39. ముప్పది తొమ్మిదవ అధ్యాయము
విదురుడు ధృతరాష్ట్రునకు నీతినుపదేశించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
అనీశ్వరోఽయం పురుషో భవాభవే
సూత్రప్రోతా దారుమయీవ యోషా।
ధాత్రా తు దిష్టస్య వశే కృతోఽయం
తస్మాద్ వద త్వం శ్రవణే ధృతోఽహమ్॥ 1
ధృతరాష్ట్రుడిట్లన్నాడు. కలిమిలేముల విషయంలో మానవుడు స్వతంత్రుడు కాడు. త్రాటిలో లాగబడే కొయ్య బొమ్మలాంటివాడు. బ్రహ్మ దానిని దైవానికి వశం చేశాడు. అందుచేత నీవు చెపుతూ ఉండు. నేను వింటూ ఉంటాను. (1)
విదుర ఉవాచ
అప్రాప్తకాలం వచనం బృహస్పతి రపి బ్రువన్।
లభతే బుద్ధ్యవజ్ఞానమ్ అవమానం చ భారత॥ 2
విదురుడిలా చెపుతున్నాడు. సమయానికి తగని మాట బృహస్పతి మాట్లాడినా అతడు బుద్ధిహీను డని పించుకొంటాడు. అవమానం పొందుతాడు. (2)
ప్రియో భవతి దానేన ప్రియవాదేన చాపరః।
మంత్రమూలబలేనాన్యః యః ప్రియః ప్రియ ఏవ సః॥ 3
ఒకడు దానం చేసి ప్రియుడవుతాడు. మరొకడు ప్రియంగా మాట్లాడి ప్రియుడవుతాడు. ఇంకొకడు మంత్రబలంచేతకాని మూలబలంచేతకాని ప్రియు డవుతాడు. కాని సహజంగా ప్రియమైనవాడు ఎపుడూ ప్రియుడే. (3)
ద్వేష్యో న సాధుర్భవతి న మేధావీ న పండితః।
ప్రియే శుభాని కార్యాణి ద్వేష్యే పాపాని చైవ హ॥ 4
మానవుడు ఎవరి నయినా ద్వేషిస్తే వానిలోని నేర్పరితనంకాని, తెలివితేటలు కాని, పాండిత్యం కాని పరిగణించడు. ప్రియునిలో అన్నీ మంచిపనులే కనిపిస్తాయి. శత్రువులలో అన్నీ పాపపు పనులు గానే గోచరిస్తాయి. (4)
ఉక్తం మయా జాతమాత్రేఽపి రాజన్
దుర్యోధనం త్యజ పుత్రం త్వమేకమ్।
తస్య త్యాగాత్ పుత్రశతస్య వృద్ధిః
అస్యాత్యాగాత్ పుత్రశతస్య నాశః॥ 5
రాజా! దుర్యోధనుడు పుట్టినపుడే చెప్పాను. "వీడిని ఒక్కడినీ విడిచిపెట్టు - వీడిని వదిలితే వందమంది పుత్రులు వృద్ధి చెందుతారు. వీడిని ఒక్కడినీ వదలకపోతే వందమంది పుత్రులూ నశిస్తారు" అని. (5)
న వృద్ధిర్బహు మంతవ్యా యా వృద్ధిః క్షయమావహేత్।
క్షయోఽపి బహుమంతవ్యః యః క్షయో వృద్ధిమావహేత్॥ 6
తరువాతి కాలంలో నశించి పోయే వృద్ధిని ఎక్కువగా భావించరాదు. అనంతర కాలంలో వృద్ధిని పొందే(ప్రస్తుత) తరుగుదలను కూడ ఎక్కువగా భావించాలి. (6)
న స క్షయో మహారాజ యః క్షయో వృద్ధిమావహేత్।
క్షయః సత్విహ మంతవ్యః యం లబ్ధ్వా బహు నాశయేత్॥ 7
మహారాజా! తరువాత వృద్ధి కలిగించే క్షయం క్షయం (క్రింద లెక్క) కాదు. కొద్దిగా వృద్ధిచెంది తరువాత మిక్కిలి నశింపజేసేదే క్షయ మనిపించుకొంటుంది. (7)
సమృద్ధా గుణతః కేచిత్ భవంతి ధనతోఽ పరే।
ధనవృద్ధాన్ గుణైర్హీనాన్ ధృతరాష్ట్ర వివర్జయ॥ 8
కొందరు సద్గుణాలతోనే సంపన్నులు, మరికొందరు ధనంతోనే సంపన్నులు - అందుచేత మహారాజా! ధనసంపన్నులై గుణహీనులయిన వారిని విడిచిపెట్టు. (8)
ధృతరాష్ట్ర ఉవాచ
సర్వం త్వమాయతీయుక్తం భాషసే ప్రాజ్ఞ సమ్మతమ్।
న చోత్సహే సుతం త్యక్తుం యతో ధర్మః తతో జయః॥ 9
ధృతరాష్ట్రుడిట్లన్నాడు. నీవు విద్వాంసు లంగీకరించేటట్లు భవిష్యత్తులో మేలు చేసే వానినే చెపుతున్నావు. కాని నేను కొడుకును విడవలేను. ధర్మం ఎటు ఉంటుందో జయమూ అటే ఉంటుంది. (9)
విదుర ఉవాచ
అతీవ గుణసంపన్నః న జాతు వినయాన్వితః।
