93. తొంబది మూడవ అధ్యాయము

కృష్ణుడు సంధి చేయుటలోని ఔచిత్యమును చెప్పుట.

(వైశంపాయన ఉవాచ
విదురస్య వచః శ్రుత్వా ప్రశ్రితం పురుషోత్తమః।
ఇదం హోవాచ వచనం భగవాన్ మధుసూదనః॥)
వైశంపాయనుడిలా అన్నాడు. భగవంతుడు, పురుషోత్తముడూ అయిన మధుసూదనుడు వినయపూర్వకమైన విదురుని మాటలను విని ఈ విధంగా అన్నాడు.
యథా బ్రూయాన్మహాప్రాజ్ఞః యథా బ్రూయాద్ విచక్షణః।
యథా వాచ్యస్త్వద్విధేన భవతా మద్విధః సుహృత్॥ 1
ధర్మార్థయుక్తం తథ్యం చ యథా త్వయ్యుపపద్యతే।
తథా వచనముక్తోఽస్మి త్వయైతత్ పితృమాతృవత్॥ 2
విదురా! బుద్ధిమంతుడు ఏవిధంగా మాటాడుతాడో, విచక్షణ గలవాడు ఏరీతిగా సలహాల నివ్వగలడో, నావంటి మిత్రునితో నీవంటి శ్రేయోభిలాషి ఏతీరుగా పలుకుతాడో, నీవు ధర్మార్థయుక్తంగా ఏ పద్ధతిలో మాట్లాడితే బాగుంటుందో ఆ విధంగా తల్లిదండ్రులవలె నీవు నాతో మాట్లాడావు. (1-2)
సత్యం ప్రాప్తం చ యుక్తం వాప్యేవమేవ యథాఽత్థ మామ్।
శృణుష్వాగమనే హేతుం విదురావహితో భవ॥ 3
నీవు నాతో పలికినది యథార్థం, సమయోచితం, యుక్తియక్తం కూడా. అయినా నా రాకకుగల కారణాన్ని సావధానంగా విను. (3)
దౌరాత్మ్యం ధార్తరాష్ట్రస్య క్షత్రియాణాం చ వైరతామ్।
సర్వమేతదహం జానన్ క్షత్తః ప్రాప్తోఽద్య కౌరవాన్॥ 4
విదురా! ధార్తరాష్ట్రుల దురాత్మత క్షత్రియుల శత్రుత్వం ఇదంతా తెలిసికూడా నేనిప్పుడు కౌరవుల దగ్గరకు వచ్చాను. (4)
పర్యస్తాం పృథివీం సర్వాం సాశ్వాం సరథకుంజరామ్।
యో మోచయేన్మృత్యుపాశాత్ ప్రాప్నుయాద్ ధర్మముత్తమమ్॥ 5
భూమండలమంతా గుఱ్ఱాలు, రథాలు, ఏనుగులతో సహా వినాశోన్ముఖమై ఉంది. ఆ మృత్యుపాశం నుండి దానిని తప్పించే ప్రయత్నం చేసినవాడు ఉత్తమధర్మాన్ని పొందగలడు. (5)
ధర్మకార్యం యతన్ శక్త్వా నో చేత ప్రాప్నోతి మానవః।
ప్రాప్తో భవతి తత్ పుణ్యమ్ అత్ర మే నాస్తి సంశయః॥ 6
మనుష్యుడు తనశక్తిననుసరించి ధర్మకార్య సాధనకై ప్రయత్నిస్తూ విఫలుడయినా కూడా తప్పక పుణ్యాన్ని పొందగలడు. ఈవిషయంలో నాకు సందేహం లేదు. (6)
మనసా చింతయన్ పాపం కర్మణా నాతిరోచయన్।
న ప్రాప్నోతి ఫలం తస్యేత్యేవం ధర్మవిదో విదుః॥ 7
మనసా పాపాన్నే తలపోస్తూ అది ఇష్టంలేక దానిని క్రియారూపంలో పెట్టని వాడు ఆ పాపఫలితాన్ని పొందడని ధర్మవేత్తలు భావిస్తున్నారు. (7)
సోహం యతిష్యే ప్రశమం క్షత్తః కర్తుమమాయయా।
