90. తొంబదియవ అధ్యాయము
శ్రీకృష్ణుడు కుంతిని ఊరడించుట.
వైశంపాయన ఉవాచ
అథోపగమ్య విదురమ్ అపరాహ్ణే జనార్దనః।
పితృష్వసారం స పృథామ్ అభ్యగచ్ఛదరిందమః॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. అరిందముడైన జనార్దనుడు విదురుని కలిసికొన్న తర్వాత అపరాహ్ణవేళలో తన మేనత్త అయిన కుంతిదగ్గరకు వెళ్లాడు. (1)
సా దృష్ట్వా కృష్ణమాయాంతం ప్రసన్నాదిత్యవర్చసమ్।
కంఠే గృహీత్వా ప్రాక్రోశత్ స్మరంతీ తనయాన్ పృథా॥ 2
నిర్మలమైన సూర్యుని వంటి తేజస్సు గల కృష్ణుడు తన దగ్గరకు రాగానే కుంతి చూసి, మెడపట్టి కౌగిలించి, తన కొడుకులను తలచుకొంటూ విలపించింది. (2)
తేషాం సత్త్వవతాం మధ్యే గోవిందం సమచారిణమ్।
చిరస్య దృష్ట్వా వార్ష్ణేయం బాష్పమాహారయత్ పృతా॥ 3
శక్తిశాలులయిన తన కొడుకుల మధ్యలో తిరుగు వృష్ణివంశజుని గోవిందుని చాలా కాలానికి చూచి పృథ కంట నీరుపెట్టింది. (3)
సాబ్రవీత్ కృష్ణమాసీనం కృతాతిథ్యం యుధాంపతిమ్।
బాష్పగద్గదపూర్ణేన ముఖేన పరిశుష్యతా॥ 4
సేనానాయకుడైన శ్రీకృష్ణునకు ఆమె ఆతిథ్యాన్ని ఇచ్చింది. శ్రీకృష్ణుడ్ ఆసీనుడయ్యాడు. అప్పుడు నోరిండిపోతుండగా, కన్నీరు కంఠాన్ని గద్గదం చేస్తుండగా కుంతి ఇలా అన్నది. (4)
యే తే బాల్యాత్ ప్రభృత్యేన గురుశుశ్రూషణే రతాః।
పరస్పరస్య సుహృదః సమ్మతాః సమచేతసః।
నికృత్యా భ్రంశితా రాజ్యాత్ జనార్హా నిర్జనం గతాః॥ 5
నా కుమారులు పాండవులు చిన్ననాటినుండి గురుశుశ్రూషయందు ఆసక్తిగలవారు. ఒకరిపై ఒకరు స్నేహం గలవారు. అందరిచేత ఔననిపించుకొనినవారు. సమానభావన గలవారు. శత్రువుల వంచననే రాజ్యాన్ని కోలుపోయి, జనావాసానికి తగినవారై కూడా నిర్జనారణ్యాల పాలయ్యారు. (5)
వినీతక్రోధహర్షాశ్చ బ్రహ్మణ్యః సత్యవాదినః।
త్యక్త్వా ప్రియసుఖే పార్థాః రుదతీమపహాయ మామ్॥ 6
క్రోధహర్షాలను జయించినవారు. బ్రాహ్మణులకు హితాన్ని చేకూర్చేవారు. సత్యసంధులు. అయినా ప్రియ జనాన్ని, సుఖాన్ని, పరిత్యజించి రోదిస్తున్న నన్ను వీడి అరణ్యాలకు వెళ్ళిపోయారు. (6)
అహార్షుశ్చ వనం యాంతః సమూలం హృదయం మమ।
అతదర్హా మహాత్మానః కథం కేశవ పాండవాః॥ 7
అరణ్యాలకు వెళ్ళే వేళలో పాండవులు సమూలంగా నా హృదయాన్ని పెకలించుకొని పోయారు. మహానుభావులయిన వాళ్ళు వనవాసానికి తగనివారు. అయినా వారికీ కష్టం ఎలా కలిగింది? (7)
ఊషుర్మహావనే తాత సింహవ్యాఘ్రగజాకులే।
బాలా విహీనాః పిత్రా తే మయా సతతలాలితాః॥ 8
అపశ్యంతశ్చ పితరౌ కథమూషుర్మహావనే।
నాయనా! పాండవులు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. నా చేతనే ఎప్పుడూ లాలింపబడినవారు. సింహాలు, పులులు, ఏనుగులచే నిండిన ఆ మహారణ్యాలలో ఎలా నివసించారు.? తల్లిదండ్రులు ఇద్దరూ లేకుండా ఎలా జీవించగలిగారు? (8 1/2)
శంఖదుందుభినిర్ఘొషైః మృదంగైర్వేణునిస్వనైః॥ 9
పాండవాః సమబోధ్యంత బాల్యాత్ ప్రభృతి కేశవ।
కేశవా! చిన్ననాటినుండి శంఖదుందుభుల గంభీరధ్వనులతో, మృదంగవేణువుల మధురనాదాలతో నిద్రలేపబడేవారు పాండవులు. (9 1/2)
యే స్మ వారణశబ్దేన హయానాం హ్రేషితేన చ॥ 10
రథనేమినినాదైశ్చ వ్యబోధ్యంత తదా గృహే।
శంఖభేరీనినాదేవ వేణువీణానునాదినా॥ 11
పుణ్యాహఘోషమిశ్రేణ పూజ్యమానా ద్విజాతిభిః।
వస్త్రై రత్నైరలంకారైః పూజయంతో ద్విజన్మనః॥ 12
గీర్భిర్మంగలయుక్తాభిః బ్రాహ్మణానాం మహాత్మనామ్।
అర్చితైరర్చనార్హైశ్చ స్తువద్భీరభినందితాః॥ 13
ప్రాసాదాగ్రేష్వబోధ్యంత రాంకవాజినశాయినః।
క్రూరం చ నినదం శ్రుత్వా శ్వాపదానాం మహావనే॥ 14
న స్మోపయాంతి నిద్రాం తే న తదర్హా జనార్దన।