సుసూక్ష్మమపి భూతానామ్ ఉపమర్దముపేక్షతే॥ 10
విదురు డిట్లన్నాడు. మిక్కిలి సద్గుణాలు, వినయమూ కలిగినవాడు ప్రాణులకు కలిగే కొద్దిపాటి కష్టాన్ని కూడా ఉపేక్షింపడు. (10)
పరాపవాదనిరతాః పరదుఃఖోదయేషు చ।
పరస్పరవిరోధే చ యతంతే సతతోత్థితాః॥ 11
సదోషం దర్శనం యేషాం సంవాసే సుమహద్ భయమ్।
అర్థాదానే మహాన్ దోషః ప్రదానే చ మహద్ భయమ్॥ 12
కొంతమంది పరులపై సతతమూ అపనిందలు వేస్తూ, దుఃఖం కలిగిస్తూ, పరస్పర విరోధాలు పెట్టటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని చూస్తేనే పాపం కలుగుతుంది. వారి నుండి ధనం తీసుకున్నా చాలా పాపం. వారికి ధనమివ్వటం చాలా భయం కలిగిస్తుంది. భయంకరమయినది. (11,12)
యే వై భేదనశీలాస్తు సకామా నిస్త్రపాః శఠాః।
యే పాపా ఇతి విఖ్యాతాః సంవాసే పరిగర్వితాః॥ 13
విరోధాలు, పెట్టేవారు, స్వార్థపరులు, సిగ్గులేనివారు, మూర్ఖులు, పాపపు పనులు చేసేవారు వీరితో సహవాసం విడిచి పెట్టాలి. (వీరితో కలిసి ఉండరాదు). (13)
యుక్తాశ్చాన్యైర్మహాదోషైః యే నరాః తాన్ వర్జయేత్।
నివర్తమానే సౌహార్దే ప్రీతిర్నీచే ప్రణశ్యతి॥ 14
యా చైవ ఫల నిర్వృత్తిః సౌహృదే చైవ యత్సుఖమ్।
మహాపాపాలు చేసే వారిని, వారితో సంబంధం కలవారిని విసర్జించాలి. స్నేహం తొలగిపోతే నీచునికి ప్రీతి నశించి పోతుంది. అంతే కాదు స్నేహఫలమ్Y, స్నేహ సుకమూ కూడా నశించి పోతాయి. (14 1/2)
యతతే చాపవాదాయ యత్నమారభతే క్షయే॥ 15
అల్పేప్యపకృతే మోహాత్ న శాంతిమధిగచ్ఛతి।
నీచుడు అపనిందలు వేసేందుకు ప్రయత్నిస్తాడు. మన వినాశానికి ప్రయత్నిస్తాడు. మోహంతో స్వల్పమయిన అపకారంతో శాంతించడు. (15 1/2)
తాదృశైః సంగతం నీచైః నృశంసైరకృతాత్మభిః॥ 16
నిశమ్య నిపుణం బుద్ధ్యా విద్వాన్ దూరాత్ వివర్జయేత్।
క్రూరులై, ఎదగని మనసులు కల నీచులతో స్నేహాన్ని తెలివైనవాడు బుద్ధితో ఆలోచించి దూరంగా వదలాలి. (16 1/2)
యో జ్ఞాతిమనుగృహ్ణాతి దరిద్రం దీన మాతురమ్॥ 17
స పుత్రపశుభిర్వృద్ధిం శ్రేయశ్చానంత్యమశ్నుతే।
దరిద్రుడు, దీనుడు, రోగాతురుడు అయిన జ్ఞాతిపట్ల అనుగ్రహం చూపేవాడు పుత్రవృద్ధినీ, పశువృద్ధినీ పొంది అనంతమయిన శ్రేయస్సునుకూడా పొందుతాడు. (17 1/2)
జ్ఞాతయో వర్ధనీయా స్తైః య ఇచ్ఛంత్యాత్మనః శుభమ్॥ 18
కులవృద్ధిం చ రాజేంద్ర తస్మాత్ సాధు సమాచర।
తనమేలు కోరేవాడు జ్ఞాతులనూ, కులాన్నీ వృద్ధిపొందించుకోవాలి. అందుచేత మహారాజా! ఆ పని చక్కగా చెయ్యి. (18 1/2)
శ్రేయసా యోక్ష్యతే రాజన్ కుర్వాణో జ్ఞాతిసత్క్రియామ్॥ 19
రాజా! జ్ఞాతులను సత్కరించేవానికి శ్రేయస్సు కలుగుతుంది. (19)
విగుణా హ్యపి సంరక్ష్యాః జ్ఞాతయో భరతర్షభ।
కిం పునర్గుణవంతస్తే త్వత్ప్రసాదాభికాంక్షిణః॥ 20
రాజా! జ్ఞాతులు గుణహీనులయినా రక్షింప దగిన వారే. సద్గుణవంతులై నీ అనుగ్రహం కోరే(పాండవుల) వారి మాట వేరుగా చెప్పాలా? (20)
ప్రసాదం కురు వీరాణాం పాండవానాం విశాంపతే।
దీయంతాం గ్రామకాః కేచిత్ తేషాం వృత్త్యర్థమీశ్వర॥ 21
రాజా! వీరు లయిన పాండవులపై అనుగ్రహం చూపించు. వారి జీవనానికి కొన్ని పల్లె లయినా ఇయ్యి. (21)
ఏవం లోకే యశః ప్రాప్తం భవిష్యతి నరాధిప।
