116. నూటపదునారవ అధ్యాయము
రెండువందల గుఱ్ఱములనిచ్చి హర్యశ్వుడు పుత్రుని పొందుట.
నారద ఉవాచ
హర్యశ్వస్త్వబ్రవీద్ రాజా విచింత్య బహుధా తతః।
దీర్ఘముష్ణం చ నిఃశ్వస్య ప్రజాహేతోర్నృపోత్తమః॥ 1
ఉన్నతేషూన్నతా షట్సు సూక్ష్మా సూక్ష్మేషు పంచసు।
గంభీరా త్రిషు గంభీరేష్వియం రక్తా చ పంచసు॥ 2
నారదుడిలా అన్నాడు.
ఆ తరువాత నృపశ్రేష్ఠుడయిన హర్యశ్వ మహారాజు సంతానాన్ని పొందాలన్న కోరికతో అనేకవిధాలుగా ఆలోచించి వేడి నిట్టూర్పులు విడిచి గాలవునితో ఇలా అన్నాడు.
ఈమెకు ఉన్నతంగా ఉండవలసిన ఆరు అవయవాలు ఉన్నతంగా ఉన్నాయి. సూక్ష్మంగా ఉండవలసిన అయిదు అవయవాలు సూక్ష్మంగా ఉన్నాయి. గంభీరంగా ఉండవలసిన మూడు అవయవాలు గంభీరంగా ఉన్నాయి. ఎఱ్ఱబారి ఉండవలసిన అయిదు అవయవాలు ఎఱ్ఱగా ఉన్నాయి. (1-2)
(శ్రోణ్యౌ లలాటమూరూ చ ఘ్రాణం చేతి షడున్నతమ్।
సూక్ష్మాణ్యంగుళిపర్వాణి కేశరోమనఖత్వచః॥
స్వరః సత్త్వం చ నాభిశ్చ త్రిగంభీరం ప్రచక్షతే।
పాణిపాదతలే రక్తే నేత్రాంతా చ నఖాని చ॥)
రెండు నితంబాలు, రెండు పిక్కలు, లలాటం, నాసిక ఉన్నతంగా ఉండవలసిన ఆరు; వ్రేళ్ళ కణుపులు, కేశాలు, రోమాలు, గోళ్ళు, చర్మం సూక్ష్మంగా ఉండవలసిన ఐదు; స్వరం, అంతఃకరణం నాభి లోతుగా ఉండవలసిన మూడు; అరచేతులు, అరకాళ్ళు, కుడి, ఎడమ కనుగొనలు, గోళ్లు ఎఱ్ఱగా ఉండవలసిన ఐదు.
బహుదేవాసురాలోకా బహుగంధర్వదర్శనా।
బహులక్షణసంపన్నా బహుప్రసవధారిణీ॥ 3
ఈమె దేవదానవులలో చాలామందికన్న అందమైనది. గాంధర్వ విద్యనెరిగినది. అనేక శుభలక్షణాలు గలది. బహుసంతానాన్ని పొందగలది. (3)
సమర్థేయం జనయితుం చక్రవర్తినమాత్మజమ్।
బ్రూహి శుల్కం ద్విజశ్రేష్ఠ సమీక్ష్య విభవం మమ॥ 4
చక్రవర్తి కాగల కుమారుని కనగలిగిన దీమె. విప్రోత్తమా! నా వైభవాన్ని గమనించి ఈమెకు తగిన శుల్కాన్ని చెప్పు. (4)
గాలన ఉవాచ
ఏకతః శ్యామకర్ణానాం శతాన్యష్టౌ ప్రయచ్ఛ మే।
హయానాం చంద్రశుభ్రాణాం దేశజానాం వపుష్మతామ్॥ 5
తతస్తవ భవిత్రీయం పుత్రాణాం జననీ శుభా।
అరణీవ హుతాశానాం యోనిరాయతలోచనా॥ 6
గాలవుడిలా అన్నాడు.
