89. ఎనుబది తొమ్మిదవ అధ్యాయము

కౌరవులు శ్రీకృష్ణుని స్వాగతించుట - విదుర ధృతరాష్ట్రుల ఆతిథ్యము.

వైశంపాయన ఉవాచ
ప్రాతరుత్థాయ కృష్ణస్తు కృతవాన్ సర్వమాహ్నికమ్।
బ్రాహ్మణైరభ్యనుజ్ఞాతః ప్రయయౌ నగరం ప్రతి॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. శ్రీకృష్ణుడు ప్రాతఃకాలంలోనే లేచి నిత్యకృత్యలన్నీ ముగించి బ్రాహ్మణూల అనుమతి తీసికొని నగరానికి బయలుదేరాడు. (1)
తం ప్రయాంతం మహాబాహుమ్ అనుజ్ఞాయ మహాబలమ్।
పర్యవర్తంత తే సర్వే వృకస్థలనివాసినః॥ 2
మహాబాహువు, మహాబలుడు అయిన శ్రీకృష్ణుడు బయలుదేరాడు. వృకస్థలనివాసులు ఆయనను అనుసరించి ఆపై ఆయన అనుమతితో వెనుదిరిగారు. (2)
ధార్తరాష్ట్రాస్సమాయాంతం ప్రత్యుజ్జగ్ముః స్వలంకృతాః।
దుర్యోధనదృతే సర్వే భీష్మద్రోణ కృపాదయః॥ 3
దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్ర కుమారులు, భీష్మద్రోణకృపాదులందరూ చక్కగా అలంకరించుకొని తమ వద్దకు వస్తున్న శ్రీకృష్ణునికి ఎదురేగారు. (3)
పౌరాశ్చ బహులా రాజన్ హృషీకేశం దిదృక్షవః।
యానైర్బహువిధైరన్యైః పద్భిరేవ తథా పరే॥ 4
రాజా! ఎందరో పౌరులు శ్రీకృష్ణుని చూడగోరి కొందరు వివిధవాహనాలతో మరికొందరు కాలినడకతో బయలుదేరారు. (4)
స వై పథి సమాగమ్య భీష్మేణాక్లిష్టకర్మణా।
ద్రోణేన ధార్తరాష్ట్రైశ్చ తైర్వృతో నగరం యయౌ॥ 5
సులువుగా పరాక్రమింపగల భీష్ముడూ, ద్రోణుడు, ధార్తరాష్ట్రులు మార్గమధ్యంలో కలిసి తనను చుట్టినడుస్తూఉండగా శ్రీకృష్ణుడు నగరానికి వెళ్ళాడు. (5)
కృష్ణసమ్మాననార్థం చ నగరం సమలంకృతమ్।
బభూవ రాజమార్గశ్చ బహురత్నసమాచితః॥ 6
శ్రీకృష్ణుని గౌరవార్థం నగరాన్ని చక్కగా అలంకరించారు. రాజమార్గాన్ని రత్నాలతో అందంగా తీర్చిదిద్దారు. (6)
న చ కశ్చిద్ గృహే రాజన్ తదాఽఽసీద్ భరతర్షభ।
న స్త్రీ న వృద్ధో న శిశుః వాసుదేవదిదృక్షయా॥ 7
భరతశ్రేష్ఠా! రాజా! వాసుదేవుని చూడాలన్న కోరికతో ఆ సమయంలో స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, చిన్న పిల్లలుకానీ ఒక్కరు కూడా ఇంటిలో ఉండలేక పోయారు. (7)
రాజమార్గే నరాస్తస్మిన్ సంస్తువంత్యవనిం గతాః।
తస్మిన్ కాలే మహారాజ హృషీకేశప్రవేశనే॥ 8
మహారాజా! శ్రీకృష్ణుడు ప్రవేశించిన సమయంలో పౌరులందరూ రాజమార్గంలోనే నేలపై నిలిచి శ్రీకృష్ణుని స్తుతింప నారంభించారు. (8)
ఆవృతాని వరస్త్రీభిః గృహాణి సుమహాంత్యపి।
ప్రచలంతీవ భారేణ ధృశ్యంతే స్మ మహీతలే॥ 9
