17. పదునేడవ అధ్యాయము
నహుష పతనమును అగస్త్యుడు ఇంద్రునకు తెలుపుట.
శల్య ఉవాచ
అథ సంచింతయానస్య దేవరాజస్య ధీమతః।
నహుషస్య వధోపాయం లోకపాలైః సదైవతైః॥ 1
తపస్వీ తత్ర భగవాన్ అగస్త్యః ప్రత్యదృశ్యత।
సోఽబ్రవీ దర్చ్య దేవేంద్రం దిష్ట్వా వై వర్ధతే భవాన్॥ 2
విశ్వరూపవినాశేన వృత్రాసురవధేన చ।
దిష్ట్యాద్య నహుషో భ్రష్టః దేవరాజ్యాత్ పురందర॥ 3
దిష్ట్వా హతారిం పశ్యామి భవంతం బలసూదన॥
శల్యుడిలా చెప్పాడు. ధీశాలి అయిన ఇంద్రుడు నహుషుని వధోపాయం గురించి దిక్పాలకులతో, దేవతలతో ఆలోచిస్తున్నాడు. అపుడక్కడికి తపస్వి అయిన అగస్త్వమహర్షి వచ్చాడు. అతడు దేవేంద్రుని పూజించి "అదృష్టవశాత్తు నీవు విశ్వరూపునీ, వృత్రాసురునీ చంపి వర్ధిల్లుతున్నావు. మహేంద్రా! భాగ్యవశాన ఇపుడు నహుషుడు దేవరాజ్యంనుండి పతన మయ్యాడు. పురందరా! దైవవశాత్తు ఈ నాటికి నిన్ను శత్రు రహితునిగా చూస్తున్నాను అన్నాడు. (1,2,3)
ఇంద్ర ఉవాచ
స్వాగతం తే మహర్షేఽస్తు ప్రీతోఽహం దర్శనాత్తవ।
పాద్యమాచమనీయం చ గామర్ఘ్యంత ప్రతీచ్ఛ మే॥ 4
అపుడు ఇంద్రుడిలా అన్నాడు. మహర్షీ! స్వాగతం. నీ దర్శనం నాకు చాలా సంతోషదాయకం. ఇవిగో మీకు పాద్యం, ఆచమనోదకం, గోవు, అర్ఘ్యమూ, గ్రహించండి. (4)
శల్య ఉవాచ
పూజితం చోపవిష్టం తమ్ ఆసనే మునిసత్తమమ్।
పర్యపృచ్ఛత దేవేశః ప్రహృష్టో బ్రాహ్మణర్షభమ్॥ 5
శల్యుడన్నాడు. అలా ఇంద్రుని పూజను గ్రహించి ఆసనం మీద కూర్చున్నాడు. మునిసత్తముడు అగస్త్యుడు. అపుడు ఇంద్రుడు బ్రాహ్మణోత్తముడైన అగస్త్యుని ఇలా ప్రశ్నించాడు. (5)
ఏతదిచ్ఛామి భగవన్ కథ్యమానం ద్విజోత్తమ।
పరిభ్రష్టః కథం స్వర్గాత్ నహుషః పాపనిశ్చయః॥ 6
ద్విజోత్తమా! పాపనిశ్చయ డయిన నహుషుడు స్వర్గం నుండి ఎలా పతనమయ్యాడు? అనే విషయాన్ని మీ నుండి వినాలని కోరుతున్నాను. (6)
అగస్త్య ఉవాచ
శృణు శక్ర ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్।
స్వర్గాద్భ్రష్టో దురాచారః నహుషో బలదర్పితః॥ 7
అగస్త్యుడు ఇలా చెప్పాడు. దేవేంద్రా! ప్రియమైన మాట విను. దుష్టుడూ బలగర్వితుడూ దురాచారుడూ అయిన నహుషుడు స్వర్గం నుండి పతన మయిన తీరు చెపుతున్నాను. (7)
శ్రమార్తాశ్చ వహంత స్తం నహుషం పాపకారిణమ్।
దేవర్షయో మహాభాగాః తథా బ్రహ్మర్షయో ఽమలాః॥ 8
పప్రచ్ఛు ర్నహుషం దేవ సంశయం జయతాం వర।
పాపి అయిన నహుషుని మోస్తూ శ్రమ చెందిన పుణ్యాత్ములు, దేవర్షులూ, బ్రహ్మర్షులూ నహుషుని ఒక సంశయం అడిగారు. (8 1/2)
య ఇమే బ్రహ్మణా ప్రోక్తాః మంత్రా వై ప్రోక్షణే గవామ్॥ 9
ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవ।
నహుషో నేతి తానాహ తమసా మూఢచేతనః॥ 10
బ్రహ్మ చెప్పిన గోప్రోక్షణ మంత్రాలు నీకు ప్రమాణములా? కాదా? అని అడిగారు. నహుషుడు అజ్ఞానంతో మూఢుడై "కావు" అని సమాధానం చెప్పాడు. (9,10)
ఋషయ ఊచుః
అధర్మే సంప్రవృత్త స్త్వం ధర్మం న ప్రతిపద్యసే।
ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః॥ 11
