18. పదునెనిమిదవ అధ్యాయము

ఇంద్రుడు స్వర్గమున కేగుట - శల్యుడు దుర్యోధనుని చేరుట.

శల్య ఉవాచ
తతః శక్రః స్తూయమానో గంధర్వాప్సరసాం గణైః।
ఐరావతం సమారుహ్య ద్విపేంద్రం లక్షణైర్యుతమ్॥ 1
పావకః సుమహాతేజాః మహర్షిశ్చ బృహస్పతిః।
యమశ్చ వరుణశ్చైవ కుబేరశ్చ ధనేశ్వరః॥ 2
సర్వైర్దేవైః పరివృతః శక్రో వృత్రనిషూదనః।
గంధర్వైరప్సరోభిశ్చ యాతస్త్రిభువనం ప్రభుః॥ 3
శల్యుడిట్లు చెప్పాడు. గంధర్వాప్సరోగణాలు ప్రశంసిస్తూ ఉన్నాయి. శుభచిహ్నాలు కల గజోత్తమం ఐరావతం ఎక్కాడు దేవేంద్రుడు. తేజస్వి అయిన అగ్ని, బృహస్పతి, యముడు, వరుణుడ్, కుబేరుడు మొదలయిన దేవతలందరితో కలిసి వృత్రసంహారకుడయిన ఇంద్రుడు స్వర్గానికి వెళ్లాడు. (1,2,3)
స సమేత్య మహేంద్రాణ్యా దేవరాజః శతక్రతుః।
ముదా పరమయా యుక్తః పాలయామాస దేవరాట్॥ 4
దేవతలకు రాజయిన శతక్రతుడు శచీదేవితో కలసి పరమానందంతో స్వర్గాన్ని పాలింపసాగాడు. (4)
తతః స భగవాంస్తత్ర అంగిరాః సమదృశ్యత।
అథర్వవేదమంత్రైశ్చ దేవేంద్రం సమపూజయత్॥ 5
అక్కడ అంగిరసుడు ప్రత్యక్షమయి, దేవేంద్రుని, అధర్వవేద మంత్రాలతో స్తుతించాడు. (5)
తతస్తు భగవానింద్రః సంహృష్టః సమపద్యత।
వరం చ ప్రదదే తస్మై అథర్వాంగిరసే తదా॥ 6
ఆ స్తుతితో దేవేంద్రుడు చాలా సంతోషించి అథర్వవేద మంత్రవేత్త అయిన అంగిరసునికి ఒక వరం ఇచ్చాడు. (6)
అథర్వాంగిరసో నామ వేదేఽస్మిన్ వై భవిష్యతి।
ఉదాహరణమేతద్ధి యజ్ఞభాగం చ లప్స్యసే॥ 7
ఈ స్తుతి అథర్వ వేదంలో అథర్వాంగిరసమనే పేర ప్రసిద్ధి నొందుతుంది. నీకు యజ్ఞభాగం కూడా లభిస్తుంది. (7)
వి॥సం॥ ఈ స్తుతి భాగానికి అథర్వాంగిరసమని పేరు వస్తుంది. ఆ మంత్రభాగానికి ఋషి అంగిరసుడని భావం. ఉదాహరణం అంటే వాక్యం - (నీల)
ఏవం సంపూజ్య భగవాన్ అథర్వాంగిరసం తదా।
వ్యసర్జయన్ మహారాజ దేవరాజః శతక్రతుః॥ 8
మహారాజా! శతక్రతువయిన దేవేంద్రుడు అలా అథర్వాంగిరసుని సత్కరించి వీడ్కొలిపాడు. (8)
సంపూజ్య సర్వాంస్త్రిదశాన్ ఋషింశ్చాపి తపోధనాన్।
ఇంద్రః ప్రముదితో రాజన్ ధర్మేణాపాలయత్ ప్రజాః॥ 9
అలాగే దేవతలనూ, ఋషులనూ, తాపసులనూ సన్మానించి దేవేంద్రుడు ఆనందించాడు. ధర్మపూర్వకంగా ప్రజాపాలనం సాగించాడు. (9)
ఏవం దుఃఖమనుప్రాప్తమ్ ఇంద్రేణ సహభార్యయా।
