109. నూటతొమ్మిదవ అధ్యాయము

దక్షిణ దిక్కును వర్ణించుట.

సుపర్ణ ఉవాచ
ఇయం వివస్వతా పూర్వం శ్రౌతేన విధినా కిల।
గురవే దక్షిణా దత్తా దక్షిణేత్యుచ్యతే చ దిక్॥ 1
గరుడుడిలా అన్నాడు - పూర్వకాలంలో సూర్యుడు శాస్త్రోక్తంగా యజ్ఞం చేసి ఆచార్యుడైన కశ్యపునకు ఈ దిక్కును దక్షిణగా ఇచ్చాడు. అందువలన ఇది దక్షిణ దిక్కు అయింది. (1)
అత్ర లోకత్రయస్యాస్య పితృపక్షః ప్రతిష్ఠితః।
అత్రోష్మపాణాం దేవానాం నివాసః శ్రూయతే ద్విజ॥ 2
బ్రాహ్మణా! మూడులోకాలకు సంబంధించిన పితృగణానికి ఇది ప్రతిష్ఠాస్థానం. ఊష్మపులనే పేరుగల దేవతలకు కూడా ఇదే నివాసస్థానమంటారు. (2)
అత్ర విశ్వే సదా దేవాః పితృభిః సార్ధమాసతే।
ఇజ్యమానాః స్మ లోకేషు సంప్రాప్తాస్తుల్యభాగతామ్॥ 3
పితృదేవతలతో పాటు విశ్వేదేవులును ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. లోకపూజితులై శ్రాద్ధకర్మలలో పితరులతో సమానంగా భాగాన్ని పొందుతారు విశ్వేదేవులు. (3)
ఏతద్ ద్వితీయం దేవస్య ద్వారమాచక్షతే ద్విజ।
త్రుటితో లవశశ్చాపి గణ్యతే కాలనిశ్చయః॥ 4
బ్రాహ్మణా! ధర్మదేవతకిది రెండవ ద్వారమంటారు. "త్రుటి" 'లవం' మొదలయిన సూక్ష్మకాలాంశాలను కూడా లెక్కించి ప్రాణుల ఆయుష్షును నిర్ణయించేది ఇక్కడే. (4)
అత్ర దేవర్షయో నిత్యం పితృలోకర్షయస్తథా।
తథా రాజర్షయః సర్వే నివసంతి గతవ్యథాః॥ 5
ఇక్కడ దేవర్షులు, పితృలోకఋషులు, రాజర్షులు అందరూ ఎల్లప్పుడూ నిశ్చింతగా నివసిస్తారు. (5)
అత్ర ధర్మశ్చ సత్యం చ కర్మ చాత్ర నిగద్యతే।
గతిరేషా ద్విజశ్రేష్ఠ కర్మణా మవసాయినామ్॥ 6
విప్రోత్తమా! ప్రాణుల ధర్మ, సత్య, సాధారణ కర్మలవిషయాలన్నీ ఇక్కడే లెక్కింప బడతాయి. మరణించిన ప్రాణులకు ఈ దిక్కే దిక్కు. (6)
ఏషా దిక్ సా ద్విజశ్రేష్ఠ యాం సర్వః ప్రతిపద్యతే।
వృతా త్వనవబోధేన సుఖం తేన న గమ్యతే॥ 7
ద్విజశ్రేష్ఠా! మరణానంతరం సమస్త ప్రాణులూ ఈ దిక్కువైపే వెళ్ళాలి. ఇది అజ్ఞానాంధకారంతో నిండి ఉంటుంది. కాబట్టి సుఖంగా ప్రయాణించలేరు. (7)
నైరృతానాం సహస్రాణి బహూన్యత్ర ద్విజర్షభ।
సృష్టాని ప్రతికూలాని ద్రష్టవ్యాన్యకృతాత్మభిః॥ 8
ద్విజర్షభా! ఈ దిక్కుననే ప్రతికూల స్వభావంగల వేలకొలది రాక్షసులు సృష్టింపబడి ఉన్నారు. వారు అపవిత్ర హృదయులకే కనిపిస్తారు. (8)
అత్ర మందరకుంజేషు విప్రర్షిసదనేషు చ।
గాయంతి గాథా గంధర్వాః చిత్తబుద్ధిహరా ద్విజ॥ 9
ఈ దిక్కుననే మందర పర్వతం మీది పొదరిండ్లలో, మున్యాశ్రమాలలో నిలిచి గంధర్వులు మనస్సునూ, బుద్ధినీ ఆకర్షించగల గాథలను పాడుతూంటారు. (9)
వి॥సం॥ చిత్తము ఆలోచనావ్యాపారము - బుద్ధి అధ్యవసాయ వ్యాపారము. (అర్జు)
చిత్తబుద్ధి హరాః = చిత్తాన్ని, బుద్ధిని హరించేవారు.
యోగుల తత్త్వజ్ఞానాన్ని ప్రపంచం మిధ్య అనే నిశ్చయాని పోగొడతారు.
