108. నూటయెనిమిదవ అధ్యాయము
గరుడుడు గాలవునకు తూర్పుదిక్కును వర్ణించి చెప్పుట.
సుపర్ణ ఉవాచ
అనుశిష్టోఽస్మి దేవేన గాలవాజ్ఞాతయోనినా।
బ్రూహి కామం తు కాం యామి ద్రష్టుం ప్రథమతో దిశమ్॥ 1
సుపర్ణుడిలా అన్నాడు - గాలవా! నీకు సహకరించమని అనాదిదేవుడైన విష్ణుమూర్తి నన్ను ఆదేశించాడు. నీ ఇష్టం. ముందు ఏ దిక్కువైపు వెళదామా చెప్పు. (1)
పూర్వాం నా దక్షిణాం వాహమ్ అథవా పశ్చిమాం దిశమ్।
ఉత్తరాం వా ద్విజశ్రేష్ఠ కుతో గచ్ఛామి గాలవ॥ 2
ద్విజశ్రేష్ఠా! గాలవా! తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం వీటిలో ఏదిక్కువైపు వెళ్ళమంటావో చెప్పు. (2)
యస్యాముదయతే పూర్వం సర్వలోకప్రభావనః।
సవితా యత్ర సంధ్యాయాం సాధ్యానాం వర్తతే తపః॥ 3
యస్యాం పూర్వం మతిర్యాతా యయా వ్యాప్తమిదం జగత్।
చక్షుషీ యత్ర ధర్మస్య యత్ర చైష ప్రతిష్ఠితః॥ 4
కృతం యతో హుతం హవ్యం సర్పతే సర్వతోదిశమ్।
ఏతద్ ద్వారం ద్విజశ్రేష్ఠ దివసస్య తథాధ్వనః॥ 5
ద్విజశ్రేష్ఠా! ఇది తూర్పుదిక్కు, పగటికీ, సూర్యమార్గానికీ ఇది ద్వారం. సమస్త జగత్తునూ ప్రభావితం చేసే సూర్యుడు ఈ దిక్కుననే ఉదయిస్తాడు. సంద్యాకాలంలో సాధ్యులు తపస్సు చేసేది ఈ దిక్కుననే. ఈ దిక్కుననే బుద్ధిజనించి లోకమంతా వ్యాపించింది. ధర్మానికి కళ్ళవంటి సూర్యచంద్రులు ఈ దిశలోనే ఉదయిస్తారు. ధర్మప్రతిష్ఠ ఈ దిక్కులోనే. పవిత్రమైన హవిస్సును ముందు ఈ దిక్కుననే హోమం చేస్తారు. ఆ తర్వాత అది అన్నిదిక్కూలకూ వ్యాపిస్తుంది. (3-5)
అత్ర పూర్వం ప్రసూతా వై దాక్షాయణ్యః ప్రజాః స్త్రియః।
యస్యాం దిశి ప్రవృద్ధాశ్చ కశ్యపస్యాత్మసంభవాః॥ 6
ఈ దిక్కుననే దక్షప్రజాపతిసంతతి అదితి మొదలగువారు తొలిగా సంతతిని కన్నారు. కశ్యప ప్రజాపతిసంతానం కూడా ఈ దిక్కుననే వర్ధిల్లింది. (6)
అదోమూలా సురాణాం శ్రీః యత్ర శక్రోఽభ్యషిచ్యత।
సురరాజ్యేన విప్రర్షే దేవైశ్చాత్ర తపశ్చితమ్॥ 7
బ్రహ్మర్షీ! దేవతల ఐశ్వర్యానికి మూలస్థానం ఈ దిక్కే. ఇంద్రుడు తొలిగా దేవాధిపతిగా పట్టాభిషేకాన్ని ఈ దిక్కుననే పొందాడు. దేవతలు ఈ దిశలోనే తపస్సు చేశారు. (7)
ఏతస్మాత్ కారణాత్ బ్రహ్మన్ పూర్వేత్యేషా దిగుచ్యతే।
యస్మాత్ పూర్వతరే కాలే పూర్వమేవావృతా సురైః॥ 8
అత ఏవ చ సర్వేషాం పూర్వామాశాం ప్రచక్షతే।
బ్రహ్మస్వరూపా! ఈ కారణాలచేతనే దీనిని పూర్వదిక్కు అంటారు. ప్రాచీన కాలంలోనే ముందుగా దేవతలచే ఈ దిక్కు నిండిపోయింది. అందుకనే అందరికీ ఇది తొలిదిక్కు అయినది. (8)
పూర్వం సర్వాణి కార్యాణి దైవాని సుఖమీప్సతా॥ 9
సుఖాన్ని అఖిలషించే వరెవరైన ఏ పనినైనా ముందు ఈ దిక్కుననే చేయాలి. (9)