వృద్ధేన హి త్వయా కార్యం పుత్రాణాం తాత శాసనమ్॥ 22
మహారాజా! ఇలా నీకు లోకంలో కీర్తి కలుగుతుంది. పెద్దవాడవయిన నీవు నీ కొడుకులను శాసించాలి. (22)
మయా చాపి హితం వాచ్యం విద్ధి మాం త్వద్ధితైషిణమ్।
జ్ఞాతిభిర్విగ్రహస్తాత న కర్తవ్యః శుభార్థినా।
సుఖాని సహభోజ్యాని జ్ఞాతిభిర్భరతర్షభ॥ 23
నేను కూడా నీకు హితమే చెప్పాలి. నేను నీకు శ్రేయోభిలాషి నని తెలుసుకో - శుభం కోరేవాడు జ్ఞాతులతో విరోధం పెట్టుకోరాదు. మహారాజా! సుఖాలు జ్ఞాతులతో కలసి అనుభవించాలి. (23)
సంభోజనం సంకథనం సంప్రీతిశ్చ పరస్పరమ్।
జ్ఞాతిభిః సహ కార్యాణి న విరోధః కదాచన॥ 24
కలిసి భోజనం చేయడం, కలిసి సంభాషించు కోవడం, కలిసి ప్రీతిగా పనులు చేసుకోవడం ఇవి జ్ఞాతులు చేయదగినవి. అంతేకాని ఎన్నడూ విరోధపడరాదు. (24)
జ్ఞాతయస్తారయంతీహ జ్ఞాతయో మజ్జయంతి చ।
సువృత్తాస్తారయంతీహ దుర్వృత్తా మజ్జయంతి చ॥ 25
జ్ఞాతులు తరింపజేస్తారు. ముంచేస్తారు కూడ. మంచి జ్ఞాతులు కష్టాలు తరింపజేస్తారు. దుర్మార్గం కల జ్ఞాతులు ముంచేస్తారు. (25)
సువృత్తో భవ రాజేంద్ర పాండవాన్ ప్రతి మానద।
అధర్షణీయః శత్రూణాం తైర్వృతస్త్వం భవిష్యసి॥ 26
రాజా! పాండవుల పట్ల మంచిగా ఉండు. వారితో కలసి ఉంటే శత్రువులు నిన్ను తిరస్కరించలేరు. ఎదిరించలేరు. (26)
శ్రీమంతం జ్ఞాతిమాసాద్య యో జ్ఞాతిరవసీదతి।
దిగ్ధహస్తం మృగ ఇవ స ఏనస్తస్య విందతి॥ 27
విషం పూసిన బాణంతో కొట్టబడిన మృగంలాగా శ్రీమంతుడయిన జ్ఞాతితో మరో జ్ఞాతి చితికి పోతే ఆ పాపం ఆ శ్రీమంతుడు పొందుతాడు. (27)
పశ్చాదపి నరశ్రేష్ఠ తవ తాపో భవిష్యతి।
తాన్ వా హతాన్ సుతాన్ వాపి శ్రుత్వా తదనుచింతయ॥ 28
రాజా! పాండవులలో నీ కొడుకులో చనిపోయాక నీకు తాపం కలుగుతుంది. దాన్ని ఆలోచించు. (28)
యేన ఖట్వాం సమారూఢః పరితప్యేత కర్మణా।
ఆదావేవ న తత్ కుర్యాత్ ఆధ్రువే జీవితే పతి॥ 29
నీవు చేసిన పనివల్ల నీవు మంచాన పడి పరితపించకూడదు. ముందుగానే ఆలోచించి ఆపని మానుకోవాలి. జీవితం శాశ్వతం కాదు గదా! (29)
న కశ్చిన్నాపనయతే పుమానన్యత్ర భార్గవాత్।
శేషసంప్రతిపత్తిస్తు బుద్ధిమత్స్యేవ తిష్ఠతి॥ 30
శుక్రాచార్యుడు తప్ప ఇంకెవరూ తప్పు చేయరని ఎక్కడా లేదు. అందరమూ ఎపుడో ఒకప్పుడు తప్పు చేస్తాం. కాని మిగిలిన పనిని గురించి మంచి చెడు విచారణ మాత్రం తెలివైన వారే చేస్తారు. (పొరపాటు పడినా తరువాత సరిదిద్దుకుంటారు). (30)
దుర్యోధనేన యద్యేతత్ పాపం తేషు పురాకృతమ్।
త్వయా తత్ కులవృద్ధేన ప్రత్యానేయం నరేశ్వర॥ 31
దుర్యోధనుడు పాండవులకు పూర్వంచేసిన అపకారం కులంలో పెద్దవయిన నీవు సరిదిద్ది ఉపకారం చెయ్యాలి. (31)
తాంస్త్వం పదే ప్రతిష్ఠాప్య లోకే విగతకల్మషః।
భవిష్యసి నరశ్రేష్ఠ పూజనీయో మనీషిణామ్॥ 32
పాండవులను నీవు రాజ్యపదవిలో ప్రతిష్ఠిస్తే పాపరహితుడ వవుతావు. బుద్ధిమంతులు అపుడు నిన్ను పూజిస్తారు. (32)
సువ్యాహృతాని ధీరాణాం ఫలతః పరిచింత్య యః।
భవిష్యసి నరశ్రేష్ఠ పూజనీయో మనీషిణామ్॥ 32
పాండవులను నీవు రాజ్యపదవిలో ప్రతిష్ఠిస్తే పాపరహితుడ వవుతావు. బుద్ధిమంతులు అపుడు నిన్ను పూజిస్తారు. (32)
సువ్యాహృతాని ధీరాణాం ఫలతః పరిచింత్య యః।
