94. తొంబది నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు కౌరవసభలో ప్రవేశించుట.

వైశంపాయన ఉవాచ
తథా కథయతోరేవ తయోర్బుద్ధిమతోస్తదా।
శివా నక్షత్రసంపన్నా సా వ్యతీయాయ శర్వరీ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. బుద్ధిమంతులయిన శ్రీకృష్ణవిదురులు ఆవిధంగా మాటాడుకొంటూ ఉండగానే నక్షత్ర శోభిత మయిన ఆ శుభరాత్రి గడచి పోయింది. (1)
ధర్మార్థకామయుక్తాశ్చ విచిత్రార్థపదాక్షరాః।
శృణ్వతో వివిధా వాచః విదురస్య మహాత్మనః॥ 2
కథాభిరనురూపాభిః కృష్ణస్యామితతేజసః।
అకామస్యేవ కృష్ణస్య సా వ్యతీయాయ శర్వరీ॥ 3
మహాత్ముడైన శ్రీకృష్ణుడు ధర్మార్థ కామాలకు సంబంధించి వివిధ విషయాలు చెప్పుతున్నాడు. ఆ మాటలు విచిత్రమైన అర్థాలతో, పదాలతో, అక్షరాలతో కూడి ఉన్నాయి. విదురుడు వాటిని ఆసక్తితో వింటున్నాడు ఈ విధంగా తేజస్సంపన్నుడైన శ్రీకృష్ణుడు, విదురుడూ ఇద్దరూ కూడా తమ మనస్సులకు నచ్చిన కథాలాపాలతో తన్మయులయ్యారు. వారికి తెలియకుండానే ఆ రాత్రి గడచిపోయింది. (2-3)
తతస్తు స్వరసంపన్నాః బహవః సూతమాగధాః।
శంఖదుందుభినిర్ఘోషైః కేశవం ప్రత్యబోధయన్॥ 4
ఆ తరువాత స్వరసంపదలు గల సూతులు, మాగధులు ఎందరో శంఖ దుందుభినినాదాలతో శ్రీకృష్ణుని మేల్కొలిపారు. (4)
తత ఉత్థాయ దాశార్హః ఋషభః సర్వసాత్వతామ్।
సర్వమావశ్యకం చక్రే ప్రాతఃకార్యం జనార్దనః॥ 5
అప్పుడు యదువంశ శ్రేష్ఠుడూ, దశార్హనందనుడూ అయిన శ్రీకృష్ణుడు లేచి ప్రాతఃకాలంలో అవసరమైన కృత్యాల నన్నింటినీ ముగించాడు. (5)
కృతోదకానుజప్యః స హుతాగ్నిః సమలంకృతః।
తతశ్చాదిత్యముద్యంతమ్ ఉపాతిష్ఠత మాధవః॥ 6
సంధ్యాతర్పణాన్నీ, జపాన్నీ ముగించి, అగ్ని కార్యాన్ని పూర్తిచేసి, చక్కగా అలంకరించుకొని శ్రీకృష్ణుడు ఉదయభానుని ఉపస్థానం చేశాడు. (6)
వి॥ సంధ్యావందనంలో గాయత్రీ మంత్రజపం అయినతరువాత సుర్యోపస్థానం అని ఒక ప్రక్రియ చేస్తారు. అపుడే దిగ్దేవతా నమస్కారం కూడా చేస్తారు.
అథ దుర్యోధనః కృష్ణం శకునిశ్చాపి సౌబలః।
సంధ్యాం తిష్ఠంతమభ్యేత్య దాశార్హమపరాజితమ్॥ 7
ఆచక్షేతాం తు కృష్ణస్య ధృతరాష్ట్రం సభాగతమ్।
కురూంశ్చ భీష్మప్రముఖాన్ రాజ్ఞః సర్వాంశ్చ పార్థివాన్॥ 8
త్వామర్థయంతే గోవింద దివి శక్రమివామరాః।
తావభ్యనందద్ గోవిందః సామ్నా పరమవల్గునా॥ 9
ఆ సమయంలో దుర్యోధనుడూ, సబల పుత్రుడయిన శకునీ కలిసి సంధ్యోపాసన చేస్తున్న (అపరాజితుడయిన) శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి గోవిందా! ధృతరాష్ట్రమహారాజు కొలువు దీరి అన్నాడు. భీష్ముడు మొదలయిన కురుప్రముఖులు ఇతరరాజులందరూ అక్కడే ఉన్నారు. దేవతలు స్వర్గంలో ఇంద్రుని ఆహ్వానించినట్లు భీష్మాదులు నీ దర్శనాన్ని అభ్యర్థిస్తున్నారు అని చెప్పారు.
