157. నూట ఏబది ఏడవ అధ్యాయము
ధర్మరాజు సేనాపతులను నియమించుట, బలరాముని ఆగమనము.
జనమేజయ ఉవాచ
ఆపగేయం మహాత్మానం భీష్మం శస్త్రభృతాం వరమ్।
పితామహం భారతానాం ధ్వజం సర్వమహీక్షితామ్॥ 1
బృహస్పతిసమం బుద్ధ్యా క్షమయా పృథివీసమమ్।
సముద్రమివ గాంభీర్యే హిమవంతమివ స్థితమ్॥ 2
ప్రజాపతిమివౌదార్యే తేజసా భాస్కరోపమమ్।
మహేమ్ద్రమివ శత్రూణాం ధ్వంసనం శరవృష్టిభిః॥ 3
రణయజ్ఞే ప్రవితతే సుభీమే లోమహర్షణే।
దీక్షితం చిరరాత్రాయ శ్రుత్వా తత్ర యుధిష్ఠిరః॥ 4
కిమబ్రవీన్మహాబాహుః సర్వశస్త్రభృతాం వరః।
భీమసేనార్జునౌ వాపి కృష్ణో వా ప్రత్యభాషత॥ 5
జనమేజయుడు ఇలా ఆరంభించాడు. గంగా సుతుడు మహాత్ముడు, శస్త్రాలు ధరించిన వారిలో ప్రముఖుడు, సమస్త రాజన్యులలో పతాక స్థాయివాడు. అతడు బుద్ధిలో బృహస్పతి. ఓరిపులో భూదేవివంటివాడు, గాంభీర్యంలో సముద్రుడు. హిమవంతుడంతటి స్థైర్యంకలవాడు. ఔదార్యంలో ప్రజాపతి వంటి వాడు. తేజస్సులో సూర్యుడు. శరవృష్టిని కురిపించి శత్రుసంహారం చేయడంలో ఇంద్రుని వంటివాడు కదా! అట్టి భీష్ముడు ఈ మహభయంకరమైన రణయజ్ఞంలో బహురాత్రదీక్షను స్వీకరించాడని తెలిసి ధర్మనందనుడు ఏమన్నాడు? భీమార్జునులు ఏమన్నారు? శ్రీ కృష్ణభగవానుడు ఏమన్నాడు?(1-5)
వైశంపాయన ఉవాచ
ఆపద్ధర్మార్థకుశలః మహాబుద్ధిర్యుధిష్ఠిరః।
సర్వాన్ భ్రాతౄన్ సమానీయ వాసుదేవం చ శాశ్వతమ్॥ 6
ఉవాచ వదతాం శ్రేష్ఠః సాన్త్వపూర్వమిదం వచః।
వైశంపాయనుడిట్లన్నాడు.
ఆపద్ధర్మవిషయాల్లో నేర్పరి, మహాబుద్ధి సంపన్నుడూ అయిన ధర్మరాజు తనతమ్ములనూ, శాశ్వతుడయిన శ్రీ కృష్ణునీ పిలిచి అనునయంగా ఓదార్పుగా ఇలా పలుకనారంభించాడు. (6 1/2)
పర్యాక్రామత సైన్యాని యత్తాస్తిష్ఠత దంశితాః॥ 7
పితామహేన వో యుద్ధం పూర్వమేవ భవిష్యతి।
తస్మాత్ సప్తసు సేవాసు ప్రణేతౄన్ మమ పశ్యత॥ 8
మీరంతా యుద్ధరంగాన్ని కలయజూచి మీ సైన్యాన్ని అదుపులో పెట్టుకోండి. కవచాదులను ధరించి యుద్ధసన్నద్ధులు కండి. ముందుగా మీరు భీష్మపితామహునితో యుద్ధానికి దిగవలసి ఉంది. కాబట్టి మన ఏడు అక్షౌహిణుల సైన్యాన్ని సేనాపతులను సమీక్షించండి. (7-8)
కృష్ణ ఉవాచ
యథార్హతి భవాన్ వక్తుమ్ అస్మిన్ కాలే హ్యుపస్థితే।
తథేదమర్థవద్వాక్యమ్ ఉక్తం తే భరతర్షభ॥ 9
