36. ముప్పది ఆరవ అధ్యాయము
విదురుని నీతి వాక్యములు.
విదుర ఉవాచ
అత్రైవోదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్।
ఆత్రేయస్య చ సంవాదం సాధ్యానాం చేతి నః శ్రుతమ్॥ 1
విదురుడు ఇలా చెపుతున్నాడు. ఈ సంధర్భంలో పూర్వం జరిగిన ఒక కథ చెపుతారు. అది ఆత్రేయునికీ, సాధ్యులకూ జరిగిన సంవాదం అని విన్నాము. (1)
చరంతం హంసరూపేణ మహర్షిం సంశితవ్రతమ్।
సాధ్యా దేవా మహాప్రాజ్ఞం పర్యపృచ్ఛంత వై పురా॥ 2
మహాజ్ఞాని, నిష్ఠాపరుడూ అయిన ఆత్రేయ మహర్షి సన్యాసిరూపంలో తిరుగుతూ ఉంటే ఒకసారి సాధ్యులు ఆయనను ఇలా ప్రశ్నించారు. (2)
సాధ్యా ఊచుః
సాధ్యా దేవా వయమేతే మహర్షే
దృష్ట్వా భవంతం న శక్నుమోఽనుమాతుమ్।
శ్రుతేన ధీరో బుద్ధిమాంస్త్వం మతో నః
కావ్యాం వాచం వక్తుమర్హస్యుదారామ్॥ 3
సాధ్యులిట్లా అడిగారు. మహర్షీ! మేము సాధ్యులము. దేవజాతి మాది. మిమ్మల్ని చూసి మేము గుర్తుపట్టలేకపోతున్నాం. మీరు వెదవిజ్ఞానం కల ధీరులు. బుద్ధిమంతులు, విజ్ఞాన పూర్వక మయిన మంచిమాట ఏదైనా చెప్పండి. (3)
హంస ఉవాచ
ఏతత్కార్యమమరాః సంశ్రుతం మే
ధృతిః శమః సత్యధర్మానువృత్తిః।
గ్రంథిం వినీయ హృదయస్య సర్వం
ప్రియాప్రియే చాత్మసమం నయీత॥ 4
పరమహంస ఇలా చెప్పాడు.
దేవతలారా! ఇది కర్తవ్యం అని నేను గురువుల వల్ల విన్నాను. ధైర్యం, శమం, సత్యం, ధర్మం వీనిని నిరంతరంగా పాటించాలి. హృదయంలోని ముడి విప్పుకొని అప్రియాన్ని కూడా ఆత్మసమంగా లాగుకొని తీసుకొని రావాలి. (4)
ఆక్రుశ్యమానో నాక్రోశేత్ మన్యురేవ తితిక్షతః।
ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి॥ 5
తనను ఇతరులు నిందిస్తున్నా తాను వారిని నిందించకూడదు. అలా సహించే వానిలోని కోపమే ఆ తిట్టేవానిని దహించి వేస్తుంది. అంతేకాదు. ఆ తిట్టేవాని పుణ్యం ఈ సహనశీలికి సంక్రమిస్తుంది. (5)
నాక్రోశీ స్యాన్నావమానీ పరస్య
మిత్రద్రోహీ నోత నీచోపసేవీ।
న చాభిమానీ న చ హీనవృత్తిః
రూక్షాం వాచం రుషతీం వర్జయీత॥ 6
ఇతరులను నిందింపకూడదు. అవమానింపరాదు. మిత్రద్రోహం చేయకూడదు. నీచుని సేవింపరాదు. అభిమానం పనికిరాదు. నీచప్రవర్తన కూడదు. కోపంతో పరుషవాక్కులు మాట్లాడరాదు. (6)
మర్మాణ్యస్థీని హృదయం తథాసూన్
రూక్షా వాచో నిర్దహంతీహ పుంసామ్।
తస్మాద్వాచముషతీం రూక్షరూపాం
ధర్మారామో నిత్యశో వర్జయీత॥ 7
పరుషవాక్కులు మానవుల మర్మస్థానాలనూ, ఎముకల్ని, హృదయాన్ని, ప్రాణాలనూ దహించివేస్తాయి. అందుచేత అలా దహించివేసే పరుషవాక్కులను ధర్మపరుడు నిత్యమూ విడిచి పెట్టాలి. దరిచేరనీయరాదు. (7)
అరుంతుదం పరుషం రూక్షవాచం
వాక్కంటకైర్వితుదంతం మనుష్యాన్।
విద్యాదలక్ష్మీకతమం జనానాం
ముఖే నిబద్ధాం నిరృతిం వై వహంతమ్॥ 8
మర్మచ్ఛేదకంగా పరుషవాక్కులు పలికే వాడిని, మాటల ఈటెలతో మనుష్యుల్ని పొడిచేవాడిని, నాలుకమీద జ్యేష్ఠాదేవిని ధరించిన పరమ దరిద్రుడిగా భావించాలి. (8)
పరశ్చేదేనమభివిధ్యేత బాణైః
భృశం సుతీక్ష్ణైరనలార్కదీపైః।
స విధ్యమానో ఽప్యతిదహ్యమానః
విద్యాత్ కవిః సుకృతం మే దధాతి॥ 9