అధ్యవస్యతి కార్యేషు చిరం యశసి తిష్ఠతి॥ 33
ధీరుల మంచి మాటలను ఫలితం దృష్టితో ఆలోచించి కార్యం నిశ్చయించేవాడు చాలాకాలం మంచిపేరు పొందుతాడు. (33)
అసమ్యగుపయుక్తం హి జ్ఞానం సుకుశలైరపి।
ఉపలభ్యం చావిదితం విదితం చాననుష్ఠితమ్॥ 34
నిపుణులుపదేశించిన జ్ఞానం కూడా ఒక్కొక్కప్పుడు పనికిరాదు. నేర్పరులు చెప్పినది తనకు తెలియకపోయినా, తెలిసినా సరిగా ఆచరించకపోయినా ఆ జ్ఞానం నిష్పలమే అవుతుంది. (34)
పాపోదయఫకం విద్వాన్ యో నారభతి వర్ధతే।
యస్తు పూర్వకృతం పాపం అవిమృశ్యానువర్తతే।
అగాథపంకే దుర్మేధా విషమే వినిపాత్యతే॥ 35
దుష్ఫలితాన్ని ఇచ్చే పాపకర్మను ఆరంభించని వాడు వృద్ధిలోకి వస్తాడు. పాపాన్ని చేసి మంచి చెడులు విమర్శించు కోకుండా మళ్లీ మళ్లీ చేసే దుష్టబుద్ధి కలవాడు అగాథమయిన బురదలో కూరుకుపోతాడు. (35)
మంత్ర భేదస్య షట్ ప్రాజ్ఞః ద్వారాణీమాని లక్షయేత్।
అర్థసంతతికామశ్చ రక్షేదేతాని నిత్యశః॥ 36
మదం స్వప్నమవిజ్ఞానం ఆకారం చాత్మసంభవమ్।
దుష్టామాత్యేషు విశ్రంభం దూతా చ్చాకుశలా దపి॥ 37
మంత్రభేదం (రహస్యమ్ బయటపడటం) కలగటానికి ఆరు ద్వారాలున్నాయి. నిత్యమూ అర్థవృద్ధిని కాంక్షించేవాడు. వీటిని దరిచేరనీయ రాదు. 1. మదం, 2. పగటి కలలుకనడం, 3. విజ్ఞానం లేకపోవడం 4. బయటపడే తన ముఖకవళికలు 5. దుష్టమంత్రుల మీది నమ్మకం 6. నేర్పు లేని దూత - ఈ ఆరూ రహస్యం బయటపడే ద్వారాలు. (36,37)
ద్వారాణ్యేతాని యో జ్ఞాత్వా సంవృణోతి సదా నృప।
త్రివర్గాచరణే యుక్తః స శత్రూనధితిష్ఠతి॥ 38
ఈ ఆరు ద్వారాలూ సతతమూ తెలిసికొని మూసివేసి ధర్మార్థ కామాలు నిర్వహించే వాడు శత్రువులను అణగద్రొక్కుతాడు. (38)
న వై శ్రుతమవిజ్ఞాయ వృద్ధాననుపసేవ్య వా।
ధర్మార్థౌ వేదితుం శక్యౌ బృహస్పతిసమైరపి॥ 39
శాస్త్ర మయినా తెలియాలి. లేదా పెద్దలను సేవించి అయినా తెలుసుకోవాలి. ఈ రెండూ లేకుండా బృహస్పతి లాంటి తెలివిగల వారు కూడా ధర్మార్థాలు తెలుసుకోలేరు. (39)
నష్టం సముద్రే పతితం నష్టం వాక్యమశృణ్వతి।
అనాత్మని శ్రుతం నష్టం నష్టం హుతమనగ్నికమ్॥ 40
సముద్రంలో పడినది నిష్ఫలం. అలాగే వినిపించు కోని వానికి చెప్పిన నిష్ఫలం. ఆత్మజ్ఞానం లేని వాని శాస్త్రజ్ఞానం నిష్ఫలం. అలాగే అగ్నిలో పడని హోమద్రవ్యం నిష్ఫలం. (40)
మత్యా పరీక్ష్య మేధావీ బుద్ధ్యా సంపాద్య చాసకృత్।
శ్రుత్వా దృష్ట్వాథ విజ్ఞాయ ప్రాజ్ఞైర్మైత్రీం సమాచరేత్॥ 41
తెలివిగల మానవుడు ముందు తన బుద్ధితో కారణాలను పరీక్షించాలి. చాలాసార్లు అనుభవంతో నిశ్చయించాలి. అలా పరులవల్ల విని, తాను చూసి, బాగా తెలిసికొని అపుడు బుద్ధి మంతులతో స్నేహం చెయ్యాలి. (41)
అకీర్తిం వినయో హంతి హంత్యనర్థం పరాక్రమః।
హంతి నిత్యం క్షమా క్రోధమ్ ఆచారో హంత్యలక్షణమ్॥ 42
వినయం అపకీర్తిని పోగొడుతుంది. పరాక్రమం కీడును తొలగిస్తుంది. సహనం కోపాన్ని చంపుతుంది. సదాచారం అవలక్షణాన్ని పోగొడుతుంది. (42)
పరిచ్ఛదేన క్షేత్రేణ వేశ్మనా పరిచర్యయా।
పరీక్షిత కులం రాజన్ భోజనాచ్ఛాదనేన చ॥ 43
భోగ్యవస్తు సామగ్రి చేతనూ, జన్మస్థానం చేతనూ, ఇంటి చేతనూ, ఆచారవ్యవహారాల చేతనూ, అన్న వస్త్రాల చేతనూ వంశాన్ని పరీక్షించాలి. (43)