శ్రీకృష్ణుడిట్లు అన్నాడు. భరతకులభూషణా! ఈ సమయంలో ఏ మాటలు పలకాలో ఆ మాటలనే అర్థవంతంగా పలికావు. (9)
రోచతే మే మహాబాహో క్రియతాం యదనంతరమ్।
నాయకాస్తవ సేనాయాం క్రియంతామిహ సప్త వై॥ 10
మహాబాహూ! నాకు నీ మాటలు బాగా నచ్చాయి. తరువాతి కార్యక్రమం ప్రారంభించు. మన సేనానాయకులను ఏడుగురిని ఇక్కడనే నిశ్చయించు. (10)
వైశంపాయన ఉవాచ
తతో ద్రుపదమానాయ్య విరాటం శినిపుంగవమ్।
ధృష్టద్యుమ్నం చ పాంచాల్యం ధృష్టకేతుం చ పార్థివ॥ 11
శిఖండినం చ పాంచాల్యం సహదేవం చ మాగధమ్।
ఏతాన్ సప్త మహాభాగాన్ వీరాన్ యుద్ధాభికాంక్షిణః॥ 12
సేనాప్రణేతౄన్ విధివద్ అభ్యషించత్ యుధిష్ఠిరః।
సర్వసేనాపతిం చాత్ర ధృష్టద్యుమ్నం చకార హ॥ 13
ద్రోణాంతహేతోరుత్పన్నః య ఇద్ధాజ్జాతవేదసః।
వైశంపాయనుడు ఇట్లు అన్నాడు.
జనమేజయా! ద్రుపదరాజు, విరాటుడు, సాత్యకి, పాంచాల రాజకుమారుడైన ధృష్టద్యుమ్నుడు, ధృష్టకేతువు, పాంచాలవీరుడైన శిఖండి, మగధరాజు సహదేవుడు, అనే ఈ ఏడుగురు మహావీరులను ధర్మనందనుడు శాస్త్రానుసారంగా సేనాపతులుగా అభిషిక్తులను గావించాడు. ధృష్టద్యుమ్నుని మాత్రం సర్వసైన్యాధిపతిగా నియమించాడు. అతడే ద్రోణాచార్యుని సంహరించడానికి జ్వలించే అగ్నినుండి ఉద్భవించాడు. (11-13 1/2)
సర్వేషామేవ తేషాం తు సమస్తానాం మహాత్మనామ్॥ 14
సేనాపతిపతిం చక్రే గుడాకేశం ధనంజయమ్।
అయితే ధనంజయుడైన అర్జునుని సేనాపతు లందరికీ అధిపతిగా నియమించారు. (14 1/2)
అర్జునస్యాపి నేతా చ సంయంత చైవ వాజినామ్॥ 15
సంకర్షణానుజః శ్రీమాన్ మహాబుద్ధిః జనార్దనః।
అర్జునునకు కూడా అధిపతిగా అతని గుర్రాలు అదుపు చేసే శ్రీకృష్ణుని నియమించాడు. (15 1/2)
తద్దృష్ట్వోపస్థితం యుద్ధం సమాసన్నం మహాత్యయమ్॥ 16
ప్రావిశత్ భవనం రాజన్ పాండవానాం హలాయుధః।
సహాక్రూరప్రభృతిభిః గదసాంబోద్ధవాదిభిః॥ 17
రౌక్మిణేయాహుకసుతైః చారుదేష్ణ పురోగమైః।
వృష్ణిముఖ్యైరధిగతైః వ్యాఘ్రైరివ బలోత్కటైః॥ 18
అభిగుప్తో మహాబాహుః మరుద్భిరివ వాసవః।
నీలకౌశేయవసనః కైలాసశిఖరోపమః॥ 19
సింహఖేలగతిః శ్రీమాన్ మదరక్తాంతలోచనః।