(పాండవులు తమ రాజధానిలో) ప్రాసాదాలపై భాగంలో జింక చర్మాలతో చేసిన పడకలపై పరుండినప్పుడు ఏనుగులఘీంకారాలతో అశ్వాల సకిలింపులతో, రథాల ఇరుసుల శబ్దాలతో, శంఖభేరీ నినాదాలతో, వీణా వేణునిస్వనాలతో వారి నాదరించేవారు. ఆ బ్రాహ్మణుల మంగళాశీస్సులు విని వారు లేచేవారు. గౌరవింపదగినవారు, గౌరవింపబడినవారూ వారి గుణాలను గానంచేస్తూ అభినందించేవారు. వారు లేచి రత్నవస్త్రాభరణాలతో ఆ బ్రాహ్మణులను సత్కరించావారు. జనార్దనా! అటువంటి పాండవులు మహారణ్యాలతో క్రూరజంతువుల అరుపులవలన సుఖనిద్రకు కూడా నోచుకోకపోయి ఉండవచ్చు. వారు ఎప్పుడూ అటువంటి దురవస్థల ననుభవించవలసినవారు కాదు. (10-14 1/2)
భేరీమృదంగనినదైః శంకవైణవనిస్వనైః॥ 15
స్త్రీణాం గీతనినాదైశ్చ మధురైర్మధుసూదన।
వందిమాగధసూతైశ్చ స్తువద్భిర్బోధితాః కథమ్॥ 16
మహావనేష్వబోధ్యంత శ్వాపదానాం రుతేన చ।
మధుసూదనా! భేరీ మృదంగధ్వనులతో, శంఖవేణునినాదాలతో, స్త్రీల మధురగీతస్వనాలతో వంది మాగధ సూతస్తోత్రాలతో మేల్కొంటున్న వారు మహారణ్యాలలో క్రూరజంతువుల అరుపులతో ఎలా నిదుర లేచేవారో! (15-16 1/2)
హ్రీమాన్ సత్యధృతిర్దాంతః భూతానామనుకంపితా॥ 17
కామద్వేషౌ వశే కృత్వా సతాం వర్త్మానువర్తతే।
అంబరీషస్య మాంధాతుః యయాతేర్నహుషస్యచ॥ 18
భరతస్య దిలీపస్య శిబేరౌశీనరస్య చ।
రాజర్షీణాం పురాణానాం ధురం ధత్తే దురుద్వహామ్॥ 19
శీలవృత్తోపసంపన్నః ధర్మజ్ఞః సత్యసంగరః।
రాజా సర్వగుణోపేతః త్రైలోక్యస్యాపి యో భవేత్॥ 20
అజాతశత్రుర్ధర్మాత్మా శుద్ధజామ్బూనదప్రభః।
శ్రేష్ఠః కురుషు సర్వేషు ధర్మతః శ్రుతవృత్తతః।
ప్రియదర్శో దీర్ఘభుజః కథం కృష్ణ యుధిష్ఠిరః॥ 21
కృష్ణా! యుధిష్ఠిరుడు బిడియంగలవాడు, సత్యసంధుడు, జితేంద్రియుడు, భూతదయగలవాడు, కామద్వేషాల నదుపులో నిలుపుకొని సత్పురుషుల మార్గంలో నడిచేవాడు. అంబరీషుడు, మాంధాత, యయాతి, నహుషుడు, భరతుడు, దిలీపుడు, ఉశీనరకుమారుడైన శిబి మొదలగు ప్రాచీన రాజర్షుల వలె సదాచారపాలన చేస్తూ ధరింపశక్యంకాని ధర్మభారాన్ని మోసేవాడు. శీల సదాచారసంపత్తి గలవాడు. ధర్మవేత్త, సత్యపాలకుడు ఈవిధంగా సర్వగుణ సంపన్నుడైనందువలన మూడులోకాలకూ రాజు కాదగినవాడు, అజాతశత్రువు, ధర్మతత్పరుడు, తన ధర్మజ్ఞాన సత్ప్రవర్తనల కారణంగా కౌరవులందరిలో శ్రేష్ఠుడు, నిర్మల మైన బంగారు వన్నె కలవాడు, ప్రియదర్శి, మహాబాహువు, ఆయన ఎలా ఉన్నాడు? (17-21)
యః స నాగాయుతప్రాణః వాతరంహా మహాబలః।
సామర్షః పాండవో నిత్యం ప్రియో భ్రాతుః ప్రియంకరః॥ 22
కీచకస్య తు సజ్ఞాతేః యో హంతా మధుసూదన।
శూరః క్రోధవశానాం చ హిడింబస్య బకస్యచ॥ 23
పరాక్రమే శక్రసమః మాతరిశ్వసమో బలే।
మహేశ్వరసమః క్రోధే భీమః ప్రహరతాంవరః॥ 24
క్రోధం బలమమర్షం చ యో నిధాయ పరంతపః।
జితాత్మా పాండవోఽ మర్షీ భ్రాతుస్తిష్ఠతి శాసనే॥ 25
తేజోరాశిం మహాత్మానం వరిష్ఠ మమితౌజసమ్।
భీమం ప్రదర్శనేనాపి భీమసేనం జనార్దన॥ 26
తం మమాచక్ష్వ వార్ష్ణేయ కథమద్య వృకోదరః।
ఆస్తే పరిఘబాహుః సః మధ్యమః పాండవో బలీ॥ 27
మధుసూదనా! పదివేల ఏనుగుల బలం గలవాడు. మహాశక్తి సంపన్నుడు, వాయువేగం గలవాడు, సహనం లేకపోయినా యుధిష్ఠిరునకు ప్రియమైనవాడు, సోదరులకు హితం చేకూర్చేవాడు, సోదరులతో సహా కీచకుని చంపినవాడు, శూరుడు, క్రోధవశులను, హిడింబుని, బకుని సంహరించిన వాడు, పరాక్రమంలో ఇంద్రతుల్యుడు, బలంలో వాయుసమానుడు, కోపంలో రుద్రునితో సమానుడు, యోధశ్రేష్ఠుడు, కోపం, బలం, అసహనం కలిగికూడా జితేంద్రియుడై అన్న అదుపులో ప్రవర్తించేవాడు, భీమసేనుడు, మహాత్ముడు, తేజో రాశి, శ్రేష్ఠుడు, మహాతేజస్వి, చూచుటకు భయంకరమైనవాడు, బలవంతుడు, పరిఘబాహువు అయిన మధ్యమ పాండవుడు వృకోదరుడు ఇప్పుడెలా ఉన్నాడో చెప్పు? (22-27)
అర్జునేనార్జునో యః సః కృష్ణ బాహుసహస్రిణా।
ద్విబాహుః స్పర్ధతే నిత్యమ్ అతీతేనాపి కేశవ॥ 28
క్షిపత్యేకేన వేగేన పంచ బాణశతాని యః।
ఇష్వస్త్రే సదృశో రాజ్ఞః కార్తవీర్యస్య పాండవః॥ 29
తేజసాఽఽదిత్యసదృశః మహర్షిసదృశో దమే।
క్షమయా పృతివీతుల్యః మహేంద్రసమవిక్రమః॥ 30