అగ్నిలాగా సూర్యుని లాగా మండిపోయే వాడియైన మాటల బాణాలతో కొడుతూ ఉన్నా, తాను ఆ దెబ్బలు తింటూనే, కాలిపోతూనే పండితుడు "నా పుణ్యం ఫలింపజేస్తున్నా"డని భావిస్తాడు. (9)
యది సంతం సేవతి యద్యసంతం
తపస్వినం యది వా స్తేనమేవ।
వాసో యథా రంగవశం ప్రయాతి
తథా స తేషాం వశమభ్యుపైతి॥ 10
మానవుడు సజ్జనుని కాని దుర్జనుని కాని, తపస్విని కాని దొంగను కాని - ఎవరిని సేవిస్తే వారికే వశుడవుతాడు. వస్త్రానికి రంగు అంటినట్లు వారి భావం అంటుకుపోతుంది. సంక్రమిస్తుంది. (10)
అతివాదం న ప్రవదే న్న వాదయేత్
యోఽనాహతః ప్రతిహన్యాన్న ఘాతయేత్।
హంతుం చ యో నేచ్ఛతి పాపకం వై
తస్మై దేవాః స్పృహయంత్యాగతాయ॥ 11
హద్దు మీరి మాట్లాడరాదు. మాట్లాడింపరాదు. ఎదుటివాడు కొట్టకుండా కొట్టకూడదు. కొట్టింపకూడదు. పాపం చేసిన (ముందుగా కొట్టిన) వాడిని కూడ కొట్టాలని అనుకోని వాని రాకను దేవతలు కూడ అభిలషిస్తారు. (11)
అవ్యాహృతం వ్యాహృతాచ్ఛ్రేయ ఆహుః
సత్యం వదేత్ వ్యాహృతం తద్ద్వితీయమ్।
ప్రియం వదేద్ వ్యాహృతం తత్ తృతీయం
ధర్మ్యం వదేత్ వ్యాహృతం తచ్చతుర్థమ్॥ 12
మాట్లాడటం కంటె మౌనం మేలు - మాట్లాడితే సత్యమే మాట్లాడటం రెట్టింపు మేలు. ఆ సత్యం ప్రియంగ మాట్లాడటం మూడు రెట్లు మేలు. ఆ సత్యప్రియాలు ధర్మంతో కలిసిఉంటే అది నాల్గురెట్లు మేలు. (12)
యాదృశైః సంనివిశతే యాదృశాంశ్చోపసేవతే।
యాదృగిచ్ఛతి భవితుం తాదృగ్భవతి పూరుషః॥ 13
మానవుడు ఎటువంటి వారితో సహవాసం చేస్తాడో అటువంటి వాడే అవుతాడు. ఎటువంటి వారిని సేవిస్తాడో అటువంటి వాడే అవుతాడు. ఎటువంటివాడు కావాలని కోరుకొంటాడో అటువంటి వాడే అవుతాడు. (13)
యతో యతో నివర్తతే తతస్తతో విముచ్యతే।
నివర్తనాద్ధి సర్వతః న వేత్తి దుఃఖమణ్వపి॥ 14
మానవుడు దేని నుండి మరలుతాడో దానినుండి విముక్తుడవుతాడు. అన్నిటినుండి నివృత్తి పొందటంవల్లనే నలుసంతైనా దుఃఖం తెలియదు. (14)
న జీయతే చానుజిగీషతే ఽన్యాన్
న వైరకృచ్చాప్రతిఘాతకశ్చ।
నిందాప్రశంసాసు సమస్వభావః
న శోచతే హృష్యతి నైవ చాయమ్॥ 15
తాను ఓడిపోడు. ఇతరులను ఓడించాలనుకోడు. విరోధం పెట్టుకోడు. ప్రతీకారం చెయ్యడు. నిందా స్తుతులను సమంగా స్వీకరిస్తాడు. అటువంటివాడు దుఃఖించడు, సంతోషించడు. (15)
భావమిచ్ఛతి సర్వస్య నాభావే కురుతే మనః।
సత్యవాదీ మృదుర్దాంతః యస్ప ఉత్తమ పూరుషః॥ 16
ఉత్తమ పురుషుడు అందరికీ అభ్యుదయాన్ని కోరుతాడు. ఎవరికీ కీడు తలపెట్టడు. సత్యం పలుకుతాడు. మృదుస్వభావంతో ఇంద్రియ నిగ్రహం కలిగిఉంటాడు. (16)
నానర్థకం సాంత్వయతి ప్రతిజ్ఞాయ దదాతి చ।
రంధ్రం పరస్య జానాతి యః స మధ్యమపూరుషః॥ 17
మధ్యమ పురుషుడు అప్రయోజకుని బ్రతిమలాడడు. ఇస్తా నన్నది తప్పక ఇస్తాడు. శత్రువు యొక్క లోపాలను తెలుసుకొంటాడు. (17)
దుశ్శాసన స్తూపహతోఽ భిశస్తః
నావర్తతే మన్యువశాత్ కృతఘ్నః।
న కస్యచిన్మిత్ర మథో దురాత్మా
కలాశ్చైతా అధమస్యేహ పుంసః॥ 18
అధముడు దుష్టంగా శాసిస్తాడు. దెబ్బలు తింటాడు. నిందలు పొందుతాడు. వచ్చినకోపం తగ్గించుకోడు. చేసిన మేలు మరిచి పోతాడు. ఎవరితోనూ స్నేహం చెయ్యడు. (18)