ఆమాటలు విని శ్రీకృష్ణుడు మధుర ప్రియభాషణలతో వారిని అభినందించారు. (7-9)
తతో విమల ఆదిత్యే బ్రాహ్మణేభ్యో జనార్దనః।
దదౌ హిరణ్యం వాసాంసి గాశ్చాశ్వాంశ్చ పరంతపః॥ 10
విసృజ్య బహురత్నాని దాశార్హమపరాజితమ్।
తిష్ఠంతముపసంగమ్య వవందే సారథిస్తదా॥ 11
నిర్మలమయిన సూర్యుడు ఉదయించిన తరువాత పరంతపుడైన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు బంగారం, వస్త్రాలు, గోవులూ, గుఱ్ఱాలూ దానం చేశాడు.
అనేక రత్నాలను దానం చేసి, నిలిచి ఉన్న అపరాజితుడైన శ్రీకృష్ణుని సమీపించి సారథి నమస్కరించాడు. (10-11)
తతో రథేన శుభ్రేణ మహతా కింకిణీకినా।
హయోత్తమయుజా శీఘ్రమ్ ఉపాతిష్ఠత దారుకః॥ 12
ఆ తరువాత సిరిమువ్వలచేత అలంకరింపబడి, మేలు జాతి గుఱ్ఱాలు పూన్పబడి, నిర్మలంగా ప్రకాశిస్తున్న విశాలమైన రథాన్ని తీసికొని త్వరగా దారుకుడు శ్రీకృష్ణుని సమీపించాడు. (12)
(తస్మై రథవరో యుక్తః శుశుభే లోకవిశ్రుతః।
వాజిభిః శైబ్యసుగ్రీవమేఘపుష్పవలాహకైః॥
శ్రీకృష్ణుని కొరకు సమకూర్చబడిన ఆ విశ్వవిఖ్యాత శ్రేష్ఠరథం శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనబడే నాలుగు గుఱ్ఱాలతో చక్కగా ప్రకాశిస్తోంది.
శైబ్యస్తు శుకపత్రాభః సుగ్రీవః కింశుకప్రభః।
మేఘపుష్పో మేఘవర్ణః పాండురస్తు వలాహకః॥
శైబ్యం చిలుకరెక్కల వలె పచ్చగా ఉంది. సుగ్రీవం పలాశకుసుమంలా ఎఱ్ఱగా ఉంది. మేఘపుష్పం మేఘవర్ణంలో ఉంది. వలాహకం తెల్లగా ఉంది.
దక్షిణం చావహచ్చైబ్యః సుగ్రీవః సవ్యతోఽవహత్।
పృష్ఠవాహౌ తయోరాస్తాం మేఘపుష్పవలాహకౌ॥
శైబ్యం కుడివైపు, సుగ్రీవం ఎడమ వైపు, మేఘపుష్ప వలాహకాలు వాటి వెనుక పూన్చబడి ఉన్నాయి.
వైనతేయః స్థితస్తస్యాం ప్రభాకరమివ స్పృశన్।
తస్య సత్త్వవతః కేతౌ భుజగారిరశోభత॥
సత్త్వగుణానికి ఆశ్రయమైన ఆ శ్రీకృష్ణుని రథంపై నున్న ధ్వజపతాకంపై సూర్యుని తాకుతున్నట్లుగా సర్పశత్రువైన గరుడు డున్నాడు.
తస్య కీర్తిమతస్తేన భాస్వరేణ విరాజితా।
శుశుభే స్యందనశ్రేష్ఠః పతగేంద్రేణ కేతునా॥
యశస్వి అయిన శ్రీకృష్ణుని శ్రేష్ఠరథం ఉజ్జ్వలమై ప్రకాశిస్తున్న గరుడధ్వజంతో ఎంతో శోభిస్తోంది.