ఉపస్థితస్య కామస్య ప్రతివాదో న విద్యతే।
అపి నిర్ముక్తదేహస్య కామరక్తస్య కిం పునః॥ 44
దేహాభిమానం వదలుకున్నవాడే ఆశించకుండా వచ్చిన వాటిమీద ఆశ వదల లేకపోతున్నాడు. ఇక కామానురక్తుడయిన వాని విషయం చెప్పాలా? (44)
ప్రాజ్ఞోపసేవినం వైద్యం ధార్మికం ప్రియదర్శనమ్।
మిత్రవంతం సువాక్యం చ సుహృదం పరిపాలయేత్॥ 45
ప్రాజ్ఞులను మన్నించే విద్వాంసునీ, ధర్మప్రవర్తన కల వానినీ, చూడముచ్చటయిన వానినీ, పెక్కుమంది మిత్రులు కలవానినీ, చక్కగా ప్రియంగా మాట్లాడే వానినీ స్నేహితునీ రక్షించుకోవాలి. (45)
దుష్కులీనః కులీనో వా మర్యాదాం యో నలంఘయేత్।
ధర్మాపేక్షో మృదుర్హ్రీమాన్ స కులీనశతాద్వరః॥ 46
హద్దుమీరని వాడు, ధర్మాసక్తి కలవాడు, మృదుత్వమూ సిగ్గూ కలిగిన వాడు దుష్కులీనుడయినా నూరుగురు కులీనులకంటే మేలు. (46)
యయోశ్చిత్తేన వా చిత్తం నిభృతం నిభృతేన వా।
సమేతి ప్రజ్ఞయా ప్రజ్ఞా తయోర్మైత్రీ న జీర్యతి॥ 47
మనసుతో మనసు, రహస్యంతో రహస్యం, ప్రజ్ఞతో ప్రజ్ఞ కలిస్తే ఆ యిద్దరి మైత్రి తరగదు, క్షీణించదు. (47)
దుర్బుద్ధిమకృతప్రజ్ఞం ఛన్నం కూపం తృణైరివ।
వివర్జయీత మేధావీ తస్మిన్ మైత్రీ ప్రణశ్యతి॥ 48
దుర్మార్గుడై, పరిపక్వం కాని ప్రజ్ఞ కల స్నేహితుని తెలివిగల వాడు విడిచిపెట్టాలి. గడ్డితో కప్పిన నూతిలాగా విడవాలి. వానితో స్నేహం నశించి పోతుంది. (48)
అవలిప్తేషు మూర్ఖేషు రౌద్రసాహసికేషు చ।
తథైవాపేతధర్మేషు న మైత్రీమాచరేద్ బుధః॥ 49
గర్వితులతో, మూర్ఖులతో, కోవులతో, తొందర పాటు కలవారితో, ధర్మం విడిచిన వారితో పండితుడు స్నేహం చేయరాదు. (49)
కృతజ్ఞం ధార్మికం సత్యమ్ అక్షుద్రం దృఢభక్తికమ్।
జితేంద్రియం స్థితం స్థిత్యాం మిత్రమత్యాగి చేష్యతే॥ 50
మిత్రుడెప్పుడూ కృతజ్ఞుడై ఉండాలి. ధార్మికుడు, సత్యసంధుడూ కావాలి. నీచుడు కారాదు. దృఢమైన భక్తి కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, హద్దు మీరని వాడు కావాలి. ఆపదల్లో విడవని వాడు కావాలి. (50)
ఇంద్రియణామనుత్సర్గః మృత్యునాపి విశిష్యతే।
అత్యర్థం పునరుత్సర్గః సాదయేత్ దైవతాన్యపి॥ 51
ఇంద్రియాలను జయించడం మృత్యువును జయించడం కంటే గొప్పవిషయం. ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు వదిలి వేయడం మంచిదికాదు. అది దేవతలకు కూడా వినాశం చేకూరుస్తుంది. (51)
మార్దనం సర్వభూతానామ్ అనసూయా క్షమా ధృతిః।
ఆయుష్యాణి బుధాః ప్రాహుః మిత్రాణాం చావిమాననా॥ 52
అన్ని ప్రాణులపట్ల మృదుత్వం, అసూయ లేకపోవడం, సహనం, ధైర్యం, మిత్రులను అవమానించకపోవడం, ఈ అయిదూ ఆయువును వృద్ధి పరుస్తాయని పెద్దలు చెప్పారు. (52)
అపనీతం సునీతేన యోఽర్థం ప్రత్యానిషీషతే।
మతిమాస్థాయ సుదృఢాం తదకాపుర్రుషవ్రతమ్॥ 53
అన్యాయంగా లాగుకొనబడిన అర్థాన్ని చక్కని నీతితో దృఢబుద్ధితో పొందాలనుకొనడం సత్పురుషుల వ్రతం. (53)
ఆయత్యాం ప్రతికారజ్ఞః తదాత్వే దృఢనిశ్చయః।
అతీతే కార్యశేషజ్ఞః నరోఽర్థైర్న హీయతే॥ 54
రాబోయే అనర్థాలకు విరుగుడు తెలిసిన వాడూ, వర్తమన (ప్రస్తుత) కార్యాలలో దృఢనిశ్చయం కలవాడూ, జరిగిన పనుల్లో మిగిలిపోయినదాన్ని గుర్తించే మానవుడు ఏ ప్రయోజనాన్నీ కోల్పోడు. (54)