గొప్పదేశంలో, గొప్పవంశంలో పుట్టి శరీర సౌష్ఠవం గలిగి చంద్రకాంతివలె తెల్లనివై ఒక వైపు నుండి చెవి నల్లగా ఉన్న ఎనిమిదివందల గుఱ్ఱాలను ఇయ్యి. అప్పుడు విశాలాక్షీ, శుభాంగి అయిన ఈమె అగ్నికి అరణివలె నీ కుమారులకు తల్లి కాగలదు. (5-6)
నారద ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వచో రాజా హర్యశ్చః కామమోహితః।
ఉవాచ గాలవం దీనః రాజర్షిః ఋషిసత్తమమ్॥ 7
నారదుడిలా అన్నాడు.
ఈ మాటలు విని కామమోహితుడై ఉన్న హర్యశ్వరాజర్షి దీనంగా ఆ మునివర్యుడైన గాలవునితో ఇలా అన్నాడు. (7)
ద్వే మే శతే సంనిహితే హయానాం యద్విధాస్తవ।
ఏష్టవ్యాః శతశస్త్వన్యే చరంతి మమ వాజినః॥ 8
నీవడిగిన లక్షణాలు గల గుఱ్ఱాలు ఇప్పుడు నా దగ్గర రెండు వందలే ఉన్నాయి. ఇతర జాతికి చెందినవయితే వందలకొలది ఉన్నాయి. (8)
సోఽహమేకనుపత్యం వై జనయిష్యామి గాలవ।
అస్యామేతం భవాణ్ కామం సంపాదయతు మే వరమ్॥ 9
కాబట్టి నేను ఈమె యందు ఒక్క పుత్రుని మాత్రమే కంటాను. నా ఈ కోరికను మన్నించాలి. (9)
ఏతచ్ఛ్రుత్వా తు సా కన్యా గాలవం వాక్యమబ్రవీత్।
మమ దత్తో వరః కశ్చిత్ కేనచిద్ బ్రహ్మవాదినా॥ 10
ప్రసూత్యంతే ప్రసూత్యంతే కన్యైవ త్వం భవిష్యసి।
స త్వం దదస్చ మాం రాజ్ఞే ప్రతిగృహ్య హయోత్తమాన్॥ 11
ఈ మాటలు విని ఈ కన్య(మాధవి) గాలవునితో ఇలా అన్నది - ఎవరో ఒక మహాత్ముడు వేదవేత్త నాకొక వరమిచ్చాడు. సంతానాన్ని పొందిన తరువాత కూడా నా కన్యాత్వం చెడదనేది ఆ వరం. కాబట్టి తమరు రెండువందల గుఱ్ఱాలను తీసికొని నన్ను రాజుకు ఇవ్వవచ్చు. (10-11)
నృపేభ్యో హి చతుర్భ్యస్తే పూర్ణాన్యష్టౌ శతాని మే।
భవిష్యంతి తథా పుత్రాః మమ చత్వార ఏవ తే॥ 12
నలుగురు రాజులనుండి రెండు వందల లెక్కన గుఱ్ఱాలను తీసికొంటే తమకు అవసరమైన ఎనిమిదివందల గుఱ్ఱాలు సమకూరుతాయి. నాఖు నలుగురు కుమారులుంటారు. (12)
క్రియతాముపసంహారః గుర్వర్థం ద్విజసత్తమ।
ఏషా తావన్మమ ప్రజ్ఞా యథా వా మన్యసే ద్విజ॥ 13
విప్రశ్రేష్ఠా! ఈ విధంగా తమరు గురుదక్షిణను సమీకరించుకొనవచ్చు. నేను చేసి పెట్టగలిగిన దిదే. ఆపై తమ ఇష్టం. (13)
ఏవముక్తస్తు స మునిః కన్యయా గాలవస్తదా।
హర్యశ్వం పృథివీపాలమ్ ఇదం వచనమబ్రవీత్॥ 14
ఆ కన్య(మాధవి) అలా అనగానే గాలవుడు హర్యశ్వమహారాజుతో ఇలా అన్నాడు. (14)
ఇయం కన్యా నరశ్రేష్ఠ హర్యశ్వ ప్రతిగృహ్యతామ్।