రుక్మజాలైః పతాకాభిః సౌవర్ణేన చ కేతునా।
బభూవ స రథశ్రేష్ఠః కాలసూర్య ఇవోదితః॥
సువర్ణ పతాకలు, సువర్ణ ధ్వజం కలిగి ఆ శ్రేష్ఠరథం ప్రళయకాలంలో ఉదయించిన సూర్యునిలాగా వెలుగుతూ ఉంది.
పక్షిధ్వజవితానైశ్చ రుక్మజాలకృతాంతరైః।
దండమార్గవిభాగైశ్చ సుకృతై ర్విశ్వకర్మణా॥
ప్రవాలమణిహేమైశ్చ వాలజాలకృతాంతరైః॥
కార్తస్వరమయీభిశ్చ పద్మినీభిరలంకృతః।
శుశుభే స్యందనశ్రేష్ఠః తాపనీయైశ్చ పాదపైః॥
వ్యాఘ్రసింహవరాహైశ్చ గోవృషైర్మృగపక్షిభిః।
తారాభిర్భాస్కరైశ్చాపి వారణైశ్చ హిరణ్మయైః॥
వజ్రాంకుశవిమానైశ్చ కూబరావృత్త సంధిషు।)
ఆ రథాన్ని విశ్వకర్మ నిర్మించాడు. గరుడ ధ్వజపు చాందినీలతో, బంగారు కిటికీలు గల మధ్యభాగంతో, విడివిడిగా వైడూర్యాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో, వందలకొలది సిరిమువ్వలతో, పగడపు దండలతో ఆ రథంలోపలి భాగం అందంగా ఉన్నది. బంగారు తామరలు, బంగారు చెట్లు, పులులు, సింహాలు, వరాహాలు, వృషభాలు, మృగాలు, పక్షులు, నక్షత్రాలు, సూర్యుడు, ఏనుగుల స్వర్ణ ప్రతిమలతో ఆ రథం శోభిస్తోంది.
ఆ రథం నొగలోని సంధులలో వజ్రం, అంకుశం, విమానాల ఆకృతులు అందగిస్తున్నాయి.
తముపస్థిత మజ్ఞాయ రథం దివ్యం మహామనాః।
మహాభ్రఘననిర్ఘోషం సర్వరత్న విభూషితమ్॥ 13
అగ్నిం ప్రదక్షిణం కృత్వా బ్రాహ్మణాంశ్చ జనార్దనః।
కౌస్తుభం మణిమాముచ్య శ్రియా పరమయా జ్వలన్॥ 14
కురుభిః సంవృతః కృష్ణః వృష్ణిభిశ్చాభిరక్షితః।
ఆతిష్ఠత రథం శౌరిః సర్వయాదవనందనః॥ 15
నిండు మేఘాల గర్జనవంటి గంభీఱ ధ్వని గల్గి, సర్వరత్నాల చేత అలంకరింపబడిన ఆ దివ్యరథం వచ్చినట్టు తెలిసికొని అగ్నికీ, బ్రాహ్మణులకూ ప్రదక్షిణంచేసి, మెడలో కౌస్తుభమణిని ధరించి, పరమ కాంతితో ప్రకాశిస్తూ, తనచుట్టూ, కౌరవులు నిలువగా, యాదవులు రక్షకులై నిలువగా సమస్త యాదవులకూ ఆనందాన్ని కలిగించే ఆ జనార్దనుడు శ్రీకృష్ణుడురథాన్ని ఎక్కాడు. (13-15)
అన్వారురోహ దాశార్హం విదురః సర్వధర్మవిత్।
సర్వప్రాణభృతాం శ్రేష్ఠం సర్వబుద్ధిమతాం వరమ్॥ 16
సర్వప్రాణుల యందును సర్వబుద్ధిమంతుల యందును శ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణుని తరువాత సకల ధర్మవేత్త అయిన విదురుడు ఆ రథాన్ని అధిరోహించాడు. (16)
తతో దుర్యోధనః కృష్ణం శకునిశ్చాపి సౌబలః।
ద్వితీయేన రథేనైనమ్ అన్వయాతాం పరంతపమ్॥ 17
ఆ తరువాత దుర్యోధనుడూ, సుబలసుతుడు శకునీ మరోరథంలో పరంతపుడైన శ్రీకృష్ణుని అనుసరించారు. (17)
