81. ఎనుబది ఒకటవ అధ్యాయము

సహదేవుడు, సాత్యకి యుద్ధమునకు ఇష్టపడుట - యోధులు సమర్థించుట.

సహదేవ ఉవాచ
యదేతత్ కథితం రాజ్ఞా ధర్మ ఏష సనాతనః।
యథా చ యుద్ధమేవ స్యాత్ తథా కార్యమరిందమ॥ 1
సహదేవుడు ఇలా అన్నాడు. అరిందమా! యుధిష్ఠిరమహారాజు చెప్పిన ఈ విషయమంతా సనాతనధర్మం. యుద్ధం జరిగేటట్లు నీవు ప్రయత్నించాలి. (1)
యది ప్రశమమిచ్ఛేయుః కురవః పాండవైః సహ।
తథాపి యుద్ధం దాశార్హ యోజయేథాః సహైవ తైః॥ 2
దాశార్హా! కౌరవులు పాండవులతో సంధికి కోరుకొన్నా, నీవు వారితో యుద్ధం జరిగేటట్లే యోజన చేయాలి. (2)
కథం ను దృష్ట్వా పాంచాలీం తథా కృష్ణ సభాగతామ్।
అవధేన ప్రశామ్యేత మమ మన్యుః సుయోధనే॥ 3
కృష్ణా! నాడు సభలో ఆ పరిస్థితిలో ఉన్న ద్రౌపదిని చూసి సుయోధనునిపై నాకు కలిగిన కోపం సుయోధనుని చంపకుండా ఎలా శాంతిస్తుంది? (3)
యది భీమార్జునౌ కృష్ణ ధర్మరాజశ్చ ధార్మికః।
ధర్మముత్సృజ్య తేనాహం యోద్ధుమిచ్ఛామి సంయుగే॥ 4
కృష్ణా! భీముడు, అర్జునుడు, ధర్మరాజు - ఈ ముగ్గురూ ఒకవేళ ధర్మమార్గాన్ని అనుసరించినా నేను మాత్రం ధర్మాన్ని వదిలి యుద్ధంలో పోరాడలనే కోరుకొంటున్నాను. (4)
వి॥ తె॥ సహదేవుడు సూటిగా చెపుతాడు. తెలుగులో అమూలకమయినా తిక్కన ఇక్కడ చక్కని పద్యం వ్రాశాడు.
తుది రాజ్యమ్ము సగమ్ము గొమ్మడవియందుం బేరువంచించియుం
బదుమూడేడులు నీవనం దిరిగిరాఁబాలీకపోవచ్చునే
యది గదేఁదెగి బంటనైయుఱుము మాయల్ పన్ను నేర్పింపకఁజె
ల్లదు సూ నీకని యా సుయోధనుని యుల్లం బుచ్చిపోనాడుమా!
ఉద్యో-3-97
సాత్యకి రువాచ
సత్యమాహ మహబాహో సహదేవో మహామతిః।
దుర్యోధనవధే శాంతిః తస్య కోపస్య మే భవేత్॥ 5
సాత్యకి ఇలా అన్నాడు.
మహాబాహూ! మేధావి అయిన సహదేవుడు చక్కగా చెప్పాడు. (సత్యం చెప్పాడు). ఆ నా కోపం శమించటానికి సుయోధనుని చంపటమొక్కటే ఉపాయం. (5)
న జానాసి యథా దృష్ట్వా చీరాజినధరాన్ వనే।
తవాపి మన్యురుద్భూతో దుఃఖితాన్ ప్రేక్ష్య పాండవాన్॥ 6
నీకు గుర్తుండే ఉంటుంది. అరణ్యంలో నార చీరలనూ, జింక చర్మాలనూ ధరించి తిరుగుతున్న పాండవులను చూచి నీకు కూడా కోపం వచ్చింది గదా! (6)
తస్మాన్మాద్రీసుతః శూరః యదాహ రణకర్కశః।
వచనం సర్వయోధానాం తన్మతం పురుషోత్తమ॥ 7
కాబట్టి పురుషోత్తమా! యుద్ధంలో కర్కశంగా ప్రవర్తించగల శూరుడైన సహదేవుని మాటయే యోధులందరి అభిప్రాయం. (7)
వైశంపాయన ఉవాచ
ఏవం వదతి వాక్యం తు యుయుధానే మహామతౌ।
సుభీమః సింహనాదోఽభూద్ యోధానాం తత్ర సర్వశః॥ 8
వైశంపాయనుడిలా అన్నాడు - మహామతి అయిన సాత్యకి ఈ విధంగా మాట్లాడగానే అక్కడున్న సమస్త సైనికులూ /యోధులూ భీకరంగా సింహనాదం చేయ నారంభించారు. (8)
సర్వే హి సర్వశో వీరాః తద్వచః ప్రత్యపూజయన్।
సాధు సాధ్వితి శైనేయం హర్షయంతో యుయుత్సవః॥ 9
యుద్ధం చేయాలన్న కోరికతో వచ్చి ఉన్న అక్కడి వీరులంతా 'భళా భళా' అంటూ ఆనందిస్తూ సాత్యకి వచనాలను సర్వాత్మనా ప్రశంసించారు. (9)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి సహదేవ సాత్యకివాక్యే ఏకాశీతితమోఽధ్యాయః॥ 81 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున సహదేవసాత్యకి వచనమను ఎనుబది యొకటవ అధ్యాయము. (81)