80. ఎనుబదియవ అధ్యాయము

నకులుని మాటలు.

నకుల ఉవాచ
ఉక్తం బహువిధం వాక్యం ధర్మరాజేన మాధవ।
ధర్మజ్ఞేన వదాన్యేన శ్రుతం చైవ హి తత్ త్వయా॥ 1
మాధవా! ధర్మవేత్త, వదాన్యుడూ అయిన ధర్మరాజు ఎన్నో విషయాలు చెప్పాడు. వాటిని నీవు విన్నావు కూడా! (1)
మత మాజ్ఞాయ రాజ్ఞశ్చ భీమసేనేన మాధవ।
సంశమో బాహువీర్యం చ ఖ్యాపితం మాధవాత్మనః॥ 2
మాధవా! రాజు అయిన ధర్మజుని అభిప్రాయాన్ని అనుసరించి భీమసేనుడు కూడా ముందు సంధిని గురించి, ఆ తరువాత తన బాహు విక్రమాన్ని గురించీ ఎంతో చెప్పాడు. (2)
తథైవ ఫాల్గునే నాపి యదుక్తం తత్ త్వయా శ్రుతమ్।
ఆత్మవశ్చ మతం వీర కథితం భవతాసకృత్॥ 3
వీరా! అదేవిధంగా అర్జునుడు చెప్పిన మాటలను కూడా నీవు విన్నావు. నీ అభిప్రాయాన్ని కూడా ఎన్నోసార్లు ప్రకటించావు. (3)
సర్వమేతదతిక్రమ్య శ్రుత్వా పరమతం భవాన్।
యత్ ప్రాప్తకాలం మన్యేథాః తద్ కుర్యాః పురుషోత్తమ॥ 4
పురుషోత్తమా! ఈ అభిప్రాయాలను అన్నింటినీ ప్రక్కనపెట్టి, శత్రువుల అభిప్రాయాన్ని తెలిసికొని అప్పటికి ఏది తగినదని నీవు భావిస్తే దానిని చేయవలసినది. (4)
తస్మిం స్తస్మిన్ నిమిత్తే హి మతం భవతి కేశవ।
ప్రాప్తకాలం మనుష్యేణ క్షమం కార్యమరిందమ॥ 5
అరిందమా! కేశవా! వేరు వేరు కారణాలను బట్టి అభిప్రాయాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి యోగ్యమూ, సమయోచితమూ అయిన పనినే మనుష్యుడు చేయాలి. (5)
వి॥సం॥ వ్యక్తి భేదంతో మతభేదం ఏర్పడుతుంది. వంశనాశనం కాకూడదని ధర్మరాజుభావం. జుట్టు పట్టి లాగబడిన ద్రౌపదికి సమూలంగా శత్రునాశం చెయ్యాలని భావం. కాలానుగుణంగా ఏది తగినదో అది చెయ్యాలి. (నీల)
అన్యథా చింతితో హ్యర్థః పునర్భవతి సోఽన్యథా।
అనిత్యమతయో లోకే నరాః పురుషసత్తమ॥ 6
పురుష శ్రేహ్ఠా! ఒక విధంగా ఆలోచించిన అంశం మరలా మరో రీతిగా మారిపోతుంటుంది. లోకంలో మనుష్యుల బుద్ధి స్థిరమైనది కాదు. (6)
అన్యథా బుద్ధయో హ్యాసన్ అస్మాసు వనవాసిషు।
అదృశ్యేష్వన్యథా కృష్ణ దృశ్యేషు పునరన్యథా॥ 7
కృష్ణా! అరణ్యవాసకాలంలో కూడా ఆలోచన ఒకరకంగా ఉండేది. అజ్ఞాతవాసకాలంలో మరొకరకంగా ఉండేది. ఇప్పుడు మేము బయటపడిన తర్వాత ఇంకొకరకంగా ఉంది. (7)
వి॥సం॥ ఒకే వ్యక్తి అయినా అవస్థ మారటంతో మత భేదం ఏర్పడుతుంది. అజ్ఞాతవాసంలో ఎలా దాగి ఉండాలా అని ఆలోచించారు. బయట పడ్డాక రాజ్యం ఎలా వస్తుందా అని ఆలోచిస్తున్నారు. (నీల)
అస్మాకమపి వార్ష్ణేయ వనే విచరతాం తదా।
న తథా ప్రణయో రాజ్యే యథా సంప్రతి వర్తతే॥ 8
వృష్ణినందనా! అప్పుడు మేము అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు మాకు రాజ్యం మీద ఇప్పుడున్నంత ప్రేమ లేదు. (8)
నివృత్తవనవాసాన్ నః శ్రుత్వా వీర సమాగతాః।