న శ్రద్దధాతి కల్యాణం పరేభ్యోఽప్యాత్మశంకితః।
నిరాకరోతొ మిత్రాణి యో వై సోఽధమపూరుషః॥ 19
తనమీద తనకే నమ్మకం ఉండదు. కనుక ఇతరులు కూడ తనకు శుభం కలిగిస్తారని నమ్మడు. తాను ఎవరికీ ఉపకారం చెయ్యడు. కనుక మిత్రులను నిరాకరిస్తాడు. వాడే అధముడు. (19)
ఉత్తమానేవ సేవేత ప్రాప్తకాలే తు మధ్యమాన్।
అధమాంస్తు న సేవేత య ఇచ్ఛేత్ భూతిమాత్మనః॥ 20
తన అభ్యుదయాన్ని కోరుకొనేవాడు ఉత్తములనే సేవించాలి. ఆపత్కాలంలో మాత్రం మధ్యములను సేవింపవచ్చును. అధములను మాత్రం సేవింపరాదు. (20)
ప్రాప్నోతి వై విత్తమసద్బలేన
నిత్యోత్థానాత్ ప్రజ్ఞయా పౌరుషేణ।
న త్వేవ సమ్యగ్ లభతే ప్రశంసాం
న వృత్తమాప్నోతి మహాకులానామ్॥ 21
మానవుడు ధనాన్ని కపటద్యూతాదుల వల్ల కూడా పొందవచ్చు. నిరంతర ప్రయత్నం చేత, నేర్పుతో చేసే సేవ చేతకూడా ధనం సంపాదించవచ్చు. కాని చక్కని ప్రశంసను పొందలేడు. ఉత్తమ వంశ సంజాతుల ప్రవర్తనను పొందలేడు. (21)
ధృతరాష్ట్ర ఉవాచ
మహాకులేభ్యః స్పృహయంతి దేవా
ధర్మార్థ నిత్యాశ్చ బహుశ్రుతాశ్చ।
పృచ్ఛామి త్వాం విదుర ప్రశ్నమేతం
భవంతి వై కాని మహాకులాని॥ 22
ధృతరాష్ట్రుడిలా ప్రశ్నించాడు.
నిత్యం ధర్మమూ, అర్థమూ కల్గి. చాలా పాండిత్యం కల దేవతలు మహాకులీనులను/ఉత్తమ్ వర్గీయులను కాంక్షిస్తారట కదా! విదురా! నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు మహాకులాలేవి? (22)
విదుర ఉవాచ
తపో దమో బ్రహ్మవిత్తం వితానాః
పుణ్యా వివాహాః సతతాన్నదానమ్।
యేష్వేవైతే సప్తగుణా వసంతి
సమ్యగ్వృత్తాస్తాని మహాకులాని॥ 23
విదురుడిట్లా అన్నాడు. తపమూ, దమమూ(ఇంద్రియ నిగ్రహం), వేద విజ్ఞానం, యజ్ఞకృత్యములు విధి పూర్వక శుభంకర వివాహాలు, సతతమూ అన్నదానం, సత్ప్రవర్తన అనే ఈ ఏడు గుణాలూ ఉండే వారే మహాకులంవారు. (23)
యేషాం న వృత్తం వ్యథతే న యోనిః
చిత్తప్రసాదేన చరంతి ధర్మమ్।
యే కీర్తిమిచ్ఛంతి కులే విశిష్టాం
త్యక్తానృతాస్తాని మహాకులాని॥ 24
స్థిరమైన సత్ప్రవర్తన కలవారు. తన్నుచూసి సంతోషించే తల్లిదండ్రులు కలవారు, ప్రసన్నహృదయంతో ధర్మం ఆచరించేవారు, తమ వంశంలో విశిష్టమైన కీర్తిని అపేక్షించేవారు, అసత్యాన్ని విడిచిన వారు ఈ అయిదుగురు మహావంశజాతులు. (24)
అనిజ్యయా కువివాహైః వేదస్యోత్సాదనేన చ।
కులాన్యకులతాం యాంతి ధర్మస్యాతిక్రమేణ చ॥ 25
యజ్ఞాలు చేయకపోవడం వల్లనూ, విధివిధానంగా చేసికొనని వివాహాల వల్లనూ, వేదాన్ని విడిచిపెట్టడం చేతనూ, ధర్మం అతిక్రమించడం చేతనూ సత్కురాలు చెడిపోతాయి. (25)
దేవద్రవ్యవినాశేన బ్రహ్మస్వహరణేన చ।
కులాన్యకులతాం యాంతి బ్రాహ్మణాతిక్రమేణ చ॥ 26
దేవుని సొమ్ము పాడుచేయడం వల్లనూ, బ్రాహ్మణ ధనం దొంగిలించటం వల్లనూ, బ్రాహ్మణుని పట్ల హద్దు మీరడం వల్లనూ సత్కురాలు చెడిపోతాయి. (26)
బ్రాహ్మణానాం పరిభవాత్ పరీవాదాచ్చ భారత।
కులాన్యకులతాం యాంతి న్యాసాపహరణేన చ॥ 27
బ్రాహ్మణులను అవమానించడం వల్లనూ, అపనిందల వల్లనూ, న్యాసాన్ని అపహరించడం వల్లనూ కులాలు చెడిపోతాయి. (27)
కులాని సముపేతాని గోభిః పురుషతోఽర్థతః।
