32. ముప్పది రెండవ అధ్యాయము

(అర్జునుడు కౌరవులకు సందేశమిచ్చుట) సంజయుడు హస్తినకు చేరుట.

వైశంపాయన ఉవాచ
(ధర్మరాజస్య తు వచః శ్రుత్వా పార్థో ధనంజయః।
ఉవాచ సంజయం తత్ర వాసుదేవస్య శృణ్వతః॥
వైశంపాయనుడు పలికాడు. ధర్మరాజు చెప్పిన మాటలు విన్నాక అర్జునుడు శ్రీకృష్ణుడు వింటూండగా సంజయునితో ఇలా అన్నాడు.
అర్జున ఉవాచ
పితామహం శాంతనవం ధృతరాష్ట్రం చ సంజయ।
ద్రోణం సపుత్రం శల్యం చ మహారాజం చ బాహ్లికమ్॥
వికర్ణం సోమదత్తం చ శకునిం చాపి సౌబలమ్।
వినింశతిం చిత్రసేనం జయత్సేనం చ సంజయ॥
భగదత్తం తథా చైవ శూరం రణకృతాం వరమ్॥
యే చాప్యన్యే కురవస్తత్ర సంతి
రాజానశ్చేద్ భూమిపాలాః సమేతాః।
యుయుత్సవః పార్థివాః సైంధవాస్చ
సమానీతా ధార్తరాష్ట్రేన సూత॥
యథా న్యాయం కుశలం వందనం చ
సమాగమే మద్వచనేన వాచ్యాః।
తతో బ్రూయాః సంజయ రాజమధ్యే
దుర్యోధనం పాపకృతాం ప్రధానమ్॥
అర్జునుడు చెపుతున్నాడు. సంజయా! భీష్మపితా మహుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ, ద్రోణుడు, శల్యుడు, బాహ్లికుడు, వికర్ణుడు, సోమదత్తుడు, సుబలపుత్రుడు శకుని, వివింశతి, చిత్రసేనుడు, జయత్సేనుడు, యోధులలో శ్రేష్ఠుడైన భగదత్తుడు, ఇంకా సభలో కౌరవులతో బాటున్న, దుర్యోధనుడు రప్పించిన, యుద్ధ కాంక్షతో వచ్చిన రాజులు, సింధు దేశీయులు మున్నగు వారందరికి నా పక్షాన యథోచితంగా కుశలమడిగి నమస్కరించు. అనంతరం ఆ రాజులందరి సమక్షంలో పాపాత్ములలో ముఖ్యుడైన దుర్యోధనుడితో ఇలా చెప్పు.
వైశంపాయన ఉవాచ
ఏవం ప్రతిష్ఠాస్య ధనంజయస్తం
తతోఽర్థవద్ ధర్మవచ్పైవ పార్థః।
ఉవాచ వాక్యం స్వజనప్రహర్షం
విత్రాసనం ధృతరాష్ట్రాత్మజానామ్॥
వైశంపాయనుడు పలికాడు. అర్జునుడు సంజయుని అనుమతి తీసుకొని ధర్మార్థ యుక్తమై, తన వారికి ఆనందమూ, కౌరవులకు భయమూ కలిగిస్తూ ఈ మాట చెప్పాడు.
అర్జునేన సమాదిష్టః తథేత్యుక్త్వా తు సంజయః।
పార్థానామంత్రయామాస కేశవం చ యశస్వినమ్॥)
అర్జునుడిచ్చిన సందేశాన్ని స్వీకరించి సంజయుడు 'తథాస్తు' అని పలికి పాండవులను, శ్రీకృష్ణుని సెలవడిగాడు.