సాత్యకిః కృతవర్మా చ వృష్ణీనాం చాపరే రథాః।
పృష్ఠతోఽనుయయుః కృష్ణం గజైరశ్వైః రథైరపి॥ 18
సాత్యకీ, కృతవర్మా, యదువంశస్థులైన ఇతర రథికులూ, రథాలపై, ఏనుగులపై, గుఱ్ఱాలపై కూర్చొని శ్రీకృష్ణుని వెనుక బయలు దేరారు. (18)
తేషాం హేమపరిష్కారైః యుక్తాః పరమవాజిభిః।
గచ్ఛతాం ఘోషిణశ్చిత్రరథా రాజన్ విరేజిరే॥ 19
రాజా! వారంతా ప్రయాణిస్తున్న సమయంలో స్వర్ణాభరణాలతో అలంకరించబడ్డాయి. శ్రేష్ఠమైన అశ్వాలు. వానితో పూన్చబడి గంభీరంగా ధ్వనిస్తూ ఆ రథాలు ప్రకాశిస్తున్నాయి. (19)
సంమృష్ట సంసిక్తరజః ప్రతిపేదే మహారథమ్।
రాజర్షిచరితం కాలే కృష్ణో ధీమాన్ శ్రియా జ్వలన్॥ 20
ధీమంతుడైన శ్రీకృష్ణుడు తన శరీరశోభతో ప్రకాశిస్తూ ప్రాచీన రాజర్షులు సంచరించిన ఆ రాజమార్గంలోనికి సకాలంలో ప్రవేశించాడు. ఆ రాజమార్గం చక్కగా చిమ్మి నీళ్ళుచల్లబడి ఉంది. (20)
తతః ప్రయాతే దాశార్హే ప్రావాద్యంతైకపుష్కరాః।
శంఖాశ్చ దధ్మిరే తత్ర వాద్యాన్యన్యాని యాని చ॥ 21
శ్రీకృష్ణుడు బయలుదేరగానే డోలు, శంఖం, ఇంకా ఇతర వాద్యాలూ ఒక్కసారిగా మ్రోగాయి. (21)
వి॥సం॥ ఏకపుష్కరాః = కాహ్ళలు(నీల)
ఒకే ధ్వనిగా వచ్చేవి - లెక్కలేనన్ని (అర్జు)
ఒక ప్రక్కనే మ్రోగించేవి(సర్వ)
ప్రవీరాః సర్వలోకస్య యువానః సింహవిక్రమాః।
పరివార్య రథం శౌరేః అగచ్ఛంత పరంతపాః॥ 22
శత్రువులకు సంతాపాన్ని కల్గించగల వారూ, సింహ విక్రములు, లోకప్రఖ్యాతులూ, యువకులు అయిన వీరులు శ్రీకృష్ణుని రథాన్ని చుట్టి వస్తున్నారు. (22)
తతోఽన్యే బహుసాహస్రాః విచిత్రాద్భుతవాససః।
అసిప్రాసాయుధధరాః కృష్ణస్యాసన్ పురఃసరాః॥ 23
శ్రీకృష్ణునకు ముందుగా కొన్ని వేలమంది సైనినికులు నడుస్తున్నారు. వారు విచిత్రాద్భుతవస్త్రాలను ధరించి ఉన్నారు. కత్తి, బల్లెం మొదలయిన ఆయుధాలను చేతబట్టి ఉన్నారు. (23)
గజాః పంచశతాస్తత్ర రథాశ్చాసన్ సహస్రశః।
ప్రయాంతమన్వయుర్వీరం దాశార్హమపరాజితమ్॥ 24
అపరాజితుడయిన వీరుడు - శ్రీకృష్ణుడు బయలుదేరగా ఐదువందల ఏనుగులూ, వేలకొలదీ రథాలు అనుసరించాయి. (24)
పురం కురూణాం సంవృత్తం ద్రష్టుకామం జనార్దనమ్।
సబాలవృద్ధం సస్త్రీకం రథ్యాగతమరిందమ॥ 25
అరిందమా! జనమేజయా! ఆ సమయంలో శ్రీకృష్ణుని చూడాలన్న కోరికతో బాలురూ, వృద్ధులూ, స్త్రీలూ, సమస్త హట్షినాపురమూ రాజమార్గంలో నిలిచింది. (25)
వేదికామాశ్రితాభిశ్చ సమాక్రాంతాన్యనేకశః।
ప్రచలంతీవ భారేణ యోషిద్భిర్భవనాన్యుత॥ 26
