105. నూట అయిదవ అధ్యాయము
విష్ణువు గరుడుని గర్వమణుచుట - దుర్యోధనుడు కణ్వుని హేళనచేయుట.
కణ్వ ఉవాచ
గరుడస్తత్ర శుశ్రావ యథావృత్తం మహాబలః।
అయుఃప్రదానం శక్రేణ కృతం నాగస్య భారత॥ 1
కణ్వుడిలా అన్నాడు - భారతా! మహాబలుడయిన గరుడుడు దేవేంద్రుడు సుముఖునకు ఆయుష్షు నిచ్చిన విషయాన్ని యథాతథంగా విన్నాడు. (1)
పక్షవాతేన మహతా రుద్ధ్వా త్రిభువనం ఖగః।
సుపర్ణః పరమక్రుద్ధః వాసనం సముపాద్రవత్॥ 2
ఖేచరుడయిన గరుడుడు ఇది విని, కోపించి, తీవ్రమయిన తన రెక్కల గాలితో మూడులోకాలనూ కంపింపజేస్తూ ఇంద్రుని దగ్గరకు వచ్చాడు. (2)
గరుడ ఉవాచ
భగవన్ కిమవజ్ఞానాద్ వృత్తిః ప్రతిహతా మమ।
కామకారవరం దత్త్వా పునశ్చలితవానసి॥ 3
స్వామీ! నన్ను అవహేళన చేస్తూ నా జీవికను మీరు అడ్డగించారు. ఒకమారు నాకు స్వేచ్ఛాచారిత్వాన్ని వరంగా ప్రసాదించి ఇప్పుడు మరల దానిని తప్పారు. (3)
విసర్గాత్ సర్వభూతానాం సర్వభూతేశ్వరేణ మే।
ఆహారో విహితో ధాత్రా కిమర్థం వార్యతే త్వయా॥ 4
సమస్త ప్రాణులకూ సృష్టికర్త అయిన బ్రహ్మ సర్వప్రాణులనూ సృష్టించే సమయంలోనే నా ఆహారాన్ని నిర్ణయించాడు. దానిని మీరెందుకు వారిస్తున్నారు? (4)
వృతశ్పైవ మహానాగః స్థాపితః సమయశ్చ మే।
అనేన చమయా దేవ భర్తవ్యః ప్రసవో మహాన్॥ 5
స్వామీ! నేను ఆ మహానాగాన్ని ఆహారంగా ఎన్నుకొన్నాను. దానికి కాలాన్నికూడా నిశ్చయించాను. ఆ ఆహారంతోనే నేనూ నా కుటుంబాన్ని అంతా పోషించవలసి ఉంది. (5)
ఏతస్మింస్తు తథాభూతే నాన్యం హింసితుముత్సహే।
క్రీడసే కామకారేణ దేవరాజ యథేచ్ఛకమ్॥ 6
దేవరాజా! నేను ఆహారంగా ఎంచుకొనిన ఆ పాము దీర్ఘాయువు అయితే దానికి బదులుగా నేను మరొకదానిని హింసించలేను. స్వేచ్ఛాచారిత్వాన్ని సొంతం చేసికొని ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. (6)
సోఽహం ప్రాణాన్ విమోక్ష్యామి తథా పరిజనో మమ।
యే చ భృత్వా మమ గృహే ప్రీతిమాన్ భవ వాసవ॥ 7
వాసవా! నేనిప్పుడు ప్రాణత్యాగం చేస్తాను. నా పరిజనులూ, నా ఇంటిలో ఉన్న భృత్యులూ అందరూ ప్రాణాలు విడుస్తారు. నీవు మాత్రం ఆనందంగా ఉండు. (7)
ఏతచ్పైవాహమర్హామి భూయశ్చ బలవృత్రహన్।
త్రైలోక్యస్యేశ్వరో యోఽహం పరభృత్యత్వ మాగతః॥ 8
