149. నూట నలువది తొమ్మిదవ అధ్యాయము
పాండవుల కర్ధరాజ్యమిమ్మని ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి చెప్పుట.
వాసుదేవ ఉవాచ
ఏవముక్తే తు గాంధార్యా ధృతరాష్ట్రో జనేశ్వరః।
దుర్యోధనమువాచేదం రాజమధ్యే జనాధిప॥ 1
వాసుదేవిడిట్లు చెపుతున్నాడు. గాంధారి ఇలా చెప్పాక ధృతరాష్ట్రుడు సభామధ్యంలో దుర్యోధనునితో ఇలా అన్నాడు. (1)
దుర్యోధన నిబోధేదం యత్త్వాం వక్ష్యామి పుత్రక।
తథా తత్ కురు భద్రం తే యద్యస్తి పితృగౌరవమ్॥ 2
పుత్రా! దుర్యోధనా! తండ్రి మీద గౌరవం ఉంటే నేను చెప్పేమాట విని అలా చెయ్యి. నీకు శుభం కలుగుతుంది. (2)
సోమః ప్రజాపతిః పూర్వం కురూణాం వంశవర్ధనః।
సోమాద్బభూవ షష్ఠోఽయం యయాతిర్నహుషాత్మజః॥ 3
మొదట ఈ కురువంశాన్ని వృద్ధి పొందించిన వాడు చంద్రుడనే ప్రజాపతి. అతనికి ఆరవ తరం వాడు నహుషుని కుమారుడు యయాతి. (3)
తస్య పుత్రా బభూవుర్హి పంచ రాజర్షిసత్తమాః।
తేషాం యదుర్మహాతేజాః జ్యేష్ఠః సమభవత్ ప్రభుః॥ 4
అతనికి రాజర్షి సత్తములయిన అయిదుగురు కొడుకులు. వారిలో పెద్దవాడు యదువు. అతడు మహాతేజస్వి, సమర్థుడూను. (4)
పూరుర్యవీయాంశ్చ తతః యోఽస్మాకం వంశవర్ధనః।
శర్మిష్ఠయా సంప్రసూతః దుహిత్రా వృషపర్వణః॥ 5
పూరుడు చిన్నవాడు. అతడే మనవంశం వృద్ధి పొందించాడు. అతడు శర్మిష్ఠకొడుకు. శర్మిష్ఠ వృషపర్వుని కూతురు. (5)
యదుశ్చ భరతశ్రేష్ఠ దేవయాన్యాః సుతోఽభవత్।
దౌహిత్ర స్తాత శుక్రస్య కావ్యస్యామితతేజసః॥ 6
యదువు దేవయాని యొక్క కొడుకు. అమిత తేజస్వి అయిన శుక్రుని దౌహిత్రుడు. (6)
యాదవానాం కులకరో బలవాన్ వీర్యసమ్మతః।
అవమేనే స తు క్షత్రం దర్పపూర్ణః సుమందధీః॥ 7
అతడు యదువంశకర్త, బలవంతుడు, పరాక్రమం కలవాడు. అతడు బుద్ధిలేకుండా గర్వంతో క్షత్రియ జాతిని అవమానించాడు. (7)
న చాతిష్ఠత్ పితుః శాస్త్రే బలదర్పవిమోహితః।
అవమేనే చ పితరం భ్రాతౄంశ్చాప్యపరాజితః॥ 8
పరాజయం ఎరుగని యదువు గర్వంతో తండ్రి మాట కూడా వినలేదు. తండ్రినీ, తమ్ముళ్లనూ అవమానించాడు. (8)
పృథివ్యాం చతురంతాయాం యదురేవాభవద్బలీ।
వశే కృత్వా స నృపతీన్ న్యవసన్నాగసాహ్వయే॥ 9
భూమి అంతటిలోనూ యదువే బలవంతుడయ్యాడు - రాజులందరినీ అతడు వశపరచుకొని హస్తినాపురంలో నివసించాడు. (9)
తం పితా పరమక్రుద్ధః యయాతి ర్నహుషాత్మజః।
శశాప పుత్రం గాంధారే రాజ్యాచ్చాపి వ్యరోపయత్॥ 10
