధవమ్॥ 32
ధారయన్ గాండివం దివ్యం ధనుస్తేజోమయం దృఢమ్।
అక్షయ్యశరసంయుక్తః దివ్యాస్త్రపరిబృంహితః॥ 33
కథమస్మద్విధో బ్రూయాత్ భీతోఽస్మీతి యశోహరమ్।
వచనం నరశార్దూల వజ్రాయుధమపి స్వయమ్॥ 34
నేను యుద్ధంలో సాఫల్యం పొందాలను ఇంద్ర, రుద్ర, యమ, కుబేర, వరుణ, అగ్ని, కృపాచార్య, ద్రోణాచార్య, శ్రీకృష్ణులను ఆరాధించాను. నేను తేజోమయమయిన దివ్యగాండీవాన్ని ధరించినవాడను. నా దగ్గర అక్షయబాణాలతో నిండిన అమ్ముల పొదులు ఉన్నాయి. దివ్యాస్త్రాలతో ఉత్తేజితుణ్ణి. నాలాంటి వాడు సాక్షాత్తు ఇంద్రుని ముందు నిలచినా "నేను భయపడినవాడను" అని చెప్పుకొనటం యశోనాశకం. అట్టి మాట ఎలా అంటాను? (32-34)
నాస్మి భీతో మహాబాహో సహాయార్థశ్చ నాస్తి మే।
యథాకామం యథాయోగం గచ్ఛ వాఽన్యత్ర తిష్ఠ వా॥ 35
మహాబాహూ! నేను భయపడను. నాకు నీ సహాయం అవసరం లేదు. నీవు నీ యిష్ట ప్రకారం వెళ్ళవచ్చును. లేదా ఎక్కడయినా నిలవవచ్చును. (35)
వైశంపాయన ఉవాచ
(తచ్ఛ్రుత్వా వచనం తస్య విజయస్య హి ధీమతః।)
వినివర్త్య తతో రుక్మీ సేనాం సాగరసన్నిభామ్।
దుర్యోధనముపాగచ్ఛత్ తథైవ భరతర్షభ॥ 36
వైశంపాయనుడిట్లు అన్నాడు. భరతోత్తమా! బుద్ధిమంతుడైన రుక్మి అర్జునుని మాటలను విని, సముద్రంవంటి తనసైన్యాన్ని, మరలించుకొని అలాగే దుర్యోధనుని సమీపించాడు. (36)
తథైవ చాభిగమ్యైనమ్ ఉవాచ వసుధాధిపః।
ప్రత్యఖ్యాతశ్చ తేనాపి స తదా శూరమానినా॥ 37
రుక్మి తన సైన్యంతో పాటు దుర్యోధనుని సమీపించి తన సహాయాన్ని తీసుకోమని అడిగాడు. కాని తనను తాను శూరునిగా భావించే ఆ దుర్యోధనుడు రుక్మిని తిరస్కరించాడు. (37)
ద్వావేవ తు మహారాజ తస్మాద్యుద్ధాదపేయతుః।
రౌహిణేయశ్చ వార్ష్ణేయో రుక్మీ చ వసుధాధిపః॥ 38
రాజా! ఆ యుద్ధంలో వృష్ణివంశవీరుడు బలరాముడు, రుక్మి వీరిద్దరే పాల్గొననివారు. (38)
గతే రామే తీర్థయాత్రాం భీష్మకస్య సుతే తథా।
ఉపావిశన్ పాండవేయాః మంత్రాయ పునరేవ చ॥ 39
బలరాముడు తీర్థయాత్రలకై వెళ్ళాడు. భీష్మక పుత్రుడు రుక్మి మరలిపోయాడు. పాండవులు మళ్లీ రహస్య సమాలోచనకై కూర్చున్నారు. (39)
సమితిః ధర్మరాజస్య సా పార్థివసమాకులా।
శుశుభే తారకైశ్చిత్రా ద్యౌశ్చంద్రేణేవ భారత॥ 40
భారతా! రాజన్యులతో నిండిన ఆ ధర్మరాజు సభ తారలతో కూడిన చంద్రునితో చిత్రమైన ఆకాశంలా ప్రకాశిస్తోంది. (40)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ సైన్యనిర్యాణపర్వణి రుక్మిప్రత్యాఖ్యానే అష్టపంచాశదధిక శతతమోఽధ్యాయః ॥ 158 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సైన్యనిర్యాణ పర్వమను ఉపపర్వమున రుక్మిని తిరస్కరించుట అను
నూట ఏబది ఎనిమిదవ ఆధ్యాయము. (158)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకము కలిపి మొత్తం 401/2 శ్లోకాలు)