148. నూటనలువది యెనిమిదవ అధ్యాయము

ద్రోణ విదురులు, గాంధారి చెప్పిన మాటలను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పుట.

వాసుదేవ ఉవాచ
భీష్మేణోక్తే తతో ద్రోణః దుర్యోధన మభాషత।
మధ్యే నృపాణాం భద్రం తే వచనం వచనక్షమః॥ 1
వాసుదేవుడు ఇట్లు చెప్పాడు - భీష్ముడు ఇలా చెప్పిన తరువాత ప్రవచన సమర్థుడయిన ద్రోణుడు రోజుల మధ్యనున్న దుర్యోధనునితో నీకు శుభం కలిగించే మాట ఇలా చెప్పాడు. (1)
ప్రాతీపః శాంతనుస్తాత కులస్యార్థే యథా స్థితః।
యథా దేవవ్రతో భీష్మః కులస్యార్థే స్థితోఽభవత్॥ 2
నాయనా! ప్రతీపకుమారుడు శంతనుడు కులంకోసం ఎలా నిలిచాడో అలాగే దేవవ్రతుడయిన ఈ భీష్ముడూ కులంకోసం నిలబడ్డాడు. (2)
తథా పాండుర్నరపతిః సత్యసంధో జితేంద్రియః।
రాజా కురూణాం ధర్మాత్మా సువ్రతః సుసమాహితః॥ 3
జ్యేష్ఠాయ రాజ్యమదదాత్ ధృతరాష్ట్రాయ ధీమతే।
యనీయసే తథా క్షత్రే కురూణాం వంశవర్ధనః॥ 4
పాండురాజు సత్యసంధుడు, జితేంద్రియుడు, కౌరవులకు రాజు, ధర్మాత్ముడు, ఏకాగ్రతతో వ్రతదీక్ష వహించినవాడు. అతడు అన్నయైన ధృతరాష్ట్రునకు రాజ్యం ఇచ్చాడు. అలాగే తమ్ముడయిన విదురునకు రాజ్యభారం ఇచ్చాడు. (3,4)
తతః సింహాసనే రాజన్ స్థాపయిత్వైనమచ్యుతమ్।
వనం జగామ కౌరవ్యః భార్యాభ్యాం సహితో నృపః॥ 5
తరువాత ఈ ధృతరాష్ట్రుని సింహాసనం మీద స్థిరంగా నిలిపి(దిగ్విజయాదులతో) పాండురాజు తన భార్యలిద్దరితో అడవికి వెళ్లిపోయాడు. (5)
నీచైః స్థిత్వా తు విదురః ఉపాస్తే స్మ వినీతవత్।
ప్రేష్యవత్ పురుషవ్యాఘ్రః వాలవ్యజన ముత్ క్షిపన్॥ 6
విదురుడు పురుష సింహుడయినా క్రింద నిలిచి భృత్యుని వలె వింజామర వీస్తూ వీనిని(ధృతరాష్ట్రుని) సేవించాడు. (6)
తతః సర్వాః ప్రజాస్తాత ధృతరాష్ట్రం జనేశ్వరమ్।
అన్వపద్యంత విధివత్ యథా పాండుం జనాధిపమ్॥ 7
ప్రజలంతా పాండురాజును అనుసరించినట్లే ధృతరాష్ట్రుని కూడా రాజు వలెనే అంగీకరించి అనుసరించారు. (7)
విసృజ్య ధృతరాష్ట్రాయ రాజ్యం స విదురాయ చ।
చచార పృథివీం పాండుః సర్వాం పరపురంజయః॥ 8
విదురునికీ, ధృతరాష్ట్రునికీ రాజ్యం విడిచిపెట్టి పాండురాజు శత్రునగరాలను జయిస్తూ భూమి అంతటా సంచరించాడు. (8)
కోశసంవననే దానే భృత్యానాం చాన్వవేక్షణే।
భరణే చైవ సర్వస్య విదురః సత్యసంగరః॥ 9
సత్యసంధుడయిన విదురుడు కోశాగారం రక్షిస్తూ, దానాలు చేస్తూ, సేవకులనే చూసుకొంటూ రాజ్యమంతా భరించాడు. (9)
సంధివిగ్రహసంయుక్తః రాజ్ఞాం సంవాహనక్రియాః।
అవైక్షత మహాతేజాః భీష్మః పరపురంజయః॥ 10
సంధి, విగ్రహాలు నిర్ణయించడం, రాజుల నుండి కప్పములు గ్రహించడం - ఈ పనులు శత్రుమర్దన సమర్థుడయిన భీష్ముడు చూసుకొన్నాడు. (10)