బలవృత్రసంహారా! దేవేంద్రా! మూడు లోకాలనూ శాసించగలవాడనై ఉండికూడా ఇతరులను సేవించటానికి సిద్ధపడిన నాకు ఇది తగిన మర్యాదయే. (8)
త్వయి తిష్ఠతి దేవేస న విష్ణుః కారణం మమ।
త్రైలోక్యరాజ రాజ్యం హి త్వయి వాసవ శాశ్వతమ్॥ 9
దేవేశ్వరా! త్రిలోకనాథా! నీవున్న కారణంగా నా జీవిక నిరోధింపబడటానికి విష్ణువు కారణమని నేను భావించటం లేదు. వాసవా! మూడులోకాల రాజ్యభారమంతా నీమీదే గదా ఉంటుంది. (9)
మమాపి దక్షస్య సుతా జననీ కశ్యపః పితా।
అహమప్యుత్సహే లోకాన్ సమంతాద్ వోఢుమంజసా॥ 10
నాతల్లి కూడా దక్షప్రజాపతి కూతురే. నా తండ్రి కశ్యపమహర్షి. నేను కూడా చాలా తేలికగా సర్వలోకాల భారాన్నీ వహించగలను. (10)
అసహ్యం సర్వభూతానాం మమాపి విపులం బలమ్।
మయాపి సుమహత్ కర్మ కృతం దైతేయవిగ్రహే॥ 11
సర్వభూతాలూ ఒక్కటైనా కూడా సహించలేనంత విస్తారంగా నాకు బలముంది. దైత్యులతో యుద్ధం చేసే సమయంలో నేను కూడా ఎంతో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాను. (11)
శ్రుతశ్రీః శ్రుతసేనశ్చ వివస్వాన్ రోచనాముఖః।
ప్రసృతః కాలకాక్షశ్చ మయాపి దితిజా హతాః॥ 12
నేను కూడా శ్రుతశ్రీనీ, శ్రుతసేనునీ, వివస్వంతునీ, రోచనాముఖునీ, ప్రసృతునీ, కాలకాక్షునీ సంహరించాను. (12)
యత్ తు ధ్వజస్థానగతః యత్నాత్ పరిచరామ్యహమ్।
వహామి చైవానుజం తే తేవ మామవమన్యసే॥ 13
అయినా నేను రథపతాకంపై నిలిచి ప్రయత్నపూర్వకంగా నీ సోదరుని సేవిస్తూ, వాహనమై మోస్తున్నాను. అందుకని నన్ను తక్కువగా చూస్తున్నావు. (13)
కోఽన్యే భారసహో హ్యస్తి కోఽన్యోఽస్తి బలవత్తరః।
మయా యోఽహం విశిష్టః సన్ వహామీమం సబాంధవమ్॥ 14
నేను తప్ప విష్ణువు భారాన్ని భరించగలవాడు మరొకడు ఎవడున్నాడు? నా బలాన్ని మించిన బలం కలవాడెవడున్నాడు? అంత విశిష్టమైన భక్తి సంపదగలవాడనై కూడా సబాంధవంగా ఈ విష్ణువును మోస్తున్నాను. (14)
అవజ్ఞాయ తు యత్ తేఽహం భోజనాద్ వ్యసరోపితః।
తేన మే గౌరవం నష్టం త్వత్తశ్చాస్మాచ్చ వాసవ॥ 15
వాసవా! నన్ను చిన్నచూపు చూసి నా ఆహారాన్ని తొలగించావు. దానితో నా గౌరవం భంగపడింది. దీనికి నీవూ, విష్ణువూ కారణం. (15)
అదిత్యాం య ఇమే జాతాః బలవిక్రమశాలినః।
త్వమేషాం కిల సర్వేషాం బలేన బలవత్తరః॥ 16
స్వామీ! విష్ణూ! అదితి గర్భాన పుట్టిన బలవిక్రమసంపన్నులయిన దేవతలలో బలదృష్టితో అందరికన్నా బలవంతుడవు నీవే. (16)