ఆధిరాజ్యం మహద్ దీప్తం ప్రథితం మధుసూదన।
ఆహృతం యేన వీర్యేణ కురూణాం సర్వరాజసు॥ 31
యస్య బాహుబలం సర్వే పాండవాః పర్యుపాపతే।
స సర్వరథినాం శ్రేష్టః పాండవః సత్యవిక్రమః॥ 32
యం గత్వాభిముఖః సంఖ్యే న జీవన్ కాశ్చిదావ్రజేత్।
యో జేతా సర్వభూతానామ్ అజేయో జిష్ణురచ్యుత॥ 33
యోఽపాశ్రయః పాండవానామ్ దేవానామివ వాసవః।
స తే భ్రాతా సఖా చైవ కథమద్య ధనంజయః॥ 34
కృష్ణా! అర్జునుడు రెండు భుజాలే గల వాడయినా ప్రాచీనుడయిన సహస్రబాహువుతో - కార్త వీర్యార్జునునితో - ఎప్పుడూ పోటీపడేవాడు. అయిదు వందల బాణాలనయినా సమానవేగంతో ప్రయోగించగలవాడు. విలువిద్యలో కార్తవీర్యచక్రవర్తితో సమానుడు, తేజస్సులో సూర్యసదృశుడు, ఇంద్రియనిగ్రహంలో మహర్షి వంటివాడు. ఓర్పులో భూదేవితో సమానుడు. పరాక్రమంలో మహేంద్రతుల్యుడు, రాజలోకంలో ప్రఖ్యాతమై, ప్రకాశిస్తున్న ఈ విశాల కౌరవసామ్రాజాన్ని తన పరాక్రమంతో సాధించినవాడు. పాండవుల కందరకూ అర్జునుని బాహుబలమే ఆసరా; సత్యవిక్రముడయిన ఆ అర్జునుడు రథికులందరిలో ఆసరా; సత్యవిక్రముడయిన ఆ అర్జునుడు రథికులందరిలో శ్రేష్ఠుడు; రణభూమిలో అతని నెదిరించి ప్రాణాలతో బయటపడగలవాడు ఎవ్వడూ లేడు ; సర్వప్రాణులను జయించిన జయశీలుడతడు. తన నెవ్వరూ జయించలేరు; దేవతలకు ఇంద్రునివలె పాండవులకు అర్జునుడే ఆశ్రయం. అటువంటి ఆ అర్జునుడు నీకు సోదరుడు, నెచ్చెలి అయినవాడు ఎలా ఉన్నాడు? (28-34)
దయావాన్ సర్వభూతేషు హ్రీనిషేవో మహాస్తవిత్।
మృదుశ్చ సుకుమారశ్చ ధార్మికశ్చ ప్రియశ్చ మే॥ 35
సహదేవో మహేశ్వాసః శూరః సమితిశోభనః।
భ్రాతౄణాం కృష్ణః శుశ్రూషుః ధర్మార్థకుశలో యువా॥ 36
సదైవ సహదేవస్య భ్రాతరో మధుసూదన।
వృత్తం కల్యాణవృత్తస్య పూజయంతి మహాత్మనః॥ 37
జ్యోష్ఠోపచాయినం వీరం సహదేవం యుథాం పతిమ్।
శూస్రూషుం మమ వార్ష్ణేయః మాద్రీపుత్రం ప్రచక్ష్వ మే॥ 38
మధుసూదనా! శ్రీ కృష్ణా! సహదేవుడు సమస్త ప్రాణుల యందు దయగలవాడు, బిడియం గలవాడు, మహాస్త్రవేత్త, కోమలుడు, సుకుమారుడు, ధార్మికుడు, నాకు మిక్కిలి ఇష్టమయిన వాడు. గొప్ప విలుకాడూ శూర్డుడూ, వీరుడూ, అయిన సహదేవుడు రణరంగానికే వన్నె తేగలవాడు, సోదరులందరకూ సేవకుడు, ధర్మార్థవివేచన గలవాడు, యువకుడు కూడా.
శుభలక్షణాలతో కూడిన సహదేవుని నడవడిని సోదరులు ఎల్లప్పుడూ అభినందిస్తుంటారు.
పెద్ద అన్నపై ప్రేమ గలవాడు, సేనానాయకుడు, నా సేవయం దనురక్తుడునూ అయిన సహదేవుడు ఎలా ఉన్నాడో చెప్పు. (35-38)
సుకుమారో యువా శూరః దర్శనీయశ్చ పాండవః।
భ్రాతౄణాం చైవ సర్వేషాం ప్రియః ప్రాణో బహిశ్చరః॥ 39
చిత్రయోధీ చ నకులః మహేష్వాసో మహాబలః।
కచ్చిత్ స కుశలీ కృష్ణ వత్సో మమ సుఖైధితః॥ 40
కృష్ణా! సుకుమారుడూ, యువకుడూ, శూరుడూ, అందమయినవాడూ, సోదరులకందకూ బహిఃప్రాణం వంటివాడూ, యుద్ధకళలెరిగిన వాడూ, మహాబలుడూ, గొప్ప విలుకాడూ, నేను అల్లారుముద్దుగా పెంచిన నకులుడు కుశలమే గదా! (39-40)
సుఖోచితమదుఃఖార్హమ్ సుకుమారం మహారథమ్।
అపి జాతు మహాబాహో పశ్యేయం నకులం పునః॥ 41
మహాబాహుడా! కృష్ణా! సుఖానికే తగినవాడు, కష్టాలు పడరాని వాడు, సుకుమారుడు, మహారథుడు అయిన నకులుని మరల ఎప్పటికయినా చూడగలనా? (41)
పక్ష్మసంపాతజే కాలే నకులేన వినాకృతా।
న లభామి ధృతిం వీర సాద్య జీవామి పశ్య మామ్॥ 42
వీరా! రెప్పపాటుకాలం కూడా నకులుడు లేకుండా ధైర్యంగా నిలువలేనిదాన్ని ఇప్పుడు నకులుడు దగ్గర లేకపోయినా జీవిస్తున్నాను. చూడు నేనెంత కఠినాత్మనో! (42)
సర్వైః పుత్రైః ప్రియతరా ద్రౌపదీ మే జనార్దన।
కులీనా రూపసంపన్నా, సర్వైః సముదితా గుణైః॥ 43
జనార్దనా! నా కుమారులందరి కన్న నా కిష్టమైనది ద్రౌపది. ఆమె ఉన్నతవంశంలో పుట్టింది. అందమైనది. సర్వసద్గుణాలతో కూడినది. (43)
పుత్రలోకాత్ పతిలోకం వృణ్వానా సత్యవాదినీ।
