40. నలువదియవ అధ్యాయము
విదురుడు ధర్మమహత్త్వమును చెప్పుట.
విదుర ఉవాచ
యో ఽభ్యర్చితః సద్భిరసజ్జమానః
కరోత్యర్థం శక్తిమహాపయిత్వా।
క్షిప్రం యశస్తం సముపైతి సంతమ్
అలం ప్రసన్నాహి సుఖాయ సంతః॥ 1
విదురుడిట్లన్నాడు. సజ్జనులు అడిగితే గర్వించకుండా శక్తి వంచన లేకుండా కార్యం ముగించిన సుజనునికి వెంటనే కీర్తి లభిస్తుంది. ఎందుచేత నంటే సజ్జనుల అనుగ్రహం సుఖం కలిగిస్తుంది. (1)
మహాంతమప్యర్థమధర్మయుక్తం
యః సంత్యజత్యనపాకృష్ట ఏవ।
సుఖం సుదుఃఖాన్యవముచ్య శేతే
జీర్ణాం త్వచం సర్ప ఇవావముచ్య॥ 2
ఎంతగొప్ప పనిఅయినా ధర్మవిరుద్ధమయితే ఇతరులు వద్దనకుండానే విడిచిపెట్టేవాడు కుబుసాన్ని విడిచిన పాములాగా దుఃఖాలను విడిచి సుఖంగా నిద్రిస్తాడు. (2)
అనృతే చ సముత్కర్షః రాజగామి చ పైశునమ్।
గురోశ్చాలీకనిర్బంధః సమాని బ్రహ్మహత్యయా॥ 3
అసత్యం వల్ల పొందిన గెలుపు, రాజుసొమ్ము మీద దురాశ, గురువులను, (తల్లి తండ్రి గురువు మొ॥ వారిని) నెపంతో నిర్బంధించటం ఈ మూడు బ్రహ్మహత్యతో సమానమయినవి. (3)
అసూయైకపదం మృత్యుః అతివాదః శ్రియో వధః।
అశుశ్రూషా త్వరా శ్లాఘా విద్యాయాః శత్రవస్త్రయః॥ 4
అసూయ ఒక్క అంగలో వచ్చే మృత్యువు. అతిగా మాట్లాడటం సంపదను హత్యచేయడమే. గురుశుశ్రూష లేకపోవడం, తొందరపాటు, ఆత్మస్తుతి ఈ మూడూ విద్యకు శత్రువులు. (4)
ఆలస్యం మదమోహౌ చ చాపలం గోష్ఠిరేవ చ।
స్తబ్ధతా చాతిమానిత్వం తథాత్యాగిత్వ మేవ చ।
ఏతే వై సప్తదోషాః స్యుః విద్యార్థినాం మతాః॥ 5
సోమరితనం, మదమోహాలు, చపలత్వం, వ్యర్థప్రసంగాలు, ఔద్ధత్యం, దురభిమానం, లోభం అనే ఏడూ విద్యార్థుల దోషాలు. ఇవి విడిచిపెట్టాలి. (5)
సుఖార్థినః కుతో విద్య నాస్తి విద్యార్థినః సుఖమ్।
సుఖార్థీ వా త్యజే ద్విద్యాం విద్యార్థీ వా త్యజేత్ సుఖమ్॥ 6
సుఖం కోరేవాడికి విద్య ఎక్కడి నుండి వస్తుంది? విద్యార్థికి సుఖం లేదు. సుఖం కావాలనుకుంటే విద్యను త్యజించాలి. విద్య కావాలనుకుంటే సుఖం త్యజించాలి. (6)
నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం నాపగానాం మహౌదధిః।
నాంతకః సర్వభూతానాం న పుంసాం వామలోచనా॥ 7
కట్టెలతో అగ్ని సంతృప్తి చెందదు. నదులతో సముద్రం, ప్రాణులతో యముడు, పురుషులతో స్త్రీ తృప్తిపడరు. (7)
ఆశా ధృతిం హంతి సమృద్ధిమంతకః
క్రోధః శ్రియం హంతి యశః కదర్యతా।
అపాలనం హంతి పశూంశ్చ రాజన్
ఏకః క్రుద్ధో బ్రాహ్మణో హంతి రాష్ట్రమ్॥ 8
రాజా! ఆశ ధైర్యాన్ని చంపుతుంది. యముడు పుత్రకళత్ర సమృద్ధిని చంపుతాడు. కోపం సంపదను చంపుతుంది. లోభం కీర్తిని చంపుతుంది. అపాలనం(రక్షణలేకుండుట) పశువులను చంపుతుంది. కోపించిన ఒకే ఒక బ్రాహ్మణుడు రాష్ట్ర మంతటినీ చంపుతాడు. (8)
అజాశ్చ కాంస్యం రజతం చ నిత్యం
మధ్వాకర్షః శకునిః శ్రోత్రియశ్చ।