అజ్ఞాతవాసశ్చ కృతః శత్రూణాం వధకాంక్షయా॥ 10
ఇలా భార్యతో సహా ఇంద్రుడు దుఃఖం అనుభవించడమే కాదు. శత్రు సంహారకోసం అజ్ఞాతవాసం కూడా చేశాడు. (10)
నాత్ర మన్యు స్త్వయా కార్యః యత్ల్కిష్టోఽసి మహావనే।
ద్రౌపద్యా సహ రాజేంద్ర భ్రాతృభిశ్చ మహాత్మభిః॥ 11
అందుచేత రాజేంద్రా! మహాత్ములయిన తమ్ములతోనూ, ద్రౌపదితోనూ అడవిలో యాతనపడ్డామని ఇపుడు దుఃఖించకు. (11)
ఏవం త్వమపి రాజేంద్ర రాజ్యం ప్రాప్స్యసి భారత।
వృత్రం హత్వా యథా ప్రాప్తః శక్రః కౌరవనందన॥ 12
రాజేంద్రా! ఇంద్రుడు వృత్రాసురుని చంపి రాజ్యం ఎలా పొందాడో అలాగే నీవూ రాజ్యం పొందుతావు. (12)
దురాచారశ్చ నహుషో బ్రహ్మద్విట్ పాపచేతనః।
అగస్త్వశాపాభిహతః వినష్టః శాశ్వతీః సమాః॥ 13
దుష్టకృత్యాలు చేస్తూ బ్రహ్మద్వేషి, పాపాత్ముడూ అయిన నహుషుడు అగస్త్యుని శాపం తగిలి చాలా ఏళ్లు పతితుడయ్యాడు. (13)
ఏవం తవ దురాత్మానః శత్రవః శత్రుసూదన।
క్షిప్రం నాశం గమిష్యంతి కర్ణదుర్యోధనాదయః॥ 14
ఇలాగే దుష్టులయిన కర్ణదుర్యోధనాది శత్రువులు త్వరలోనే నశిస్తారు. (14)
తతః సాగరపర్యంతాం భోక్ష్యసే మేదినీమిమామ్।
భ్రాతృభిః సహితో వీర ద్రౌపద్యా చ సహానయా॥ 15
తరువాత ద్రౌపదితోను, తమ్ములతోనూ కలిపి ఈ భూమి నంతటినీ అనుభవిస్తావు. (15)
ఉపాఖ్యాన మిదం శక్రవిజయం వేద సంమితమ్।
రాజ్ఞా వ్యూఢేష్వనీకేషు శ్రోతవ్యం జయమిచ్ఛతా॥ 16
జయం కోరే రాజు సేన సమకూర్చుకొనేటప్పుడు దేవతుల్యమయిన ఈ "ఇంద్ర విజయం" అనే కథ వినాలి. (16)
తస్మాత్ సంశ్రావయామి త్వాం విజయం జయతాం వర।
సంస్తూయమానా వర్ధంతే మహాత్మానో యుధిష్ఠిర॥ 17
యుధిష్ఠిరా! జయశాలీ! అందుచేత నీకీ విజయ గాధ వినిపిస్తున్నాను. ఇది విన్న మహాత్ములు ప్రశంసనీయులై వర్ధిల్లుతారు. (17)
క్షత్రియాణామభావోఽయం యుధిష్ఠిర మహాత్మనామ్।
దుర్యోధనాపరాధేన భీమార్జునబలేన చ॥ 18
ధర్మజా! దుర్యోధనుని అపరాధం వల్లనూ, భీమార్జునుల బలం వల్లనూ మహాత్ములయిన క్షత్రియులకు ఇపుడు వినాశం దాపురించింది. (18)
వి॥ శిశుపాల వధ అయిన తరువాత ధర్మరాజుతో వ్యాసమహర్షి ఈ విషయాన్ని ఇవే మాటలతో చెపుతాడు. దాన్ని గుర్తుచేయడం ఇది. (సభాపర్వం - 46 అధ్యా, -11, 12 శ్లోకములు)