కులసంఖ్యాం న గచ్ఛంతి యాని హీనాని వృత్తతః॥ 28
విద్యలచేతను, సత్పురుషుల చేతను, ధనం వల్లనూ వంశాలు పుష్టినొందుతాయి. సత్ప్రవర్తన లేకపోతే వంశాలుగా పరిగణింపబడవు. (28)
వృత్తతస్త్వవిహీనాని కులాన్యల్పధనాన్యపి।
కులసంఖ్యాం చ గచ్ఛంతి కర్షంతి చ మహద్యశః॥ 29
కొద్దిపాటి సంపదలే ఉన్నా, సత్ప్రవర్తన వదలకపోతే కులాలుగానే పరిగణింపబడతాయి. అంతేకాదు మంచి పేరు తెచ్చుకొంటాయి. (సత్కులాలు అనిపించుకొంటాయి.) (29)
వృత్తం యత్నేన సంరక్షేద్ విత్తమేతి చ యాతి చ।
అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః॥ 30
మానవుడు తన నడవడిని ప్రయత్నపూర్వకంగా రక్షించు కోవాలి. ధనం వస్తుంది, పోతుంది. ధనం లేని వాడు క్షీణుడు కాడు. సత్ప్రవర్తనలేనివాడే క్షీణుడు, మృతుడు కూడ. (30)
గోభిః పశుభిరశ్వైశ్చ కృష్యాచ సుసమృద్ధయా।
కులాని న ప్రరోహంతి యాని హీనాని వృత్తతః॥ 31
సత్ప్రవర్తన లేని కులాలు, గోవుల(విద్యల)తో, కాని పశువులతో కాని, గుర్రాలతో కాని, సస్యసమృద్ధి కల వ్యవసాయంతో కాని మళ్లీ పైకి లేవవు. (అభ్యుదయం పొందవు) (31)
మా నః కులే వైరకృత్ కశ్చిదస్తు
రాజాఽమాత్యో మా పరస్వాపహరీ।
మిత్రద్రోహీ నైకృతికో ఽనృతో వా
పూర్వాశీ వా పితృదేవాతిథిభ్యః॥ 32
మన వంశంలో వైరం పెట్టేవాడు ఒక్కడయినా లేకుండుగాక. ఇతరుల సొమ్ము నపహరించే రాజుగాని మంత్రికాని లేకుండుగాక. మిత్రద్రోహికాని, వంచకుడు కాని, 'అబద్ధాలకోరు' కాని లేకుండుగాక. అలాగే పితరులకు, దేవతలకు, అతిథులకు పెట్టకుండా ముందే భుజించేవాడు లేకుండు గాక. (32)
యశ్చ వో బ్రాహ్మణాన్ హన్యాద్ యశ్చ వో బ్రాహ్మణాన్ ద్విషేత్।
న నఃస సమితం గచ్ఛేత్ యశ్చ నో నిర్వపేత్కృషిమ్॥ 33
బ్రాహ్మణులను హింసించేవాడూ, ద్వేషించేవాడూ, మనకృషిని ధ్వంసం చేసేవాడూ మన సభలో ప్రవేశింపకుండును గాక. (33)
తృణాని భూమిరుదకం వాక్ చతుర్థీ చ సూనృతా।
సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన॥ 34
తృణాలు, భూమి, నీరు, సత్యవాక్కు ఈ నాలుగూ సన్మార్గుల ఇళ్లలో ఎన్నడూ తరిగి పోవు. (34)
శ్రద్ధయా పరయా రాజన్నుపనీతాని సత్కృతిమ్।
ప్రవృత్తాని మహాప్రాజ్ఞ ధర్మిణాం పుణ్యకర్మణామ్॥ 35
రాజా! ధార్మికులయిన పుణ్యాచారుల సత్ప్రవర్తనలు ఎంతో శ్రద్ధతో సత్కరింప దగినవి. (35)
సూక్ష్మో ఽపి భారం నృపతే స్యందనో వై
శక్తో వోఢుం న తథాన్యే మహీజాః।
ఏవం యుక్తా భారసహా భవంతి
మహాకులీనా న తథా ఽన్యే మనుష్యాః॥ 36
రథం చిన్నదయినా పెద్ద బరువ్ ఉ మోస్తుంది. కాని చెట్లు అలా మోయలేవు. అలాగే మహాకుల సంజాతులయిన వారు పెద్దభారం సహింపగలరు. అలా ఇతరులు మోయలేరు. (36)
న తన్మిత్రం యస్య కోపాద్బిభేతి
యద్వా మిత్రం శంకితేనోపచర్యమ్।
యస్మిన్ మిత్రే పితరోవాశ్వసీత
తద్వై మిత్రం సంగతానీతరాణి॥ 37
తన కోపంతో ఇతరులను భయపెట్టేవాడు మిత్రుడు కాడు. అనుమానంతో సేవచేసేవాడు మిత్రుడు కాడు. తండ్రిని నమ్మినట్లు నమ్మకం ఉంచదగినవాడే మిత్రుడు, మిగిలిన వారంతా బంధువు లవుతారు. కాని మిత్రులు కారు. (37)
యః కశ్చిదప్యసంబద్ధః మిత్రభావేన వర్తతే।