సోఽహం పక్షైకదేశేన వహామి త్వాం గతక్షమః।
విమృశ త్వం శనైస్తాత కోన్వత్ర బలవానితి॥ 17
తండ్రీ! అటువంటి నేను నారెక్కలలో ఒక ప్రక్క కూర్చోబెట్టుకొని ఏ శ్రమా లేకుండా మిమ్ము మోస్తున్నాను. నెమ్మదిగా ఆలోచించండి. ఇక్కడ అందరికన్నా బలవంతుడెవడో? గమనించండి. (17)
కణ్వ ఉవాచ
స తస్య వచనం శ్రుత్వా ఖగస్యోదర్కదారుణమ్।
అక్షోభ్యం క్షోభయన్ తార్ క్ష్యమ్ ఉవాచ రథచక్రభృత్॥ 18
గరుత్మన్ మన్యసేఽత్మానం బలవంతం సుదుర్బలమ్।
అలమస్మత్సమక్షం తే స్తోతుమాత్మాన మండజ॥ 19
కణ్వుడిలా అన్నాడు - గరుత్మంతుని మాటలు దారుణ పరిణామాలకు దారి తీసేవిగా ఉన్నాయి. విష్ణుమూర్తి ఆ మాటలు విన్నాడు. ఎవ్వరూ మందలించలేని గరుత్మంతుని మాటలు విన్నాడు. ఎవ్వరూ మందలించలేని గరుత్మంతుని మందలిస్తూ ఇలా అన్నాడు విష్ణువు -
గరుత్మంతుడా! నీవు చాలా బలహీనుడివి. కానీ నీవు గొప్ప బలవంతుడను అనుకొంటున్నావు. అండజా! మా సమక్షంలో ఆత్మస్తుతు లిక చాలు. (18-19)
త్రైలోఖ్యమపి మే కృత్స్నమ్ అశక్తం దేహధారణే।
అహమేవాత్మనాత్మానం వహామి త్వాం చ ధారయే॥ 20
మూడు లోకాలూ ఒక్కటైనా నా శరీరభారాన్ని మోయలేవు. నేనే నన్ను నేను మోసుకొంటూ నిన్ను కూడా మోస్తున్నాను. (20)
ఇమం తావన్మమైకం త్వం బాహుం సవ్యేతరం వహ।
యద్యేనం ధారయస్యేకం సఫలం తే వికత్థితమ్॥ 21
సరే! ముందు నీవు నా ఎడమచేతి బరువును మోయి. ఈ పాటి బరువును నీవు మోయగలిగితే నీ ఆత్మస్తుతి సార్థకమవుతుంది. (21)
తతస్స భగవాంస్తస్య స్కంధే బాహుం సమాసజత్।
నిపపాత స భారార్తః విహ్వలో నష్టచేతనః॥ 22
ఆ మాటలు చెప్పి పూజ్యుడైన విష్ణువు తన చేతిని గరుడుని భుజంపై పెట్టాడు. దానితో గరుడుడు ఆ బరువును మోయలేక కలతపడి పడిపోయాడు, స్పృహ తప్పాడు. (22)
యావాన్ హి భారః కృత్స్నాయాః పృథివ్యాః పర్వతైస్సహ।
ఏకస్యా దేహశాఖాయాః తావద్ భారమమన్యత॥ 23
పర్వతాలతో సహా ఈ భూమి మొత్తం ఎంత బరువుంటుందో, అంత బరువు విష్ణువు శరీరంలో భాగమైన ఆ భుజం ఉన్నట్లు గరుడునికి అనిపించింది. (23)
న త్వేనం పీడయామాస బలేన బలవత్తరః।
తతో హి జీవితం తస్య న వ్యనీనశదచ్యుతః॥ 24
అత్యంతబలశాలి అయిన ఆ విష్ణువు ఆ చేతిని అంతబలంగా పెట్టలేదు. అందుకని గరుడుడు ప్రాణాలు కోల్పోకుండా నిలువగలిగాడు. (24)