అత్ర సామాని గాథాభిః శ్రుత్వా గీతాని రైవతః।
గతదారో గతామాత్యో గతరాజ్యో వనం గతః॥ 10
గతంలో రైవతుడను రాజు ఇక్కడ గాథల రూపంలో సామగానాన్ని విని భార్యనూ, మంత్రులనూ, రాజ్యాన్నీ వీడి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. (10)
అత్ర సావర్ణినా చైవ యవక్రీతాత్మజేన చ।
మర్యాదా స్థాపితా బ్రహ్మన్ యాం సూర్యో నాతివర్తతే॥ 11
బ్రాహ్మణా! ఇక్కడే సావర్ణిమనువు, యవక్రీతుని కొడుకు సూర్యగమనానికి హద్దులను నిర్ణయించారు. సూర్యుడిప్పటికీ వాటిని అతిక్రమించడు. (11)
అత్ర రాక్షసరాజేన పౌలస్త్యేన మహాత్మనా।
రావణేన తపశ్చీర్త్వా సురేభ్యోఽమరతా వృతా॥ 12
పులస్త్యవంశంలో పుట్టిన మహనీయుడు, రాక్షసరాజు అయిన రావణుడు తపస్సు చేసి దేవతల నుండి అమరత్వాన్ని కోరుకొనిన దిక్కు ఇదే. (12)
అత్ర వృత్తేన వృత్రోఽపి శక్రశత్రుత్వమీయివాన్।
అత్ర సర్వాసనః ప్రాప్తాః పునర్గచ్ఛంతి పంచధా॥ 13
ఈ దిక్కున జరిగిన సంఘటన వలననే వృత్రుడు ఇంద్రునితో శత్రుత్వాన్ని తెచ్చికొనినాడు. ఇక్కడకు చేరిన తర్వాత ప్రాణుల ప్రాణాలు మరలా ఐదుగా విడిపోతాయి. (13)
అత్ర దుష్కృతకర్మాణః నరాః పచ్యంతి గాలవ।
అత్ర వైతరణీ నామ నదీ వితరణైర్వృతా॥ 14
గాలవా! పాపాత్ములయిన మనుష్యులు ఇక్కడే అగ్నిలో పచనం చేయబడతారు. ఇక్కడే వైతరణీనది అక్కడ ఉండదగిన పాపులతో నిండి ఉంటుంది. (14)
అత్ర గత్వా సుఖస్యాంతం దుఃఖస్యాంతం ప్రపద్యతే।
అత్రావృత్తో దినకరః సురసం క్షరతే పయః॥ 15
కాష్ఠాం చాసాద్య వాసిష్ఠీం హిమముత్సృజతే పునః।
సుఖంగానీ, దుఃఖం కానీ పరిపక్వమయ్యేది ఇక్కడే. ఈ దిక్కునకు మరలిన తరువాతనే సూర్యుడు స్వాదనీయమయిన జలాన్ని వర్షిస్తాడు. మరల వసిష్ఠసేవితమయిన ఉత్తరదిక్కును చేరి మంచు కురిపిస్తాడు.(15 1/2)
అత్రాహం గాలవ పురా క్షుధార్తః పరిచింతయన్॥ 16
లబ్ధవన్ యుధ్యమానౌ ద్వౌ బృహంతా గజకచ్ఛసౌ।
గాలవా! ఒకప్పుడు నేను ఆకలితో బాధపడుతూ, చింతకులోనయి ఇక్కడే యుద్ధం చేస్తున్న పెద్ద ఏనుగునూ, తాబేటినీ పొందాను. (16 1/2)
అత్ర చక్రధనుర్నామ సూర్యాజ్జాతో మహానృషిః॥ 17
విదుర్యం కపిలం దేవం యేనార్తాః సగరాత్మజాః।
సూర్యునివలె తేజోమూర్తి అయిన కర్దమునకు పుట్టిన చక్రధను మహర్షి ఈ దిక్కుననే ఉంటాడు. ఆయననంతా కపిలుడు అంటారు. సగరకుమారులను దగ్ధం చేసినది ఆ కపిలుడే. (17 1/2)
అత్ర సిద్ధాః శివా నామ బ్రాహ్మణా వేదపారిగాః॥ 18
అధీత్య సకలాన్ వేదాన్ లేభిరే మోక్షమక్షయమ్।
ఇక్కడ 'శివ'నామం గల సిద్ధ బ్రాహ్మణులు కొందరు వేదవేత్తలుండేవారు. వారు సకలవేదాలనూ అభ్యసించి అక్షయమోక్షసిద్ధిని పొందారు. (18 1/2)
అత్ర భోగవతీ నామ పురీ రాక్షసపాలితా॥ 19
తక్షకేణ చ నాగేన తథైవైరావతేన చ।
ఈ దిక్కుననే వాసుకిచేత పాలింపబడుతూ, తక్షక - ఐరావతులచేత రక్షింపబడుతున్న 'భోగవతి' అనే నాగనగరం ఉన్నది. (19 1/2)
అత్ర నిర్యాణకాలేఽపి తమః సంప్రాప్యతే మహత్॥ 20
అభేద్యం భాస్కరేణాపి స్వయం వా కృష్ణవర్త్మనా।
మరణానంతరం ప్రయాణంలో ఈ దిక్కుననే గాఢాంధకారం అలముతుంది. అది సూర్యునకూ, అగ్నికీ కూడా అభేద్యమయినది. (20 1/2)
ఏష తస్యాపి తే మార్గః పరిచార్యస్య గాలవ।
బ్రూహి మే యది గంతవ్యం ప్రతీచీం శృణు చాపరామ్॥ 21
గాలవా! నా సేవలందుకొంటున్న నీకు ఈ దక్షిణ దిక్కును గూర్చి చెప్పాను. ఇటు వెళ్దామంటావా? లేకపోతే పడమటి దిక్కును గురించి విను. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే నవాధికశతతమోఽధ్యాయః॥ 109 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి గాలచరితమను నూటతొమ్మిదవ అధ్యాయము. (109)