కురూణాం సృంజయానాం చ సంగ్రామే వినశిష్యతామ్॥ 8
కాబట్టి విదురా! యుద్ధంలో నశించటానికి సిద్ధంగా ఉన్న కౌరవులకూ పాండవులకూ సంధి సమకూర్చాలని నేను నిష్కపటంగా ప్రయత్నిస్తున్నాను. (8)
సేయమాపన్మహాఘోరా కురుష్వేవ సముత్థితా।
కర్ణదుర్యోధనకృతా సర్వే హ్యేతే తదన్వయాః॥ 9
అత్యంత భయంకరమైన ఈ ఆపద కర్ణదుర్యోధనుల కారణంగా కౌరవులలోనే పుట్టింది. ఈ రాజులందరూ ఆ ఇద్దరి మార్గాన్నే అనుసరిస్తున్నారు. (9)
వ్యసనే క్లిశ్యమానం హి యో మిత్రం నాభిపద్యతే।
అనునీయ యథాశక్తి తం నృశంసం విదుర్బుధాః॥ 10
వ్యసనాలలోగాని ఆపదలలోగానీ ఇబ్బంది పడుతున్న మిత్రుని యథాశక్తిగా అనునయించి ఉద్ధరించలేని వాడు క్రూరకర్ముడని పండితులు అంటుంటారు. (10)
ఆకేశగ్రహణాన్మిత్రమ్ అకార్యాత్ సంనివర్తయన్।
అవాచ్యః కస్యచిద్ భవతి కృతయత్నో యథాబలమ్॥ 11
యథాశక్తి ప్రయత్నించి జుట్టు పట్టుకొని అయినా మిత్రుని అకృత్యాలనుండి మరలించినవాడు ఎవ్వరి నిందకూ గురికాడు. (11)
తత్ సమర్థం శుభం వాక్యం ధర్మార్థసహితం హితమ్।
ధార్తరాష్ట్రః సమామాత్యః గ్రహీతుం విదురార్హతి॥ 12
కాబట్టి విదురా! దుర్యోధనునకూ, మంత్రులకూ శుభకరమూ, యుక్తియుక్తమూ, ధర్మార్థ సహితమూ, హితకరమూ అయిన నా మాటను తప్పక చెప్పాలి. (12)
హితం హి ధార్తరాష్ట్రాణాం పాండవానాం తథైవ చ।
పృథివ్యాం క్షత్రియాణాం చ యతిష్యేఽహమమాయయా॥ 13
ధార్తరాష్ట్రులకూ, పాండవులకూ, లోకంలోని సకల భూపాలురకూ హితాన్ని చేకూర్చటానికి నిష్కపటంగా నేను ప్రయత్నిస్తాను. (13)
హితే ప్రయతమానం మాం శంకేద్ దుర్యోధనో యది।
హృదయస్య చ మే ప్రీతిః ఆనృణ్యం చ భవిష్యతి॥ 14
హితసాధనకై ప్రయత్నిస్తున్న నన్ను కూడా సుయోధనుడు అనుమానించినా నా మనస్సుకు తృప్తియే కాక కర్తవ్యభారం నుండి నాకు విముక్తికూడా లభిస్తుంది. (14)
జ్ఞాతీనాం హి మిథో భేదే యన్మిత్రం నాభిపద్యతే।
సర్వయత్నేన మాధ్యస్థ్యం న తన్మిత్రం విదుర్బుధాః॥ 15
దాయాదుల మధ్య భేదభావం ఏర్పడితే ఉభయులకు మిత్రుడైన వాడు సర్వవిధాలా ప్రయత్నించి సమైక్యసాధనకై మధ్యస్థుడుగా వ్యవహరించకపోతే ఆ మిత్రుడు మిత్రుడే కాదని పండితభావన. (15)
న మాం బ్రూయురధర్మిష్ఠాః మూఢా హ్యసుహృదస్తథా।
శక్తో నావారయత్ కృష్ణః సంరబ్ధాన్ కురుపాండవాన్॥ 16