రాజా! భయంకరమగు మహాయుద్ధం చేరువకాగా పాండవ భవనానికి బలరాముడు చేరుకున్నాడు. ఆ మహాత్ముని నేత్రాలు ఎఱ్ఱబారాయి. ఆ బలదేవునితో పాటు అక్రూరుడు మొదలైన యదువంశీయులు, గదుడు, సాంబుడు, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు, ఆహుకపుత్రులు చారుదేష్ణుడు, మొదలగు వృష్ణివంశీయులు, వ్యాఘ్రబలసంపన్నులు కూడా చేరుకున్నారు. వీరందరితో ఆ బలరాముడు మరుద్గణాలతో కూడిన ఇంద్రునిలాగా ప్రకాశించాడు. (16-19 1/2)
తం దృష్ట్వా ధర్మరాజశ్చ కేశవశ్చ మహాద్యుతిః॥ 20
ఉదతిష్ఠత్ తతః పార్థః భీమకర్మా వృకోదరః।
గాండీవ ధన్వా యే చాన్యే రాజాన స్తత్ర కేచన॥ 21
బలరాముని చూచి, ధర్మరాజు, మహాతేజస్వి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ఇంకా అక్కడే ఉన్న మహావీరులందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. (20-21)
పూజయాంచక్రిరే తే వై సమాయాంతం హలాయుధమ్।
తతస్తం పాండవో రాజా కరే పస్పర్శ పాణినా॥ 22
బలరామునిచూచి అందరూ ఆదరించారు. ధర్మనం దనుడు తనచేతితో బలరాముని ఆదరంతో తాకాడు. (22)
వాసుదేవపురోగాస్తం సర్వఏవాభ్యవాదయన్।
విరాటద్రుపదౌ వృద్ధౌ అభివాద్య హలాయుధః॥ 23
యుధిష్ఠిరేణ సహితః ఉపావిశదరిందమః।
శ్రీకృష్ణుడు మొదలైన వారంతా బలరామునికి నమస్కరించారు. పిమ్మట వృద్ధులైన విరాట ద్రుపద రాజులకు బలరాముడు నమస్కరించి ధర్మరాజుతో కలసి కూర్చున్నాడు. (23 1/2)
తతస్తేషూపవిష్టేషు పార్థివేషు సమంతతః।
వాసుదేవమభిప్రేక్ష్య రౌహిణేయోఽభ్యభాషత॥ 24
ఆ రాజులంతా చుట్టూరా కూర్చుని యుండగా బలరాముడు శ్రీకృష్ణునిజూచి ఇలా అన్నాడు. (24)
భవితాయం మహారౌద్రః దారుణః పురుషక్షయః।
దిష్టమేతత్ ధ్రువం మన్యే న శక్యమతివర్తితుమ్॥ 25
జరుగబోయే ఈ మహాసంగ్రామం దారుణమైనది. జననష్టాన్ని కలిగిస్తుంది. ఇది దైవసంకల్పం. దీనిని తప్పించుకొనటం కుదరనిది. (25)
తస్మాత్ యుద్ధాత్ సముత్తీర్ణాన్ అపి వః ససుహృజ్జనాన్।
అరోగానక్షతైః దేహైః ద్రష్టాస్మీతి మతిర్మమ॥ 26
ఈ మహాయుద్ధాన్ని పూర్తిచేసిన మీరు మీ స్నేహితులందరితో కలిసి ఎట్టి ఆపదలు పొందక ఆరోగ్యవంతులుగా నుండగలరు. నేను దీనిని తప్పక చూడగలను అని నాకు అనిపిస్తోంది. (26)
సమేతం పార్థివం క్షత్రం కాలపక్వమసంశయమ్।
విమర్దశ్చ మహాన్ భావీ మాంసశోణితకర్దమః॥ 27
గుంపులు గుంపులుగా చేరిన రాజులందరూ కాలాగ్నిలో ఉడికి పోగలరు. జననాశం తప్పదు. ఈ పోరులో రక్త మాంసాలు బురదగా ఏర్పడతాయి.