కర్మణా మనసా వాచా యదభీక్ష్ణం నిషేవతే।
తదేవాపహరత్యేనం త్స్మాత్ కల్యాణమాచరేత్॥ 55
చేష్టలతో, మనసుతో, మాటలతో మానవుడు ఏ విషయాన్ని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటాడో అదే మానవుని లాక్కుపోతూ ఉంటుంది. అందుచేత మానవుడు శుభాలనే త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉండాలి. (55)
మంగళాలంభనం యోగః శ్రుతముత్ధానమార్జవమ్।
భూతిమేతాని కుర్వంతి సతాం చాభీక్ష్ణదర్శనమ్॥ 56
మంగళద్రవ్యాలు (పెరుగు, గరిక, గోవు మొ॥) స్పృశించడం, మిత్రుల (యోగం) సహాయం, శాస్త్రవిజ్ఞానం, ప్రయత్నం, కుటిలత లేని ప్రవర్తన, పలుమార్లు సజ్జన దర్శనం ఇవి మానవునికి శుభం(ఐశ్ఽఅర్యం) కలిగిస్తాయి. (56)
అనిర్వేదః శ్రియో మూలం లాభస్య చ శుభస్య చ।
మహాన్ భవత్యనిర్విణ్ణః సుఖం చానంత్యమశ్నుతే॥ 57
నిర్వేదం చెందకపోవడం సంపదకూ, లాభానికీ, శుభానికీ మూలం. ప్రయత్నం విడవని వాడు గొప్పవాడవుతాడు. అనంతమయిన సుఖం కూడా పొందుతాడు. (57)
నాతః శ్రీమత్తరం కించిద్ అన్యత్పథ్యతమం మతమ్।
ప్రభవిష్ణోర్యథా తాత క్షమా సర్వత్ర సర్వదా॥ 58
సమర్థుడికి అన్నిచోట్ల, అన్ని వేళలా సహనం కంటె సంపత్కరం మరొకటి లేదు. అది అన్నిటి కంటే చాలా హితంకరము. (58)
క్షమేదశక్తః సర్వస్య శక్తిమాన ధర్మకారణాత్।
అర్థానర్థే సమౌ యస్య తస్య నిత్యం క్షమా హితా॥ 59
అసమర్థుడు అన్ని విషయాలలోనూ సహనం వహించాలి. సమర్థుడు కూడా ధర్మం కోసం సహనం వహించాలి. అర్థానర్థాలు(లాభాలాభాలు) సమానంగా చూసుకొనే వాడికి సహనం హితంగా ఉంటుంది. (59)
యత్సుఖం సేవమానోఽపి ధర్మార్థాభ్యాం న హీయతే।
కామం తదుపసేవేత న మూఢవ్రతమాచరేత్॥ 60
ధర్మానికీ, అర్థానికీ హాని కలగని సుఖాన్ని మానవుడు ఇష్టం వచ్చినట్లు అనుభవించవచ్చు. అంతేకాని మూఢునిలా అనుభవించారు. (ధర్మార్థహాని విషయంలో మూఢుడు కారాదు). (60)
దుఃఖార్తేషు ప్రమత్తేషు నాస్తికేష్వలసేషు చ।
న శ్రీర్వసత్యదాంతేషు యే చోత్సాహవివర్జితాః॥ 61
దుఃఖార్తేషు ప్రమత్తేషు నాస్తికేష్వలసేషు చ।
న శ్రీర్వసత్యదాంతేషు యే చోత్సహవివర్జితాః॥ 61
దుఃఖార్తుల దగ్గర, మత్తెక్కిన వారి దగ్గర, నాస్తికుల దగ్గర, సోమరుల దగ్గర, ఇంద్రియనిగ్రహం లేనివారి దగ్గర, ఉత్సాహ రహితుల దగ్గర లక్ష్మి ఉండదు. (61)
ఆర్ఝవేన నరం యుక్తమ్ ఆర్జవాత్ సవ్యపత్రపమ్।
అశక్యం మన్యమానాస్తు ధర్షయంతి కుబుద్ధయః॥ 62
ఆర్జనమూ, దాని వల్ల కలిగిన లజ్జాశీలమూ కలిగిన మానవుని దుర్మార్గులి అసమర్థుడనుకొంటూ బెదిరిస్తూ ఉంటారు. తిరస్కరిస్తూ ఉంటారు. (62)
అత్యార్యమతిదాతారమ్ అతిశూరమతివ్రతమ్।
ప్రజ్ఞాభిమానినం చైవ శ్రీర్భ్యాన్నోపసర్పతి॥ 63
అతి మంచితనం కలవాని దగ్గరకు అతిగా దానం చేసే వాడి దగ్గరకు, అతి పరాక్రమవంతుడి దగ్గరకు, అతిగా వ్రతాలు చేసే వాడిదగ్గరకు, తన తెలివిమీద వల్లమాలిన అభిమానం కలవాడి దగ్గరకు లక్ష్మి భయంతో చేరదు. (63)
న చాతిగుణవత్సేషా నాత్యంతం నిర్గుణేషు చ।
నైషా గుణాన్ కామయతే నైర్గుణ్యాన్నానురజ్యతే।
ఉన్మత్తా గౌరివాంధా శ్రీః క్వచిదేవాతిష్ఠతే॥ 64