స ఏవ బంధుస్తన్మిత్రం సా గతిస్తత్పరాయణమ్॥ 38
బంధుత్వం లేకుండానే స్నేహభావంతో ప్రవర్తించే వాడే బంధువు. వాడే మిత్రుడు, వాడే గతి, వాడే చివరికి చేరదగినవాడు. (38)
చలచిత్తస్యవై పుంసాం వృద్ధాననుపసేవతః।
పారిప్లవమతేర్నిత్యమ్ అధ్రువో మిత్రసంగ్రహః॥ 39
చపల చిత్తుడు, పెద్దలను సేవింపనివాడు, చంచలబుద్ఢి కలవాడు అయిన మానవునికి మైత్రి శాశ్వతంగా నిలవదు. (39)
చలచిత్తమనాత్మానమ్ ఇంద్రియాణాం వశానుగమ్।
అర్థాః సమభివర్ధంతే హంసాః శుష్కం సరో యథా॥ 40
నీరు తరిగి పోయిన చెరువు చుట్టూ పైపైని హంసలు తిరిగినట్లు చంచలచిత్తుడై ఇంద్రియాలకు వశుడై తిరిగే నీచాత్మునికి సంపదలు అంటకుండా చుట్టూ తిరుగుతాయి (40)
అకస్మాదేవ కుప్యంతి ప్రసీదంత్యనిమిత్తతః।
శీలమేతదసాధూనామ్ అభ్రం పారిప్లవం యథా॥ 41
ఉన్నట్లుండి కోప్పడతారు. నిష్కారణంగా ప్రసన్నులవుతారు. గాలికి కొట్టుకిపోయే మేఘం లాంటిది దుర్మార్గుల శీలం. (41)
సత్కృతాశ్చ కృతార్థాశ్చ మిత్రాణాం న భవంతి యే।
తాన్ మృతానపి క్రవ్యాదాః కృతఘ్నాన్నోపభుంజతే॥ 42
మిత్రుల వలన సత్కారాలు పొంది, తమ పనులు నెరవేర్చుకొన్నాక ఆ మిత్రుల హితం కోరని కృతఘ్నుల శవాలను క్రూరమృగాలు కూడా తినవు. (42)
పాండురాజును దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు విదురు డన్నాడు. అతని వలన రాజ్యాన్ని పొంది అన్ని విషయాల్లోనూ ఏ లోటూ లేకుండా ప్రశంసింపదగిన సంపదను పొంది. ఇపుడు అతని కొడుకులకే రాజ్యం లేదనడం ఎటువంటిదో వివరిస్తున్నాడు. దుర్యోధనుడు కూడా ఘోషయాత్రలో పాండవులచేతనే రక్షింపబడ్డాడు. ఇపుడా విషయం మరచి కృతఘ్నుడయి పోయాడని సూచన, క్రవ్యాద శబ్దానికి కుక్కలు అని తెనిగించి నాడీజంఘుని వృత్తాంతం స్ఫురించేటట్లు చేశాడు.
అర్చయేదేవ మిత్రాణి సతి వా ఽసతి వా ధనే।
నానర్థయన్ ప్రజానాతి మిత్రాణాం సారఫల్గుతామ్॥ 43
ధనం ఉన్నా లేకపోయినా మిత్రులను తప్పక ఆదరించాలి. ఏ కోరిక లేనివాడు మిత్రుల కలిమిలేములను తెలిసికొనడు. (43)
సంతాపాద్ భ్రశ్యతే రూపం సంతాపాద్ భ్రశ్యతే బలమ్।
సంతాపాద్ భ్రశ్యతే జ్ఞానం సంతాపాద్ వ్యాఢ్Hఇ మృచ్ఛతి॥ 44
సంతాపం వలన రూపం నశిస్తుంది. ఏడుపు వలన బలం తగ్గిపోతుంది. జ్ఞానం తరిగిపోతుంది. అంతే కాదు రోగం ప్రబలుతుంది. (44)
అనవాప్యం చ శోకేన శరీరం చోపతప్యతే।
అమిత్రాశ్చ ప్రహృష్యంతి మా స్మ శోకే మనః కృథాః॥ 45
ఏడుపు వలన కోరినది రాదు. అంతేకాదు శరీరం ఉడికిపోతుంది. శత్రువులు సంతోషిస్తారు. అందుచేత ఏడుపుమీద మనసు పెట్టకు. (45)
పునర్నరో మ్రియతే జాయతే చ
పునర్నరో హీయతే వర్ధతే చ।
పునర్నరో యాచతి యాచ్యతే చ
పునర్నరః శోచతి శోచ్యతే చ॥ 46
మానవుడు మరణిస్తాడు. మళ్లీ జన్మిస్తాడు. అలాగే కృశిస్తాడు. పెరుగుతాడు; తాను ఇతరులను యాచిస్తాడు. ఇతరులచేత యాచింపబడతాడు. అలాగే శోకిస్తాడు. ఇతరులు శోకించేటట్లు చేస్తాడు. (46)
సుఖం చ దుఃఖం చ భవాభవే చ
లాభాలాభే మరణం జీవితం చ।
పర్యాయశః సర్వమేతే స్పృశంతి
తస్మాద్ధీరో న చ హృష్యేన్న శోచేత్॥ 47