ఇంటి ముందున్న అరుగులపై చేరిన లెక్కకు మించిన స్త్రీలచేత ఆక్రమింపబడిన భవనాలు బరువుతో కదిలిపోతున్నట్లున్నాయి. (26)
స పూజ్యమానః కురుభిః సంశృణ్వన్ మధురాః కథాః।
యథార్హం ప్రతిసత్కుర్వన్ ప్రేక్షమాణః శనైర్యయౌ॥ 27
ఆశ్రీకృష్ణుడు కౌరవులచే సత్కరింపబడుతూ, మధురభాషలు వింటూ, యథోచితంగా వారలను సత్కరిస్తూ అంతటా పరికిస్తూ మెల్లగా వెళ్ళసాగాడు. (27)
తతః సభాం సమాసాద్య కేశవస్యానుయాయినః।
సశంఖైర్వేణునిర్ఘోషైర్దిశః సర్వా వ్యనాదయన్॥ 28
ఆ తర్వాత కౌరవసభను సమీపించిన కేశవుని అనుయాయులు, సేవకులు, శంఖవేణునాదాలతో దిక్కులను ధ్వనింపజేశారు. (28)
తతః సా సమితిః సర్వా రాజ్ఞామమితతేజసామ్।
సంప్రాకంపత హర్షేణ కృష్ణాగమనకాంక్షయా॥ 29
అమితతేజస్సుగల ఆ రాజుల సమూహం శ్రీకృష్ణుని రాకను కోరుతున్నందువలన ఆనందంతో పులకించి పోయింది. (29)
తతోఽభ్యాశగతే కృష్ణే సమహృష్యన్ నరాధిపాః।
శ్రుత్వా తం రథనిర్ఘోషం పర్జన్యనినదోపమమ్॥ 30
ఆసాద్య తు సభాద్వారమ్ ఋషభః సర్వసాత్వతామ్।
అవతీర్య రథాచ్ఛౌరిః కైలాసశిఖరోపమాత్॥ 31
నవమేఘప్రతీకాశాం జ్వలంతమివ తేజసా।
మహేంద్ర సదన ప్రఖ్యాం ప్రవివేశ సభాం తతః॥ 32
శ్రీకృష్ణుడు దగ్గరవుతుండగా మేఘగర్జనతో సమానమైన ఆ రథఘోషను విని రాజులందరూ పరమానంద పడ్డారు. యదువంశశ్రేష్ఠుడైన శౌరి సభాద్వారాన్ని చేరి కైలాస శిఖరంలాగా ఉన్న రథం నుండి దిగాడు.
ఆ తరువాత నూతన మేఘాల వలె శ్యామలవర్ణమై, తేజస్సుతో ప్రకాశిస్తూ మహేంద్రభవనం వలె ఉన్న ఆ సభలో ప్రవేశించాడు. (30-32)
పాణౌ గృహీత్వా విదురం సాత్యకిం చ మహాయశాః।
జ్యోతీంష్యాదిత్యవద్ రాజన్ కురూన్ ప్రాచ్ఛాదయచ్ఛ్రియా॥ 33
రాజా! మహాయశస్వి అయిన శ్రీకృష్ణుడు విదురసాత్యకుల చేతులు పట్టుకొని సూర్యుడు తన తేజస్సుతో తారల నన్నింటినో కప్పివేసినట్టు, తన కాంతితో కౌరవుల నందరినీ కప్పివేశాడు. (33)
అగ్రతో వాసుదేవస్య కర్ణదుర్యోధనావుభౌ।
వృష్ణయః కృతవర్మా చాప్యాసన్ కృష్ణస్య పృష్ఠతః॥ 34
శ్రీకృష్ణుని ముందు కర్నదుర్యోధనులూ, శ్రీకృష్ణుని వెనుక యాదవులూ, కృతవర్మ ఉన్నారు. (34)
ధృతరాష్ట్రం పురస్కృత్య భీష్మద్రోణాదయస్తతః।
ఆసనేభ్యోఽచలన్ సర్వే పూజయంతో జనార్దనమ్॥ 35
అప్పుడు భీష్మద్రోణాదులందరూ శ్రీకృష్ణుని గౌరవిస్తూ ధృతరాష్ట్రునితో సహా తమ తమ ఆసనాలతో కదిలారు. (35)
అభ్యాగచ్ఛతి దాశార్హే ప్రజ్ఞాచక్షుర్నరేశ్వరః।
సహైవ ద్రోణభీష్మాభ్యామ్ ఉదతిష్ఠన్మహాయశాః॥ 36