అనుజ్ఞాతః పాండవేన ప్రయయౌ సంజయస్తదా।
శాసనం ధృతరాష్ట్రస్య సర్వం కృత్వా మహాత్మనః॥ 1
సంజయుడు పాండవుల దగ్గర సెలవు తీసికొని మహాత్ముడైన ధృతరాష్ట్రుని శాసనాన్ని పూర్తిగా పాటించి అక్కడినుండి వెళ్లాడు. (1)
సంప్రాప్య హాస్తినపురం శీఘ్రమేవ ప్రవిశ్య చ।
అంతఃపురం సమాస్థాయ ద్వాఃస్థం వచనమబ్రవీత్॥ 2
హస్తినాపురం చేరి శీఘ్రంగా అంతఃపురంలోకి ప్రవేశించి, ద్వారపాలకుడితో ఇలా అన్నాడు. (2)
ఆచక్ష్వ ధృతరాష్ట్రాయ ద్వాఃస్థ మాం సముపాగతమ్।
సకాశాత్ పాండుపుత్రాణాం సంజయం మా చిరం కృథాః॥ 3
"ద్వారపాలకా! పాండవుల దగ్గరనుండి సంజయుడు వచ్చాడని ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పు. ఆలస్యం చేయకు". (3)
జాగర్తి చేదభివదేస్త్వం హి ద్వాఃస్థ
ప్రవిశేయం విదితో భూమిపస్య।
నివేద్యమత్రాత్యయికం హి మేఽస్తి
ద్వాఃస్థోఽథ శ్రుత్వా నృపతిం జగామ॥ 4
"ద్వారపాలక! మహారాజు మెలకువగా ఉంటే నా నమస్కారాన్ని తెలియజెయ్యి. రాజానుమతితో లోనికి ప్రవేశిస్తాను. అత్యవసరంగా ఆయనకు నివేదించవలసినదుంది". ఆ మాటలు విని ద్వార పాలకుడు రాజు దగ్గరకు వెళ్లాడు. (4)
ద్వాఃస్థ ఉవాచ
సంజయోఽథ భూమిపతే నమస్తే
దిదృక్షయా ద్వారముపాగతస్తే।
ప్రాప్తో దూతః పాండవానాం సకాశాత్
ప్రశాధి రాజన్ కిమయం కరోతు॥ 5
ద్వారపాలకుడు చెప్పాడు - "మహారాజా! నమస్కారం. మిమ్ములను చూడటం కోసం సంజయుడు ద్వారం దగ్గర వేచి ఉన్నాడు. పాండవుల దగ్గరనుండి వచ్చిన దూత అతడు. రాజా! నేనేం చెయ్యాలో శాసించు." (5)
ధృతరాష్ట్ర ఉవాచ
ఆచక్ష్వ మాం కుశలినం కల్పమస్మై
ప్రవేశ్యతాం స్వాగతం సంజయాయ।
న చాహమేతస్య భవామ్యకల్పః
స మే కస్మాద్ ద్వారి తిష్ఠేచ్చ సక్తః॥ 6
ధృతరాష్ట్రుడు అన్నాడు - సంజయునికి స్వాగతం పలికి నాకుశలాన్ని చెప్పు. ఇప్పుడతనిని కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రవేశపెట్టు. అసలు నన్ను కలవడానికి అతనికెప్పుడూ అడ్డులేదు. మరెందుకు అక్కడే ఉన్నాడు? (6)
వైశంపాయన ఉవాచ
తతః ప్రవిశ్యానుమతే నృపస్య
మహద్ వేశ్మ ప్రాజ్ఞశూరార్యగుప్తమ్।
సింహాసనస్థం పార్థివమాససాద
వైచిత్రవీర్యం ప్రాంజలిః సూతపుత్రః॥ 7