లక్ష్మి అతిసదుణవంతుల దగ్గరా ఉండదు. ఏమాత్రం గుణంలేనివారి దగ్గర కూడా ఉండదు. ఆమె గుణాలను కోరదు. అంతమాత్రాన నిర్గుణులపట్ల అనురాగం లేదు. పిచ్చిపట్టిన ఆవువలె గ్రుడ్డిదయిన లక్ష్మి ఎక్కడెక్కడో నిలిచిపోతూ ఉంటుంది. (64)
అగ్నిహోత్రఫలా వేదాః శీలవృత్తఫలం శ్రుతమ్।
రతిపుత్రఫలా నారీ దత్తభుక్తఫలం ధనమ్॥ 65
వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్చిండడమే. శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన, స్త్రీ సంగమానికి ఫలం సుఖ సంతానాలు కల్గడమే. ధనానికి ఫలం దానం చెయ్యడమూ, అనుభవించడమూను. (65)
అధర్మోపార్జితైరర్థైః యః కరోత్యౌర్ధ్వదైహికమ్।
న స తస్య ఫలం ప్రేత్య భుంక్తే ఽర్థస్య దురాగమాత్॥ 66
అధర్మంతో సంపాదించిన ధనంతో పరలోక సుఖానికి అవసరమయిన క్రియలు(దానాదికం) చేసిన వాడికి చనిపోయాక దాని ఫలం రాదు. ఎందుచేతనంటే ఆ ధనం అన్యాయంగా సంపాదించింది గనుక. (66)
కాంతారే వనదుర్గేషు కృచ్ఛ్రాస్వాపత్సు సంభ్రమే।
ఉద్యతేషు చ శస్త్రేషు నాస్తి సత్త్వవతాం భయమ్॥ 67
అడవుల్లో కాని, దుర్గమస్థలాల్లో కాని, ఘోరమయిన ఆపదల్లో కాని, సమయాల్లోకాని, ఆఖరికి కత్తి మీద పడుతున్నాకాని సత్త్వ గుణం కలవారికి భయం ఉండదు. (67)
ఉత్థానం సంయమో దాక్ష్యమ్ అప్రమాదో ధృతిః స్మృతిః।
సమీక్ష్య చ సమారంభః విద్ధి మూలం భవస్య తు॥ 68
ప్రయత్నం, ఇంద్రియ నిగ్రహం, సమర్థత, పొరపాటు పడకపోవటం, ధైర్యం, స్మృతి, బాగా పరిశీలించి ప్రారంభించటం ఇవి సంపదకు మూలం. (68)
తపోబలం తాపసానాం బ్రహ్మ బ్రహ్మవిదాం బలమ్।
హింసా బలమసాధూనాం క్షమా గుణవతాం బలమ్॥ 69
తాపసులకు తపస్సు బలం. బ్రహ్మవేత్తలకు వేదం బలం. పాపాత్ములకు హింస బలం. గుణవంతులకు సహనం బలం. (69)
అష్టౌ తాన్యవ్రతఘ్నాని ఆపో మూలం ఫలం పయః।
హవి ర్బ్రాహ్మణకామ్యా చ గురోర్వచనమౌషధమ్॥ 70
నీరు, దుంపలు, పండ్లు, పాలు, హోమద్రవ్యం, విప్రుని ఆజ్ఞ, గురువు ఆజ్ఞ, ఔషధము - ఈ ఎనిమిది వ్రతానికి/ దీక్షకు భంగం కలిగించవు. (వి తీసుకున్నా వ్రతం చెడదు) (70)
న తత్ పరస్య సందధ్యాత్ ప్రతికూలం యదాత్మనః।
సంగ్రహేణైష ధర్మః స్యాత్ కామాదన్యః ప్రవర్తతే॥ 71
సంగ్రహంగా ధర్మం ఏమిటంటే...... తనకు అప్రియమయినది ఇతరులకు చేయకపోవడమే ధర్మం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమే అధర్మం. (71)
అక్రోధేన జయేత్ క్రోధమ్ అసాధుం సాధునా జయేత్।
జయేత్ కదర్యం దానేన జయేత్ సత్యేన చనృతమ్॥ 72
క్రోధాన్ని శాంతంలో జయించాలి. దుర్మార్గాన్ని మంచితనంతోనూ, లోభాన్ని దానంతోనూ, అసత్యాన్ని సత్యంతోనూ జయించాలి. (72)
స్త్రీధూర్తకేఽలసే భీరౌ చండే పురుషమానిని।
చౌరే కృతఘ్నే విశ్వాసః న కార్యో న చ నాస్తికే॥ 73
స్త్రీలపట్ల దుడుకుగా చరించే వానిని, సోమరిని, పిరికి వానిని, కోపిని, పౌరుషంతో గర్వించే వానిని, దొంగను, కృతఘ్నుని, నాస్తికుని నమ్మరాదు. (73)
అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః।
చత్వారి సంప్రవర్ధంతే కీర్తిరాయుర్యశో బలమ్॥ 74
పెద్దలకు నమస్కరిస్తూ నిత్యమూ సేవించే స్వభావం కలవానికి 1. కీర్తి 2. ఆయువు 3. యశస్సు, 4. బలం, వృద్ధిపొందుతాయి. (74)