సుఖ దుఃఖాలు, శుభాశుభాలు, లాభాలాభాలు, అలాగే మరణమూ జీవితమూ ఇవి అందరికీ వంతుల వారీగా వస్తూ ఉంటాయి. అందుచేత ధైర్యం కలవాడు వానికోసం పొంగిపోరాదు. క్రుంగిపోరాదు. (47)
చలాని హీమాని షడింద్రియాణి
తేషాం యద్యద్వర్ధతే యత్ర యత్ర।
తతస్తతః స్రవతే బుద్ధిరస్య
ఛిద్రోదకుంభాదివ నిత్యమంభః॥ 48
మనసు, పంచేంద్రియాలూ చంచలములు - వీటిలో ఏ యింద్రియం ఏ విషయంలో బాగా ప్రసరిస్తుందో దాని ద్వారా సతతమూ బుద్ధి జారిపోతూ ఉంటుంది. ఎలా అంటే... చిల్లుపడిన కుండలోనుండి నీరు కారిపోయినట్లు. (48)
ధృతరాష్ట్ర ఉవాచ
తనురుద్ధః శిఖీ రాజా మిథ్యోపచరితో మయా।
మందానాం మమ పుత్రాణాం యుద్ధేనాంతం కరిష్యతి॥ 49
అపుడు ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
ధర్మరాజు దాగిఉన్న నిప్పు. వానిని నేను రిత్త ఉపచారాలతో ఉడికించాను. తెలివితక్కువ వారయిన నా పుత్రులను యుద్ధంలో చంపివేస్తాడు. (49)
నిత్యోద్విగ్నమిదం సర్వం నిత్యోద్విగ్న మిదం మనః।
యత్తత్పదమనుద్విగ్నం తన్మే వద మహామతే॥ 50
ఈ నా పరిస్థితి అంతా భీతితో నిండి ఉంది. నా మనస్సు కూడ భయంతో కలత చెందుతోంది. విదురా! అభయప్రదమయిన స్థితిని నాకు చెప్పు. (50)
విదుర ఉవాచ
నాన్యత్ర విద్యాతపసః నాన్యత్రేంద్రియ నిగ్రహాత్।
నాన్యత్ర లోభసంత్యాగాత్ శాంతిం పశ్యామి తేఽ నఘ॥ 51
విదురు డిట్లన్నాడు. పుణ్యాత్మా! విద్య, తపస్సు, ఇంద్రియనిగ్రహం, లోభత్యాగం వీనిని యెచ్చటను నీకు శాంతి దొరకదు. (51)
శాంతి = నిర్వాణము(దేవ - అర్జు)
బుద్ధ్యా భయం ప్రణుదతి తపసా విందతే మహత్।
గురుశూశ్రూషయా జ్ఞానం శాంతిం యోగేన విందతి॥ 52
మానవుడు బుద్ధిబలంతో భయం తొలగించు కొంటాడు. తపస్సు చేత గొప్పదనం పొందుతాడు. గురు శుశ్రూష చేత జ్ఞానం పొందుతాడు. అలాగే శాంతిని యోగం చేత పొందుతాడు. (52)
అనాశ్రితా దానపుణ్యం వేదపుణ్యమనాశ్రితాః।
రాగద్వేషవినిర్ముక్తాః విచరంతీహ మోక్షిణః॥ 53
దానంవల్ల కలిగిన పుణ్యాన్ని, వేదోక్తకర్మలు చేయడం వల్ల కలిగిన పుణ్యాన్ని ఆశ్రయించకుండా, రాగ ద్వేషాలు విడిచినవారు జీవన్ముక్తులై ఇక్కడే సంచరిస్తూ ఉంటారు. (53)
స్వధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణః।
తపసశ్చ సుతస్తస్య తస్యాంతే సుఖమేధతే॥ 54
ఆసక్తితో చదివిన చదువు, ధర్మబద్ధంగా చేశిన యుద్ధమూ, చక్కగా (నిష్కామంగా) చేసిన కర్మ, నియమంతో చేసిన తపస్సు ఈ నాలుగూ అంతమందు సుఖం చేకూరుస్తాయి. (54)
స్వాస్తీర్ణాని శయనాని ప్రపన్నాః
న వై భిన్నా జాతు నిద్రాం లభంతే।
న స్త్రీషు రాజన్ రతిమాప్నువంతి
న మాగధైః స్తూయమానా న సూతైః॥ 55
జ్ఞాతులతో భేదదృష్టి కలవారికి పట్టుపరుపుల మీద పడుకొన్నా నిద్రపట్టదు. స్త్రీలపై ప్రీతి, ఆసక్ట్జి కలుగదు, వందిమాగధులు స్తుతిస్తూ ఉన్నా తృప్తి కలుగదు. (55)
న వై భిన్నా జాతు చరంతి ధర్మం
న వై సుఖం ప్రాప్నువంతీహ భిన్నాః।
న వై భిన్నా గౌరవం ప్రాప్నువంతి
న వై భిన్నాః ప్రశమం రోచయంతి॥ 56
భేదబుద్ధి కలవారు ఎప్పుడూ ధార్మికంగా ప్రవర్తింప లేరు. ఇక్కడ సుఖాన్ని, గౌరవాన్ని పొందలేరు. ప్రశాంతత పొందలేరు. (56)