వృద్ధో జ్ఞాతిరవసన్నః కులీనః
ఏతాని తే సంతు గృహే సదైవ॥ 9
మేకలు, కంచు, వెండి, తేనె, విషాన్ని హరించే మణి, పక్షి, వేదవేత్త, వృద్ధుడయిన జ్ఞాతి, ధనహీనుడయిన కులీనుడు, ఎల్లపుడు ఇంటిలో ఉండాలి. (9)
అజోక్షా చందనం వీణా ఆదర్శో మధు సర్పిషీ।
విషమౌదుంబరం శంఖః స్వర్ణనాభో ఽథ రోచనా॥ 10
గృహే స్థాపయితవ్యాని ధన్యాని మనురబ్రవీత్।
దేవబ్రాహ్మణపూజార్థం అతిథీనాం చ భారత॥ 11
మేక, ఎద్దు, మంచిగంధం, వీణ, అద్దం, తేనె, నెయ్యి, జలం, రగిపాత్రలు, శంఖం, సాలగ్రామం, గోరోచనం, ఈ మంగళ ద్రవ్యాలు దేవ, బ్రాహ్మణ, అతిథుల పూజకోసం ఇంటిలో ఉంచుకోవాలి. అని మవువు చెప్పాడు. (10,11)
ఇదం చ త్వాం సర్వపరం బ్రవీమి
పుణ్యం పదం తాత మహావిశిష్టమ్।
న జాతు కామాన్న భయాన్న లోభాత్
ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః॥ 12
నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే
జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః।
త్యక్త్వానిత్యం ప్రతితిష్ఠస్వ నిత్యే
సంతుష్య త్వం తోషపరో హి లాభః॥ 13
ఇదిగో! అన్నిటికంటె ఉత్తమం, చాలా విశిష్టమైనది పుణ్యప్రదమూ అయిన మాట చెపుతున్నాను. కామం వల్లకాని, భయం వల్లకాని, లోభం వల్లకాని, చివరకు ప్రాణం పోతున్నాసరే ధర్మం విడిచిపెట్టకూడదు. (ఎందుకంటే) ధర్మం నశించదు. సుఖ దుఃఖాలు నశించిపోతాయి. జీవుడు నిత్యుడు, (జీవుడిక్కడికి రావటానికి) కారణం మాత్రం అనిత్యం. అనిత్యం విడిచిపెట్టి నిత్యం మీద నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. సంతోషం పొందు. లాభమంటే చివరకు సంతోషమే గదా! (12,13)
మహాబలాన్ పశ్య మహానుభావాన్
ప్రశాస్య భూమిం ధనధాన్యపూర్ణామ్।
రాజ్యాని హిత్వా విపులాంశ్చ భోగాన్
గతాన్నరేంద్రాన్ వశమంతకస్య॥ 14
చూడు! ఎంతోమంది బలవంతులు మహానుభావులు ధనధాన్యసంపన్నమయిన భూమిని పరిపాలించి, చివరకు రాజ్యాలను గొప్ప భోగాలను వదిలి యమునికి వశమై పోయారు. (14)
మృతం పుత్రం దుఃఖపుష్టం మనుష్యాః
ఉత్ క్షిప్య రాజన్ స్వగృహాన్ నిర్హరంతి।
తం ముక్తకేశాః కరుణం రుదంతి
చితామధ్యే కాష్ఠమివ క్షిపంతి॥ 15
ఎంతోకష్టపడి పెంచిన కొడుకు చచ్చిపోతే మానవులు తమ యిళ్లల్లో నుండి(వారి శవాలను) బయటకు ఎత్తి పారేస్తున్నారు. వాని కోసం జుట్టు విరబోసుకొని జాలిగా ఏడుస్తూనే చితిమధ్య కట్టెలాగా పడవేస్తున్నారు. (15)
అన్యో ధనం ప్రేతగతస్య భుంక్తే
వయాంసి చాగ్నిశ్చ శరీరధాతూన్।
ద్వాఖ్యామయం సహగచ్ఛత్యముత్ర
పుణ్యేన పాపేన చ వేష్ట్యమానః॥ 16
చనిపోయిన వాని ధనం మరొకడు తింటున్నాడు. వాడి శరీర ధాతువులను పక్షులూ, అగ్నీ తింటున్నాయి. కాని జీవుడు మాత్రం పుణ్యం పాపం అనే రెంటితో చుట్టు కొని పరలోకానికి పోతున్నాడు. (16)
ఉత్సృజ్య వినివర్తంతే జ్ఞాతయః సుహృదః సుతాః।