ప్రియాన్ పుత్రాన్ పరిత్యజ్య పాండవాననురుధ్యతే॥ 44
ఆ ద్రౌపది పుత్రలోకం కన్నా పతి లోకాన్ని మిన్నగా భావించి ఆ మార్గాన్నే కోరి ప్రియసుతులను కూడా వీడి పాండవులను అనుసరిస్తోంది. (44)
మహాభీజనసంపన్నా సర్వకామైః సుపూజితా।
ఈశ్వరీ సర్వకల్యాణీ ద్రౌపదీ కథమచ్యుత॥ 45
అచ్యుతా! ఆ ద్రౌపది ఉత్తమవంశజాత. తన కోరికల నన్నింటినీ తీర్చుతూ నాచే ఆదరింపబడినది. ఆ మహారాణి మంగళరూపిణి ఇప్పుడు ఎలా ఉన్నది? (45)
సురభిః పంచభిః శూరైః అగ్నికల్పైః ప్రహారిభిః।
ఉపపన్నా మహేస్వాసైః ద్రౌపదీ దుఃఖభాగినీ॥ 46
శూరులు, యుద్ధ నిపుణులు, అగ్నిసమానులు, గొప్ప విలుకాండ్రు అయిన అయిదుగురు భర్తలున్నా ఆ ద్రౌపది కష్టాల ననుభవించవలసి వచ్చింది. (46)
చతుర్దశమిదం వర్షం యన్నాపశ్యమరిందమ।
పుత్రాదిభిః పరిద్యూనాం ద్రపదీం సత్యవాదినీమ్॥ 47
అరిందమా! పుత్రవియోగంతో బాధపడుతున్న, సత్యవాదిని అయిన ద్రౌపదిని చూడక ఇది పదునాలుగవ సంవత్సరం. (47)
న నూనం కర్మభిః పుణ్యైః అశ్నుతే పురుషః సుఖమ్।
ద్రౌపదీ చేత్ తథావృత్తా నాశ్నుతే సుఖమవ్యయమ్॥ 48
అంతటి ద్రౌపది కూడా నిలకడగా సుఖంగా ఉండలేక పోతోందంటే పుణ్యకర్మవలన మనిషి సుఖపడతాడని చెప్పటానికి వీలు లేకపోతున్నది. (48)
న ప్రియో మమ కృష్ణాయా బీభత్సుర్న యుధిష్ఠిరః।
భీమసేనో యమౌ వాపి యదపశ్యం సభాగతామ్॥ 49
న మే దుఃఖతరం కించిద్ భూతపూర్వం తతోఽధికమ్ ।
నాకు యుధిష్ఠిరుడుకానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవులు కానీ ద్రౌపది కన్న ప్రియమైనవారు కాదు. అటువంటి ద్రౌపది కౌరవసభలో నిస్సహాయంగా నిలచినపుడు నేను పొందిన దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని అంతకు ముందెప్పుడూ అనుభవించలేదు.(49 1/2)
స్త్రీధర్మిణీం ద్రౌపదీం యత్ శ్వశురాణాం సమీపగామ్॥ 50
ఆనాయితామనార్యేణ క్రోధలోభానువర్తినా।
సర్వే ప్రైక్షంత కురవః ఏకవస్త్రాం సభాగతామ్॥ 51
క్రోధానికీ, లోభానికి లొంగిపోయిన దుర్మార్గుడు దుర్యోధనుడు రజస్వలయై, ఏకవస్త్రయై ఉన్న ద్రౌపదిని సభకు రప్పించి అత్తమామల సన్నిధిలో నిలిపాడు. అప్పుడు కౌరవులంతా ఆమెను చూశారు. (50,51)
తత్రైవ ధృతరాష్ట్రశ్చ మహారాజశ్చ బాహ్లికః।
కృపశ్చ సోమదత్తశ్చ నిర్విణ్ణాః కురవస్తథా॥ 52
అక్కడే ధృతరాష్ట్రుడు, బాహ్లికమహారాజు, కృపుడు సోదరులు ఇతరకౌరవులు దుఃఖమగ్నులై నిలిచారు. (52)
తస్యాం సంసది సర్వేషాం క్షత్తారం పూజయామ్యహమ్।
వృత్తేన హి భవత్యార్యః న ధనేన న విద్యయా॥ 53
ఆ సభలోని వారందరిలో విదురుని మాత్రమే నేను గౌరవిస్తున్నాను. నడవడి చేతనే వ్యక్తి గొప్పవాడు కాగలడు కానీ డబ్బు వలననో, చదువు వలననో గొప్పవాడు కాలేడు. (53)
తస్య కృష్ణ మహాబుద్ధేః గంభీరస్య మహాత్మనః।
క్షత్తుః శీలమలంకారః లోకాన్ విష్టభ్య తిష్ఠతి॥ 54
కృష్ణా! మహాత్ముడు, గొప్ప బుద్ధికలవాడు. గంభీరస్వభావుడైన ఆ విదురునకు శీలమే ఆభరణం. అది లోకమంతా వ్యాపించిన విషయం. (54)
వైశంపాయన ఉవాచ
సా శోకార్తా చ హృష్టా చ దృష్ట్వా గోవింద మాగతమ్।
నానావిధాని దుఃఖాని సర్వాణ్యే వాన్వకీర్తయత్॥ 55
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! గోవిందుడు తన దగ్గరకు రావటంతో ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా పొందుతున్న కుంతి అనేక విధాలయిన తన కష్టాల నన్నింటినీ ఏకరువు పెట్టింది. (55)
పూర్వైరాచరితం యత్ తత్ కురాజభిరరిందమ।
అక్షద్యూతం మృగవధః కచ్చిదేషాం సుఖావహమ్॥ 56
అరిందమా! పూర్వకాలంలో చెడ్డ రాజులెందరో జూదాన్నీ, వేటనూ పరిపాటిగా చేశారు. అదేమైనా వారికి సుఖాన్ని కల్గించిందా? (56)
తన్మాం దహతి యత్ కృష్ణా సభాయం కురుసంనిధౌ।
ధార్తరాష్ట్రైః పరిక్లిష్టా యథా న కుశలం తథా॥ 57
