64. అరువది నాలుగవ అధ్యాయము
జ్ఞాతి విరోధము తగదని విదురుడు బోధించుట.
విదుర ఉవాచ
శకునీనామిహార్థాయ పాశం భూమావయోజయత్।
కశ్చిచ్ఛాకునికస్తాత పూర్వేషామితి శుశ్రుమ॥ 1
విదురుడు చెప్పాడు. నాయనా! ఇది నేను పూర్వుల నుండి విన్నాను. బోయవాడొకడు పక్షుల్ని పట్టుకొనడానికి నేలమీద వల పన్నాడు. (1)
తస్మిన్ ద్వే శకునౌ బద్ధౌ యుగపత్సహచారిణౌ।
తావుపాదాయ తం పాశం జగ్మతుః ఖచరావుభౌ॥ 2
కలిసి తిరిగే పక్షులు రెండు ఒక్కసారిగా అందుకోపడ్డాయి. వెంటనే అవి రెండూ ఆ వలను ఎత్తుకొని ఆకాశానికి ఎగిరి పోయాయి. (2)
తౌ విహాయసమాక్రాంతౌ దృష్ట్వా శాకునికస్తదా।
అన్వధావదనిర్విణ్ణో యేన యేన స్మ గచ్ఛతః॥ 3
ఎగిరిపోతున్న పక్షుల్ని బోయవాడు చూసి, అవి వెళ్లే చోటికి నిరాశపడకుండ వెంటపడ్డాడు. (3)
తథా తమనుధావంతం మృగయం శకునార్థినమ్।
ఆశ్రమస్థో మునిః కశ్చిద్ దదర్శాథ కృతాహ్నికః॥ 4
అలా పక్షుల కోసం వెంటపడి పరుగెత్తే బోయవానిని ఒక ఆశ్రమంలోని ముని ఒకడు చూశాడు. అప్పుడే అతడు పగటి అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. (4)
తావంతరిక్షగౌ శీఘ్రమ్ అనుయాంతం మహీచరమ్।
శ్లోకేనానేన కౌరవ్య పప్రచ్ఛ స మునిస్తదా॥ 5
పైన ఆకాశంలో వేగంగా పోయే పక్షుల్నీ, క్రింద వెంటపడిపోతున్న బోయవానిని చూసి ఈ శ్లోకంతో ఇలా పలుకరించాడు. (5)
విచిత్రమిదమాశ్చర్యం మృగవాన్ ప్రతిభాతి మే।
ప్లవమానౌ హి ఖచరౌ పదాతిరనుధావసి॥ 6
బోయవాడా! ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది నాకు. పక్షులు ఆకాశంలో ఎగిరిపోతున్నాయి.- నీవేమో నేలమీద వెంటాడుతున్నావు. (6)
శాకునిక ఉవాచ
పాశమేకముఖావేతౌ సహితౌ హరతో మమ।
యత్ర వై వివదిష్యేతే తత్ర మే వశమేష్యతః॥ 7
బోయవాడిట్లు చెప్పాడు. ఇవి రెండూ కలిసి ఒకే అభిప్రాయంతో నావల ఎత్తుకొని పోతున్నాయి. ఎక్కడ అభిప్రాయ భేదంతో వాదులాడుకొంటాయో అక్కడ(క్రిందపడి) నాకు వశమవుతాయి. (7)
విదుర ఉవాచ
తౌ వివాద మనుప్రాప్తౌ శకునౌ మృత్యుసంధితౌ।
విగృహ్య చ సుదుర్బుద్ధీ పృథివ్యాం సన్నిపేతతుః॥ 8
విదురుడిలా అన్నాడు. అలాగే ఆ పక్షులకు మృత్యువు దగ్గరపడి వివాదం కలిగింది. ఏమాత్రం తెలివిలేని ఆ పక్షులు రెండూ నేలమీద పడ్డాయి. (8)
తౌ యుద్ధ్యమానౌ సంరబ్ధౌ మృత్యుపాశవశానుగౌ।
ఉపసృత్యాపరిజ్ఞాతః జగ్రాహ మృగహా తదా॥ 9
మృత్యుపాశానికి లోబడి ఆ పక్షులు రెండూ కోపంతో దెబ్బలాడుకొంటున్నాయి - ఇంతలో ఆ వేటగాడు తెలియకుండా (పక్షులకు) దగ్గరచేరి వాటిని పట్టుకున్నాడు. (9)