వైశంపాయనుడు పలికాడు. జనమేజయా! ఈ ప్రకారంగా సంజయుడు రాజు అనుమతి తీసికొని ప్రాజ్ఞులైన శూరులచే సురక్షితమైన విశాల భవనంలోకి ప్రవేశించి, సింహాసనంపై కూర్చున్న ధృతరాష్ట్రమహారాజుకు చేతులు జోడించి నమస్కరించాడు. (7)
సంజయ ఉవాచ
సంజయోఽహం భూమిపతే నమస్తే
ప్రాప్తోఽస్మి గత్వా నరదేవ పాండవాన్।
అభివాద్య త్వాం పాండుపుత్రో మనస్వీ
యుధిష్ఠిరః కుశలం చాన్వపృచ్ఛత్॥ 8
సంజయుడు ఇలా విన్నవించాడు. రాజా! నమస్కారం. నేను సంజయుణ్ణి. పాండవుల నుండి వచ్చాను. మంచిమనసున్న ధర్మరాజు నీకు నమస్కారం చేసి మీ క్షేమాన్ని అడిగాడు. (8)
స తే పుత్రాన్ పృచ్ఛతి ప్రీయమాణః
కచ్చిత్ పుత్రైః ప్రీయసే నప్తృభిశ్చ।
తథా సుహృద్భిః సచివైశ్చ రాజన్
యే చాపి త్వాముపజీవంతి తైశ్చ॥ 9
అతడు ప్రేమతో మీ పుత్రుల క్షేమసమాచారాన్ని అడిగాడు. 'రాజా! నీవు నీ కుమారులతో, మనుమలతో, మునిమనుమలతో, స్నేహితులతో, మంత్రులతో, ఆశ్రితులతో కలిసి ఆనందంగా ఉన్నావా!' (9)
ధృతరాష్ట్ర ఉవాచ
అభినంద్య త్వాం తాత వదామి సంజయ
అజాతశత్రుం చ సుఖేన పార్థమ్।
కచ్చిత్ స రాజా కుశలీ సపుత్రః
సహామాత్యః సానుజః కౌరవాణామ్॥ 10
ధృతరాష్ట్రుడు పలికాడు. సంజయా! నిన్ను అభినందించి అడుగుతున్నాడు. అజాతశత్రువైన ధర్మరాజు కుశలమేకదా! కౌరవుల సోదరుడైన ధర్మరాజు పుత్రులతో, సోదరులతో కుశలమేకదా! (10)
సంజయ ఉవాచ
సహామాత్యః కుశలీ పాండుపుత్రః
బుభూషతే యచ్చ తేఽగ్రే ఆత్మనోఽభూత్।
నిర్ణిక్తధర్మార్థకరో మనస్వీ
బహుశ్రుతో దృష్టిమాన్ శీలవాంశ్చ॥ 11
సంజయుడు పలికాడు - పాండునందనుడు తన మంత్రులతో క్షేమంగా ఉన్నాడు. మునుపటి వారి రాజ్యసంపదలు కోరుతున్నాడు. అతడు ధర్మార్థాలను సరిగా పాటిస్తాడు. దయాళువు, విద్వాంసుడు, దూరదర్శి, శీలవంతుడూను. (11)
పరో ధర్మాత్ పాండవస్యానృశంస్యం
ధర్మపరో విత్తచయాన్మతోఽస్య।
సుఖప్రియే ధర్మహీనేఽనపార్థేఽ
నురుధ్యతే భారత తస్య బుద్ధిః॥ 12
భారత! పాండునందనుడి దృష్టిలో అన్ని ధర్మాలకంటే కరుణయే పరమధర్మం. ధనార్జనకంటె ధర్మపాలనయే గొప్పదని అతడు భావిస్తాడు. అతని బుద్ధి ధర్మహీనమూ, వ్యర్థమూ ఐన సుఖాలపట్లమ్ ప్రియాల పట్ల ప్రవర్తింపదు. (12)
వి॥సం॥ అన్నాదుల వలన దేహపుష్టి సుఖాన్ని కానీ, పుత్రాది ప్రేమను కానీ పరోపకారదృష్టి తోనే అనుభవిస్తున్నారు. కానీ కామదృష్టితో కాదు(నీల).
