31. ముప్పది యొకటవ అధ్యాయము

యుధిష్ఠిరుడు అతిముఖ్యులైన కురువంశీయులకు సందేశమిచ్చుట.

యుధిష్ఠిర ఉవాచ
ఉత సంతమసంతం వా బాలం వృద్ధం చ సంజయ।
ఉతాబలం బలీయాంసం ధాతా ప్రకురుతే వశే॥ 1
యుధిష్ఠిరుడు ఇట్లు కొనసాగిస్తున్నాడు.
సంజయా! మంచివాడైనా, చెడ్డవాడైనా, బాలుడైనా, వృద్ధుడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా ఎవరినైనాసరే విధాత తన అధీనంలో ఉంచుకుంటాడు. (1)
ఉత బాలాయ పాండిత్యం పండితాయోత బాలతామ్।
దదాతి సర్వమీశానః పురస్తాచ్ఛుక్రముచ్చరన్॥ 2
ఈశ్వరుడు ప్రాణులకు పూర్వజన్మ కృతమైన కర్మానుసారంగా ఫలాన్నిస్తాడు. బాలుడికి పాండిత్యం, పండితుడికి బాలత్వం ఇవ్వగలడు. (మూర్ఖుని విద్వాంసునిగా, విద్వాంసుని మూర్ఖునిగా చేయగలడు.) (2)
బలం జిజ్ఞాసమానస్య ఆచక్షీథా యథాతథమ్।
అథ మంత్రం మంత్రయిత్వా యాథాతథ్యేన హృష్టవత్॥ 3
దుర్యోధన ధృతరాష్ట్రులు మా బలాన్ని గురించి అడిగితే ఉన్నదున్నట్లుగా చెప్పు. తరువాత వారు ఆప్తులతో సమాలోచన చేసి కర్తవ్యాన్ని నిర్ణయించుకొంటారు. (3)
గావల్గణే కురూన్ గత్వా ధృతరాష్ట్రం మహాబలమ్।
అభివాద్యోపసంగృహ్య తతః పృచ్ఛే రనామయమ్॥ 4
గవల్గణకుమారా! నీవు తిరిగి హస్తినాపురానికి వెళ్లాక, మహాబలుడైన ధృతరాష్ట్రుని పాదాలుపట్టి మా నమస్కారాలు తెలియజేసి, వారి కుశలాన్ని అడుగు. (4)
బ్రూయాశ్పైనం త్వమాసీనం కురుభిః పరివారితమ్।
తవైవ రాజన్ వీర్యేణ సుఖం జీవంతి పాండవాః॥ 5
ఆ తరువాత కౌరవులతో బాటుగా సుఖాసీనుడై ఉన్న మహారాజుతో "రాజా! నీ సామర్థ్యం చేత పాండవులంతా సుఖంగా జీవిస్తున్నారు." అని చెప్పు. (5)
వి॥తె॥ ఈ భావాన్ని ఆధారంగా చేసుకొనే తెలుగులో "సంజయుని కుశల ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు"
ఆ రాజు మాదెసం గల
కారుణ్యము కతమునను సుఖంబున నిట్లు
న్నారము" అని కొంత వెటకారం తోచెటట్లు అన్నాడు.