ఏవం యే జ్ఞాతయోఽర్థేషు మిథో గచ్ఛంతి విగ్రహమ్।
తేఽమిత్రవశమాయాంతి శకునావివ విగ్రహాత్॥ 10
దెబ్బలాడుకున్న ఈ పక్షుల వలె జ్ఞాతులు సంపద కోసం తమలో తాము కలహిస్తే వారు శత్రువులకు వశమవుతారు. (10)
సంభోజనం సంకథనం సంప్రశ్నోఽథ సమాగమః।
ఏతాని జ్ఞాతికార్యాణి న విరోధః కదాచన॥ 11
కలిసి భోజనం చేయడం, కలిసి సంభాషించుకోవడం, ఒకరియోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకోవడం, చక్కగా రాకపోకలు సాగించడం... ఇవి జ్ఞాతులు చేయదగిన పనులు - అంతే కాని ఎన్నడూ విరోధించకూడదు. (11)
యే స్మ కాలే సుమనసః సర్వే వృద్ధానుపాపతే।
సింహగుప్తమివారణ్యం అప్రధృష్యా భవంతి తే॥ 12
సమయానికి తగినట్లు మంచిమనసుతో కలిసి ఉంటూ, పెద్దలను సేవించే వారంతా సింహాలు రక్షించే అడవిలాగా ఇతరులకు వశంకాదు. (సింహాలుండే అడవిని ఎవరూ కొట్టలేరు) (12)
యేఽర్థం సతత మాసాద్య దీనా ఇవ సమాపతే।
శ్రియంతే సంప్రయచ్ఛంతి ద్విషద్భ్యో భరతర్షభ॥ 13
సతతమూ ధనం సంపాదించి దీనుల వలె ఉండేవాఉ శత్రువులకు తమ సంపదను చక్కగా ఇస్తారు. (13)
ధూమాయంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ।
దృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ॥ 14
ధృతరాష్ట్రా! జ్ఞాతులు విడివిడిగా ఉంటే కొరకంచులవలె పొగలు కక్కుతారు - కలిసి ఉంటే చక్కగా వెలుగుతారు (14)
ఇద మన్యత్ ప్రవక్ష్యామి యథా దృష్టం గిరౌ మయా।
శ్రుత్వా తదపి కౌరవ్య యథా శ్రేయస్తథా కురు॥ 15
ఒక కొండమీద నేను చూపిన సంఘటన మరొకటి చెపుతున్నాను - రాజా! అది కూడా విని ఏది మేలో అలా చెయ్యి. (15)
వయం కిరాతైః సహితాః గచ్ఛామో గిరిముత్తరమ్।
బ్రాహ్మణైర్దేవకల్పైశ్చ విద్యాజంభకవార్తికైః॥ 16
మేము ఒకసారి మంత్రాలను గురించి, ఓషధులను గురించి చెప్పే దేవసమానులయిన బ్రాహ్మణులతోను, బోయవారితోను కలిసి ఉత్తరాన్ ఉన్న కొండ దగ్గరకు వెడుతున్నాము. (16)
కుంజభూతం గిరిం సర్వమ్ అభితో గంధమాదనమ్।
దీప్తమానౌషధిగణం సిద్ధగంధర్వసేవితమ్॥ 17
అది గంధమాదన పర్వతం - చుట్టూరా పొదలూ, దివ్యమయిన ఓషధులూ ఉన్నాయి - సిద్ధులూ గంధర్వులూ తిరిగే ఆ చోటుకు మేము చేరాము. (17)
తత్రాపశ్యామ వై సర్వే మధుపీతకమాక్షికమ్।
మరుప్రపాతే విషమే నివిష్టం కుంభసమ్మితమ్॥ 18
అక్కడ మేమంతా ఒక తేనె పట్టును చూశాము. ఎగుడు దిగుడుగా ఉన్న ఒక కొండలోయలో పట్టింది. పెద్ద కుండంత ఉంది ఆ తేనెపట్టు. (18)