పరప్రయుక్తః పురుషో విచేష్టతే
సూత్రప్రోతా దారుమయీవ యోషా।
ఇమం దృష్ట్వా నియమం పాండవస్య
మన్యే పరం కర్మ దైవం మనుష్యాత్॥ 13
తాడుతో కట్టబడిన కొయ్యబొమ్మ ఇతరుల చేత ఆడింపబడుతూ ఎలా నృత్యంచేస్తుందో, అదే విధంగా మనిషి పరమాత్మచే ప్రేరేపింపబడి పనిచేస్తూంటాడు. యుధిష్ఠిరుని కష్టం చూశాక 'మానవుని ప్రయత్నం కంటె దైవ సంకల్పమే గొప్పద'ని అనిపిస్తూంది. (13)
ఇమం చ దృష్ట్వా తవ కర్మదోషం
పాపోదర్కం ఘోరమవర్ణరూపమ్।
యావత్ పరః కామయతేఽతివేలం
తావన్నరోఽయం లభతే ప్రశంసామ్॥ 14
అలాగే మిక్కిలి భయంకరమైన, వర్ణింపశక్యంగాని, పాపాన్ని కలిగించే నీకర్మదోషాన్ని చూసి 'విధి ఎంతవరకూ ఇష్టపడగలదో అంతవరకే మానవుడు ప్రశంసను పొందగల్గుతాడు' అని కూడా భావిస్తున్నాను. (14)
వి॥సం॥ నీకర్మదోషాన్ని తెలిసికూడ నిన్నే సేవించడానికి ఇష్టపడ్డం వల్ల ధర్మరాజు లోకప్రశంసను పొందుతాడు. న్యాయలబ్ధమైన ఇతరుల భాగాన్ని ఇవ్వనందుకు లోకం నిన్ను నిందిస్తుంది. అందువల్ల శీఘ్రంగా వారి రాజ్యభాగాన్ని వారికియ్యి అని ఇందలి ఆంతర్యం. (దుర్ఘ)
స్వస్వరూపాన్ని (స్వధర్మాన్ని) అతిక్రమించని వాని పాపం శత్రువులకు చెందుతుంది. "తస్యపుత్రా దాయముపయంతి సుహృదః సాధుకృత్యాం దృషంతః పాపకృత్యామ్" అని శ్రుతి(నీల).
అజాతశత్రుస్తు విహాయ పాపం
జీర్ణాం త్వచం సర్ప ఇవాసమర్థామ్।
విరోచతే ఽహార్యవృత్తేన వీరః
యుధిష్ఠిరస్త్వయి పాపం విసృజ్య॥ 15
సర్పం చివికిపోయిన (పాతచర్మాన్ని) కుబుసాన్ని విడిచి ప్రకాశించినట్లుగా అజాతశత్రువైన యుధిష్ఠిరుడు పాపాన్ని మీలో విడిచిపెట్టి తాఉ సదాచారంతో ప్రకాశిస్తున్నాడు. (15)
వి॥తె॥ ఇక్కడే తెలుగులో సంజయుడు ధర్మరాజును గురించి "మెత్తని పులి" అని అన్నాడు.
చిచ్చుపెట్టికాల్చిన యది నీ ఉపేక్షయ-
వశీకృతచిత్తుడు ధర్మసూతి మెత్తనిపులి".
