115. నూటపదునైదవ అధ్యాయము

యయాతి గాలవునకు తన కుమార్తె నిచ్చుట.

నారద ఉవాచ
ఏవముక్తః సుపర్ణేన తథ్యం వచన ముత్తమమ్।
విమృశ్యావహితో రాజా నిశ్చిత్య చ పునః పునః॥ 1
యష్టా క్రతుసహస్రాణాం దాతా దానపతిః ప్రభుః।
యయాతిః సర్వకాశీశః ఇదం వచనమబ్రవీత్॥ 2
నారదుడిలా అన్నాడు - గరుడుడు ఈ విధంగా యథార్థమూ, శ్రేష్ఠమూ అయిన మాటను చెప్పగా విని, సహస్రయజ్ఞాలను అనుష్ఠించిన మహాదాతా, దానపతీ, సమస్తరాజులకూ ప్రభువూ అయిన యయాతి మహారాజు సావధానుడై, పలుమార్లు ఆలోచింఇ, ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు. (1-2)
దృష్ట్వా ప్రియసఖం తర్ క్ష్యం గాలవం చ ద్విజర్షభమ్।
నిదర్శనం చ తపసః భిక్షాం శ్లాఘ్యాం చ కీర్తితామ్॥ 3
ఆతీత్య చ నృపానన్యాన్ ఆదిత్యకులసంభవాన్।
మత్సకాశమనుప్రాప్తౌ ఏతాం బుద్ధి మవేక్ష్య చ॥ 4
యయాతి మహారాజు ముందుగా తన చెంతకువచ్చిన ప్రియమిత్రుడైన గరుడునీ, ద్విజశ్రేష్ఠుడయిన గాలవునీ చూచి, గరుడుడు చెప్పిన ఆ భిక్షాస్వరూపాన్ని మనసా మెచ్చుకొని - సూర్యవంశంలో పుట్టిన రాజులనందరినీ కాదని నాదగ్గరకు వీరు వచ్చారు - అన్న ఆలోచనను కూడా మనసులో ఉంచుకొని (ఇలా అన్నాడు) (3,4)
అద్య మే సఫలం జన్మ తారితం చాద్య మే కులమ్।
అద్యాయం తారితో దేశః మమ తార్ క్ష్య త్వయానఘ॥ 5
అనఘా! గరుడుడా! నేడు నా జన్మ సఫలమైనది. నేడు నా వంశముద్ధరింపబడింది. ఈ నా రాజ్యం కూడా ఈనాడు నీచే ఉద్ధరింపబడింది. (5)
వక్తుమిచ్ఛామి తు సఖే యథా జానాపి మాం పురా।
న తథా విత్తవానస్మి క్షీణం విత్తం చ మే సఖా॥ 6
మిత్రమా! ఒక్క విషయం చెప్పదలచుకొన్నాను. ఇంతకుముందు నీవెరిగినట్టు ఇప్పుడు నేను సంపన్నుడను కాను. నా ధనమంతా తరిగిపోయింది. (6)
న చ శక్తోఽస్మి తే కర్తుం మోఘమాగమనం ఖగ।
న చాశామస్య విప్రర్షేః వితథీకర్తుముత్సహే॥ 7
గరుడా! నీ రాకను సార్థకం చేయటానికి ఇప్పుడు నాకు శక్తి లేదు. ఈ ద్విజశ్రేష్ఠుని ఆశను విఫలం చేయటమూ నాకిష్టం లేదు. (7)
తత్ తు దాస్యామి యత్ కార్యమ్ ఇదం సంపాదయిష్యతి।
అభిగమ్య హతాశో హి నివృత్తో దహతే కులమ్॥ 8
కాబట్టి మీ పని సానుకూలమయ్యేటట్లుగా ఒకటిస్తాను. దగ్గరకు వచ్చిన యాచకుడు హతాశుడయి మరలిపోతే వంశం నాశనమవుతుంది. (8)
నాతః పరం వైనతేయ కించిత్ పాపిష్ఠముచ్యతే।
యథాశానాశనాల్లోకే దేహి నాస్తీతి వా వచః॥ 9
గరుడా! దేహి అని అడగవలసి రావటం కానీ 'నాస్తి' అని చెప్పవలసి రావటం కానీ పాపిష్ఠవచనాలు. ఈ విధంగా యాచకునకు ఆశా భంగం కలిగిస్తే వచ్చే పాపంకన్నా, ఎక్కువ పాపాన్ని తెచ్చే విషయమేదీ ఉండదు. (9)
హతాశో హ్యకృతార్థః సన్ హతః సంభావితో నరః।
హినస్తి తస్య పుత్రాంశ్చ పాత్రాంశ్చాకుర్వతో హి తమ్॥ 10
యాచించి, హతాశుడై, అకృతార్థుడైనవాడు చచ్చినవానితో సమానం. అంతేకాదు అతడు తనను హతాశుని చేసిన వాని పుత్రులనూ, పౌత్రులనూ కూడా నశింపజేస్తాడు. (10)
తస్మాచ్చతుర్ణాం వంశానాం స్థాపయిత్రీ సుతా మమ।
ఇయం సురసుతప్రఖ్యా సర్వధర్మోపచాయినీ॥ 11