దశార్హనందనుడైన శ్రీకృష్ణుడు రాగానే మహాయశస్కుడు జ్ఞాననేత్రుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు భీష్మద్రోణులతో కలిసి పైకి లేచాడు. (36)
ఉత్తిష్ఠతి మహారాజే ధృతరాష్ట్రే జనేశ్వరే।
తాని రాజసహస్రాణి సముత్తస్థుః సమంతతః॥ 37
నరపాలకుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు లేవగానే అన్నివైపులా ఆసీనులై ఉన్న వేలకొలది రాజులు కూడా లేచారు. (37)
ఆసనం సర్వతోభద్రం జాంబూనదపరిష్కృతమ్।
కృష్ణార్థే కల్పితం తత్ర ధృతరాష్ట్రస్య శాసనాత్॥ 38
అక్కడ ధృతరాష్ట్రుని శాసనం మేరకు బంగారుతో అలంకరింపబడిన సర్వతోభద్రమను ఆసనం శ్రీకృష్ణుని కొఱకు ఏర్పాటు చేయబడి ఉంది. (38)
స్మయమానస్తు రాజానం భీష్మద్రోణౌ చ మాధవః।
అభ్యభాషత ధర్మాత్మా రాజ్ఞశ్చాన్యాన్ యథావయః॥ 39
అప్పుడు ధర్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు నవ్వుతూ ధృతరాష్ట్రునీ, భీష్మద్రోణులనూ, ఇతరులను కూడా వారి వారి స్థాయిననుసరించి పలుకరించాడు. (39)
తత్ర కేశవమానర్చుః సమ్యగభ్యాగతం సభామ్।
రాజానః పార్థివాః సర్వే కురవశ్చ జనార్దనమ్॥ 40
అక్కడ సభకు అరుదెంచిన శ్రీకృష్ణుని రాజులూ, కౌరవులందరూ చక్కగా సత్కరించారు. (40)
తత్ర తిష్ఠన్ స దాశార్హః రాజమధ్యే పరంతపః।
అపశ్యదంతరిక్షస్థాన్ ఋషీన్ పరపురంజయః॥
తతస్తానభిసంప్రేక్ష్య నారదప్రముఖానృషీన్॥ 41
అభ్యభాషత దాశార్హః భీష్మం శాంతనవం శనైః।
పార్థినీం సమితిం ద్రష్టుమ్ ఋషయోఽభ్యాగతా నృప॥ 42
పరంతపుడూ, శత్రునగరజయశీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆ రాజుల మధ్యలో నిలిచి ఆకాశంలో నిలిచిఉన్న మునులను చూచాడు. నారదుడు మొదలయిన ఆఋషులను చూచి శ్రీకృష్ణుడు మెల్లగా భీష్మునితో ఇలా అన్నాడు.
రాజా! ఈ రాజ సభను చూడాలని మహర్షులెందరో విచ్చేశారు. (41-42)
నిమంత్ర్యంతామాసనైశ్చ సత్కారేణ చ భూయసా।
నైతేష్వనుపవిష్టేషు శక్యం కేనచిదాసితుమ్॥ 43
వారిని సత్కారపూర్వకంగా ఆశీనులను చేసే ఏర్పాటు చేయండి. వారు కూర్చొనకపోతే మరెవ్వరూ ఆసీనులు కాలేరు. (43)
పూజా ప్రయుజ్యతామాశు మునీనాం భావితాత్మనామ్।
ఋషీన్ శాంతనవో దృష్ట్వా సభాద్వారముపస్థితాన్॥ 44
త్వరమాణస్తతో భృత్యాన్ ఆసనానీత్యచోదయత్।
పవిత్రమనస్కులయిన ఈ మహర్షులను త్వరగా అర్చించండి. శంతనుకుమారుడు భీష్ముడు మహర్షులను చూచి సభాద్వారందగ్గర సన్నిహితులై ఉన్న భృత్యులను తొందరపెడుతూ "ఆసనాలు తెండి" అని ఆదేశించాడు. (44 1/2)
ఆసనాన్యథ మృష్టాని మహాంతి విపులాని చ॥ 45