సభలో కౌరవుల సమక్షంలో ధృతరాష్ట్రుని కొడుకులు ఆవిధంగా, ఎవ్వరికీ మంగళకరం కాని విధంగా కష్ట పెట్టారు. అది నన్ను దహించి వేస్తోంది. (57)
నిర్వాసనం చ నగరాత్ ప్రవ్రజ్యా చ పరంతప।
నానావిధానాం దుఃఖానామ్ అభిజ్ఞాస్మి జనార్దన॥ 58
పరంతపా! జనార్దనా! పాండవులు నగరం నుండి నిష్క్రమించటం సన్యాసులై అరణ్యవాసానికి వెళ్ళటం ఒకటేమిటి రకరకాల కష్టాలను చవిచూశారు. (58)
అజ్ఞాతచర్యా బాలానామ్ అవరోధశ్చ మాధవ।
న మే క్లేశతమం తత్ స్యాత్ పుత్రైః సహ పరంతప॥ 59
పరంతపా! మాధవా! నా బిడ్డలు పాండవులు అజ్ఞాతవాసం కూడా చేయవలసివచ్చింది. ఇప్పుడు రాజ్యాన్ని పొందటానికి అవరోధ మేర్పడుతోంది. నాకూ, నాకుమారులకూ ఇంత కష్టం కలగాలా? (59)
దుర్యోధనేన నికృతాః వర్షమద్య చతుర్దశమ్।
దుఃఖాదపి సుఖం నః స్యాద్ యది పుణ్యఫలక్షయః॥ 60
నా కుమారులు దుర్యోధనుని చేత మోసగింపబడ్డారు. ఇది పదునాలుగవ సంవత్సరం . పుణ్యఫలక్షయమే సుఖానుభవమైతే పాపఫల క్షయం దుఃఖానుభవమవుతుంది. ఇప్పుడు దుఃఖాలను అనుభవిస్తున్నారు కాబట్టి ఇక సుఖం కలగాలి. (60)
న మే విశేషో జాత్వాసీద్ ధార్తరాష్ట్రేషు పాండవైః।
తేన సత్యేన కృష్ణ త్వాం హతామిత్రం శ్రియా వృతమ్।
అస్మాద్ విముక్తం సంగ్రామాత్ పశ్యేయం పాండవైః సహ॥ 61
నైవ శక్యాః పరాజేతుం సర్వం హ్యేషాం తథావిధమ్।
కృష్ణా! ధార్తరాష్ట్రులనూ, పాండవులనూ, నేనెప్పుడూ వేరుగా చూడలేదు. ఆ సత్యం మీద ప్రయాణం చేసి చెప్తున్నాను. నీవు యుద్ధంలో శత్రువులను సంహరించి, పాండవులతో సహా ఈ కష్టాలనుండి బయటపడి, రాజ్యలక్ష్మిచే వరింపబడటాన్ని నేను చూడాలి. పాండవులకు ఓటమి కలుగకూడదు. వారి గుణసంపత్తి అటువంటిది. (61 1/2)
పితరం త్వేన గర్హేయం నాత్మానం న సుయోధనమ్॥ 62
యేనాహం కుంతిభోజాయ ధనం వృత్తైరివార్పితా।
నా కష్టాలకు నేను నన్ను గానీ, సుయోధనుణ్ణి గానీ, నిందించటంలేదు. మా నాన్ననే నిందిస్తున్నాను. ఆయనే గదా మామూలు యాచకులకు డబ్బు ఇచ్చినట్టు నన్ను కుంతిభోజునకు సమర్పించింది. (62 1/2)
బాలాం మామార్యకస్తుభ్యం క్రీడంతీం కందుహస్తికామ్॥ 63
అదాత్ తు కుంతిభోజాయ సఖా సఖ్యే మహాత్మనే।
నేను అప్పటికి చిన్న పిల్లనే. చేతిలో బంతిపట్టుకొని ఆడుకొంటున్న దాన్ని, అటువంటి నన్ను మీ తాతగారు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ తన మిత్రుడూ, మహానుభావుడూ అయిన కుంతి భోజన కిచ్చివేశారు. (63 1/2)
సాహం పిత్రా చ నికృతా శ్వశురైశ్చ పరంతప।
అత్యంతదుఃఖితా కృష్ణ కిం జీవితఫలం మమ॥ 64
పరంతపా! శ్రీకృష్ణా! ఆ విధంగా నేను తండ్రిచేత ఆ తర్వాత అత్తమామల చేతకూడా వంచింపబడ్డాను. అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నా జీవితానికి ఏం ప్రయోజనం. (64)
యన్మాం వాగబ్రవీన్నక్తం సూతకే సవ్యసాచినః।
పుత్రస్తే పృతీవీం జేతా యశశ్చాస్య దివం స్పృశేత్॥ 65
హత్వా కురూన్ మహాజన్యే రాజ్యం ప్రాప్య ధనంజయః।
భ్రాతృభిః సహ కౌంతేయః త్రీన్ మేధానాహరిష్యతి॥ 66
అర్జునుడు పుట్టినప్పుడు పురిటింటిలో అశరీరవాణి నాతో ఇలా అన్నది. ఈ నీ కుమారుడు భూమండలాన్ని జయిస్తాడు. ఇతని కీర్తి స్వర్గలోకాన్ని కూడా తాకుతుంది. ఘోరయుద్ధంలో కౌరవులను చంపి రాజ్యాధికారాన్ని పొంది, సోదరసహితంగా మూడు అశ్వమేధయాగాలను నిర్వహిస్తాడు. (65-66)
నాహం తానుభ్యసూయామి నమో ధర్మాయ వేధసే।
కృష్ణాయ మహతే నిత్యం ధర్మో ధారయతి ప్రజాః॥ 67
నేను ఆ ఆకాశవాణిని తప్పుపట్టటం లేదు. పరమాత్మ స్వరూపమైన, మహావిష్ణు స్వరూపమైన ధర్మానికి నమస్కరిస్తున్నాను. ధర్మమే జగత్ స్రష్ట. సకల ప్రజలను పరిపాలించునది కూడా ధర్మమే. (67)
ధర్మశ్చేదస్తి వార్ష్ణేయ యథా వాగభ్యభాషత।
త్వం చాపి తత్ తథా కృష్ణ సర్వం సంపాదయిష్యసి॥ 68
వార్ష్ణేయా! శ్రీకృష్ణా! ధర్మమే ఉంటే ఆ అశరీరవాణి పలికిన దానినంతా నీవే సమకూర్చి పెట్టగలవు. (68)
