65. అరువది అయిదవ అధ్యాయము
సంధికి అంగీకరింపుమని ధృతరాష్ట్రుడు పుత్రునకు చెప్పుట.
ధృతరాష్ట్ర ఉవాచ
దుర్యోధన విజానీహి యత్ త్వాం వక్ష్యామి పుత్రక।
ఉత్పథం మన్యసే మార్గమ్ అనభిజ్ఞ ఇవాధ్వగః॥ 1
ధృతరాష్ట్రుడు అన్నాడు. పుత్రా! దుర్యోధనా! నేను చెప్పేది తెలుసుకో. త్రోవ తెలియని బాటసారి లాగా నీవు అపమార్గాన్ని సన్మార్గం అనుకుంటున్నావు.(ధర్మమార్గం అతి క్రమిస్తున్నావు) (1)
పంచానాం పాండుపుత్రాణాం యత్త్జః ప్రజిహీర్షసి।
పంచానామివ భూతానాం మహతాం లోకధారిణామ్॥ 2
లోకములకు ఆధారమయిన పంచభూతాలవంటివారు పంచపాండవులు. వారి తేజస్సును నీవు అపహరించాలనుకొంటున్నావు. (ఇది సాధ్యమా?) (2)
యుధిష్ఠిరం హి కౌంతేయం వరం ధర్మ మిహాస్థితమ్।
పరాం గతిమసంప్రేత్య న త్వం జేతు మిహార్హసి॥ 3
కుంతీనందనుడు యుధిష్ఠిరుడు ఉత్తమ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు. నీవు మరణం పొందకుండా అతనిని ఇక్కడ జయించలేవు. (3)
భీమసేనం చ కౌంతేయం యస్య నాస్తి సమో బలే।
రణాంతకం తర్జయసే మహావాత మివ ద్రుమః॥ 4
కుంతీనందనుడు భీమునికి బలంలో సమానుడెవరూ లేరు. అతడు యుద్ధంలో యముడే. మహాబలుడయిన వాయువును చెట్టు బెదిరించినట్లు నీవు భీముని బెదరిస్తున్నావు. (4)
సర్వశస్త్రభృతాం శ్రేష్ఠం మేరుం శిఖరిణా మివ।
యుధి గాండీవధన్వానం కో ను యుద్ధ్యేత బుద్ధిమాన్॥ 5
శత్రం పట్టిన వారందరిలో అర్జునుడు శ్రేష్ఠుడు. పర్వతాల్లో మేరువు వంటివాడు. ఆ గాండీవధారిని యుద్ధంలో బుద్ధి గలవాడెవడు ఎదుర్కొంటాడు? (5)
ధృష్టద్యుమ్నశ్చ పాంచాల్యః కమివాద్య న శాతయేత్।
శత్రుమధ్యే శరాన్ ముంచన్ దేవరాడశనీమివ॥ 6
పాంచాలరాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినట్లు శత్రుమధ్యంలో బాణాలు వేస్తూ ఎవరిని నరకకుండా ఉంటాడు? (6)
సాత్యకిశ్చాపి దుర్ధర్షః సంమతోఽంధకవృష్ణిషు।
ధ్వంసయిష్యతి తే సేవాం పాండవేయహితే రతః॥ 7
సాత్యకి ఎదిరింపరానివాడు. అంధక వృష్ణివంశాల్లో గణింపదగ్గవాడు. పాండవులకు హితం చేయాలనుకొనేవాడు. అతడు నీ సేనను ధ్వంసం చేస్తాడు. (7)
యః పునః ప్రతిమానేన త్రీన్ లోకానతిరిచ్యతే।
తం కృష్ణం పుండరీకాక్షం కో ను యుద్ధ్యేత బుద్ధిమాన్॥ 8
పోలిస్తే మూడు లోకాల్నీ మించిపోయే (తెల్లతామరల వంటి కనులుకల) కృష్ణుని ఏ తెలివైనవాడు ఎదిరించగలడు? (8)
ఏకతో హ్యస్య దారాశ్చ జ్ఞాతయశ్చ సబాంధవాః।
ఆత్మా చ పృథివీ చేయమ్ ఏకతశ్చ ధనంజయః॥ 9
ఆ కృష్ణుడికి భార్యలు. జ్ఞాతులు, బంధువులు, తాను, ఈ భూమి అన్నీ ఒక ఎత్తు, అర్జునుడొక్కడూ ఒక ఎత్తు. (9)
వాసుదేవోఽపి దుర్ధర్షః యతాత్మా యత్ర పాండవః।
అవిషహ్యం పృథివ్యాఽపి తద్బలం యత్ర కేశవః॥ 10
సంయమం కల అర్జునుడున్న చోటనే అసాధ్యుడయిన వాసుదేవుడుంటాడు. కృష్ణుడున్న వైపు బలాన్ని భూమి కూడా భరించలేదు. (10)
తిష్ఠ తాత సతాం వాక్యే సుహృదామర్థవాదినామ్।
వృద్ధం శాంతనవం భీష్మం తితిక్షస్వ పితామహమ్॥ 11
నాయనా! మన మేలు కోరే సజ్జనుల మాటను పాటించు. పెద్దవాడు, శంతనుకుమారుడు, నీ తాత అయిన భీష్ముని సహించు. (11)
మాం చ బ్రువాణం శుశ్రూష కురూణామర్థదర్శినమ్।
ద్రోణం కృపం వికర్ణంచ మహారాజం చ బాహ్లికమ్॥ 12
ఏతే హ్యపి యథైవాహం మంతుమర్హసి తాంస్తథా।
సర్వే ధర్మవిదోహ్యేతే తుల్యస్నేహాశ్చ భారత॥ 13
కౌరవుల హితం చెప్పే నన్ను, ద్రోణుని, కృపుని, వికర్ణుని, మహారాజు బాహ్లికుని, ఆదరించు, వీరంతా నావంటి వారే అని భావించు. అందరూ ధర్మవేత్తలే. నాతో సమానమైన స్నేహం నీ మీద కలవారే. (12,13)
యత్తద్విరాటనగరే సహభ్రాతృభిరగ్రతః।
ఉత్సృజ్య గాః సుసంత్రస్తం బలం తే సమశీర్యత॥ 14
విరాటనగరంలో నీ సోదరులతో పాటు సేన అంతా ఆవుల్ని వదలి చాలా భయపడి చెల్లాచెదరయింది. (14)
యచ్చైవ నగరే తస్మిన్ శ్రూయతే మహదద్భుతమ్।
ఏకస్య చ బహూనాం చ పర్యాప్తం తన్నిదర్శనమ్॥ 15
అదే పట్టణంలో ఒక్క(అర్జును)నికి చాలా మందితో జరిగిన అద్భుత సన్నివేశం విన్నాం గదా! ఆ నిదర్శనం చాలు. (15)
అర్జున స్తత్తథాఽకార్షీత్ కిం పునః సర్వ ఏవ తే।
స భ్రాతౄ నభిజానీహి వృత్త్యా తం ప్రతిపాదయ॥ 16
ఆ పని అంతా అర్జునుడొక్కడే చేశాడు. ఇక అందరూ కలిస్తే వేరే చెప్పాలా?ఆ సోదరులను తెలుసుకో. అతనిని (ధర్మజుని) వృత్తితో సత్కరించు. (16)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి దృతరాష్ట్ర వాక్యే పంచషష్టితమోఽధ్యాయ॥ 65 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రవాక్యమను అరువది అయిదవ అధ్యాయము. (65)