మణికాంచన చిత్రాణి సమాజహ్రుస్తతస్తతః।
అప్పుడు సేవకులు మణికాంచనానల్తో అలంకరించబడి, నిర్మలములూ, విశాలములూ అయిన ఆసనాలను తెచ్చివేశారు. (45 1/2)
తేషు తత్రోపవిష్టేషు గృహీతార్ఘ్యేషు భారత॥ 46
నిషసాదాసనే కృష్ణః రాజానశ్చ యథాసనమ్।
భరతా! ఆ మహర్షులు ఆ ఆసనాలపై ఆసీనులయి అర్ఘ్యాన్ని స్వీకరించిన తర్వాత శ్రీకృష్ణుడు, ఇతర నరపాలురు ఆసనాలపై కూర్చున్నారు. (46 1/2)
దుఃశాసనః సాత్యకయే దదావాసనముత్తమమ్॥ 47
వివింశతిర్దదౌ పీఠం కాంచనం కృతవర్మణే।
దుశ్శాసనుడు సాత్యకికి మంచి ఆసనాన్ని చూపించాడు. వివింశతి కృతవర్మకు స్వర్ణమయమైన ఆసనాన్ని ఇచ్చాడు. (47 1/2)
అవిదూరే తు కృష్ణస్య కర్ణదుర్యోధనావుభౌ॥ 48
ఏకాసనే మహాత్మానౌ నిషీదతురమర్షణౌ।
అసహనశీలురు అయిన మహానుభావులు కర్ణ దుర్యోధనులు శ్రీకృష్ణునకు దగ్గరగా ఒకే ఆసనంపై కూర్చున్నారు. (48 1/2)
గాంధారరాజః శకునిః గాంధారైరభిరక్షితః॥ 49
నిషసాదాసనే రాజా సహపుత్రో విశాంపతే।
జనమేజయా! గాంధారరాజయిన, శకుని సైనికరక్షణలో కుమారునితో సహా ఆసీనుడయ్యాడు. (49 1/2)
విదురో మణిపీఠే తు శుక్లస్పర్ధ్యాజినోత్తరే॥ 50
సంస్పృశన్నాసనం శౌరేః మహామతిరుపావిశత్।
మహాప్రాజ్ఞుడైన విదురుడు శ్రీకృష్ణుని ఆసనానికి తగులుతూ ఉన్న మణిపీఠం మీద తెల్లని మృగచర్మం పరచిన ఆసనంపై కూర్చున్నాడు. (50 1/2)
చిరస్య దృష్ట్వా దాశార్హం రాజానః సర్వ ఏవ తే॥ 51
అమృతస్యేవ నాతృప్యన్ ప్రేక్షమాణా జనార్దనమ్।
అక్కడున్న రాజులంతా ఎంతో కాలం తర్వాత శ్రీకృష్ణుని చూచినందువలన అమృతం త్రాగుతున్నట్లు ఆయనవైపు చూస్తున్నారు. అయినా వారికి తృప్తి కలగటం లేదు. (51 1/2)
అతసీపుష్పసంకాశః పీతవాసా జనార్దనః॥ 52
వ్యభ్రాజత సభామధ్యే హేమ్నీవోపహితో మణిః॥ 53
అవిసె పూలవలె శ్యామవర్ణంగల శ్రీకృష్ణుడు పీతవసనుడై బంగారు పాత్రపై ఉంచబడిన నీలమణిలాగా ఆ సభమధ్యంలో విరాజిల్లాడు. (52-53)
తతస్తూ ష్ణీం సర్వమాసీద్ గోవిందగతమానసమ్।
న తత్ర కశ్చిత్ కించిద్ వా వ్యాజహార పుమాణ్ క్వచిత్॥ 54
అక్కడ అప్పుడు అందరిమనస్సులూ శ్రీకృష్ణుని మీదనే లగ్నమయ్యాయి. ఏ ఒక్క మనిషీ ఏమీ మాటడలేదు. (54)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి శ్రీకృష్ణ సభాప్రవేశే చతుర్నవతితమోఽధ్యాయః॥ 94 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణసభాప్రవేశమను తొంబది నాలుగవ అధ్యాయము. (94)
(దాక్షిణాత్య అధికపాఠము 10 1/2 శ్లోకములు కలుపుకొని 64 1/2 శ్లోకాలు)