అపుడు ఋషులిట్లా అన్నారు. "నీవు అధర్మమార్గంలో నడుస్తున్నావు. ధర్మం నీకు తెలియటం లేదు. పూర్వం మహర్షులు చెప్పిన యీ విషయం మాకు ప్రమాణం". (11)
తతో వివదమానః సః మునిభిః సహ వాసవ।
అథ మామస్పృశన్ మూర్ధ్ని పాదేనాధర్మపీడితః॥ 12
ఇంద్రా! అలా మునులతో వాదిస్తూ అధర్మావిష్టుడై నహుషుడు నా నెత్తిమీద కాలితో తన్నాడు. (12)
తేనాభూద్ధతతేజాశ్చ నిఃశ్రీకశ్చ మహీపతిః।
తతస్తం తమసా ఽవిగ్నమ్ అవోచం భృశపీడితమ్॥ 13
దానితో అతని తేజస్సు చచ్చిపోయింది. సంపద పోయింది. అలా అజ్ఞానాంధకారంలో పడి ఏడుస్తున్న నహుషునితో నేనిలా అన్నాను. (13)
యస్మాత్ పూర్వైః కృతం రాజన్ బ్రహ్మర్షిభిరనుష్ఠితమ్।
అదృష్టం దూషయసి మే యచ్చ మూర్థ్న్యస్పృశః పదా॥ 14
యచ్చాపి త్వమృషీన్ మూఢ బ్రహ్మకల్పాన్ దురాసదాన్॥ 15
వాహాన్ కృత్వా వాహయసి తేన స్వర్గాద్ధతప్రభః।
ధ్వంస పాప పరిభ్రష్టః క్షీణపుణ్యో మహీతలే॥ 16
రాజా! పూర్వులయిన బ్రహ్మర్షులు ఆచరించినదాన్ని, నీకు తెలియక దూషిస్తున్నావు. పైగా నన్ను కాలితో తన్నావు. బ్రహ్మతుల్యులూ, ఉన్నతులూ అయిన మహర్షులను వాహనాలుగా చేసికొని మోయించుకొంటున్నావు. కాబట్టి నీవు తేజస్సు, పుణ్యమూ నశించి భూమిమీద పడు. (14,15,16)
దశవర్షసహస్రాణి సర్పరూపధరో మహాన్।
విచరిష్యసి పూర్ణేషు పునః స్వర్గమవాప్స్యపి॥ 17
పదివేల ఏళ్లు పాము రూపం దాల్చి భూమిపై ఉంటావు. ఆ కాలం పూర్తయ్యాక మళ్లీ స్వర్గం పొందుతావు. (17)
ఏవం భ్రష్టో దురాత్మా స దేవరాజ్యాదరిందమ।
దిష్ట్వా వర్ధామహే శక్ర హతో బ్రాహ్మణకంటకః॥ 18
ఇంద్రా! ఇలా ఆ దురాత్ముడు దేవరాజ్యం నుండి భ్రష్టుడయ్యాడు. అదృష్టవశాత్తు మాకు వృద్ధియే కలుగుతోంది. బ్రాహ్మణ కంటకుడు నశించాడు. (18)
త్రివిష్టవం ప్రపద్యస్వ పాహి లోకాణ్ శచీపతే।
జితేంద్రియో జితామిత్రః స్తూయమానో మహర్షిభిః॥ 19
శచీపతీ! స్వర్గం పొందు. ఇంద్రియాలను, శత్రువులనూ (లోపలి, బయటి శత్రువులను) జయించి మహర్షుల స్తుతులు పొందుతూ లోకాలను రక్షించు. (19)
శల్య ఉవాచ
తతో దేవా భృశం తుష్టాః మహర్షిగణసంవృతాః।
పితరశ్చైవ యక్షాశ్చ భుజగా రాక్షసాస్తథా॥ 20
గంధర్వా దేవకన్యాశ్చ సర్వే చాప్సరసాం గణాః।
సరాంసి సరితః శైలాః సాగరాశ్చ విశాంపతే॥ 21
శల్యుడిలా అన్నాడు. దానితో దేవతలు, మహర్షులు, పితృదేవతలూ, యక్షులూ, నాఘులూ, పర్వతాలూ, సముద్రాలూ అన్నీ సంతోషించాయి. (20,21)
ఉపాగమ్యాబ్రువన్ సర్వే దిష్ట్వా వర్ధసి శత్రుహన్।
హతశ్చ నహుషః పాపః దిష్ట్వాగస్త్యేన ధీమతా।
దిష్ట్వా పాపసమాచారః కృతః సర్పో మహీతలే॥ 22
అందరూ వచ్చి ఇంద్రునితో శత్రుమర్దనా! మా భాగ్యవశాత్తు నీవు వర్ధిల్లుతున్నావు. పాపి అయిన నహుషుడు ధీమంతుడయిన అగస్త్యునిచే నశించాడు. ఆ దురాచారుడు భూమి మీద పామై పడ్డాడు. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఇంద్రాగస్త్వ సంవాదే నహుషభ్రంశే సప్తదశోఽధ్యాయః॥ 17 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున ఇంద్రాగస్త్వ సంవాదము నహుషభ్రంశమను పదునేడవ అధ్యాయము. (17)