సింహాసనస్థో నృపతిః ధృతరాష్ట్రో మహాబలః।
అన్వాస్యమానః సతతం విదురేణ మహాత్మనా॥ 11
మహాత్ముడయిన విదురుడు దగ్గరుండి సేవిస్తూ ఉంటే బలవంతుడయిన ధృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు. (11)
కథమ్ తస్య కులే జాతః కులభేదం వ్యవస్యసి।
సంభూయ భ్రాతృభిః సార్ధం భుంక్ష్వ భోగాన్ జనాధిప॥ 12
ఆత్ని వంశంలో పుట్టి నీవెందుకు వంశం విచ్ఛేదం చేస్తావు? రాజా! అన్నదమ్ములతో కలిసి భోగాలు అనుభవించు. (12)
బ్రవీమ్యహం న కార్పణ్యాత్ నార్థహీతోః కథంచన।
భీష్మేణ దత్తమిచ్ఛామి న త్వయా రాజసత్తమ॥ 13
జాలితోకాని భయంతోకాని, ధనంకోసం కాని నేనెప్పుడూ చెప్పను. భీష్ముడిచ్చేదే నేను కోరుతాను. కాని నీవిచ్చేది కాదు రాజా! (13)
నాహం త్వత్తోఽభికాంక్షిష్యే వృత్త్యుపాయం జనాధిప।
యతో భీష్మః తతో ద్రోణః యద్భీష్మస్త్వాహ తత్కురు॥ 14
రాజా! నీనుండి నేను జీవనోపాధి కూడ కోరను. భీష్ముడున్న చోటనే నేనూ ఉంటాను. భీష్ముడు చెప్పిందే చెయ్యి. (14)
దీయతాం పాండుపుత్రేభ్యః రాజ్యార్ధమరికర్శన।
సమమాచార్యకం తాత తవ తేషాం చ మే సదా॥ 15
పాండు కుమారులకు అర్ధరాజ్యం ఇయ్యి - నీకూ పాండవులకూ కూడా నేను సమంగానే సదా ఆచార్యత్వం నిర్వహించాను. (15)
అశ్వత్థామా యథా మహ్యం తథా శ్వేతహయో మమ।
బహునా కిం ప్రలాపేన యతో ధర్మస్తతో జయః॥ 16
నాకు అశ్వత్థామ ఎటువంటి వాడో అలాగే అర్జునుడు కూడా, ఇన్ని మాటలెందుకు? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉంటుంది. (16)
వాసుదేవ ఉవాచ
ఏవముక్తే మహారాజ ద్రోణేనామితతేజసా।
వ్యాజహార తతో వాక్యం విదురః సత్యసంగరః।
పితుర్వదనమన్వీక్ష్య పరివృత్య చ ధర్మవిత్॥ 17
కృష్ణుడు ఇలా అన్నాడు. అమితతేజస్వి అయిన ద్రోణుడు చెప్పిన తరువాత సత్యసంధుడయిన ధర్మవేత్త విదురుడు పూర్తిగా భీష్ముని ముఖం చూసి ఇలా అన్నాడు. (17)
విదుర ఉవాచ
దేవవ్రత నిబోధేదం వచనం మమ భాషతః।
ప్రణష్టః కౌరవో వంశః త్వయాయం పునరుద్ధృతః॥ 18
విదురుడిట్లు అన్నాడు. దేవ్రతా! నేను చెప్పేమాట విను. పూర్వం ఒకసారి కురువంశం నశించి పోతే మళ్లీ దాన్ని నీవు ఉద్ధరించావు. (18)
తన్మే విలపమానస్య వచనం సముపేక్షసే।
కోఽయం దుర్యోధనో నామ కులోఽస్మిన్ కులపాంసనః॥ 19
నేను ఏడ్చిమొత్తుకొంటూ ఉన్నా నా మాట నీవు పరిఘనించటంలేదు. ఈ వంశంలో చెడబుట్టిన వాడు తప్ప అసలీ దుర్యోధనుడెవడు? (19)
యస్య లోభాభిభూతస్య మతిం సమనువర్తసే।
అనార్యస్యాకృతజ్ఞస్య లోభేన హృతచేతసః॥ 20