తవ ప్రసాదాత్ బాలాస్తే ప్రాప్తా రాజ్యమరిందమ।
రాజ్యే తాన్ స్థాపయిత్వాగ్రే నోపేక్షస్వ వినశ్యతః॥ 6
శత్రుదమన! నీ అనుగ్రహం వల్ల నీ కుమారులు బాలురైనా రాజ్యాన్ని పొందారు. మొదట రాజ్యాధికారంలో కూర్చోబెట్టి తరువాత వారు నశిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దు. (6)
సర్వమప్యేతదేకస్య నాలం సంజయ కస్యచిత్।
తాత సంహత్య జీవామః ద్విషతాం మా వశం గమః॥ 7
సంజయా! ఇంకా ఇలా చెప్పు-"తండ్రి! ఈ రాజ్యమంతా ఇచ్చినా ఒకనికి చాలదు. చాలునని సంతృప్తిపడడు. మనమంతా కలిసి జీవిద్దాం - మన శత్రువులకు లోబడకు" అని చెప్పు. (7)
తథా భీష్మం శాంతనవం భారతానాం పితామహమ్।
శిరసాభివదేథాస్త్వం మమ నామ ప్రకీర్తయన్॥ 8
అభివాద్య చ వక్తవ్యః తతోఽస్మాకం పితామహః।
భవతా శంతనోర్వంశః నిమగ్నః పునరుద్ధృతః॥9
స త్వం కురు తథా తాత స్వమతేన పితామహ।
యథా జీవంతి తే పౌత్రాః ప్రీతిమంతః పరస్పరమ్॥ 10
అదేవిధంగా భరతవంశ పితామహుడు, శంతను కుమారుడైన భీష్మునికి, నా పేరు చెప్పి శిరస్సు వంచి అభివాదం చేసి ఇలా చెప్పు-'తాతా! నీవు నశించిపోతున్న శంతనుని వంశాన్ని ఉద్ధరించావు. నీ మనుమలైన కౌరవ పాండవులు పరస్పరం ప్రేమతో జీవించే విధంగా నీకిష్టమైన రీతిగా చెయ్యి.' (8,9,10)
వి॥సం॥ భరతానా మమద్యపమ్ అని పాఠాంతరం. అప్పుడు రాజులు సాధారణంగా మద్యపానం చేసేవారు. భీష్ముడు మాత్రం మద్యపానం చేయడు అని సూచన. (లక్షా)
తథైవ విదురం బ్రూయాః కురూణాం మంత్రధారిణమ్।
అయుద్ధం సౌమ్య భాషస్వ హితకామో యుధిష్ఠిరే॥ 11
అదే విధంగా కౌరవుల మంత్రియైన విదురునితో ఇలా చెప్పు - 'సౌమ్యుడా! యుధిష్ఠిరుని హితాభిలాషిగా నీవు యుద్ధం వద్దనే సలహా చెప్పు.' (11)
అథ దుర్యోధనం బ్రూయాః రాజపుత్రమమర్షణమ్।
మధ్యే కురూణామాసీనమ్ అనునీయ పునః పునః॥ 12
అటుతర్వాత కౌరవుల మధ్య అసహనంగా కూర్చొని ఉన్న ధృతరాష్ట్ర మహారాజు కుమారుడైన దుర్యోధనుని మళ్ళీ మళ్లీ అనునయించి ఇలా చెప్పు. (12)
అపాపాం యదుపైక్షస్త్వం కృష్ణామేతాం సభాగతామ్।
తద్ దుఃఖమతితిక్షామ మా వధిష్మ కురూనితి॥ 13
నీవు ఏ పాపం చెయ్యని ద్రౌపదిని నిండుకొలువులోకి రప్పించి ఎంతటి అవమానం చేసినా, ఆ దుఃఖాన్నంతా నహించాం. కౌరవులను మేము చంపుకోము. (13)
ఏవం పూర్వాపరాన్ క్లేశాన్ అతితిక్షంత పాండవాః।
బలీయాంసోఽపి సంతో యత్ తత్ సర్వం కురవో విదుః॥ 14
ఈ విదంగ పాండవులు ముందు వెనుకల కష్టాలు అనుభవించారు. బలవంతులైనప్పటికి వాటిని సహించారు. ఆ సంగతంతా కౌరవులు ఎరుగుదురు. (14)
యన్నః ప్రావ్రాజయః సౌమ్య అజినైః ప్రతివాసితాన్।
తద్ దుఃఖమతితిక్షామ మా వధిష్మ కురూనితి॥ 15
సౌమ్యుడా! మమ్మల్ని నారబట్టలతో అడవులకు పంపినా, కౌరవులను చంపాలనుకోక ఆకష్టం అంతా సహించాం. (15)