ఉక్తో మయా వాసుదేవః పునః పునరుపహ్వరే।
సంబంధిషు సమాం వృత్తిం వర్తస్వ మధుసూదన॥ 28
పాండవా హి యథా ఽస్మాకం తథా దుర్యోధనో నృపః।
తస్యాపి క్రియతాం సాహ్యం స పర్యేతి పునః పునః॥ 29
నేను రహస్యంగా శ్రీకృష్ణునికి "మధుసూదనా! మన బంధువులందరిదగ్గర ఒకేపద్ధతిని అవలంబించు. మనకు పాండవులెట్లాగో దుర్యోధనుడూ అంతే. వానికి కూడా సహాయం చేయి. అతడు మాటి మాటికి మనచుట్టూ తిరుగుతున్నాడు." అని చాలాసార్లు చెప్పాను. (29)
తచ్చ మే నాకరోద్వక్యం త్వదర్థే మధుసూదనః।
నిర్విష్టః సర్వభావేస ధనంజయమవేక్ష్య హ॥ 30
కాని ధర్మనందనా! ఈ కృష్ణుడు నామాటలను పెడచెవిని పెట్టాడు. అంతేకాదు. ధనంజయునిపై విశేషానురాగాన్ని ప్రదర్శించి మీలో చేరాడు. (30)
ధ్రువో జయః పాండవానాం ఇతి మే నిశ్చితా మతిః।
తథా హ్యభినివేశోఽయం వాసుదేవస్య భారత॥ 31
ఈ యుద్ధంలో పాండవులకే జయం లభిస్తోంది అని నా అభిప్రాయం. శ్రీకృష్ణుని హృదయంలో కూడా ఈ సంకల్పమే బలంగా ఉంది. (31)
న చాహముత్సహే కృష్ణమ్ ఋతే లోకముదీక్షితుమ్।
తతో ఽహమనువర్తామి కేశవస్య చికీర్షితమ్॥ 32
నేను కృష్ణుని వదలి ఇతర జగత్తును చూడలేను. కాబట్టి కృష్ణుడు చేసే దాన్నే నేనూ అనుసరిస్తాను. (32)
ఉభౌ శిష్యా హి మే వీరౌ గదాయుద్ధవిశారదౌ।
తుల్యస్నేహోఽస్మ్యతో భీమే తథా దుర్యోధనే నృపే॥ 33
గదాయుద్ధంలో ఆరితేరిన భీముడు - దుర్యోధనుడు నాశిష్యులే. కాబట్టి వీరిద్దరిపైన ఒకేవిధమైన వాత్సల్యం నాకున్నది. (33)
తస్మాత్ యాస్యామి తీర్థాని సరస్వత్యా నిషేవితుమ్।
న హి శక్ష్యామి కౌరవ్యాన్ నశ్యమానానుపేక్షితుమ్॥ 34
అందుచేత నేను సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థాలు సేవించటానికి వెడుతున్నాను. నశించిపోతున్న కౌరవవంశస్థులను చూస్తూ ఉపేక్షించలేను. (34)
ఏవముక్త్వా మహాబాహుః అనుజ్ఞాతశ్చ పాండవైః।
తీర్థయాత్రాం యయౌ రామః నిర్వర్త్య మధుసూదనమ్॥ 35
ఈ విధంగా పలికి బలదేవుడు పాండవులనుండి అనుమతి పొంది, శ్రీకృష్ణుని సంతోషపెట్టి తీర్థయాత్రలు చేయటానికి బయలు దేరాడు. (35)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ సైన్యనిర్యాణపర్వణి బలరామ తీరథాయాత్రాగమనే సప్తపంచాశదధిక శతతమోఽధ్యాయః ॥ 157 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున, సైన్యనిర్యాణ పర్వమను ఉపపర్వమున బలరామ తీర్థయాత్రా గమనము అను
నూట ఏబది ఏడవ ఆధ్యాయము. (157)