పెద్దపెద్ద మేడలుకూడా అందమైన స్త్రీలతో నిండాయి. అవి ఆ భారంతో భూమిపై కదలుతున్నట్లు అనిపిస్తున్నాయి. (9)
తథా చ గతిమంతస్తే వాసుదేవస్య వాజినః।
ప్రణష్టగతయోఽభూవన్ రాజమార్గే నరైర్హృతే॥ 10
ఆ విధంగా పౌరులతో నిండిన ఆ రాజమార్గంలో పరువెత్తుతున్న శ్రీకృష్ణుని గుఱ్ఱాలగమనం ముందుకు సాగలేదు. (10)
స గృహం ధృతరాష్ట్రస్య ప్రావిశత్ శత్రుకర్శనః।
పాండురం పుండరీకాక్షః ప్రాసాదైరుపశోభీతమ్॥ 11
శత్రుమర్దనుడు అయిన ఆ శ్రీకృష్ణుడు ప్రాసాదాలతో ప్రకాశిస్తున్న ధృతరాష్ట్రుని భవనాన్ని ప్రవేశించాడు. (11)
తిస్రః కక్ష్యాః వ్యతిక్రమ్య కేశవో రాజవేశ్మనః।
వైచిత్రవీర్యం రాజానమ్ అభ్యగచ్ఛదరిందమమ్॥ 12
అరిందముడైన కేసవుడు ఆ రాజభవనం యొక్క మూడుసింహద్వారాలను దాటి ధృతరాష్ట్ర మహారాజును సమీపించాడు. (12)
అభ్యాగచ్ఛతి దాశార్హే ప్రజ్ఞాచక్షుర్నరాధిపః।
సహైవ ద్రోణభీష్మాభ్యామ్ ఉదతిష్ఠన్మహాయశాః॥ 13
కీర్తిమంతుడూ, ప్రజ్ఞాచక్షువూ అయిన ధృతరాష్ట్రమహారాజు శ్రీకృష్ణుడు సమీపించగానే ద్రోణభీష్ములతో కలిసి పైకి లేచాడు. (13)
కృపశ్చ సోమ్దత్తశ్చ మహారాజశ్చ బాహ్లికః।
ఆసనేభ్యోఽచలన్ సర్వే పూజయంతో జనార్దనమ్॥ 14
కృపుడూ, సోమదత్తుడూ, బాహ్లికమహారాజు ఇతరులంద్రూ కూడా జనార్దనుని గౌరవిస్తూ తమతమ ఆసనాల నుండి లేచారు. (14)
తతో రాజానమాసాద్య ధృతరాష్ట్రం యశస్వినమ్।
స భీష్మం పూజయామాస వార్ష్ణేయో వాగ్భిరంజసా॥ 15
ఆపై శ్రీకృష్ణుడు కీర్తిమంతుడయిన ధృతరాష్ట్ర మహారాజును కలిసి వెంటనే ఆదరపూర్వక వచనాలతో భీష్ముని గౌరవించాడు. (15)
తేషు ధర్మానుపూర్వీం తాం ప్రయుజ్య మధుసూదనః।
యథావయః సమీయాయ రాజభిస్సహ మాధవః॥ 16
ధర్మానుసారంగా వారిని గౌరవించిన తర్వాత మధుసూదనుడు వయస్సుననుసరించి క్రమంగా అక్కడున్న రాజులను పలుకరించాడు. (16)
అథ ద్రోణం సబాహ్లీకం సపుత్రం చ యశస్వినమ్।
కృపం చ సోమదత్తం చ సమీయాయ జనార్దనః॥ 17
ఆ తరువాత శ్రీకృష్ణుడు కీర్తిమంతుడైన ద్రోణుని, అశ్వత్థామను, బాహ్లీకుని, కృపుని, సోమదత్తుని కలిశాడు. (17)
తత్రాసీదూర్జితం మృష్టం కాంచనం మహదాసనమ్।
శాసనాద్ ధృతరాష్ట్రస్య తత్రోపవిశదచ్యుతః॥ 18
అక్కడ ధృతరాష్ట్రుని ఆదేశం మేరకు ఏర్పాటుచేసిన సమ్పన్నమైన, స్వర్ణమయమైన గొప్ప సింహాసనమున్నది. దానిపై శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. (18)
అథ గాం మధుపర్కం చాప్యుదకం చ జనార్దనే।
ఉపజహ్రుర్యథాన్యాయం ధృతరాష్ట్రపురోహితాః॥ 19