అక్షౌహిణ్యో హి సప్తేమాః త్వత్ప్రసాదాజ్జనార్దన॥ 9
జనార్దనా! మేము అరణ్యవాసం నుండి బయటపడినట్లు విని నీ అనుగ్రహం వలన ఏడు అక్షౌహిణుల సేన ఇక్కడకు చేరినది. (9)
ఇమాన్ హి పురుష వ్యాఘ్రాన్ అచింత్య బలపౌరుషాన్।
ఆత్తశస్త్రాన్ రణే దృష్ట్వా న వ్యథేదిహ కః పుమాన్॥ 10
పురుష శ్రేష్ఠులూ! అమేయ బలపౌరుషాలూ గల ఈ వీరులు ఆయుధాలు ధరించి రణభూమిలో నిలిస్తే ఎవడు బెదరక నిలువగలడు? (10)
స భవాన్ కురుమధ్యే తం సాంత్వపూర్వభయోత్తరమ్।
బ్రూయాద్ వాక్యం యథా మందః న వ్యథేత సుయోధనః॥ 11
ఈ విషయాన్ని నీవు అనునయ పూర్వకంగా ముందు యుద్ధప్రస్తా॥ 11
ఈ విషయాన్ని నీవు అనునయ పూర్వకంగా ముందు యుద్ధప్రస్తావనతో భయపెడుతూ తర్వాత మూర్ఖుడైన ఆ సుయోధనుడు బాధపడని రీతిలో చెప్పు. (11)
యుధిష్ఠిరం భీమసేనం బీభత్సుం చాపరాజితమ్।
సహదేవం చ మాం చైవ త్వాం చ రామం చ కేశవ॥ 12
సాత్యకిం చ మహావీర్యం విరాటం చ సహాత్మజుమ్।
ద్రుపదం చ సహామాత్యం ధృష్టద్యుమ్నం చ మాధవ॥ 13
కాశిరాజం చ విక్రాంతం ధృష్టకేతుం చ చేదిపమ్।
మాంసశోణితభృన్మర్త్యః ప్రతియుధ్యేత కో యుధి॥ 14
కేశవా! ధర్మరాజును, భీముని, ఓటమి ఎరుగని అర్జునుని, సహదేవుని, నన్ను, నిన్ను, బలరాముని పరాక్రమశాలి అయిన సాత్యకిని,పుత్రసహితుడైన విరాటుని, మంత్రిమండలితో కూడిన ద్రుపదుని, ధృష్టద్యుమ్నుని, పరాక్రమవంతుడయిన కాశిరాజును, చేది భూపాలుడయిన ధృష్టకేతుని రక్తమాంసాలు గల ఏ నరుడు యుద్ధంలో ఎదిరించగలడు? (12,13,14)
స భవాన్ గమనాదేవ సాధయిష్యత్యసంశయమ్।
ఇష్టమర్థం మహాబాహో ధర్మరాజస్య కేవలమ్॥ 15
మహాబాహూ! నీవు పెడితే చాలు. ధర్మరాజు కోరిక నెరవేరినట్లే. ఈ విషయంలో సందేహం లేదు. (15)
విదురశ్పైవ భీష్మశ్చ ద్రోణశ్చ సహబాహ్లికః।
శ్రేయం సమర్థా విజ్ఞాతుమ్ ఉచ్యమానాస్త్వయానఘ॥ 16
అనఘా! విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, బాహ్లీకుడు శ్రేయోదాయకంగా నీవు చెప్పే మాటలను అర్థం చేసికొనగలుగుతారు. (16)
తే చైవ మనునేష్యంతి ధృతరాష్ట్రం జనాధిపమ్।
తం చ పాపసమాచారం సహామాత్యం సుయోధనమ్॥ 17
వారే మహారాజైన ధృతరాష్ట్రునికీ, పాపబుద్ధియైన సుయోధనునికీ, ఆయన అమాత్యులకూ నచ్చ జెప్పగలరు. (17)
శ్రోతా చార్థస్య విదురః త్వం చ వక్తా జనార్దన।
కమివార్థం నివర్తంతం స్థాపయేతాం న వర్త్మని॥ 18
జనార్దనా! నీవు వక్తవై, విదురుడు శ్రోతయై అర్థసాధనకు ప్రయత్నిస్తే దారిలోపడని కార్యమేముంటుంది? (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి నకులవాక్యే అశీతితమోఽధ్యాయః॥ 80 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున నకులవాక్యమను ఎనుబదియవ అధ్యాయము. (80)