106. నూట ఆరవ అధ్యాయము

గాలవచరితము.

జనమేజయ ఉవాచ
అనర్థే జాతనిర్బంధం పరార్థే లోభమోహితమ్।
అనార్యకేష్వభిరతం మరణే కృతనిశ్చయమ్॥ 1
జ్ఞాతీనాం దుఃఖకర్తారం బంధూనాం శోకవర్ధనమ్।
సుహృదాం క్లేశదాతారం ద్విషతాం హర్షవర్ధనమ్॥ 2
కథమ్ నైనం విమార్గస్థం వారయంతీహ బాంధవాః।
సౌహృదాద్ వా సుహృత్ స్నిగ్ధః భగవాన్ వా పితామహః॥ 3
జనమేజయుడిలా అన్నాడు - దుర్యోధనుడు అనర్థకార్యాలపై అధికాసక్తిగలిగి ఉన్నాడు. పరధనం మీద లోభమోహాలకు గురి అయ్యాడు. చెడ్డవారిపై అనురక్తుడై ఉన్నాడు. చావటానికి కూడా సిద్ధమయ్యాడు. కుటుంబసభ్యులకు దుఃఖాన్ని కల్గిస్తూ, బంధువుల శోకాన్ని పెంచుతున్నాడు. మిత్రులకు ఇబ్బందులను కలిగిస్తున్నాడు. శత్రువుల ఆనందాన్ని పెంపొందిస్తున్నాడు. ఇలా దారితప్పిన దుర్యీధనుని బాంధవులు ఎందుకు నివారించటం లేదు? శ్రేయోభిలాషులయినా, మిత్రులయినా, పూజ్యుడైన వ్యాసుడయినా అతనిని మంచితనంవైపు ఎందుకు మరలించటం లేదు? (1-3)
వైశంపాయన ఉవాచ
ఉక్తం భగవతా వాక్యమ్ ఉక్తం భీష్మేణ యత్ క్షమమ్।
ఉక్తం బహువిధం చైవ నారదేనాపి తచ్ఛృణు॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - వ్యాసభగవానుడు మంచిమాటలను చెప్పాడు. భీష్ముడు తగినరీతిలో బోధించాడు. నారదుడు కూడా ఎన్నో విధాలుగా చెప్పిచూచాడు. అదంతా విను. (4)
నారద ఉవాచ
దుర్లభో వై సుహృచ్ఛ్రోతా దుర్లభశ్చ హితః సుహృత్।
తిష్ఠతే హి సుహృద్ యత్ర న బంధుస్తత్ర తిష్ఠతే॥ 5
నారదుడిలా అన్నాడు - మంచివారి మాటలను ఆసక్తితో వినే శ్రోత దొరకడు - హితాన్ని కోరే మంచిమిత్రులు దొరకటం కూడా కష్టం. బంధువులు కూడా సహకరించలేని సందర్భంలో మిత్రుడే తోడు నిలవగలడు. (5)
శ్రోతవ్యమపి పశ్యామి సుహృదాం కురునందన।
న కర్తవ్యశ్చ నిర్బంధః నిర్బంధో హి సుదారుణః॥ 6
కురునందనా! నీవు నీ మిత్రుల ఉపదేశాన్ని వినవలసిన అవసరమున్నదని నాకు అనిపిస్తోంది. కాబట్టి పట్టుదలకు పోవద్దు. దురాగ్రహం భయంకరపరిణామాలకు దారితీస్తుంది. (6)
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్।
యథా నిర్బంధతః ప్రాప్తః గాలవేన పరాజయః॥ 7
ఈ విషయంలో పట్టుదలకు పోయి పరాజయం పాలయిన గాలవునకు సంబంధించిన ప్రాచీనగాథను పెద్దలు చెప్తుంటారు. (7)
విశ్వామిత్రమ్ తపస్యంతం ధర్మో జిజ్ఞాసయా పురా।
అభ్యగచ్ఛత్ స్వయం బూత్వా వసిష్ఠో భగవానృషిః॥ 8
ఒకప్పుడు ధర్ముడు జిజ్ఞాసతో వసిష్టమహర్షి రూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు. (8)
సప్తర్షీణామన్యతమం వేషమాస్థాయ భారత।