న మాం మాధవ వైధవ్యం నార్థనాశో న వైరతా।
తథా శోకాయ దహతి యథా పుత్రైర్వినా భవః॥ 69
మాధవా! పుత్ర వియోగశోకం నన్ను దహించినట్లు వైధవ్యం కానీ, అర్థనాశనం కానీ, జ్ఞాతులతో శత్రుత్వం కానీ నన్ను బాధించటం లేదు. (69)
యాహం గాండీవధన్వానం సర్వశస్త్రభృతాం వరమ్।
ధనంజయం న పశ్యామి కా శాంతిర్హృదయస్య మే॥ 70
సమస్త శస్త్ర ధారులలో శ్రేష్ఠుడై గాండీవధనుర్ధారి అయిన అర్జునుని చూడగలిగే దాకా నా హృదయానికి శాంతి లేదు. (70)
సమస్త శస్త్ర ధారులలో శ్రేష్ఠుడై గాండీవధనుర్ధారి అయిన అర్జునుని చూడగలిగే దాకా నా హృదయానికి శాంతి లేదు. (70)
ఇతశ్చతుర్దశం వర్షం యన్నాపశ్యం యుధిష్ఠిరమ్।
ధనంజయం చ గోవింద యమౌ తం చ వృకోదరమ్॥ 71
గోవిందా! ధర్మరాజునూ, భీమసేనునీ, అర్జునునీ, నకులసహదేవులనూ చూడక ఇది పదునాలుగవ సంవత్సరం. (71)
జీవనాశం ప్రణష్టానాం శ్రాద్ధం కుర్వంతి మానవాః।
అర్థతస్తే మమ మృతాః తేషాం చాహం జనార్దన॥ 72
జనార్దనా! ప్రాణాలు పోయిన వారికి మానవులు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. మరణమంటే కనిపించక పోవటమే అయితే పాండవులకు నేనూ, నాకు పాండవులూ మరణించినట్లే. (72)
బ్రూయా మాధవ రాజానం ధర్మాత్మానం యుధిష్ఠిరమ్।
భుయాంస్తే హీయతే ధర్మః మా పుత్రక వృథా కృథాః॥ 73
మాధవా! మహారాజు, ధర్మాత్ముడూ అయిన యుధిష్ఠిరునితో నా మాటగా చెప్పు - నాయనా నీ ధర్మానికి హాని కలుగుతోంది. దానిని వ్యర్థంగా పోనివ్వవద్దు. (73)
పరాశ్రయా వాసుదేవ యా జీవతి ధిగస్తు తామ్।
వృత్తేః కార్పణ్యలబ్ధాయాః అప్రతిష్ఠైవ జ్యాయసీ॥ 74
వాసుదేవా! ఇతరుల ఆశ్రయంలో జీవించే స్త్రీ జీవితం నిందార్హం. దీనంగా బ్రతకటం కన్న లేకపోవటమే మంచిది. (74)
అథో ధనంజయం బ్రూయాః నిత్యోద్యుక్తం వృకోదరమ్।
యదర్థం క్షత్రియా సూతే తస్య కాలోఽయమాగతఆHఅ॥ 75
అర్జునునితోనూ యుద్ధానికి నిత్యం సన్నద్ధుడై ఉన్న భీమసేనునితోనూ చెప్పు. క్షత్రియ కాంత ఏ ప్రయోజనం కోసం పిల్లలను కంటుందో ఆ ప్రయోజనం నెరవేర్చే కాలం ఆసన్నమైనదని చెప్పు. (75)
అస్మింశ్చేదాగతే కాలే మిథ్యా చాతిక్రమష్యతి।
లోకసంభావితాః సంతః సునృశంసం కరిష్యథ॥ 76
నృశంసేన చ నో యుక్తాన్ త్యజేయం శాశ్వతీః సమాః।
కాలే హి సమనుప్రాప్తే త్యక్తవ్యమపి జీవనమ్॥ 77
ఇటువంటి సమయం సంప్రాప్త మైనప్పుడు కూడా యుద్ధం చేయకపోతే అది చేజారిపోతుంది. మీరు లోకం మెచ్చిన మంచివారు. మీరు దయనీయమైన పనులు చేస్తే ఆ దీనత్వంతో కూడి ఉన్న మిమ్ములను శాశ్వతంగా వదిలి వేస్తాను. అవసర మైనపుడు ప్రాణాలను విడువటానికయినా మీరు సిద్ధపడాలి. (76-77)
మాద్రీపుత్రౌ చ వక్తవ్యౌ క్షత్రధర్మరతౌ సదా।
విక్రమేణార్జితాన్ భోగాన్ వృణీయం జీవితాదపి॥ 78
ఎల్లప్పుడూ క్షాత్రధర్మం మీద ఆసక్తి కలిగిన నకులసహదేవులకు కూడా చెప్పు. ప్రాణాలను ఒడ్డి అయినా పరాక్రమంతో సంపాదించిన భోగాలనే మీరు కోరుకోవాలి. (78)
విక్రమాధిగతా హ్యర్థాః క్షత్రధర్మేణ జీవతః।
మనో మనుష్యస్య సదా ప్రీణంతి పురుషోత్తమ॥ 79
పురుషోత్తమా! క్షత్రధర్మంతో జీవించే మనుష్యుని మనస్సును ఎప్పుడైనా పరాక్రమంతో సొంతం చేసికొన్న సొమ్మే ఆనందింపజేయ గలుగుతుంది. (79)
గత్వా బ్రూహి మహాబాహో సర్వశస్త్రభృతాం వరమ్।
అర్జునం పాండవం వీరం ద్రౌపద్యాః పదవీం చర॥ 80
మహాబాహూ! నీవు వెళ్ళి సర్వశస్త్ర ధారులలో శ్రేష్ఠుడైన అర్జునునితో ద్రౌపది సూచించిన దారిలోనే నడవాలని చెప్పు. (80)
విదితౌ హి తవాత్యంతం క్రుద్ధౌ తౌ తు యథాంతకౌ।
భీమార్జునౌ నయేతాం హి దేవానపి పరాం గతిమ్॥ 81
కృష్ణా! నీకిది బాగా తెలుసు. భీమార్జునులు కోపిస్తే యమసమానులై దేవతలను సయితం మృత్యుముఖం వైపు నడిపించగలరు. (81)
తయోశ్పైతదవజ్ఞానం యత్ సా కృష్ణా సభాం గతా।
దుశ్శాసనశ్చ కర్ణశ్చ పరుషాణ్యభ్యభాషతామ్॥ 82