న వై తేషాం స్వదతే పథ్యముక్తం
యోగక్షేమం కల్పతే నైవ తేషామ్।
భిన్నానాం వై మనుజేంద్ర పరాయణం
న విద్యతే కించి దన్యద్వినాశాత్॥ 57
వారికి హితమయిన మాటలు రుచింపవు. వారికి యోగక్షేమాలు కలగవు. భేదదృష్టి కలవారికి వినాశం తప్ప మరోగతి ఏ మాత్రం కనపడదు. (57)
సంపన్నం గోషు సంభావ్యం సంభావ్యం బ్రాహ్మణే తపః।
సంభావ్యం చాపలం స్త్రీషు సంభావ్యం జ్ఞాతితో భయమ్॥ 58
గోవులలో సంపదను భావింపవచ్చును, బ్రాహ్మణునిలో తపస్సు భావింపవచ్చును. స్త్రీలలో చాపల్యం ఊహించవచ్చు. జ్ఞాతుల నుండి అలాగే భయం ఊహించవచ్చు. (58)
తంతవః ప్యాయితా నిత్యం తనవో బహులాః సమాః।
బహూన్ బహుత్వాదాయాసాన్ సహంతీత్యుపమా సతామ్॥ 59
చాలా తంతువులు నిత్యమూ చాలాకాలం కలిసి ఉండటం చేతనూ, చాలాఉండటంచేతనూ ఎంతో బరువును సహిస్తాయి. సజ్జనులకు ఇదే ఉపమానం. (59)
ధూమాయంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ।
ధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ॥ 60
ధృతరాష్ట్రా! జ్ఞాతులు కొఱవుల వలె(కాలిన కట్టెలవలె) వేరు వేరుగా ఉంటే పొగలు కక్కుతారు. కలిసి ఉంటే వెలిగిపోతారు/ప్రకాశిస్తారు. (60)
బ్రాహ్మణేషు చ యే శూరాః స్త్రీషు జ్ఞాతిషు గోషు చ।
వృంతాదివ ఫలం పక్వం ధృతరాష్ట్ర పతంతి తే॥ 61
బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద, జ్ఞాతుల మీద, ఆవులమీద పరాక్రమం చూపించే వారు తొడిమ నుండి పండు రాలినట్లు పతనం చెందుతారు. (61)
మహానప్యేకజో వృక్షః బలవాన్ సుప్రతిష్ఠితః।
ప్రసహ్య ఏవ వాతేన సస్కంధో మర్దితుం క్షణాత్॥ 62
విడిగా ఉంటే లోతుగా వేళ్లు పాతుకుపోయిన పెద్ద చెట్టును కూడా వాయువు ఒక్కక్షణంలో మానుతో, వేళ్లతో సహా పెల్లగించగలదు. (62)
అథ యే సహితా వృక్షాః సంఘశః సుప్రతిష్ఠితాః।
తే హి శీఘ్రతమాన్ వాతాన్ సహంతేఽన్యోన్యసంశ్రయాత్॥ 63
అవే వృక్షాలు కలిసికట్టుగా వేళ్లూని ఉండి ఒకదాని నొకటి పరస్పరమూ అల్లుకొని ఉంటే తీవ్రమయిన వేగం కల గాలులను సయితం తట్టుకొని నిలుస్తాయి. (63)
ఏవం మనుష్యమప్యేకం గుణైరపి సమన్వితమ్।
శక్యం ద్విషంతో మన్యంతే వాయుర్ద్రుమమివైకజమ్॥ 64
ఇలాగే గుణవంతు లయినా ఒంటరి అయితే గాలి ఒంటరి చెట్టును పెల్లగించి నట్లు పెల్లగించ వచ్చునని శత్రువులు భావిస్తారు. (64)
అన్యోన్యసముపష్టంభాత్ అన్యోన్యాపాశ్రయేణ చ।
జ్ఞాతయః సంప్రవర్ధంతే సరసీవోత్పలాన్యుత॥ 65
ఒకరి కొకరు అండగా ఉండటం వల్లనూ, అన్యోన్యంగా కలిసి ఉండటం చేతనూ జ్ఞాతులు చెరువులోని పద్మాల వలె వృద్ధి పొందుతారు. (65)
అవధ్యా బ్రాహ్మణా గావః జ్ఞాతయః శిశవః స్త్రియః।
యేషాం చాన్నాని భుంజీత యే చ స్యుః శరణాగతః॥ 66
బ్రాహ్మణులు(బ్రహ్మవేత్తలు), గోవులు, జ్ఞాతులు, పసిపిల్లలు, స్త్రీలు, అన్నంపెట్టినవారు, శరణుకోరినవారు వీరు చంపదగని వారు. (66)
న మనుష్యే గుణః కశ్చిద్ రాజన్ సధనతామృతే।
అనాతురత్వాత్ భద్రం తే మృతకల్పా హి రోగిణః॥ 67
ధనవంతుడవడం, ఆరోగ్యం కలవాడవడం ఈ రెండిటినీ మించిన గుణం లేదు. రోగులు చనిపోయిన వారి వంటివారు. నీకు శుభమగు గాక. (67)