బుభుక్షుః క్షుభితో రాజన్ ఆశ్రమం కౌశికస్య తు॥ 9
భారతా! సప్తర్షులతో ఒకడైన వసిష్ఠుని రూపాన్ని ధరించి ఆకలికి నకనకలాడుతూ భోజనాపేక్షతో విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. (9)
విశ్వామిత్రోఽథ సంభ్రాంతః శ్రపయామాస వై చరుమ్।
పరమాన్నస్య యత్నేన న చ తం ప్రత్యపాలయత్॥ 10
విశ్వామిత్రుడు కంగారుపడి అతిథికి పరమాన్నాన్ని పెట్టాలన్న ప్రయత్నంతో చరుపాకాన్ని ప్రారంభించాడు. కానీ ఆ అతిథి అంతవరకు ఆగలేకపోయారు. (10)
అన్నం తేన తదా భుక్తమ్ అన్యైర్దత్తం తపస్విభిః।
అథ గృహ్యాన్నమత్యుష్ణం విశ్వామిత్రోఽప్యుపాగమత్॥ 11
ఇతర మహర్షులు పెట్టిన అన్నాన్ని ఆ అతిథి ఆరగించాడు. అప్పుడు విశ్వామిత్రుడు వేడివేడిగా ఉన్న అన్నాన్ని తీసికొనివచ్చాడు. (11)
భుక్తం మే తిష్ఠ తావత్ త్వమ్ ఇత్యుక్త్వా భగవాన్ యయౌ।
విశ్వామిత్రస్తతో రాజన్ స్థిత ఏవ మహాద్యుతిః॥ 12
అప్పుడా అతిథి 'నేను భోజనం చేశాను. నీవు అక్కడే ఉండు" అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు ఆశ్రమ సమీపంలోనే నిశ్చేష్టుడై స్థాణువు వలె నిలిచాడు. ఆ స్థితిలో గాలి మాత్రమే ఆయనకు ఆహారం. (13)
తస్య శుశ్రూషణె యత్నమ్ అకరోద్ గాలవో మునిః।
గౌరవాద్ బహుమానాశ్చ హార్దేన ప్రియకామ్యయా॥ 14
ఆ విశ్వామిత్రుని మీది గౌరవంతో, ఆదరంతో, ఆత్మీయతతో ఆయన అనుగ్రహాన్ని పొందగోరి గాలవముని ప్రయత్నపూర్వకంగా విశ్వామిత్రుని శుశ్రూష చేశాడు. (14)
అథ వర్షశతే పూర్ణే ధర్మః పునరుపాగమత్।
వాసిష్ఠం వేషమాస్థాయ కౌశికం భోజనేప్సయా॥ 15
ఆ తరువాత వందసంవత్సరాలకు యమధర్మరాజు మరల వసిష్ఠుని రూపాన్ని ధరించి భోజనాపేక్షతో విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు. (15)
స దృష్ట్వా శిరసా భక్తం ధ్రియమాణం మహర్షిణా।
తిష్ఠతా వాయుభక్షేణ విశ్వామిత్రేణ ధీమతా॥ 16
ప్రతిగృహ్య తతో ధర్మః తథైవోష్ణం తథా నవమ్।
భుక్త్వా ప్రీతోఽస్మి విప్రర్షే తముక్త్వా స మునిర్గతః॥ 17
పరమధీమంతుడైన విశ్వామిత్ర మహర్షి వాయుభక్షణ చేస్తూ తలపై అన్నాన్ని మోస్తూండటాన్ని చూచు ఆ ధర్ముడు అప్పటికీ వేడిగా, తాజాగా ఉన్న ఆ అన్నాన్ని తీసికొని తిని - "బ్రహ్మర్షీ! పరమానందంగా ఉంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. (16-17)
క్షత్రభావాదపగతః బ్రాహ్మణత్వముపాగతః।
ధర్మస్య వచనాత్ ప్రీతః విశ్వామిత్రస్తదా భవత్॥ 18
క్షత్రభావం నుండి దాని పై మెట్టయిన బ్రహ్మభావం పొందిన ఆ విశ్వామిత్రుడు ధర్ముని మాటతో ఎంతో ఆనందించాడు. (18)