అపుష్పానఫలాన్ వృక్షాన్ యథా తాత పతత్రిణః॥ 17
పూలు పండ్లు లేని చెట్లను పక్షులు వదిలిపోయినట్లు జ్ఞాతులు, స్నేహితులు, కొడుకులు చనిపోయిన వానిని వదిలి వెనుదిరిగి పోతారు. (17)
అగ్నౌ ప్రాప్తంతు పురుషం కర్మాన్వేతి స్వయం కృతమ్।
తస్మాత్తు పురుషో యత్నాత్ ధర్మం సంచినుచ్ఛనైః॥ 18
చితిలో పడిన మానవుని తాను చేసుకొన్న కర్మ ఒక్కటే అనుసరించి వస్తుంది. అందుచేతనే మానవుడు ప్రయత్నం చేసి మెల్లమెల్లగా ధర్మం కూడబెట్టుకోవాలి. (18)
అస్మాల్లోకాదూర్ధ్వమముష్య చాధః
మహత్తమస్థిషాతి హ్యంధకారమ్।
తద్వై మహామోహన మింద్రియాణాం
బుద్ధ్యస్వ మా త్వాం ప్రలభేత రాజన్॥ 19
ఈ లోకానికి పైని, పరలోకానికి క్రింద పెద్ద్ చీకటి ఉంది. అదే మన ఇంద్రియాలను బాగా మోహపెడుతుంది. రాజా! తెలుసుకో. అది నిన్ను పొందకుండునుగాక. (19)
ఇదం వచః శక్ష్యసి చేద్యథావత్
నిశమ్య సర్వం ప్రతిపత్తుమేవ।
యశః పరం ప్రాప్స్యసి జీవలోకే
భయం న చాముత్ర న చేహ తేఽస్తి॥ 20
ఈ మాట నీవు విని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోగలిగితే నీకు జీవలోకంలో గొప్ప కీర్తి కలుగుతుంది. ఇహ పరాలు రెండిట నీకు భయం ఉండదు. (20)
ఆత్మా నదీ భారత పుణ్యతీర్థా
సత్యోదకా ధృతికూలా దయోర్మిః।
తస్యాం స్నాతః పూయతే పుణ్యకర్మా
పుణ్యోహ్యాత్మా నిత్యమలోభ ఏవ॥ 21
ధృతరాష్ట్రా! ఆత్మ అనేది ఒకనది. పుణ్యం దాణి రేవు. సత్యం దాని నీరు. ధైర్యం దాని ఒడ్డు. దయయే కెరటం. అందులో స్నానం చేసిన పుణ్య కర్ముడు పవిత్రుడవుతాడు. పుణ్యసహితమయిన ఆత్మ అంటే ఎల్లపుడూ లోభం లేక పోవడమే. (21)
కామక్రోధగ్రాహవతీం పంచేంద్రియజలాం నదీమ్।
నావం ధృతిమయీం కృత్వా జన్మదుర్గాణి సంతర॥ 22
కామక్రోధాలనే మొసళ్లు, పంచేంద్రియాలనే నీరూ కల నదిని ధైర్యపూర్ణమయిన నావను చేపట్టి జన్మకష్టాలను దాటుము. (22)
ప్రజ్ఞావృద్ధం ధర్మవృద్ధం స్వబంధుం
విద్యావృద్ధం వయసా చాపి వృద్ధమ్।
కార్యాకార్యే పూజయిత్వ ప్రసాద్య
యః సంపృచ్ఛేన్న సముహ్యేత్ కదాచిత్॥ 23
ప్రజ్ఞచేత, ధర్మంచేత, విద్యచేత, వయసుచేత వృద్ధుడయిన తన బంధువును పూజించి ప్రసన్నుని చేసికొని కర్తవ్యాకర్తవ్యాలు అడిగే వాడు ఎప్పుడూ పొరపడడు. (23)
ధృత్వా శిశ్నోదరం రక్షేత్ పాణిపాదం చ చక్షుషా।
చక్షుః శ్రోత్రే చ మనసా మనో వాచం చ కర్మణా॥ 24
ధైర్యంతో గుహ్యాన్ని, పొట్టను రక్షించుకోవాలి. అలాగే కాలుచేతులను కంటితో; కన్ను, చెవులను మనసుతో; మనస్సును, మాటను సత్కర్మతోను రక్షించుకోవాలి. (24)
విత్యోదకీ నిత్యయజ్ఞోపవీతీ
నిత్యస్వాధ్యాయీ పతితాన్నవర్జీ।
సత్యం బ్రువన్ గురవే కర్మ కుర్వన్
న బ్రాహ్మణః చ్యవతే బ్రహ్మలోకాత్॥ 25