అవ్యాధిజం కటుకం శీర్షరోగి
పాపానుబంధం పరుషం తీక్ష్ణముష్ణమ్।
సతాం పేయం యన్న పిబత్యసంతః
మన్యుం మహారాజ పిబ ప్రశామ్య॥ 68
రోగంలేకుండానే కలిగేది, ఘాటయినది. తలనొప్పి కలిగించేది, పాపాల పరంపర పుట్టించేది, కఠినమయినది, తీక్ష్ణము, వేడి అయినది, సజ్జనులు మ్రింగేది, దుర్జనులు మ్రింగలేనిది అయిన కోపాన్ని దిగమ్రింగి ప్రశాంతుడ వగుము. (68)
రోగార్దితా న ఫలాన్యాద్రియంతే
న వై లభంతే విషయేషు తత్త్వమ్।
దుఃఖోపేతా రోగిణో నిత్యమేవ
న బుధ్యంతే ధనభోగాన్న సౌఖ్యమ్॥ 69
రోగపీడితులు ఫలములను(పుత్రులు, పశ్యాది సంపదలు) పొందలేరు. విషయముల తత్త్వమునూ పొందలేరు. రోగులకు సతతమూ దుఃఖమే కలుగుతూ ఉంటుంది. ధనంవల్ల పొందే భోగాలు కానీ సుఖం కానీ వారికి తెలియరాదు. (69)
పురా హ్యుక్తం నాకరోస్త్వం వచో మే
ద్యూతే జితాం ద్రౌపదీం ప్రేక్ష్య రాజన్।
దుర్యోధనం వారయేత్యక్షవత్యాం
కితవత్వం పండితా వర్జయంతి॥ 70
జూదము నాడు పరాభవింపబడిన ద్రౌపదిని చూసి."రాజా! దుర్యోధనుని వారింపు" మని నేను చెప్పాను. కాని నా మాట నీవు పాటించలేదు. పండితులు జూదంమీద ఆసక్తిని త్యజిస్తారు. (70)
న తద్బలం యన్మృదునా విరుధ్యతే
సూక్ష్మో ధర్మస్తరసా సేవితవ్యః।
ప్రధ్వంసినీ క్రూరసమాహితా శ్రీః
మృదుప్రౌఢా గచ్ఛతి పుత్రపౌత్రాన్॥ 71
మెత్తని వానితో విరోధించే బలం నిజమైన బలం కాదు. సూక్ష్మమయిన ధర్మాన్ని శీఘ్రంగా ఆచరించాలి. క్రూరుని సంపద నశించి పోతుంది. మృదుస్వభావుల దగ్గర వృద్ధినొందిన సంపద పుత్రపౌత్రాదులకు చేరుతుంది. (71)
ధార్తరాష్ట్రాః పాండవాన్ పాలయంతు
పాడోః సుతాస్తవ పుత్రాంశ్చ పాంతు।
ఏకారిమిత్రాః కురవో హ్యేకకార్యాః
జీవంతు రాజన్ సుఖినః సమృద్ధాః॥ 72
రాజా! పాండవులను నీకుమారులు రక్షించాలి. పాండుకుమారులు నీపుత్రులను రక్షించాలి. ఇద్దరికీ ఒకడే శత్రువయినా మిత్రుడయినా కావాలి. ఇద్దరికీ కర్తవ్యం ఒకటే కావాలి. అలా సంపత్సమృద్ధితో సుఖులై జీవించాలి. (72)
మేఢీభూతః కౌరవాణాం త్వమద్య
త్వయ్యాధీనం కురుకులమాజమీఢ।
పార్థాన్ బాలాన్ వనవాసప్రతప్తాన్
గోపాయస్వ స్వం యశస్తాత రక్షన్॥ 73
ఇపుడు ఈకురువంశస్థులందరకు నీవే కట్టుకొయ్యవంటివాడవు. కురువంశమంతా నీకు వశమై ఉంది. అజమీఢ వంశంలో పుట్టినవాడవు. బాలురు, అరణ్యవాస సంతాపంతో ఉన్న కౌంతేయులను రక్షించి నీకీర్తిని నిలబెట్టుకో. (73)
సంధత్స్వ త్వం కౌరవాన్ పాండుపుత్రైః
మా తేఽంతరం రిపవః ప్రాట్థయంతు।
సత్యే స్థితాస్తే నరదేవ సర్వే
దుర్యోధనం స్థాపయ త్వం నరేంద్ర॥ 74
కౌరవనాథా! నీవు పాండుపుత్రులతో కౌరవులను కలిపి ఉంచు. శత్రువులు నీ లోపాలను వెదక కుందురుగాక. వారు(పాండవులు) సత్యం మీద నిలబడి ఉన్నారు. నీవు దుర్యోధనుని (సత్యం మీద) నిలుపుము. (74)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి ప్రజాగరపర్వణి విదురనీతివాక్యే షట్ త్రింశోఽధ్యాయః॥ 36 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున ప్రజాగరపర్వమను ఉపపర్వమున
విదురునిహితవాక్యము అను ముప్పది ఆరవ అధ్యాయము. (36)