వాని మీద కోపించి యయాతి వానిని శపించాడు - రాజ్యం నుండి కూడా తప్పించాడు. (10)
యే చైనమన్వవర్తంత భ్రాతరో బలదర్పితాః।
శశాప తానభిక్రుద్ధః యయాతిస్తనయా నథ॥ 11
గర్వాంసులై వాని వెంట తిరిగే తమ్ముళ్లను కూడా కోపంతో యయాతి శపించాడు. (11)
యనీయాంసం తతః పూరుం పుత్రం స్వవశవర్తినమ్।
రాజ్యే నివేశయామాస విధేయం నృపసత్తమః॥ 12
యయాతి తనకు విధేయుడై తన వశంలో ఉన్న(మాట విన్న) చిన్నకొడుకు పూరుని రాజ్యంలో ప్రతిష్ఠించాడు. (12)
ఏవం జ్యేష్ఠోఽప్యథోత్సిక్తః న రాజ్యమభిజాయతే।
యనీయాంసోఽపి జాయంతే రాజ్యం వృద్ధోపసేవయా॥ 13
ఇలా పెద్దవాడయినా తండ్రిని కాదంటే రాజ్యం పొందలేడు. పెద్దలను గౌరవంతో సేవిస్తే చిన్నవాడయినా రాజ్యం పొందుతాడు. (13)
తథైవ సర్వధర్మజ్ఞః పితుర్మమ పితామహః।
ప్రతీపః పృథివీపాలః త్రిషు లోకేషు విశ్రుతః॥ 14
అలాగే నాతండ్రికి తాత ప్రతీప మహారాజు అతడు సర్వధర్మాలూ తెలిసినవాడని మూడు లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కాడు. (14)
తస్య పార్థివసింహస్య రాజ్యం ధర్మేణ శాసతః।
త్రయః ప్రజజ్ఞిరే పుత్రాః దేవకల్పా యశస్వినః॥ 13
ధర్మసహితంగా రాజ్యం పాలించే ఆయనకు యశస్వులై దేవసమానులయిన ముగ్గురు పుత్రులు కలిగారు. (15)
దేవాపి రభవత్ శ్రేష్ఠః బాహ్లీకః స్తదనంతరమ్।
తృతీయః శాంతనుస్తాత ధృతిమాన్ మే పితామహః॥ 16
దేవాపి పెద్దవాడు. తరువాతి వాడు బాహ్లికుడు. మూడవ వాడు శంతనుడు - మాతాత మంచి ధైర్యశాలి. (16)
దేవాపిస్తు మహాతేజాః త్వగ్దోషీ రాజసత్తమః।
ధార్మికస్సత్యవాదీ చ పితుః శుశ్రూషణే రతః॥ 17
దేవాపి మహాతేజస్వి, ధార్మికుడు, సత్యవచనుడు, తండ్రి సేవలు చేయడంలో ఆసక్తి కలవాడు. కాని చర్మదోషం కలవాడు. (17)
పౌర జానపదానాం చ సమ్మతః సాధుసత్కృతః।
సర్వేషాం బాల వృద్ధానాం దేవాపిర్హృదయంగమః॥ 18
అతడు పౌరులకు, గ్రామస్థులకూ సమ్మతుడు. సజ్జనులాతనిని సత్కరించే వారు. బాలురకూ, వృద్ధులకూ అందరికీ అతడు మిక్కిలి మనోజ్ఞంగా ఉండే వాడు. (18)
వదాన్యః సత్యసంధశ్చ సర్వభూతహితే రతః।
వర్తమానః పితుః శాస్త్రే బ్రాహ్మణానాం తథైవ చ॥ 19
అతడు మంచిదాత, సత్యసంధుడు, సర్వప్రాణులకూ హితం చేయడంలో ఆసక్తి కలవాడు. తండ్రి యొక్క, బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞను నిర్వర్తించేవాడు. (19)
బాహ్లీకస్య ప్రియో భ్రాతా శాంతనోశ్చ మహాత్మనః।