దుర్యోధనో భీమసేనమ్ అభ్యాగచ్ఛన్మనస్వినమ్।
పశ్యతాం కురుముఖ్యానాం తస్య ద్రక్ష్యతి యత్ ఫలమ్॥ 83
ద్రౌపది సభలో నిలిచి ఉన్నప్పుడు దుశ్శాసనుడు, కర్ణుడు పలికిన పరుషవచనాలు భీమార్జునులకు కూడా అవమానకరాలే. దుర్యోధనుడు కురుముఖ్యుల సమక్షంలో అభిమానవంతుడైన భీమసేనుని పరాభవించాడు. దాని ఫలాన్ని తప్పక చవిచూస్తాడు. (82,83)
న హి వైరం సమాసాద్య ప్రశామ్యతి వృకోదరః।
సుచిరాదసి భీమస్య న హి వైరం ప్రశామ్యతి।
యావదంతం న నయతి శాత్రవాన్ శత్రుకర్శనః॥ 84
శత్రుత్వమేర్పడితే భీముడెప్పుడూ శాంతించడు. శత్రుకర్శనుడైన ఆ భీమసేనుడు శత్రువులనందరినీ సంహరించేదాకా ఎంత కాలం గడిచినా సరే ఆవైరం శాంతించదు. (84)
న దుఃఖం రాజ్యహరణం న చ ద్యూతే పరాజయః।
ప్రవ్రాజనం తు పుత్రాణాం న మే తద్ దుఃఖకారణమ్॥ 85
యత్ తు సా బృహతీ శ్యామా ఏకవస్త్రా సభాం గతా।
అశ్రుణోత్ పరుషా వాచః కిం ను దుఃఖతరం తతః॥ 86
రాజ్యాన్ని కోలుపోవటం కానీ, జూదంలో ఓడిపోవటం కానీ, కొడుకులు అరణ్యాలకు వెళ్ళటం కానీ నాకు దుఃఖాన్ని కల్పించలేదు. కానీ ఆ ఉత్తమురాలు ద్రౌపది ఏకవస్త్రయై కురుసభలో నిలబడి దుర్మార్గుల పరుషవచనాలు వినవలసి వచ్చింది. అంతకన్నా బాధాకరమైనది మరొకటి లేదు. (85-86)
స్త్రీధర్మిణీ వరారోహా క్షత్రధర్మరతా సదా।
నాభ్యగచ్ఛత్ తదా నాథం కృష్ణా నాథవతీ సతీ॥ 87
సదా క్షాత్రధర్మాసక్తయైన నా అందమైన కోడలు ద్రౌపది రజస్వలయై కురుసభలో నిలిచినప్పుడు అయిదుగురు భర్తలుండి కూడా అనాథ(దిక్కులేనిది) అయినది. (87)
యస్యాః మమ సపుత్రాయాః త్వం నాథో మధుసూదన।
రామశ్చ బలినాం శ్రేష్ఠః ప్రద్యుమ్నశ్చ మహారథః॥ 88
సాహమేవంవిధం దుఃఖం సహ్యేఽద్య పురుషోత్తమ।
భీమే జీవతి దుర్ధర్షే విజయే చాపలాయిని॥ 89
మధుసూదనా! పురుషోత్తమా! బలవంతులలో శ్రేష్ఠుడైన బలరాముడూ, మహారథుడయిన ప్రద్యుమ్నుడూ, నీవూ నా కుమారులకూ, నాకూ రక్షకులు. అటువంటి నేను ఎదురులేని భీముడు, పలాయనం తెలియని అర్జునుడు జీవించి ఉండగానే ఇటువంటి కష్టాలను భరించవలసివస్తోంది. (88-89)
వైశంపాయన ఉవాచ
తత ఆశ్వాసయామాస పుత్రాధిభిరభిప్లుతామ్।
పితృష్వసారం శోచంతీం శౌరిః పార్థసఖః పృథామ్॥ 90
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు కుమారులను గురించి చింతిస్తూ శోకంలో మునిగి పోయిన తన మేనత్త కుంతిని పార్థసఖుడయిన శ్రీకృష్ణుడు ఊరడించాడు. (90)
వాసుదేవ ఉవాచ
కా తు సీమంతినీ త్వాదృక్ లోకేష్వస్తి పితృష్వసః।
శూరస్య రాజ్ఞో దిహితా ఆజమీఢకులం గతా॥ 91
వాసుదేవుడిలా అన్నాడు. అత్తా! లోకంలో నీ అంతటి సౌభాగ్యవతి మరొకర్తె లేదు. నీవు శూరసేన మహారాజ పుత్రివి.. అజమీఢ వంశంలో అడుగు పెట్టితివి. (91)
మహాకునీనా భవతీ హ్రదాద్ హ్రదమివాగతా।
ఈశ్వరీ సర్వకల్యాణీ భర్త్రా పరమపూజితా॥ 92
నీవు ఉన్నతవంశంలో పుట్టావు. ఉన్నత వంశంలో మెట్టావు. ఒక సరస్సు నుండి మరొక సరస్సులోచేరిన కమలం వంటిదానవు. ఒకప్పుడు నీవు సకల కళ్యానవతివి. మహారాణివి. భర్తచే మన్ననల నందినదానవు. (92)
వీరసూర్వీరపత్నీ త్వం సర్వైః సముదితా గుణైః।
సుఖదుఃఖే మహాప్రాజ్ఞై త్వాదృశే సోఢుమర్హతి॥ 93
నీవు వీరపత్నివి, వీరపుత్రివి, సర్వసద్గుణాలచే సంపన్నురాలవు. వివేకపతీ! నీవంటివారు తప్ప మరెవరు సుఖదుఃఖాలను భరించగలుగుదురు? (93)
నిద్రాతంద్రే క్రోధహర్షౌ క్షుత్పిపాసే హిమాతపౌ।
ఏతాని పార్థా నిర్జిత్య నిత్యం వీరసుఖే రతాః॥ 94
నీ కుమారులందరూ నిద్రనూ, అలసటనూ, క్రోధాన్నీ, హర్షాన్నీ, ఆకలిదప్పులను, చలి ఎండలనూ, అన్నింటినీ జయించి నిత్యమూ వీరోచితంగానే సుఖాసక్తులై ఉన్నారు. (94)
త్యక్తగ్రామ్యసుఖాః పార్థా నిత్యం వీరసుఖప్రియాః।
న తు స్వల్పేన తుష్యేయుః మహోత్సాహా మహాబలాః॥ 95
నీ కుమారులు గ్రామ్యసుఖాః పార్థా నిత్యం వీరసుఖప్రియాః।