ఆశీవిషై రక్ష్యమాణం కుబేరదయితం భృశమ్।
యత్ప్రాప్య పురుషో మర్త్యోఽప్యమరత్వం నియచ్ఛతి॥ 19
దాన్ని పాములు చుట్టుముట్టి ఉన్నాయి. అది కుబేరునికి చాలా ఇష్టం. దాన్ని త్రాగితే మానవునికి మరణం ఉండదట. (19)
అచక్షుర్లభతే చక్షుః వృద్ధో భవతి వై యువా।
ఇతి తే కథయంతి స్మ బ్రాహ్మణా జంభసాధకాః॥ 20
గ్రుడ్డివానికి కళ్లు వస్తయిట - ముసలివాడు యువకుడవుతాడుట. ఓషధీ సాధకులయిన బ్రాహ్మణులు అలా చెప్పారు. (20)
తతః కిరాతా స్తద్దృష్ట్వా ప్రార్థయంతో మహీపతే।
వినేశుర్విషమే తస్మిన్ ససర్పే గిరిగహ్వరే॥ 21
ఆమాటలు విని కిరాతులా తేనె పట్టును చూసి దాన్ని కోరి పరుగెత్తి విషమయిన, పాములున్న ఆ కొండలోయలో పడి చచ్చిపోయారు. (21)
తథైవ తవ పుత్రోఽయం పృథివీమేక ఇచ్ఛతి।
మధు పశ్యతి సమ్మోహాత్ ప్రపాతం నానుపశ్యతి॥ 22
అలాగే నీకొడుకు భూమి అంతా ఒక్కడే అనుభవించాలనుకొంటున్నాడు. అజ్ఞానంతో తేనెపట్టునే చూస్తున్నాడుకాని లోయను/ పతనాన్ని చూడటం లేదు. (22)
దుర్యోధనీ యోద్ధుమనాః సమరే సవ్యసాచినా।
న చ పశ్యామి తేజోఽస్య విక్రమం వా తథావిధమ్॥ 23
దుర్యోధనుడు సవ్యసాచితో యుద్ధం చేయాలనుకొంటున్నాడు. ఆ అర్జునుని తేజస్సు, అటువంటి పరాక్రమమూ ఎక్కడా చూడను. (23)
ఏకేన రథమాస్థాయ పృథివీ యేన నిర్జితా।
భీష్మద్రోణప్రభృతయః సంత్రప్తాః సాధుయాయినః॥ 24
విరాటనగరే భగ్నాః కిం తత్ర తవ దృశ్యతామ్।
ప్రతీక్షమాణో యో వీరః క్షమతే వీక్షితం తవ॥ 25
ఒక్క రథ సహాయంతో అర్జునుడు భూమిని గెలిచాడు. విరాటనగరంలో భీష్మద్రోణాదులంతా భయపడి అవమాన పడ్డారు. నీకక్కడ చూసేందుకు ఏముంది? ఆ నీ చూపును ఎదురు చూసే వీరుడే(కర్ణుడే) చూడగలడులే! (24,25)
ద్రుపదో మత్స్యరాజశ్చ సంక్రుద్ధశ్చ ధనంజయః।
న శేషయేయుః సమరే వాయుయుక్తా ఇవాగ్నయః॥ 26
ద్రుపదుడు, విరాటుడు, అర్జునుడు వీరంతా వాయువుతో కూడిన అగ్నులవలె యుద్ధంలో ఏమీ మిగల్చరు. (రణశేషం ఉంచరు) (26)
అంకే కురుష్వ రాజానం ధృతరాష్ట్ర యుధిష్ఠిరమ్।
యుధ్యతోర్హి ద్వయోర్యుద్ధే నైకాంతేన భవేజ్జయః॥ 27
ధృతరాష్ట్ర రాజయిన యుధిష్ఠిరుని ఒడిలో కూర్చుండబెట్టుకో! యుద్ధం చేసే ఇద్దరిలో ఎప్పుడూ ఒక్కనికే జయం లభించదు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి విదుర వాక్యే చతుష్షషష్టితమోఽధ్యాయ॥ 64 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున విదుర వాక్యమను అరువది నాల్గవ అధ్యాయము. (64)