నిత్యమూ స్నానసంధ్యాదులాచరిస్తూ యజ్ఞోపవీతము ధరించినవాడు, నిత్యమూ వేదాధ్యయనం చేసేవాడు, పతితుల అన్నం తిననివాడు, సత్యమే పలికేవాడు, గురుశుశ్రూష చేసేవాడు. ఈ లక్షణాలు కల బ్రాహ్మణుడు బ్రహ్మలోకం నుండి పతనం చెందడు. (25)
అధీత్య వేదాన్ పరిసంస్తీర్య చాగ్నీన్
ఇష్ట్వా యజ్ఞై పాలయిత్వా ప్రజాశ్చ।
గో బ్రాహ్మణార్థం శస్త్రపూతాంతరాత్మా
హతః సంగ్రామే క్షత్రియః స్వర్గమేతి॥ 26
వేదాధ్యయనం చేసి, అగ్నికి నాలుగు వైపుల దర్భలు పరచి యజ్ఞాలు చేసి, ప్రజలను పరిపాలించి, శస్త్రాలతో పవిత్ర మయిన అంతరంగంతో గోబ్రాహ్మణుల కోసం యుద్ధంలో చనిపోయిన క్షత్రియుడు స్వర్గం పొందుతాడు. (26)
వైశ్యోఽధీత్య బ్రాహ్మణాన్ క్షత్రియాంశ్చ
ధనైః కాలే సంవిభజ్యాశ్రితాంశ్చ।
త్రేతాపూతం ధూమమాఘ్రాయ పుణ్యం
ప్రేత్య స్వర్గే దివ్యసుఖాని భుంక్తే॥ 27
వైశ్యుడు వేదశాస్త్రాధ్యయనం చేసి, బ్రాహ్మణులను, క్షత్రియులను, తన్ను ఆశ్రయించుకొన్న వారిని, సమయంలో ధనంతో ఆదుకొని, త్రేతాగ్ని ధుమం ఆఘ్రాణించే పుణ్యమూర్తియై, మరణించి స్వర్గంలో దివ్య సుఖాలు అనుభవిస్తాడు. (27)
బ్రహ్మక్షత్రిం వైశ్యవర్ణం చ శూద్రః।
క్రమేణైతాన్ న్యాయతః పూజయానః।
తుష్టేష్వేతేష్వవ్యథో దగ్ధపాపః
త్యక్త్వా దేహం స్వర్గసుఖాణి భుంక్తే॥ 28
బ్రహ్మక్షత్రియ వైశ్యుల్ని న్యాయబద్ధంగా గౌరవిస్తూ తృప్తిపరుస్తూ పాపక్షాళనం చేసుకుంటూ సుఖంగా శరీరం వదిలి వెళ్ళిపోయిన శూద్రుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు. (28)
చాతుర్వర్ణ్యస్యైష ధర్మస్తవోక్తః
హేతుం చానుబ్రువతో మే నిబోధ।
క్షాత్రాద్ ధర్మాత్ హీయతే పాండుపుత్రః
తం త్వం రాజన్ రాజధర్మే నియుంక్ష్వ॥ 29
నాలుగు వర్ణాల ధర్మాలూ నీకు చెప్పాను. కారణం చెపుతా విను. ధర్మరాజు క్షత్రియధర్మంనుండి తొలగి ఉన్నాడు. రాజా! నీ వాతనిని రాజధర్మంలో నియోగించు. (29)
ధృతరాష్ట్ర ఉవాచ
ఏవమేతద్ యథా త్వం మామనుశాససి నిత్యదా।
మమాపి చ మతిః సౌమ్య భవత్యేవం యదాత్థ మామ్॥ 30
ధృతరాష్ట్ర డిట్లన్నాడు. నీవు నాకు సదా ఉపదేశం చేస్తూనే ఉన్నావు. నీవు చెప్పినట్లే నా బుద్ధికి కూడా అలాగే అనిపిస్తుంది. (30)
శతు బుద్ధిః కృతాప్యేవం పాండవాన్ ప్రతి మే సదా।
దుర్యోధనం సమాసాద్య పునర్విపరివర్తతే॥ 31
పాండవులను గురించి నాకు ఎల్లపుడూ అదే బుద్ధి కలుగుతూ ఉంటుంది. కాని దుర్యోధనుని కలిశాక మళ్లీ మారిపోతుంది. (31)
న దిష్టమప్యతిక్రాంతుం శక్యం భూతేన కేనచిత్।
దిష్టమేవ ధ్రువం మన్యే పౌరుషం తు నిరర్థకమ్॥ 32
ఏ ప్రాణికీ కూడా దైవాన్ని దాట శక్యం కాదు. అందుచేత దైవమే స్థిరమైనది. పురుషప్రయత్నం వ్యర్థమయినదని నా భావన. (32)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి ప్రజాగరపర్వణి విదురవాక్యే చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున ప్రజాగరపర్వమను ఉపపర్వమున
విదుర వాక్యమను నలువదియవ అధ్యాయము. (40)