సౌభ్రాత్రం చ పరం తేషాం సహితానాం మహాత్మనామ్॥ 20
ఆ దేవాపి బాహ్లీకునకూ, మహాత్ముడయిన శంతనునకూ కూడా అన్న. వారికి సోదరప్రేమ చాలా ఎక్కువ. (20)
అథ కాలస్య పర్యాయే వృద్ధో నృపతిసత్తమః।
సంభారానభీషేకార్థం కారయామాస శాస్త్రతః॥ 21
కొంతకాలానికి వృద్ధుడయిన మహారాజు విధ్యుక్తంగా అభిషేకం కోసం ఏర్పాటు చేశాడు. (21)
కారయామాస సర్వాణి మంగలార్థాని వై విధుః।
తం బ్రాహ్మణాశ్చ వృద్ధాశ్చ పౌరజానపదైః సహ॥ 22
సర్వే నివారయామాసుః దేవాపేరభిషేచనమ్।
అభిషేకానికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చాడు రాజు. అపుడు బ్రాహ్మణులు, వృద్ధులు, పౌరులు, జానపదులూ అంతా దేవాపి అభిషేకాన్ని వద్దన్నారు. (22 1/2)
స తచ్ఛ్రుత్వా తు నృపతిః అభిషేకనివారణమ్।
అశ్రుకంఠోఽభవద్రాజా పర్యశోచత చాత్మజమ్॥ 23
అభిషేకం పనికిరాదన్న వారి మాట విని మహారాజు కుమారుని గురించి చాలా దుఃఖించాడు. (23)
ఏవం వదాన్యో ధర్మజ్ఞః సత్యసంధశ్చ సోఽభవత్।
ప్రియః ప్రజానామపి సన్ త్వగ్దోషేణ ప్రదూషితః॥ 24
ఇలా అతడు దాత, ధర్మజ్ఞుడు, సత్యవాది, ప్రజలకు ఇష్టుడూ అయినా చర్మదోషంతో దూషితుడయ్యాడు. (24)
హీనాంగం పృథివీపాలం నాభినందంతి దేవతాః।
ఇతి కృత్వా నృపశ్రేష్ఠం ప్రత్యషేధన్ ద్విజర్షభాః॥ 25
అవయవలోపం కలవారిని దేవతలు ప్రశంసించరని విప్రులాతనిని వద్దన్నారు. (25)
తతః ప్రవ్యథితాంగోఽసౌ పుత్రశోక సమన్వితః।
నివారితం నృపం దృష్ట్వా దేవాపిః సంశ్రితో వనమ్॥ 26
అపుడారాజు పుత్రశోకంతో ఎంతో కృశించిపోయాడు - నివారింపబడిన రాజును చూసి దేవాపి అడవులకు వెళ్లిపోయాడు. (26)
బాహ్లీకో మాతులకులం త్వక్త్వా రాజ్యం సమాశ్రితః।
పితృభ్రాతౄన్ పరిత్యజ్య ప్రాప్తవాన్ పరమర్థిమత్॥ 27
తండ్రినీ, సోదరులనూ, రాజ్యాన్నీ వదిలి బాహ్లీకుడు మేనమామల దగ్గరకు వెళ్లి సంవత్సమృద్ధమయిన రాజ్యం పొందాడు. (27)
బాహ్లీకేన త్వనుజ్ఞాతః శాంతనుర్లోక విశ్రుతః।
పితర్యుపరతే రాజన్ రాజా రాజ్యమకారయత్॥ 28
బాహ్లీకుని అనుజ్ఞతో శాంతనుడు తండ్రి మరణానంతరం రాజై రాజ్యం చేశాడు. (28)
తథైవాహం మతిమతా పరిచింత్యేహ పాండునా।
జ్యేష్ఠః ప్రభ్రంశితో రాజ్యాత్ హీనాంగ ఇతి భారత॥ 29
అలాగే జ్యేష్ఠుడ నయినా అంగలోపం కలవాడిని అని రాజ్యం లేకుండా పాండురాజును రాజును చేశాడు. (29)
పాండుస్తు రాజ్యం సంప్రాప్తః కనీయానపి సన్నృపః।
వినాశే తస్య పుత్రాణామ్ ఇదం రాజ్య మరిందమ॥ 30