సర్వక్షత్రవినాశాయ భవిష్యతి విశాంపతే॥
త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ।
సమేతం పార్థివ క్షత్రం క్షయం యాస్యతి భారత।
దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ -
ఆఖ్యాన మింద్రవిజయం య ఇదం వియతః పఠేత్।
ధూతపాప్మా జితస్వర్గః పరత్రేహ చ మోదతే॥ 19
నియమంతో ఈ ఇంద్రవిజయ కథను పఠించిన వాడు పాపాలు పోయి స్వర్గం పొందుతాడు. అంతేకాదు ఇహపరాలు రెండిట ఆనందం పొందుతాడు. (19)
న చారిజం భయం తస్య వా పుత్త్రో వా భవేన్నరః।
నాపదం ప్రాప్నుయాత్ కాంచిద్ దీర్ఘమాయుశ్చ విందతి॥ 20
వానికి శత్రుభయం ఉండదు. సంతానం లేక పోవడం అనేది ఉండదు. ఏ ఆపద కలగదు. దీర్ఘాయువు కలుగుతుంది. ఎప్పుడూ జయమే కలుగుతుంది. అపజయం కలగదు. (20)
వైశంపాయన ఉవాచ
ఏవమాశ్వాసితో రాజా శల్యేన భరతర్షభ।
పూజయామాస విధివత్ శల్యం ధర్మభృతాం వరః॥ 21
వైశంపాయనుడు అన్నాడు. శల్యుడు ధర్మరాజును ఇలా ఓదార్చాడు. ధార్మికోత్తముడయిన ధర్మరాజు శాస్త్రోక్తంగా శల్యుని సత్కరించాడు. (21)
శ్రుత్వా తు శల్యవచనం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ప్రత్యువాచ మహాబాహుః మద్రరాజమిదం వచః॥ 22
శల్యుని మాట విని ధర్మరాజు మద్రరాజుతో ఇలా అన్నాడు. (22)
భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయః।
తత్ర తేజోవధః కార్యః కర్ణస్యార్జునసంస్తవః॥ 23
మీరు కర్ణునికి సారథ్యం చేస్తున్నారు. సందేహంలేదు. అందునా అర్జునుని ప్రశంసిస్తూ కర్ణుని తేజోవధ చెయ్యాలి. (23)
శల్య ఉవాచ
ఏవమేతత్ కరిష్యామి యథా మాం సంప్రభాషసే।
యచ్చాన్యదపి శక్ష్యామి తత్కరిష్యామ్యహం తవ॥ 24
శల్యుడన్నాడు. నీ వన్నట్లే చేస్తాను. నేను చేయగలిగినది ఇంకా ఏమయినా ఉంటే అది నీకు తప్పక చేస్తాను. (24)
వైశంపయన ఉవాచ
తతస్త్వామంత్ర్య కౌంతేయాత్ శల్యో మద్రాధిపస్తదా।
జగామ సబలః శ్రీమాన్ దుర్యోధనమరిందమ॥ 25
వైశంపాయనుడు అన్నాడు. తరువాత మద్రరాజు శల్యుడు ధర్మరాజును వీడ్కొని బలగంతో దుర్యోధనుని చేరాడు. (25)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి శల్యగమనే అష్టాదశోఽధ్యాయః॥ 18 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున శల్యగమనమను పదునెనిమిదవ అధ్యాయము. (18)