వ్యాత్తాస్యః స్రస్తకాయశ్చ విచేతా విహ్వలః ఖగః।
ముమోచ పత్రాణి తదా గురుభారప్రపీడితః॥ 25
ఆ బరువుకు గరుడుడు నోరు తెరిచాడు. అతని శరీరమంతా శిథిలమైంది. కలతపడి, స్పృహతప్పి తన రెక్కలను వదిలివేశాడు. (25)
స విష్ణుం శిరసా పక్షీ ప్రణమ్య వినతాసుతః।
విచేతా విహ్వలో దీనః కించిద్ వచనమబ్రవీద్॥ 26
కలతపడి నిశ్చేష్టుడై ఉన్న ఆ వైనతేయుడు తేరుకొని, తలవాల్చి పాదాలపై బడి, విష్ణుమూర్తికి నమస్కరించి, దీనంగా ఇలా అన్నాడు.(26)
భగవన్ లోకసారస్య సదృశేన వపుష్మతా।
భుజేన స్వైరముక్తేన నిష్పిష్టోఽస్మి మహీతలే॥ 27
స్వామీ! లోకంలోని సారమంతా ఆకృతి ధరించినట్లున్న తమ భుజాన్ని యథాలాపంగా నా శరీరంపై ఉంచితేనే పొడిపొడియై నేలకూలాను. (27)
క్షంతు మర్హసి మే దేవ విహ్వలస్యాల్పచేతసః।
బలదాహవిదగ్ధస్య పక్షిణో ధ్వజవాసినః॥ 28
దేవా! తమ ధ్వజంపై నున్న ఒక పక్షిని నేను, తమ బలతేజస్సులతో మండిపోయి కలతపడిన అల్పబుద్ధిని నేను, నా తప్పును క్షమించాలి. (28)
న హి జ్ఞాతం బలం దేవ మయా తే పరమం విభో।
తేన మన్యే హ్యహం వీర్యమ్ ఆత్మనో న సమం పరైః॥ 29
ప్రభూ! నాకు తమ మహాశక్తి తెలియదు. అందువలననే నా బలప్రాక్రమాలు అసామాన్యమైనవని నేను గొప్పగా భావించాను. (29)
తతశ్చక్రే స భగవాన్ ప్రసాదం వై గరుత్మతః।
మైనం భూయ ఇతి స్నేహాత్ తదా చైనమువాచ హ॥ 30
అప్పుడు విష్ణుమూర్తి గరుడుని క్షమించి, ప్రసన్నుడై "మరల ఎప్పుడూ ఇలా ప్రవర్తించవలదని" స్నేహపూర్వకంగా మందలించాడు.(30)
పాదాంగుష్ఠేన చిక్షేప సుముఖం గరుడోరసి।
తతః ప్రభృతి రాజేంద్ర సహ సర్పేణ వర్తతే॥ 31
రాజేంద్రా! తన కాలి బొటనవ్రేలితో సుముఖుని ఎత్తి గరుడుని వక్షః స్థలంపై ఉంచాడు. అప్పటినుండి గరుడుడు ఆ సర్పాన్ని ఎప్పుడూ తనతోనే ఉంచుకొన్నాడు. (31)
ఏవం విష్ణుబలాక్రాంతః గర్వనాశముపాగతః।
గరుడో బలవాన్ రాజన్ వైనతేయో మహాయశాః॥ 32
రాజా! ఈ విధంగా బలవంతుడు, మహాయాశస్వి, వినతాసుతుడైన గరుడుడు విష్ణుమూర్తి బలానికి లొంగి తన అహంకారాన్ని విడిచిపెట్టాడు. (32)
కణ్వ ఉవాచ
తథా త్వమపి గాంధారే యావత్ పాండుసుతాన్ రణే।
నాసాదయసి తాన్ వీరాన్ తవజ్జీవసి పుత్రక॥ 33