లోకంలోని పాపాత్ములూ, మూఢులూ, శత్రువులూ కృష్ణుడు సమర్థుడై కూడా క్రోధావిష్టులయిన కౌరవ పాండవులను యుద్ధంనుండి ఆపలేదని నన్ను అనే అవకాశ ముండదు. (16)
ఉభయోః సాధయన్నర్థమ్ అహమాగత ఇత్యుత।
తత్ర యత్నమహం కృత్వా గచ్ఛేయం నృష్వవాచ్యతామ్॥ 17
ఉభయ పక్షాలకూ, కార్యసిద్ధిని సాధించాలనే నేను ఇక్కడకు వచ్చాను. దానికై పూర్తిగా ప్రయత్నం చేస్తే లోకులు నన్ననుకొనే పని ఉండదు. (17)
మమ ధర్మార్థయుక్తం హి శ్రుత్వా వాక్యమనామయమ్।
నా చేదాదాస్యతే బాలః దిష్టస్య వశమేష్యతి॥ 18
ధర్మార్థసంయుక్తమూ, క్షేమకరమూ అయిన నా మాటలను విని కూడా స్వీకరించక పోతే మూర్ఖుడైన దుర్యోధనుడు కాలానికి చిక్కుపడతాడు. (18)
అహాపయన్ పాండవార్థం యథావత్
శమం కురూణాం యది చాచరేయమ్।
పుణ్యం చ మే స్యాచ్చరితం మహాత్మన్
ముచ్యేరంశ్చ కురవో మృత్యుపాశాత్॥ 19
మహాత్మా! పాండవుల స్వార్థానికి దెబ్బ తగలకుండా కౌరవపాండవులకు సంధి చేయగలిగితే నేను గొప్ప పుణ్యం చేసినట్లే. అంతే గాక కౌరవులుకూడా మృత్యుపాశం నుండి బయట పడతారు. (19)
అపి వాచం భాషమాణస్య కావ్యాం
ధర్మారామామర్థవతీమహింస్రామ్।
అవేక్షేరన్ ధార్తరాష్ట్రాః శమార్థం
మాం చ ప్రాప్తం కురవః పూజయేయుః॥ 20
నేను శాంతికై పండితసమ్మతమై ధర్మార్థ సంగతమై హింసాశూన్యమయిన మాటను చెప్తాను. ధార్తరాష్ట్రులు నా మాటపై దృష్టిపెడితే శాంతిస్థాపనకై వచ్చిన నన్ను వారు తప్పనిసరిగా సమాదరిస్తారు. (20)
న చాపి మమ పర్యాప్తాః సహితాః సర్వపార్థివాః।
క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం సింహస్యేవేతరో మృగాః॥ 21
సింహం ముందు ఇతరమృగాలు నిలవలేనట్లు కోపించిన నా ఎదురుగా నిలవటానికి రాజులందరూ ఒక్కటై వచ్చినా చాలరు. (21)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా వచనం వృష్ణీనామృషభస్తదా।
శయనే సుఖసంస్పర్శే శిశ్యే యదుసుఖావహః॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు. వృష్ణివంశశ్రేష్ఠుడూ, యాదవసుఖ సంధాత అయిన శ్రీకృష్ణుడు విదురునితో ఇలా మాటాడి సుఖస్పర్శ గల శయ్యపై నిద్రించాడు. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి భగవద్యాన పర్వణి శ్రీకృష్ణ వాక్యే త్రినవతితమోఽధ్యాయః॥ 93 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణవాక్యమను తొంబది మూడవ అధ్యాయము. (93)