అటుతర్వాత ధృతరాష్ట్ర పురోహితులు శాస్త్రోకంగా ఆవునూ, మధుపర్కాన్నీ, నీటినీ శ్రీకృష్ణుని సత్కారంకోసం తీసికొనివచ్చారు. (19)
కృతాతిథ్యస్తు గోవిందః సర్వాన్ పరిహసన్ కురూన్।
ఆస్తే సాంబంధికం కుర్వన్ కురుభిః పరివారితః॥ 20
ఆతిథ్యం పూర్తి అయిన తర్వాత కౌరవుల మధ్యనున్న శ్రీకృష్ణుడు నవ్వుతూ, సంబంధానుసారంగా అందరినీ పలుకరిస్తూ కూర్చొన్నాడు. (20)
సోఽర్చితో ధృతరాష్ట్రేణ పూజితశ్చ మహాయశాః।
రాజానం సమనుజ్ఞాప్య నిరక్రామదరిందమమ్॥ 21
ధృతరాష్ట్రుని పూజలందుకొనిన కీర్తిమంతుడు, అరిందముడూ అయిన శ్రీకృష్ణుడు ఆయన సెలవుతీసికొని నిష్క్రమించాడు. (21)
తైస్సమేత్య యథాన్యాయం కురుభిః కురుసంసది।
విదురావసథం రమ్యమ్ ఉపాతిష్ఠత మాధవః॥ 22
కౌరవసభలో కౌరవులను మర్యాదానుసారంగా కలిసికొని ఆ తర్వాత శ్రీకృష్ణుడు రమణీయమయిన విదురనివాసానికి వచ్చాడు. (22)
విదురః సర్వకళ్యాణైః అభిగమ్య జనార్దనమ్।
అర్చయామాస దాశార్హం సర్వకామైరుపస్థితమ్॥ 23
విదురుడు తన ఇంట నిలచిన శ్రీకృష్ణుని స్వాగతించి సమస్తమంగళ ద్రవ్యాలతో, సముచిత భోగాలతో శ్రీకృష్ణుని అర్చించాడు. (23)
యా మే ప్రీతిః పుష్కరాక్ష త్వద్దర్శనసముద్భవా।
సా కిమాఖ్యాయతే తుభ్యమ్ అంతరాత్మాసి దేహినామ్॥ 24
(విదురుడిలా అన్నాడు) - పుండరీకాక్ష! నీదర్శనం వలన నాలో కలిగిన ఆనందాన్ని ఏమని చెప్పగలను? ప్రాణులందరకు అంతరాత్మవు నీవే కదా! (24)
కృతాతిథ్యం తు గీవిందం విదురః సర్వధర్మవిత్।
కుశలం పాండుపుత్రాణామ్ అపృచ్ఛన్మధుసూదనమ్॥ 25
సర్వధర్మవేత్త అయిన విదురుడు గోవిందుని సత్కరించి ఆ మధుసూదనుని పాండవుల క్షేమాన్ని అడిగాడు. (25)
ప్రీయమాణస్య సుహృదః విదురో బుద్ధిసత్తమః।
ధర్మార్థనిత్యస్య సతః గతరోషస్య ధీమతః.. 26
తస్య సర్వం సవిస్తారం పాండవానాం విచేష్టితమ్।
క్షత్తురాచష్ట దాశార్హః సర్వం ప్రత్యక్షదర్శినామ్॥
విదురుడు బుద్ధిమంతుడు. అంతా కనులారా చూస్తున్న శ్రీకృష్ణుడు నిత్యమూ ధర్మార్థతత్పరుడై రోషశూన్యుడై, ప్రేమరూపియై, మతిమంతుడై తనకు మిత్రుడైన విదురునకు పాండవుల వ్యవహారాన్నంతా సవిస్తరంగా చెప్పాడు. (26)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి ధృతరాష్ట్ర గృహప్రవేశపూర్వకం శ్రీకృష్ణస్య విదురగృహప్రవేశే ఏకోననవతితమోఽధ్యాయః॥ 89 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర గృహప్రవేశపూర్వకంగా శ్రీకృష్ణుని విదురగృహప్రవేశమను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము. (89)