కణ్వుడిలా అన్నాడు - నాయనా! దుర్యోధనా! నీవు కూడా అలాగే రణరంగంలో వీరులయిన ఆ పాండవుల ఎదుట పడేదాకా జీవించి ఉండగలవు. (33)
భీమః ప్రహరతాం శ్రేష్ఠః వాయుపుత్రో మహాబలః।
ధనంజయశ్చేంద్రసుతః న హన్యాతాం తు కం రణే॥ 34
యోధులలో శ్రేష్ఠుడూ, బలిష్ఠుడూ అయిన భీముడు వాయునందనుడు, అర్జునుడు ఇంద్రకుమారుడు, వారిద్దరూ కలిసి యుద్ధంలో ఎవరిని చంపలేరు? (34)
విష్ణుర్వాయుశ్చ శక్రశ్చ ధర్మస్తౌ చాశ్వినావుభౌ।
ఏతే దేవాస్త్వయా కేన హేతునా వీక్షితుం క్షమాః॥ 35
విష్ణువు, వాయువు, ఇంద్రుడు, యముడు, అశ్వినులు ఈ దేవతలంతా నీకు వ్యతిరేకులు, నీవు ఏ బలం చూచికొని వారివైపు చూచే సాహసం చేస్తున్నావు/ (35)
తదలం తే విరోధేన శమం గచ్ఛ నృపాత్మజ।
వాసుదేవేన తీర్థేన కులం రక్షితుమర్హసి॥ 36
రాజకుమారా! శత్రుత్వం చాలు. సంధి చేసికో, శ్రీకృష్ణుని సహకారంతో నీ వంశాన్ని రక్షించుకో. (36)
ప్రత్యక్షదర్శీ సర్వస్య నారదోఽయం మహాతపాః।
మాహాత్మ్యస్య తదా విష్ణోః సోఽయం చక్రగదాధరః॥ 37
మహాతపస్వి అయిన ఈ నారదుడు నాటి విష్ణుమాహాత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూచినవాడు. చక్రదాధరుడైన ఆ విష్ణువే ఈ కృష్ణుడు. (37)
వైశంపాయన ఉవాచ
దుర్యోధనస్తు తచ్ఛ్రుత్వా నిఃశ్వసన్ భ్రుకుటీముఖః।
రాధేయమభిసంప్రేక్ష్య జహాస స్వనవత్తదా॥ 38
వైశంపాయనుడిలా అన్నాడు - దుర్యోధనుడు ఆ మాటలు విని, కనుబొమలు ముడివేసి, నిట్టూర్చుతూ కర్ణునివైపు చూసి పెద్దగా నవ్వసాగాడు. (38)
కదర్థీకృత్య తద్వాక్యమ్ ఋషేః కణ్వస్య దుర్మతిః।
ఊరుం గజకరాకారం తాడయన్నిదమబ్రవీత్॥ 39
కణ్వమహర్షి మాటలను హేళన చేసి దుర్మతియైన ఆ దుర్యోధనుడు ఏనుగుతొండంలాగా ఉన్న తన తొడను కొట్టి ఇలా అన్నాడు. (39)
యథైవేశ్వరసృష్టోఽస్మి యద్ భావి యా చ మే గతిః।
తథా మహర్షే వర్తామి కిం ప్రలాపః కరిష్యతి॥ 40
మహర్షీ! ఈశ్వరుడు నన్నెలా సృష్టించాడీ, ఏది జరగబోతోందో, నాకు ఏగతి వ్రాసి ఉన్నదో దానికనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నాను. ఇటువంటి ప్రలాపాలు నిష్ప్రయోజనాలు. (40)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి మాతలివరాన్వేషణే పంచాధికశతతమోఽధ్యాయః॥ 105 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణమను నూట ఐదవ అధ్యాయము. (105)