కాబట్టి, ఇదిగో ఈమె నా కుమార్తె. నాల్గు వంశాలనూ ఉద్ధరించగలది. దేవకాంత వంటిది. సర్వధర్మాలనూ వర్ధిల్లజేయగలది. (11)
సదా దేవ మనుష్యాణామ్ అసురాణాం చ గాలవ।
కాంక్షితా రూపతో బాలా సుతా మే ప్రతిగృహ్యతామ్॥ 12
గాలవా! ఈమె రూపాన్ని చూచి, ఎప్పుడూ దేవతలూ, మనుష్యులూ, అసురులూ ఈమెను పొందాలని కోరుతుంటారు. ఈమెను నీవు స్వీకరించు. (12)
అస్యాః శుల్కం ప్రదాస్యంతి నృపా రాజ్యమపి ధ్రువమ్।
కిం పునః శ్యామకర్ణానాం హయానాం ద్వే చతుశ్శతే॥ 13
ఈమెకోసాం శుల్కంగా రాజులు రాజ్యాలనయినా ధారవోస్తారు. ఇక నల్లని చెవులు గల ఎనిమిది వందల గుఱ్ఱాలు ఏపాటి? (13)
స భవాన్ ప్రతిగృహ్ణాతు మమైతాం మాధవీం సుతామ్।
అహం దౌహిత్రవాన్ స్యాం వై వర ఏష మమ ప్రభో॥ 14
స్వామీ! నీవు ఈ నాకుమార్తెను - మాధవిని - తీసికో. అయితే నేను దౌహిత్రుడు గల వాడనయ్యే వరాన్ని మాత్రమివ్వు. (14)
ప్రతిగృహ్య చ తాం కన్యాం గాలవః సహపక్షిణా।
పునర్ద్రక్ష్యాన ఇత్యుక్త్వా ప్రతస్థే సహ కన్యయా॥ 15
గాలవుడు ఆ కన్యను స్వీకరించి మరలా కలుద్దామని చెప్పి ఆ కన్యతో, గరుడునితో కలిసి నిష్క్రమించాడు. (15)
ఉపలబ్ధమిదం ద్వారమ్ అశ్వానామితి చాండజః।
ఉక్త్వా గాలవమాపృచ్ఛ్వ జగామ భవనం స్వకమ్॥ 16
గరుత్మంతుడు కూడా గుఱ్ఱాలను సంపాదించగల మార్గం దొరికిందని చెప్పి, గాలవుని యొద్ద సెలవుతీసికొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. (16)
గతే పతగరాజే తు గాలవః సహ కన్యయా।
చింతయానః క్షమం దానే రాజ్ఞాం వై శుల్కతోఽగమత్॥ 17
గరుడుడు నిష్క్రమించగానే గాలవుడు "ఈకన్యకు తగిన మూల్యాన్ని చెల్లించగల రాజెవరు"? అని ఆలోచిస్తూ ప్రయాణం సాగించాడు. (17)
సోఽగచ్ఛన్మనసేక్ష్వాకుం హర్యశ్వం రాజసత్తమమ్।
అయోధ్యాయాం మహావీర్యం చతురంగబలాన్వితమ్॥ 18
ఆయన బాగా ఆలోచించి చతురంగ బలసమన్వితుడై అయోధ్యలోనున్న ఇక్ష్వాకు వంశస్థుడైన హర్యశ్వమహారాజు దగ్గరకు వెళ్లాడు. (18)
కోశధాన్యబలోపేతం ప్రియపౌరం ద్విజప్రియమ్।
ప్రజాభికామం శామ్యంతం కుర్వాణం తప ఉత్తమమ్॥ 19
ఆ హర్యశ్వుడు కోశం, ధాన్యం, బలం బాగా కలవాడు. పురజనులకు ఇష్టమైనవాడు. ద్విజులను ఆచరించేవాడు. ప్రజాక్షేమాన్ని కోరుకొనేవాడు. శాంతమనస్కుడు గొప్పతపస్వి. (19)
తముపాగమ్య విప్రః సః హర్యశ్వం గాలవోఽబ్రవీత్।
కన్యేయం మమ రాజేంద్ర ప్రసవైః కులవర్ధినీ॥ 20
ఇయం శుల్కేన భార్యార్థం హర్యశ్వ ప్రతిగృహ్యతామ్।
శుల్కం తే కీర్తయిష్యామి తచ్ఛ్రుత్వ సంప్రధార్యతామ్॥ 21
ఆ హర్యశ్వమహారాజు దగ్గరకు వచ్చి ఆ విప్రుడు గాలవుడు ఇలా అన్నాడు -
రాజేంద్రా! ఈ నా కన్య తన సంతానంతో వంశాన్ని ఉద్ధరించగలది, తగిన శుల్కాన్ని చెల్లించి ఈమెను భార్యగా చేసికో, ఆ శుల్కమేమిటో వివరిస్తాను విని నిర్ణయించుకో. (20-21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే పంచదశాధికశతతమోఽధ్యాయః॥ 115 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదునైదవ అధ్యాయము. (115)