ఉద్యో -2-14
హంతాత్మనః కర్మ నిబోధ రాజన్
ధర్మార్థయుక్తాదార్యవృత్తాదపేతమ్।
ఉపక్రోశం చేహ గతోఽసి రాజన్
భూయశ్చ పాపం ప్రసజేదముత్ర॥ 16
రాజా! ధర్మార్థాలతో కూడి యుండే పెద్దవారి నడవడికకు వ్యతిరేకంగా ఉన్న మీరు చేసిన పనులను గూర్చి బాగా తెలిసికోండి. వాని వల్ల ఇహలోకంలో మీరు నిందలపాలవడమే కాక పరలోకంలో పాపమయమైన నరకదుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. (16)
స త్వమర్థం సంశయితం వినా తైః
ఆశంససే పుత్రవశానుగోఽస్య।
అధర్మశబ్దశ్చ మహాన్ పృథివ్యాం
నేదం కర్మ త్వత్సమం భారతాగ్ర్య॥ 17
భారతశ్రేష్ఠా! నీవు పుత్రాధీనుడవై సంశయించకుండా పాండవుల రాజ్యాన్ని కోరుకొంటున్నావు. అలాగే కనుక జరిగితే ఈ భూమిమీద ఈ అధర్మంవల్ల నీకు పెద్ద నింద కలుగుతుంది. (అది నీకు మంచిది కాదు) ఆ పని నీకు యోగ్యమైంది కాదు. (17)
హీనప్రజ్ఞో దౌష్కులేయో నృశంసః
దీర్ఘం వైరీ క్షత్రవిద్యాస్వధీరః।
ఏవం ధర్మానాపదః సంశ్రయేయుః
హీనవీర్యో యశ్చ భవేదశిష్టః॥ 18
బుద్ధిహీనుడు, చెడ్డకులంలో పుట్టినవాడు, క్రూరుడు, దీర్ఘవైరం కలవాడు, క్షత్రియోచితమైన యుద్ధవిద్య తెలియనివాడు, పరాక్రమహీనుడు, శిష్టుడు కానివాడు ఇటువంటి ఆపదలనే పొందుతారు. (18)
కులే జాతో బలవాన్ యో యశస్వీ
బహుశ్రుతః సుఖజీవీ యతాత్మా।
ధర్మాధర్మౌ గ్రథితౌ యో బిభర్తి
స హ్యస్య దిష్టస్య వశాదుపైతి॥ 19
ఉన్నతవంశంలో పుట్టినవాడు, బలవంతుడు, కీర్తికలవాడు, అన్నీ తెలిసినవాడు, సుఖంగా జీవించేవాడు, మనస్సును అదుపు చేయగలవాడు. ధర్మాధర్మాలు బాగా తెలిసినవాడు, భాగ్యవశం వల్ల మంచి గుణసంపదను పొందుతాడు. (19)
వి॥సం॥ సత్యం లేకపోతే అనృతం లేదు. అనృతమైన దేహం లేకపోతే సత్యమైన బ్రహ్మలేదు. కాబట్టి రెండింటిని ధరించిన వాడే సద్వంశంలో పుట్టడం మొ॥ ఈ షడ్గుణాలు పొందగలడు. (నీల)
కథం హి మంత్రాగ్ర్యథరో మనీషీ
ధర్మార్థయోరాపది సంప్రణేతా।
ఏవం యుక్తః సర్వమంత్రై రహీనః
నరో నృశంసం కర్మ కుర్యాదమూఢః॥ 20
నీకు గొప్ప మంత్రులున్నారు. నీవు బుద్ధి కుశలుడవు. ఆపత్కాలంలో ధర్మాధర్మాలను ఎరిగి ప్రవర్తించేవాడివి. అన్నివిధాలా మంచి సలహాలను పొందగలవాడివి, నీవంటి సాధన సంపత్తిగల విజ్ఞుడు ఇటువంటి క్రూరమైన పనిని ఎలా చెయ్యగలడు? (20)
తవ హ్యమీ మంత్రవిదః సమేత్య
సమాసతే కర్మసు నిత్యయుక్తాః।
తేషామయం బలవాన్ నిశ్చయశ్చ
కురుక్షయే నియమేనోదపాది॥ 21