చతుర్భాగేన శుల్కస్య జనయస్వైకమాత్మజమ్॥ 15
నరోత్తమా! హర్యశ్వా! ఈమెకు నిర్ణయించిన శుల్కంలో నాలుగవభాగాన్ని ఇచ్చి ఈమెను పరిగ్రహించు. ఒక్క కుమారుని మాత్రమే పొందు. (15)
ప్రతిగృహ్య సతాం కన్యాం గాలవం ప్రతినంద్య చ।
సమయే దేశకాలే చ లబ్ధవాన్ సుతమీప్సితమ్॥ 16
ఆ హర్యశ్వమహారాజు ఆ కన్యను స్వీకరించి, గాలవుని అభినందించి తగిన సమయంలో, తగినచోట ఆమె వలన తాను కోరిన కుమారుని పొందాడు. (16)
తతో వసుమనా నామ వసుభ్యో వసుమత్తరః।
వసుప్రఖ్యో నరపతిః స బభూవ వసుప్రదః॥ 17
ఆ తర్వాత ఆ హర్యశ్వుని కుమారుడే వసుమనుడన్న పేర ప్రసిద్ధుడయ్యాడు. అతడు వసువులంత కాంతిమంతుడూ, వారికన్నా ధనవంతుడూ అయ్యాడు. మహాదాత కూడా అయ్యాడు. (17)
అథ కాలే పునర్ధీమాన్ గాలవః ప్రత్యుపస్థితః।
ఉపసంగమ్య చోవాచ హర్యశ్వం ప్రీతమానసమ్॥ 18
ఆ తరువాత తగిన సమయంలో ధీమంతుడైన గాలవుడు వచ్చి, ప్రసన్న హృదయుడైన హర్యశ్వునితో ఇలా అన్నాడు. (18)
జాతో నృప సుతస్తేఽయం బాలో భాస్కరసంనిభః।
కాలో గంతుం నరశ్రేష్ఠ భిక్షార్థమపరం నృపమ్॥ 19
నరశ్రేష్ఠా! మహారాజా! సూర్యతేజస్సు గల ఈ బాలుని కుమారునిగా పొందావు. ఈ కన్యతో కలిపి గురుదక్షిణకై గుఱ్ఱాలను యాచించటానికి మరొక నరపాలుని దగ్గరకు వెళ్ళటానికి తగిన సమయమిది. (19)
హర్యశ్చః సత్యవచనే స్థితః స్థిత్వా చ పౌరుషే।
దుర్లభత్వాద్ధయానాం చ ప్రదదౌ మాధవీం పునః॥ 20
హర్యశ్వమహారాజు సత్యవచనుడు, పౌరుషవంతుడయినా కూడా అటువంటి గుఱ్ఱాలు దుర్లభం కావటంతో మాధవిని గాలవునకు తిరిగి ఇచ్చాడు. (20)
మాధవీ చ పునర్దీస్తాం పరిత్యజ్య నృపశ్రియమ్।
కుమారీ కామతో భూత్వా గాలవం పృష్ఠతోఽస్వయాత్॥ 21
మాధవి కూడా మరల తన అభీష్టాన్ని అనుసరించి కన్యయై అయోధ్యారాజ్యలక్ష్మిని విడిచి గాలవుని వెంట వెళ్ళింది. (21)
త్వయ్యేవ తావత్ తిష్ఠంతు హయా ఇత్యుక్తవాన్ ద్విజః।
ప్రయయౌ కన్యయా సార్ధం దివోదాసం ప్రజేశ్వరమ్॥ 22
'గుఱ్ఱాలను నీ దగ్గరే ఉంచు' అని హర్యశ్వమహారాజుతో చెప్పి గాలవుడు మాధవితో సహా దివోదాసమహారాజు సన్నిధికి వెళ్ళాడు. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే షోడశాధికశతతమోఽధ్యాయః॥ 116 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదునారవ అధ్యాయము. (116)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకాలు 24 శ్లోకాలు)