విశ్వామిత్రస్తు శిష్యస్య గాలవస్య తపస్వినః।
శుశ్రూషయా చ భక్త్వా చ ప్రీతిమానిత్యువాచ హ॥ 19
విశ్వామిత్రుడు తన శిష్యుడూ, తపస్వి అయిన గాలవుని శుశ్రూషవలన, భక్తివలన సంతుష్టుడై ఇలా అన్నాడు. (19)
అనుజ్ఞాతో మయా వత్స యథేష్టం గచ్ఛ గాలవ।
ఇత్యుక్తః ప్రత్యువాచేదం గాలవో మునిసత్తమమ్॥ 20
ప్రీతో మధురయా వాచా విశ్వామిత్రం మహాద్యుతిమ్।
దక్షిణాః కాః ప్రయచ్ఛామి భవతే గురుకర్మణి॥ 21
నాయనా! గాలవా! నేను అనుమతిస్తున్నాను. స్వేచ్ఛగా వెళ్ళవచ్చు - మధురమయిన ఆ మాటతో సంతోషించిన గాలవుడు తేజోమూర్తి, మునిసత్తముడూ ఐన విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. "గురుదక్షిణగా తమకేమివ్వమంటారు?" (20-21)
దక్షిణాభిరుపేతం హి కర్మ సిద్ధ్యతి మానద।
దక్షిణానాం హి దాతా వై అపవర్గేణ యుజ్యతే॥ 22
మానదా! దక్షిణలతో కూడిన కర్మయే సఫలమవుతుంది. దక్షిణలనిచ్చినవాడే సిద్ధి పొందగలుగుతాడు. (22)
స్వర్గే క్రతుఫలం తద్ధి దక్షిణా శాంతిరుచ్యతే।
కిమాహరామి గుర్వర్థం బ్రవీతు భగవానితి॥ 23
దక్షిణలనిచ్చినవాడే స్వర్గలోకంలో యజ్ఞఫలాన్ని పొందగలడు. వేదం కూడా దక్షిణనే శాంతిప్రదంగా చెప్పింది. కాబట్టి గురుదక్షిణగా ఏమివ్వమంటారో తమరు చెప్పాలి. (23)
జానానస్తేన భగవాన్ జితః శుశ్రూషణేన వై।
విశ్వామిత్రస్తమసకృద్ గచ్ఛ గచ్ఛేత్యచోదయత్॥ 24
గాలవుని సేవాశుశ్రూషలతో పూజ్యుడైన విశ్వామిత్రుడు అతని అధీనమైపోయాడు. కాబట్టి ఆ ఉపకారాన్ని మనస్సులో నుంచుకొనియే విశ్వామిత్రుడు "వెళ్ళు వెళ్ళు" అని పంపివేయబోయడు. (24)
అసకృద్ గచ్ఛ గచ్ఛేతి విశ్వామిత్రేణ భాషితః।
కిం దదానీతి బహుశః గాలవః ప్రత్యభాషత॥ 25
విశ్వామిత్రుడు పదే పదే "వెళ్ళు వెళ్ళు" అని అంటున్నా, గాలవుడు పట్టుదలతో "ఏమివ్వమంటారు చెప్పండి" అని మళ్ళీ అడిగాడు. (25)
నిర్బంధతస్తు బహుశః గాలవస్య తపస్వినః।
కించిదాగతసంరంభః విశ్వామిత్రోఽబ్రవీదిదమ్॥ 26
తపస్వి అయిన గాలవుడు తీవ్రంగ పట్టుపట్టదంతో కొంత కోపించిన విశ్వామిత్రుడు గాలవునితో ఇలా అన్నాడు. (26)
ఏకతః శ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసామ్।
అష్టౌ శతాని మే దేహి గచ్ఛ గాలవ మ చిరమ్॥ 27
గాలవా! చెవులు ఒకవైపు నల్లగా ఉండి చంద్రసమాన కాంతితో తెల్లగా ఉన్న ఎనిమిది వందల గుఱ్ఱాలను తెచ్చి ఇవ్వు, వెళ్ళు, ఆలస్యం చేయవద్దు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే షడధికశతతమోఽధ్యాయః॥ 106 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూట ఆరవ అధ్యాయము. (106)