మంత్రాంగం తెలిసిన కర్ణాదిమంత్రులందరూ ఒకచోట కలిసి చేయవలసిన పనులను నిర్ణయిస్తారు కదా! కౌరవుల నాశనానికి కారణమైన 'పాండవులకు రాజ్య మియ్యకూడదు' అని దృఢమైన నిర్ణయం ఏదైనా తీసికొన్నారా! (21)
అకాలికం కురవో నాభవిష్యన్
పాపేన చేత్ పాపమజాతశత్రుః।
ఇచ్ఛేజ్జాతు త్వయి పాపం విసృజ్య
నిందా చేయం తవ లోకేఽభవిష్యత్॥ 22
రాజా! అజాతశత్రువైన యుధిష్ఠిరుడు పాపాన్నంతా మీనెత్తినవేశి, పాపులను తొలగించే పాపపుపనికి ఒడిగడితే కౌరవులంతా అకాలమరణం పొందుతారు. అపుడు లోకమంతా నిన్ను నిందిస్తుంది. (22)
వి॥సం॥ జూదాన్ని నివారింపలేకపోయావన్న అపకీర్తి కూడా నీకే (ధృతరాష్ట్రునకే) చెందుతుంది. (లక్షా)
కిమన్యత్ర విషయాదీశ్వరాణాం
యత్ర పార్థః పరలోకం స్మ ద్రష్టుమ్।
అత్యక్రామత్ స తథా సమ్మతః స్యాత్
న సంశయో నాస్తి మనుష్యకారః॥ 23
లోకపాలుర ఆధిపత్యంలో లేనిదేముంటుంది? అర్జునుడు పరలోకాన్ని చూడటానికి వెళ్లాడు. అయినా అతడు కష్టాలు పడుతూనే ఉన్నాడు. అందువల్ల దైవబలంతో సమానమైన మానవుని పురుషకారం ఏమీలేదు. ఇందులో సందేహం లేదు. (23)
ఏతాణ్ గుణాన్ కర్మ కృతానవేక్ష్య
భావాభావౌ వర్తమానావనిత్యౌ।
బలిర్హి రాజా పారమవిందమానః
నాన్యత్ కాలాత్ కారణం తత్ర మేనే॥ 24
శౌర్యవిద్యాదిగుణాలు పూర్వకర్మానుసారంగా లభిస్తాయి. ప్రాణులకు ఇప్పుడున్న ఔన్నత్యం, అవమానం అనిత్యమైనవే. ఇవన్నీ ఆలోచించే బలిచక్రవర్తి వీని ఆవలిఒడ్డు తెలిసికోలేక, కాలానికి మించిన వేరే కారణం లేదని గ్రహించాడు. (24)
చక్షుః శ్రోత్రే నాసికా త్వక్ చ జిహ్వా
జ్ఞానస్యైతాన్యాయతనాని జంతోః।
తాని ప్రేతాన్యేవ తృష్ణాక్షయాంతే
తాన్యవ్యథో దుఃఖహీనః ప్రణుద్యాత్॥ 25
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఐదు ప్రాణుల జ్ఞానానికి స్థానాలు. కోరిక నశించాక ఇవన్నీ ఆనందంగా ఉంటాయి. మానవుడు బాధలు, దుఃఖాలు లేకుండా ఉండాలంటే ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోవాలి. (25)
న త్వేన మన్యే పురుషస్య కర్మ
సంవర్తతే సుప్రయుక్తం యథావత్।
మాతుః పితుః కర్మణాభిప్రసూతః
సంవర్థతే విధివత్ భోజనేన॥ 26
తల్లిదండ్రుల ప్రయత్నంవల్ల కలిగిన పుత్రుడు విధిపూర్వకంగా భోజనాదులతో వృద్ధినొందినట్లుగా, మానవుడు పురుషార్థాలను సరిగా నిర్వహిస్తేనే అవి మంచి ఫలితాల నిస్తాయంటారు. కాని నేనలా భావించటం లేదు. (ఇందులో కూడ దైవమే ప్రధానమంటాను) (26)
ప్రియాప్రియే సుఖదుఃఖే చ రాజన్
నిందాప్రశంసే చ భజంత ఏవ।
పరస్త్వేనం గర్హయతేఽపరాధే
ప్రశంసతే సాధువృత్తం తమేవ॥ 27