యత్ కుంతీం సమతిక్రమ్య కృష్ణాం కేశేష్వధర్షయత్।
దుఃశాసనస్తేనుమతే తచ్చాస్మాభి రుపేక్షితమ్॥ 16
నీ అనుమతితో దుఃశాసనుడు తల్లికుంతిని కూడ లక్ష్యపెట్టకుండా, అతిక్రమించి ద్రౌపది జుట్టుపట్టుకొని అవమానించాడు. దాన్ని కూడా మేము ఉపేక్షించాం. (16)
అథోచితం స్వకం భాగం లభేమహి పరంతప।
నివర్తయ పరద్రవ్యాద్ బుద్ధిం గృద్ధాం నరర్షభ॥ 17
పరంతసా! ఏమైనప్పటికి మాకు రావలసిన రాజ్యభాగం మేం పొందాలి. నరశ్రేష్ఠుడా! ఇతరుల సొత్తును ఆశించే బుద్ధిని మళ్లించుకో. (17)
శాంతిరేవం భవేద్ రాజన్ ప్రీతిశ్పైవ పరస్పరమ్।
రాజ్యైకదేశమపి నః ప్రయచ్ఛ శమమిచ్ఛతామ్॥ 18
రాజా! ఇలా అయితే శాంతి ఏర్పడుతుంది. పరస్పరం ప్రీతికూడా ఏర్పడుతుంది. శాంతిని కోరుతున్న మాకు రాజ్యంలో కొంత భాగమైనా ఇయ్యి. (18)
అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతమ్।
అవసానం భవత్వత్ర కించిదేకం చ పంచమమ్॥ 19
అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం అనే నాలుగింటితో బాటు ఐదవది ఏదో ఒకటి కలిపి మాకు రాజ్యభాగం ఇయ్యి. (19)
భ్రాతౄణాం దేహి పంచానాం పంచగ్రామాన్ సుయోధన౭.
శాంతిర్నోఽస్తు మహాప్రాజ్ఞ జ్ఞాతిభిః సహ సంజయ॥ 20
సుయోధనా! మా ఐదుగురు సోదరులకు ఐదుగ్రామాలు అయినా ఇయ్యి సంజయా! ఇలా జరిగితే మాజ్ఞాతులతో మాకు శాంతి కలుగుతుంది. మహాప్రాజ్ఞా! మాకు శాంతి కావాలి. (20)
భ్రాతా భ్రాతరమన్వేతు పితా పుత్రేణ యుజ్యతామ్।
స్మయమానాః సమాయాంతు పంచాలాః కురుభిః సహ॥ 21
అక్షతాన్ కురుపాంచాలాన్ పశ్యేయమితి కామయే।
సర్వే సుమనసస్తాత శామ్యామ భరతర్షభ॥ 22
సోదరుడు తన సోదరునితో కలిసుండాలి. తండ్రి తన కొడుకుతో కలిసుండాలి. పాంచాల దేశీయులు, కౌరవులు కలిసుండాలి. కురుపాంచాల దేశీయులు ఎటువంటి హానీ లేకుండా ఉండాలని కోరుకొంటున్నాను. భరతశ్రేష్ఠా! దుర్యోధనా! మనమంతా మంచిమనస్సు కలవారమై శాంతి పొందాలి. నీవా విధంగా చెయ్యి. (21,22)
అలమేన శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ।
ధర్మార్థయోరబలం చాహం మృదవే ధారుణాయ చ॥ 23
సంజయా! నేను శాంతికొరకు సమర్థుడను. అలాగే యుద్ధానికీ, ధర్మార్థాల సాధనకూ సమర్థుడిని - మృదువైన పనికి, దారుణమైన పనికి కూడ నేను సమర్థుడనే. (23)
వి॥తె॥ ఈ సంజయుని రాయబారం వల్ల ఏమీ ఫలితం సిద్ధించలేదు. అందుకే తిరుపతి వేంకట కవులు దీన్ని "శుష్కప్రియాలూ, శూన్య హస్తాలూ" అన్నారు.
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి యుధిష్ఠిరసందేశే ఏకత్రింశో ఽధ్యాయః॥ 31 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర సందేశమను ముప్పది ఒకటవ అధ్యాయము. (31)