వీడు పెద్దమనిషి కాడు. కృతఘ్నుడు. లోభంతో వీడిమనసు చచ్చిపోయింది. వీడి బుద్ధిని పట్టుకుని నీవు ప్రాకులాడుతున్నావు. (20)
అతిక్రామతి యః శాస్త్రం పితుర్ధర్మార్థదర్శినః।
ఏతే నశ్యంతి కురవః దుర్యోధనకృతేన వై॥ 21
ధర్మార్థాలు తెలిసిన తండ్రి మాటను వీడు పాటించటంలేదు. దుర్యోధనుని వల్ల ఈ కౌరవులంతా నశించి పోతున్నారు. (21)
యథా తే న ప్రణశ్యేయుః మహారాజ తథా కురు।
మాం చైవ ధృతరాష్ట్రం చ పూర్వమేవ మహామతే॥ 22
చిత్రకార ఇవాలేఖ్యం కృత్వా స్థాపితవానసి।
మహారాజా! వీరంతా చచ్చిపోకుండా నిలిచే పద్ధతి ననుసరించు. నన్నూ, ధృతరాష్ట్రునీ నీవు పూర్వమే చిత్రంలో బొమ్మల్లా నిలిపావు. (నీ దగ్గర మేము అస్వతంత్రులం) (22 1/2)
ప్రజాపతిః ప్రజాః సృష్ట్వా యథా సంహరతే తథా॥ 23
నోపేక్షస్వ మహాబాహో పశ్యమానః కులక్షయమ్।
ప్రజాపతి ప్రజల్ని సృష్టించి మళ్లీ సంహరించిన్నట్లు వంశనాశం కళ్లారా చూస్తూ ఉపేక్షించకు. (23 1/2)
అథ తేఽద్య మతిర్నష్టా వినాశే ప్రత్యుపస్థితే॥ 24
వనం గచ్ఛ మయా సార్ధం ధృతరాష్ట్రేణ చైవహ।
ఈ కులక్షయం దాపురిస్తోంది కనుకనే నీ బుద్ధికూడ పనిచేయటం లేదు. నాతోనూ, ధృతరాష్ట్రుని తోనూ నీవు కూడ అడవికి నడు. (24 1/2)
బద్ధ్వా వా నికృతిప్రజ్ఞం ధార్తరాష్ట్రం సుదుర్మతిమ్॥ 25
శాధీదం రాజ్యమద్యాశు పాండవైరభిరక్షితమ్।
లేదా మోసగించే ప్రజ్ఞ కల ఈ దుర్మార్గుని బంధించి పాండవుల రక్షణలో వెంటనే రాజ్యం పాలించు. (25 1/2)
ప్రసీద రాజశార్దూల వినాశో దృశ్యతే మహాన్॥ 26
పాండవానాం కురూణాం చ రాజ్ఞామమితతేజసామ్।
రాజశ్రేష్ఠా! అనుగ్రహించు. పాండవులకూ, కౌరవులకూ అమిత పరాక్రమవంతులయిన రాజులకూ పెద్దవినాశం కనపడుతోంది. (26 1/2)
విరరామైవముక్త్వా తు విదురో దీనమానసః।
ప్రధ్యాయమానః స తదా నిఃశ్వసంశ్చ పునః పునః॥ 27
ఇలా అని విదురుడు దీనంగా ఏదో ఆలోచిస్తూ తిరిగి తిరిగి నిట్టూర్పులు పుచ్చుతూ ఊరకుండి పోయాడు. (27)
తతోఽథ రాజ్ఞః సుబలస్య పుత్రీ
ధర్మార్థయుక్తం కులనాశభీతా।
దుర్యోధనం పాపమతిం నృశంసం
రాజ్ఞాం సమక్షం సుత మాహ కోపాత్॥ 28
అపుడు సుబలుని కుమార్తె అయిన గాంధారి కులం నశించిపోతుందనే భయంతో పాపి, క్రూరుడూ అయిన దుర్యోధనునితో రాజుల ఎదుట కోపంతో ధర్మ, అర్థ సహితంగా ఇలా అంది. (28)
యే పార్థివా రాజసభాం ప్రవిష్టాః
బ్రహ్మర్షయో యే చ సభాసదోఽన్యే।
శృణ్వంతు వక్ష్యామి తవాపరాధం
పాపస్య సామాత్యపరిచ్ఛదస్య॥ 29
దుర్యోధనా! మంత్రులతో, సేవకులతో కూడిన పాపివి నీవు. నీ అపరాధం ఏమిటో చెపుతున్నాను. దీన్ని సభలోని రాజులూ, బ్రహ్మర్షులూ, సభాసదులూ అంతా వినాలి. (29)
రాజ్యం కురూణామనుపూర్వభోజ్యం