అతిక్లేశేన యేఽర్థా స్యుః ధర్మస్యాతిక్రమేణ వా।
అరేర్యా ప్రణిపాతేన మా స్మ తేషు మనః కృథాః॥ 75
అతికష్టంతో సాధించే వాటిమీద, ధర్మాన్ని దాటి సాధించేవాటిమీద, శత్రువుకు లొంగి సాధించేవాటి మీద మనసు పెట్టుకోకు. (75)
అవిద్యః పురుషః శోచ్యః శోచ్యం మైథువ మప్రజమ్।
నిరాహారాః ప్రజాః శోచ్యాః శోచ్యం రాష్ట్రమరాజకమ్॥ 76
చదువు రాని పురుషుడు, బిడ్డలు లేని సంసారం, తిండిలేని సంతానం, రాజులేని రాజ్యం ఈ నాలుగూ శోకింప దగినవి. (76)
అధ్వా జరా దేహవతాం పర్వతానాం జలం జరా।
అసంభోగో జరా స్త్రీణాం వాక్శల్యం మనసో జరా॥ 77
శరీరులకు అధిక ప్రయాణం, పర్వతాలకు ఎడతెగని నీరు, స్త్రీలకు సంభోగం లేకపోవడం, మనస్సుకు వాగ్బాణాలు ముసలితనం చేకూరుస్తాయి. (77)
అనామ్నాయమలా వేదాః బ్రాహ్మణస్యావ్రతం మలమ్॥ 78
మలం పృథివ్యా బాహ్లీకాః పురుషస్యానృతం మలమ్।
కౌతూహలమలా సాధ్వీ విప్రవాసమలాః స్త్రియః॥ 79
అభ్యాసం లేకపోవడమే వేదాలకు దోషం - వ్రతం (దీక్ష) లేకపోవడమే బ్రాహ్మణునకు దోషం - భూమికి బాహ్లికులు దోషం - పురుషునికి అసత్యం దోషం - సాధ్వికి కుతూహలం దోషం - స్త్రీకి ఎడబాటు దోషం. (78,79)
సువర్ణస్య మలం రూప్యం రూప్యస్యాపి మలం త్రపు।
జ్ఞేయం త్రపుమలం సీసం, సీసస్యాపి మలం మలమ్॥ 80
బంగారానికి మలం(కాలుష్యం) వెండి, వెండికి మలం తగరం, తగరానికి మలం సీసం, సీసానికి మలం మలమే. (80)
న స్వప్నేన జయేన్నిద్రాం న కామేన జయేత్ స్త్రియః।
నేంధనేన జయేదగ్నిం న పానేన సురాం జయేత్॥ 81
నిద్రను స్వప్నంతో జయించలేము. స్త్రీలను కామంతో జయించలేము. కట్టెలతో అగ్నిని జయించలేము. పానంతో మద్యాన్ని జయించలేము. (81)
యస్య దానజితం మిత్రం శత్రవో యుధి నిర్జితాః।
అన్నపానజితా దారాః సఫలం తస్య జీవితమ్॥ 82
దానంతో మిత్రుని సంతృప్తి పరచినవాడు, యుద్ధంలో శత్రువును జయించినవాడు, అన్నపానాలతో భార్యను జయించినవాడు - ఈ ముగ్గురి జీవితమూ సఫలమైనట్లే. (82)
సహస్త్రిణోఽపి జీవంతి జీవంతి శతినస్తదా।
ధృతరాష్ట్ర విముంచేచ్ఛాం న కథంచిన్న జీవ్యతే॥ 83
వేలకొద్దీ డబ్బు ఉన్నవారూ బతుకుతున్నారు. వందలున్న వారూ బతుకుతున్నారు. ధృతరాష్ట్రా! ధనం మీద ఆశ వదలు. బ్రతకలేము అనేది లేదు. ఎలాగో అలా జీవిస్తాం. (83)
యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః।
నాలమేకస్య తత్సర్వమ్ ఇతి పశ్యన్న ముహ్యతి॥ 84
భూమి మీద ఉన్న ధాన్యం అంతా, బంగారం, పశు సంపద, స్త్రీ సంపద అన్నీ కలిపినా ఒక్కడికి చాలవు. దీన్ని తెలిసిన మానవుడు మోహపడడు. (అందుచేత మానవునకు ముందుగా కావలసినది తృప్తి అని భావం) (84)
రాజన్ భూయో బ్రవీమి త్వాం పుత్రేషు సమమాచర।
సమతా యది తే రాజన్ స్వేషు పాండుసుతేషు వా॥ 85
రాజా! నీకు మళ్లీ చెపుతున్నాను. నీకు నీ కొడుకుల మీద, పాండురాజు కొడుకుల మీద సమభావం ఉంటే అందరినీ సమానంగా చూడు. (85)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగర పర్వణి విదురవాక్యే ఏకోన చత్వారింశోఽధ్యాయః॥ 39 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున ప్రజాగరపర్వమను ఉపపర్వమున
విదురుని వాక్యమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (39)