రాజా! ఇష్టానిష్టాలు, సుఖదుఃఖాలు, నింద్రాప్రశంసలు, మానవుడు పొందుతూ ఉంటాడు. తప్పుచేసినవాని, లోకం నిందిస్తుంది. మంచి చేస్తే వానినే పొగడుతుంది. (27)
స త్వా గర్హే భారతానాం విరోధాత్
అంతో నూనం భవితాయం ప్రజానామ్।
నో చేదిదం తవ కర్మాపరాధాత్
కురూన్ దహేత్ కృష్ణవర్త్మేవ కక్షమ్॥ 28
అందువల్ల భరతవంశీయుల ఈ నిరోధం వల్ల తప్పనిసరిగా ప్రజానీకం నశిస్తుంది. దీనికి నిన్నే నిందిస్తున్నాను. నేను సూచించిన ప్రకారం చేయకపోతే అగ్నిజ్వాల అడవినంతా తగులబెట్టినట్లు, నీ అపరాధం వల్ల జరిగే ఈపని(యుద్ధం) కౌరవులందరినీ దహిస్తుంది. (28)
త్వమేవైకో జాతు పుత్రస్య రాజన్
వశం గత్వా సర్వలోకే నరేంద్ర।
కామాత్మనః శ్లాఘనో ద్యూతకాలే
నాగాః శమం పశ్య విపాకమస్య॥ 29
రాజా! అందరిలో నీవొక్కడివి మాత్రమే స్వేచ్ఛగా ప్రవర్తించే పుత్రునికి అధీనుడవై, జూదసమయంలో అతణ్ణి ప్రశంసించావు. అందువల్ల శాంతి పొందలేకపోయావు. ఇపుడు దాని విపరీత పరిణామాన్ని చూడు. (29)
అనాప్తానాం సంగ్రహాత్ త్వం నరేంద్ర
తథాఽఽప్తానాం నిగ్రహాచ్పైవ రాజన్।
భూమిం స్ఫీతాం దుర్బలత్వాదనంతామ్
అశక్తస్త్వం రక్షితుం కౌరవేయ॥ 30
నరేంద్రా! ఆప్తులుకాని శకుని, కర్ణుడు వంటివారిని చేరదీయడం వల్ల, ఆప్తులైన వారిని దండించడం వల్ల దుర్బలుడవైన నీవు విశాలమై, అనంతమైన ఈ భూమిని రక్షించడానికి సమర్థుడవు కావు. (30)
అనుజ్ఞాతో రథవేగావధూతః
శ్రాంతోఽభిపద్యే శయనం నృసింహ।
ప్రాతః శ్రోతారః కురవః సభాయామ్
అజాతశత్రోర్వచనం సమేతాః॥ 31
నరశ్రేహ్ఠా! రథవేగంవల్ల బాగా బడలిక చెందాను. నీవు అనుమతిస్తే నేను వెళ్లి విశ్రాంతి తీసికొంటాను. రేపు ఉదయం సభలో కౌరవులంతా అజాతశత్రువైన ధర్మజుని మాటలు వినగలరు. (31)
ధృతరాష్ట్ర ఉవాచ
అనుజ్ఞాతోఽస్యవసథం పరేహి
ప్రపద్యస్య శయనం సూతపుత్ర।
ప్రాతః శ్రోతారః కురవః సభాయామ్
అజాతశత్రోర్వచనం త్వయోక్తమ్॥ 32
ధృతరాష్ట్రుడు పలికాడు. సూతపుత్రా! సంజయా! నేననుమతిస్తున్నాను. నీవు నీ ఇంటికి వెళ్లి నిద్రించు. నీవు చెప్పినట్లుగా రేపు ఉదయం సభలో కౌరవులు ధర్మరాజు మాటలను వింటారు. (32)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి ధృతరాష్ట్రసంజయసంవాదే ద్వాత్రింశోఽధ్యాయః॥ 32 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర సంజయ సంవాదమను ముప్పది రెండవ అధ్యాయము. (32)
(దాక్షిణాత్య అధిక పాఠములోని 7 1/2 శ్లోకములతో కలిపి మొత్తం 39 1/2 శ్లోకములు)