క్రమాగతో నః కులధర్మ ఏషః।
త్వం పాపబుద్ధేఽతి నృశంసకర్మన్
రాజ్యం కురూణామనయాద్విహంసి॥ 30
ఈ రాజ్యం కురువంశస్థులు పెద్దవాని క్రమంలో అనుభవిస్తూ వచ్చారు - ఇది పూర్వం నుండి వచ్చిన ధర్మం. పాపీ! నీవీనాడు నీతిని విడిచి కురురాజ్యం అంతా నశింపజేస్తున్నావు. (30)
రాజ్యే స్థితో ధృతరాష్ట్రో మనీషీ
తస్యానుజో విదురో దీర్ఘదర్శీ।
ఏతావతిక్రమ్య కథం నృపత్వం
దుర్యోధన ప్రార్థయసేఽద్య మోహాత్॥ 31
రాజ్యంలో ఉన్నవాడు ధీశాలి అయిన ధృతరాష్ట్రుడు. వానికి తమ్ముడు దీర్ఘదర్శి అయిన విదురుడు. వీరిద్దరినీ దాటి మోహంతో ఇపుడు నీవు రాజత్వం ఎలా కోరతావురా? (31)
రాజా చ క్షత్తా చ మహానుభావౌ
భీష్మే స్థితే పరవంతౌ భవేతామ్।
అయం తు ధర్మజ్ఞతయా మహాత్మా
న కామయేద్యో నృవరో నదీజః॥ 32
మహానుభావులయిన ధృతరాష్ట్ర విదురులు భీష్ముడున్నంత కాలం అస్వతంత్రులే అవుతారు. ఇక ఈ మహాత్ముడు భీష్ముడు ధర్మం ఎరిగినవాడు. అందుకే ఏమీ కోరడు. (32)
రాజ్యం తు పాండోరిదమప్రధృష్యం
తస్యాద్య పుత్రాః ప్రభవంతి నాన్యే।
రాజ్యం తదేత న్నిఖిలం పాండవానాం
సైతామహం పుత్రపౌత్రానుగామి॥ 33
అసలీ రాజ్యం పాండురాజుది. దీన్ని ఎవరూ కాదనలేరు. దానికి అతని పుత్రులే రాజులు కావాలి - ఇతరులు కారు - ఈ రాజ్యం అంతా పాండవులది. తాత, తండ్రి కొడుకుల వరుసలో వారికే చెందాలి. (33)
యద్వై బ్రూతే కురుముఖ్యో మహాత్మా
దేవవ్రతః సత్యసంధో మనీషీ।
సర్వం తదస్మాభిరాహత్య కార్యం
రాజ్యం స్వధర్మాన్ పరిపాలయద్భిః॥ 34
కురుముఖ్యుడూ, మహాత్ముడూ అయిన దేవవ్రతుడు సత్యసంధుడూ మహామేధావి కూడా. అతడు చెప్పినది విని మనమంతా మనధర్మాలు చెడకుండా రాజ్యం కాపాడు కోవాలి. (34)
అనుజ్ఞయా చాథ మహావ్రతస్య
బ్రూయాన్నృపోఽయం విదురస్తథైవ।
కార్యం భవేత్తత్సుహృద్భిర్నియోజ్యం
ధర్మం పురస్కృత్య సుదీర్ఘకాలమ్॥ 35
మహావ్రతుడయిన ఆ భీష్ముని అనుమతితోనే ఈ రాజయినా, విదురుడయినా మాట్లాడుతారు. స్నేహితులు చెప్పిన ధర్మాన్ని కలకాలం మనం నిలుపుకోవాలి. (35)
న్యాయాగతం రాజ్యమిదం కురూణాం
యుధిష్ఠిరః శాస్తు వై ధర్మపుత్రః।
ప్రబోధితో ధృతరాష్ట్రేణ రాజ్ఞా
పురస్కృతః శాంతనవేన చైవ॥ 36
భీష్ముని ముందుంచుకొని, ధృతరాష్ట్రుని చేత బోధింపబడుతూ ధర్మపుత్రుడయిన ధర్మరాజు న్యాయంగా వచ్చిన ఈ కురురాజ్యం పరిపాలించాలి. (36)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన కృష్ణవాక్యే అష్టచత్వారింశ దధికశతతమోఽధ్యాయః॥ 148 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కృష్ణ వాక్యమను నూట నలువది ఎనిమిదవ అధ్యాయము. (148)