అత్ర వేదాన్ జగౌ పూర్వం భగ్వాన్ లోకభావనః।
అత్రైవోక్తా సవిత్రాఽఽసీత్ సావిత్రీ బ్రహ్మవాదిషు॥ 10
లోకసృష్టికర్మ అయిన బ్రహ్మ ముందుగా ఈ దిక్కుననే. వేదగానం చేశాడు. సవితృదేవత బ్రహ్మావాదులకు ఈ దిక్కుననే శావిత్రీమంత్రాన్ని ఉపదేశించింది. (10)
అత్ర దత్తాని పూర్వేణ యజూంషి ద్విజసత్తమ।
అత్ర లబ్ధవరః సోమః సురైః క్రతుషు పీయతే॥ 11
ద్విజశ్రేష్ఠా! ఈ దిక్కులోనే సూర్యుడు యాజ్ఞావల్క్యునకు యజుర్వేదాన్ని ఇచ్చింది. దేవతలకు యాగాలలో సోమపానం చేసే వరం ఈ దిక్కుననే లభించింది. (11)
అత్ర తృప్తా హుతవహాః స్వాం యోనిముపభుంజతే।
అత్ర పాతాళమాశ్రిత్య వరుణః శ్రియమాప చ॥ 12
ఈ దిక్కునందే యజ్ఞతృప్తులయిన అగ్నిదేవతలు తమకు కారణరూపమైన నీటిని త్రాగుతారు. ఈ దిక్కుననే వరుణుడు పాతాళాన్ని ఆశ్రయించి ఐశ్వర్యాన్ని పొందాడు. (12)
అత్ర పూర్వం వసిష్ఠస్య పౌరాణస్య ద్విజర్షభ।
సూతిశ్పైవ ప్రతిష్ఠా చ నిధనం చ ప్రకాశతే॥ 13
ద్విజశ్రేష్ఠా! పురాతనుడయిన వసిష్ఠ మహర్షి యొక్క పుట్టుక, ప్రతిష్ఠ, మరణం కూడా ఇక్కడే సంభవించాయి. (13)
ఓంకారస్యాత్ర జాయంతే సృతయో దశతీర్దశ।
పిబంతి మునయో యత్ర హవిర్ధూమం స్మ ధూమపాః॥ 14
ఈ దిక్కులోనే వేదం యొక్క సహస్రశాఖలూ పుట్టాయి. ధూమపానం చేసే మహర్షులు హవిష్యధూమాన్ని ఈ దిక్కుననే పానం చేస్తారు. (14)
ప్రోక్షితా యత్ర బహవః వరాహాద్యా మృగా వనే।
శక్రేణ యజ్ఞభాగార్థే దైవతేషు ప్రకల్పితాః॥ 15
దేవేంద్రుడు యజ్ఞభాగసిద్ధి కొరకు అరణ్యంలోని అడవిపందులు మొదలయిన క్రూరజంతువులను సంప్రోక్షించి దేవతలకు అప్పగించినది ఈ దిక్కుననే. (15)
అత్రాహితాః కృతఘ్నాశ్చ మానుషాశ్చాసురాశ్చ యే।
ఉదయంస్తాన్ హి సర్వాన్ వై క్రోధాద్ధంతి విభావసుః॥ 16
ఈ దిక్కున పుట్టిన సూర్యుడు కీడుచేసే వారూ, కృతఘ్నులూ అయిన మనుష్యులనూ, రాక్షసులనూ క్రోధంతో నశింపచేస్తాడు. (16)
ఏతద్ ద్వారం త్రిలోకస్య స్వర్గస్య చ సుఖస్య చ।
ఏష పూర్వో దిశాం భాగఆఘ విశావోఽత్ర యదీచ్ఛసి॥ 17
త్రిలోకాలకూ, స్వర్గానికీ, సుఖానికీ ఈ పూర్వదిగ్భాగమే ద్వారం. నీకిష్టమయితే మనమిద్దరం ఇక్కడ ప్రవేశిద్దాం. (17)
ప్రియం కార్యం హి మే తస్య యస్యాస్మి వచనే స్థితః।
బ్రూహి గాలవ యాస్యామి శృణు చాప్యపరాం దిశమ్॥ 18
నా యజమాని అయిన విష్ణుమూర్తికి ఇష్టమైన పనిని నేను తప్పక చేయాలి. కాబట్టి గాలవా! చెప్పు. తూర్పుదిక్కుకు వెళదామా! మరో దిక్కును గురించి కూడ విను. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే అష్టాధికశతతమోఽధ్యాయః॥ 108 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటయెనిమిదవ అధ్యాయము. (108)