పాండుడు చిన్నవాడయినా రాజ్యం పొందాడు. అతని మరణానంతరం ఈ రాజ్యం అతని పుత్రులకే చెందుతుంది. (30)
మయ్యభాగిని రాజ్యాయ కథం త్వం రాజ్యమిచ్ఛసి।
అరాజపుత్రో హ్యస్వామీ పరస్వం హర్తుమిచ్ఛసి॥ 31
రాజ్యానికి భాగం నాకే లేనపుడు నీవెట్లా రాజ్యం కోరగలవు. నీవు రాజపుత్రుడవు కావు. స్వామివి కాని నీవు పరుల ధనం అపహరించాలనుకొంటున్నావు. (31)
యుధిష్ఠిరో రాజపుత్రో మహాత్మా
న్యాయాగతం రాజ్యమిదం చ తస్య।
స కౌరవస్యాస్య కులస్య భర్తా
ప్రశాసితా చైవ మహానుభావః॥ 32
యుధిష్ఠిరుడు రాజపుత్రుడు, మహాత్ముడు, అతనికి న్యాయ్యంగా వచ్చినదీ రాజ్యం. అతడే ఈ కురువంశానికి భర్త. మహానుభావుడయిన అతడే రాజు. (32)
స సత్యసంధః స తథాఽప్రమత్తః
శాస్త్రే స్థితో బంధుజనస్య సాధుః।
ప్రియః ప్రజానాం సుహృదానుకంపీ
జితేంద్రియః సాధుజనస్య భర్తా॥ 33
అతడు సత్యసంధుడు జాగరూకుడు, శాస్త్రానుసారంగా ప్రవర్తిస్తాడు. బంధుజనుల పట్ల సద్భావం కలవాడు. ప్రజలకు హితుడు - స్నేహితుల పట్ల కరుణాపరుడు. జితేంద్రియుడు, సజ్జన రక్షకుడు. (33)
క్షమా తితిక్షా దమ ఆర్జవం చ
సత్యవ్రతత్వం శ్రుతమప్రమాదః।
భూతానుకంపీ హ్యనుశాసనం చ
యుధిష్ఠిరే రాజగుణాః సమస్తాః॥ 34
ఓర్పు, దుఃఖాలు సహించగలగడం, ఇంద్రియ జయం, ఋజుత్వం, సత్యవ్రతం, శాస్త్రజ్ఞానం, పొరబాటు పడకపోవడం, భూతదయ, ప్రజారక్షణం అనే యీ రాజజుణాలన్నీ ధర్మరాజులో ఉన్నాయి. (34)
అరాజపుత్రస్త్వమనార్యవృత్తః
లుబ్ధః సదా బంధుషు పాపబుద్ధిః।
క్రమాగతం రాజ్యమిదం పరేషాం
హర్తుం కథం శక్ష్యసి దుర్వినీత॥ 35
నీవు రాజు యొక్క కొడుకువు కావు, దుష్టవర్తనుడవు. లోభివి, బంధుల పట్ల పాపాలోచన చేస్తావు. దుర్వినీతా! క్రమంగా వచ్చిన ఈ రాజ్యం పరులది. దాన్ని నీవెలా హరిస్తావు? (35)
ప్రయచ్ఛ రాజ్యార్ధమపేతమోహః
సవాహనం త్వం సపరిచ్ఛదం చ।
తతోఽవశేషం తవ జీవితస్య
సహానుజస్యైవ భవేన్నరేంద్ర॥ 36
మోహాన్ని విడిచి, వాహనాలతో లాంఛనాలతో అర్ధరాజ్యం పాండవులకు ఇయ్యి. రాజా! అపుడే నీకూ, నీతమ్ముళ్లకూ ఆయువు మిగులుతుంది. (36)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి ధృతరాష్ట్రవాక్య కథనే ఏకోన పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 149 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర వాక్య కథనమను నూట నలువది తొమ్మిదవ అధ్యాయము. (149)