న తు స్వల్పేన తుష్యేయుః మహోత్సాహా మహాబలాః॥ 95
నీ కుమారులు గ్రామ్య(సాధారణ) సుఖాలను వదలి నిత్యమూ వీరోచిత, సుఖాలనే ఇష్టపడుతున్నారు. మహాబలం, మహోత్సాహం గలవారు. అంత తేలికగా తృప్తిపడరు. (95)
అంతం ధీరా నిషేవంతే మధ్యం గ్రామ్యసుఖప్రియాః।
ఉత్తమాంశ్చ పరిక్లేశాన్ భోగాంశ్చాతీవ మానుషాన్॥ 96
అంతేషు రేమిరే ధీరాః న తే మధ్యేషు రేమిరే।
అంతప్రాప్తిం సుఖం ప్రాహుః దుఃఖమంతరమేతయోః॥ 97
ధీరులు భోగాల అంతాన్ని చూడాలని భావిస్తారు. మధ్యములు గ్రామ్యసుఖాలపై ఆసక్తి చూపుతారు. ధీరులయిన ఉత్తములు కర్తవ్యనిర్వహణలో వివిధక్లేశాలను సహించి చివరకు మానవాతీత భోగాలను అనుభవిస్తారు. ధీరులు పర్యంత స్థితిలోనే ఆనందిస్తారు కానీ మాధ్యమిక స్థితిలో గాదు. కడముట్టటమే సుఖం, రెండుసుఖాల మధ్యస్థితియే దుఃఖం అని పెద్దల మాట. (96,97)
అభివాదయంతి భవతీం పాండవాః సహ కృష్ణయా।
ఆత్మానం చ కుశలినం నివేద్యాహురనామయమ్॥ 98
పాండవులు ద్రౌపదితో సహా నీకు నమస్కరిస్తున్నారు. తమ క్షేమాన్ని తెలియజేసి తమ స్వస్థతను కూడా సూచించారు. (98)
అరోగాన్ సర్వసిద్ధార్థాన్ క్షిప్రం ద్రక్ష్యసి పాండవాన్।
ఈశ్వరాన్ సర్వలోకస్య హతామిత్రాన్ శ్రియా వృతాన్॥ 99
త్వరలోనే శత్రువులను చంపి రాజ్యలక్ష్మిని చేపట్టి స్వస్థులై, సిద్ధమనోరథులై, లోకపాలకులయిన పాండవులను చూడగలవు. (99)
ఏవమశ్వాసితా కుంతీ ప్రత్యువాచ జనార్దనమ్।
పుత్రాదిభిరధ్వస్తా నిగృహ్యాబుద్ధిజం తమః॥ 100
పుత్రాదులకు దూరమయిన కుంతి శ్రీకృష్ణునిచే ఈ విధంగా ఊరడింపబడి అజ్ఞానంవలన ఏర్పడిన మోహాంధకారాన్ని తొలగించుకొని ఇలా బదులిచ్చింది. (100)
కుంత్యువాచ
యద్ యత్ తేషాం మహాబాహో పథ్యం స్యాన్మధుసూదన।
యథా యథా త్వం మన్యేథాః కుర్యాః కృష్ణ తథా తథా॥ 101
కుంతి ఇలా అన్నది. మహాబాహూ! మధుసూదనా! వారికి ఏది హితమో ఏరీతిగా హితమని నీవు భావిస్తున్నావో అదంతా ఆరీతిగా నీవు చేయి. (101)
అవిలోపేన ధర్మస్య అనికృత్యా పరంతప।
ప్రభావజ్ఞాస్మి తే కృష్ణ సత్యస్యాభిజనస్య చ॥ 102
పరంతపా! కృష్ణా! ధర్మభంగం లేకుండా, వంచన లేకుండా కార్యసాధన చేయాలి. నీ సత్య పరాయణత్వం నీ వంశమర్యాదల ప్రభావం నాకు తెలుసు. (102)
వ్యవస్థాయాం చ మిత్రేషు బుద్ధివిక్రమయోస్తథా।
త్వమేవ నః కులే ధర్మః త్వం సత్యం త్వం తపో మహత్॥ 103
త్వం త్రాతా త్వం మహద్ బ్రహ్మ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్।
యథైవాత్థ తథైవైతత్ త్వయి సత్యం భవిష్యతి॥ 104
కార్యవ్యవస్థీకరణలో, మిత్ర సంగ్రహణంలో బుద్ధిపరాక్రమాలలో నీ ప్రభావం నాకు తెలుసు. మా వంశంలో నీవే ధ్ర్మం. నీవే సత్యం, నీవే తపస్స్వరూపుడవు నీవే రక్షకుడవు. నీవే పరబ్రహ్మవు. నీయందే సర్వమూ ప్రతిష్ఠింపబడి ఉన్నది. నీవు చెప్పినదే నీ సన్నిధిలో సత్యం. (103-104)
(కురూణాం పాండవానాం చ లోకానాం చాపరాజిత।
సర్వస్యైతస్య వార్ష్ణేయ గతిస్త్వమసి మాధవ॥
ప్రభావో బుద్ధివీర్యం చ తాదృశం తవ కేశవ।
(అపరాజితా! వార్ష్ణేయా! మాధవా! కేశవా!కౌరవులకూ, పాండవులకూ, ఈ సమస్తలోకానికీ నీవే దిక్కు. నీ ప్రభావమూ, నీ బుద్ధిబలమూ దానికి తగినవి.)
వైశంపాయన ఉవాచ
తామామంత్ర్య చ గోవిందః కృత్వా చాభిప్రదక్షిణమ్।
ప్రాతిష్ఠత మహాబాహుః దుర్యోధనగృహాన్ ప్రతి॥ 105
వైశంపాయనుడిలా అన్నాడు. ఆమె నుండి వీడ్కోలు తీసికొని, ఆమెకు ప్రదక్షిణం చేసి ఆ మహాబాహువయిన గోవిందుడు దుర్యోధనుని ఇంటివైపు బయలు దేరాడు. (105)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కృష్ణకుంతీసంవాదే నవతితమోఽధ్యాయః॥ 90 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కృష్ణకుంతీసంవాదమను తొంబదియవ అధ్యాయము. (90)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకము కలిపి 106 1/2 శ్లోకాలు)